ఈ వారం స్పెషల్

సాగర కన్యల సాహస యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రతీరానికి సరదాగా వెళ్లినప్పుడు చెలియలకట్టను ముద్దాడేందుకా అన్నట్లు వచ్చిపోయే అలలను చూసి ముచ్చటపడతాం. కొందరు వాటిని చూసి భయపడిపోతారు. అలలతో సయ్యాటలాడేవారినీ చూస్తాం. అనేక రక్షణల మధ్య, పహరా మధ్య కడలిలో గడపటంలో గొప్పేముంది. గంభీరంగా ఉండే లోపలి సముద్రం, కల్లోలభరితమైనప్పుడు ఎగసిపడే రాకాసి అలలను మనం ప్రత్యక్షంగా చూసి ఎరగం. భారీ నౌకలే వాటి ధాటికి చెదిరిపోతాయి. అలాంటి మహాసముద్రాలపై సాహసయాత్రకు సిద్ధమవుతున్నారు మన సాగరకన్యలు.

‘మహాసముద్రాలను దాటి వెళ్లండి. ప్రపంచానికి మన మహిళల శక్తి ఏమిటో చాటిచెప్పండి’...ఇదీ త్వరలో గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్ బోట్‌లో వెళ్లిరానున్న మహిళా నావికుల బృందానికి మోదీ స్ఫూర్తిదాయక సూచన...
‘కల్లోలంగా ఉండే సముద్ర జలాలపై ఆత్మవిశ్వాసంతో, ధైర్యస్థైర్యాలతో ఎదురీదుతూ ప్రపంచాన్ని చుట్టిరానున్న యువతులను చూసి గర్విస్తున్నా. వారి వీరోచిత అనుభవాలు ఎంతో స్ఫూర్తిదాయకం. డీప్ సీలో పడవకన్నా ఏడెనిమిది మీటర్ల ఎతె్తైన రాకాసి అలలు మీదకు వస్తున్నా బెదరక యాత్రలు పూర్తిచేసిన మన అమ్మాయిల సాహసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’...రెండు రోజుల క్రితం ప్రధాని ‘మన్‌కిబాత్’లో ఆ ఆరుగురు మహిళలకు అందించిన ప్రశంస.
ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్ బోట్‌లో దాదాపు 21వేల నాటికల్ మైళ్ల దూరాన్ని ఐదు మహాసముద్రాల మీదుగా, ఐదు అంచెలుగా వెళ్లివచ్చే సాహస యాత్ర పేరు ‘నావికా సాగర్ పరిక్రమ’. భారత్ నుంచి ఇప్పటి వరకు రెండు యాత్రలు మాత్రమే ఇలా జరిగాయి. ఇది మూడవది. కేవలం మహిళలతో కూడిన యాత్ర ఇదొక్కటే. సరే, ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఆరుగురి బృందంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఒకరిది విశాఖపట్నం. మరొకరిది హైదరాబాద్. వీరి యాత్ర గోవా నుంచి ఈనెల 10న ప్రారంభం కాబోతోంది. ఈ సాహసయాత్రకు దాదాపు ఐదేళ్ల నుంచి తర్ఫీదు పొందుతున్న బృందంలోని సభ్యులు, వారి అనుభవాలు, యాత్ర లక్ష్యాలు, సన్నాహాలు ఏమిటో తెలుసుకుందాం.
దాదాపు 164 రోజుల నావికా సాగర్ పరిక్రమ సాహసయాత్రకు సిద్ధమయ్యారు మన నౌకాదళ మహిళలు. ఏళ్ల తరబడి శిక్షణ, నెలల తరబడి వివిధ సముద్రాల్లో ప్రయాణంతో విశేష అనుభవం గడించారు వీరంతా. ‘ఎన్నో సముద్రాలను దాటి వచ్చాం. చూద్దాం ఈసారి దక్షిణ సముద్రంపై ప్రయాణం ఎలా ఉంటుందో. ఆ సముద్రం గురించి ఎన్నో కథలు విన్నాను. దాని సంగతి చూడాలన్న ఆసక్తి మామూలుగా లేదు’ అంటోది ఐశ్వర్య. ‘ఆరుగురిలో ఒకరి తరువాత ఒకరు పహరా బాధ్యత చేపడతాం. నాలుగు గంటల పాటు ఏకధాటిగా డెక్‌పై ఉండి సముద్రంలోని పరిస్థితులను అధ్యయనం చేయడం, వాతావరణంలో మార్పులు, కడలిలో సంభవించే మార్పులను గమనిస్తూ డెక్‌లోపలి సభ్యులను అప్రమత్తం చేస్తాం. మిగిలిన నలుగురు సభ్యులు ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం, వంట చేసుకోవడం, పాటలు వినడం, సినిమాలు చూడటంలాంటి పనుల్లో సేదదీరుతారు’ అంటోంది ఈ బృంద సారథి వర్తిక. ‘అసలు నేవీలో చేరేదాక సముద్రమంటే తెలియని మేం ఇప్పుడు ఈ సాహసయాత్ర చేయడం విస్మయకరమే’ అంటున్నారు ఉత్తరాఖండ్, మణిపూర్‌లకు చెందిన ఇద్దరు నావికామణులు. ‘తల్లిదండ్రులు సెయిలింగ్ వద్దన్నారు. వారిని తీసుకువచ్చి ఒకటిరెండుసార్లు సముద్రంలోకి తీసుకువెళ్లాం. అదృష్టవశాత్తు ఆ సమయంలో కడలి చాలా ప్రశాంతంగా ఉంది. వారిని ఒప్పించి నేవీలో కొనసాగాం’ అన్నారు వారు. ఈసారి అత్యాధునిక దేశీయ ‘తరిణి’ నావలో సాహసయాత్ర చేస్తున్నారు. జిపిఎస్ విధానం ద్వారా వారి ప్రయాణం ఎలా సాగుతోందో గమనించే ఏర్పాట్లు చేశారు. అప్పుడప్పుడు హెలికాప్టర్‌లో వారిని అనుసరిస్తూ ఉత్సాహపరిచే ఏర్పాట్లను నావికాదళం చేసింది. మొత్తం యాత్రలో ఐదు చోట్ల వారు విడిది చేస్తారు. ఆయా దేశాలకు, పోర్టులకు ఇప్పటికే సమాచారం అందించారు.
ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లన్నది వట్టిమాట. పాతకాలంలో అలా అంటే అన్నారు కానీ మహిళాలోకం నిద్రలేచి చాలా కాలమైంది. అలా అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. నిజానికి అలా అనే ధైర్యమూ ఎవరికీ లేదు. ఎందుకంటే.. వారు మగవారికి దీటుగా, మరోమాటలో చెప్పాలంటే వారికంటే గొప్పగా తమ ప్రాధాన్యాన్ని చాటుతున్నారు. వారిలోని సాహసాన్ని, విశ్వాసాన్ని గమనించిన మన ప్రధాని నరేంద్రమోదీ ‘మనసులోమాట’ కార్యక్రమంలో ప్రస్తుతించారు. ‘తరిణి’లో ప్రపంచాన్ని చుట్టిరావడానికి సిద్ధమైన ఆరుగురు యువ నావికాదళ మహిళలతో ఆయన ఈమధ్య ముచ్చటించారు. వారిలో స్ఫూర్తినింపేలా పేరుపేరునా ట్వీట్లతో శుభం పలికారు. జైత్రయాత్ర సాగించాలని ఉత్సాహపరిచారు.
ఆ ఆరుగురు...
భారత నావికాదళంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఎంపిక చేశారు. వారిలో చివరకు అవకాశం దక్కించుకున్నది ఆరుగురు మాత్రమే. వారిలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ వర్తికా జోషి (లీడర్), లెఫ్ట్‌నెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి, లెఫ్ట్‌నెంట్ కమాండర్ ప్రతిభ, లెఫ్ట్‌నెంట్ ఎస్‌హెచ్ విజయదేవి, లెఫ్ట్‌నెంట్ పాయల్‌గుప్త, లెఫ్ట్‌నెంట్ ఐశ్వర్య బోయపాటి. ఈ ఆరుగురికి నౌకాదళంలో మంచి గుర్తింపు ఉంది. సాహసం వీరి ఊపిరి.. గతంలో ‘మహేదీ’ నౌకలో జరిగిన సాహస యాత్రలో అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు.
వర్తికా జోషి
ఈ అమ్మాయి రుషీకేశ్ వాసి. తల్లి టీచర్, తండ్రి ప్రొఫెసర్. పర్వత ప్రాంతంలో పుట్టి, అక్కడే పెరగడంతో సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ‘ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీలో చేరి, దేశానికి సేవలు అందించాలని అనుకునేదాన్ని. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇండియన్ నేవీ నుంచి నాకు పిలుపు వచ్చింది. వారు నిర్వహించిన పరీక్షలను ఎదుర్కొని, 2010లో ఇండియన్ నేవీలో చేరాను. నేవీలోని వివిధ మెళకువలను ఇట్టే నేర్చుకోగలిగాను. 2014లో మహేదీ నౌకలో బ్రెజిల్ నుంచి కేప్‌టౌన్ వరకూ సాహసయాత్ర చేసే బృందంలో చోటు సంపాదించాను. 2014లో కమాండర్ ఎంవివి సతీష్, టిజిఎస్ బేడీ నేతృత్వంలో ఆరుగురు మహిళలతో కూడిన బృందం యాత్రకు బయలుదేరింది. బయల్దేరి మూడు రోజులకు డి జనిరో హార్బర్ వద్దకు చేరుకోగానే నౌకలోని డీజిల్ అయపోయ జనరేటర్ పనిచేయలేదు. సుమారు 12 రోజులపాటు మేమంతా చీకట్లోనే గడపాల్సి వచ్చింది. జిపిఎస్ కూడా పనిచేయకపోవడం వలన మేం ఎక్కడున్నదీ షోర్ అథారిటీకి తెలియపరచలేకపోయాం. ల్యాప్‌టాప్‌లోని కొద్దిపాటి బ్యాటరీ మిగిలి ఉంటే, దాని సహకారంతో పరిస్థితిని వివరించి, బ్రెజిల్‌కి తిరిగి వచ్చేస్తున్నామన్న సమాచారాన్ని చేరవేశాను. అప్పటికే సీ రఫ్‌గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలో తెడ్లుతో నౌకను నడుపుతూ పెనుగాలుల మధ్య తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మార్గమధ్యంలో అన్నీ నెగిటివ్ థాట్స్ వచ్చాయి. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్‌కు అక్కడ ఎటువంటి షార్ట్‌కట్‌లు ఉండవు. సముద్ర కెరటాలు ఎనిమిది నుంచి 10 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అయితే, అందరం నిద్రాహారాలు మానేసి, అప్రమత్తతతో ఉంటూ తిరిగి బ్రెజిల్ చేరుకున్నాం. అక్కడ పడవకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి, తిరిగి సాహస యాత్రకు బయల్దేరాం.’ అని ఆమె వివరించారు.
స్వాతి పాతర్లపల్లి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆమె స్వస్థలం. ‘మా ఇంటికి సమీపంలోనే తూర్పు నౌకాదళ శిక్షణా శిబిరం ఉంది. తెల్ల దుస్తుల్లో నౌకాదళ సిబ్బంది మార్చ్‌పాస్ట్ చేస్తుంటే, మా బెడ్‌రూం కిటికీలో నుంచి చూసేదాన్ని. కానీ, నాకు నేవీలో చేరాలన్న ఆలోచన రాలేదు. నేను డాక్టర్ కావాలనుకున్నాను. అందుకు తగ్గట్టుగా చదువుకున్నాను. అయితే, మా నాన్న మాత్రం నన్ను నేవీ ఆఫీసర్‌గా చూడాలనుకునేవారు. మా నాన్న తమ మనసులో మాటను అనేకసార్లు నాకు చెప్పేవారు. ఆయన కోరిక మేరకు నేను ఇండియన్ నేవీలో చేరాను. నేను తెల్లని యూనిఫారం ధరించినప్పుడల్లా నన్ను చూసి నాన్న గర్వపడుతున్నట్టే ఉంటుంది. నేవీలో చేరిన కొద్ది రోజలకే కేప్‌టౌన్ నుంచి ఇండియా సముద్ర యాత్రకు నన్ను ఎంపిక చేశారు. సముద్రంలో అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇండియాకు వస్తున్నప్పుడు మార్గమధ్యంలో సముద్రం గంభీరంగా మారిపోయింది. ఒక దశలో క్షేమంగా తిరిగి ఇండియాకు వస్తానన్న నమ్మకం పోయింది. అయితే, కమాండర్ జయంత మహాథిక్ మాత్రం నాకు ధైర్యం చెబుతూ వచ్చారు. అలర్ట్ అనే ఒకే ఒక్క మంత్రంతో యాత్రను విజయవంతంగా పూర్తి చేశాను.’ అని అన్నారు.
ప్రతిభ జమ్వల్
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువతి. ‘ఇంజనీర్ కావాలన్నది నా సంకల్పం. కానీ స్నేహితులు నన్ను నేవీలోకి వెళ్లమని, ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవారు. ఇదే సమయంలో సెయిలర్ సెలక్షన్స్‌కు అడ్వర్టైజ్‌మెంట్ చూశాను. అప్లై చేశాను. టెస్ట్‌లన్నీ పాసైపోయాను. చివరి టెస్ట్ బెంగళూరులో జరిగింది. 12 మంది స్నేహితులతో బయలుదేరాను. నేను ఈ టెస్ట్‌లో ఫెయిలైపోతే ఇప్పుడు ఇచ్చే షాపింగ్ అలవెన్స్ కన్నా రెట్టింపు ఇస్తానని మా అమ్మ ఆశ చూపింది. నేను నేవీలో చేరుతానంటే మమీ భయపడేది. కానీ బెంగళూర్ టెస్ట్‌లో కూడా నెగ్గుకొచ్చాను. నేను నేవీలో సెలక్ట్ అయ్యానని మమీకి చెపితే అస్సలు నమ్మలేదు. 2012 నుంచి సెయిలింగ్ మొదలుపెట్టా. ఇప్పుడు సాగర్ పరిక్రమ యాత్రకు బయల్దేరుతున్నా’ అని తన అంతరంగాన్ని వివరించారు.
విజయదేవి
మణిపూర్‌కు చెందిన అమ్మాయి. ‘నీళ్లంటేనే నాకు భయం. అలాంటిది సముద్రాన్ని చూడాలంటే అమ్మో అనిపించింది. ఢిల్లీలో పిజి పూర్తి చేసిన నేను ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాను. కానీ అనూహ్యంగా నేను నేవీలో చేరాను. నాకు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. స్విమ్మింగ్ కూడా రాదు. కానీ పట్టుదల, అధికారులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో నేను స్విమ్మింగ్‌లో రాణించాను. భారత నౌకాదళం సొంతంగా తయారు చేసిన ‘తరణి’లో శిక్షణలో భాగంగా ఒకసారి యాత్రకు బయలుదేరాం. యాత్ర మొదలైన దగ్గర నుంచి వాంతులు ప్రారంభమయ్యాయి. మా బృందంలో ఉన్న మహిళలు ఎక్కువగా నిద్రపోయేవారు. రోజురోజుకు నా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. బరువు బాగా తగ్గిపోయాను. ఒక దశలో నేను చనిపోతానని అనుకున్నారు. అటువంటి స్ధితిలో వారి ఓదార్పు, ఆటపాటలు నన్ను తిరిగి మనిషిగా చేశాయి. సముద్రయానాన్ని ముగించుకుని తిరిగి కమాండ్‌కు చేరుకున్నాను. నేను ఇప్పుడు నావికా సాగర్ పరిక్రమ యాత్రకు బయల్దేరుతున్నాను.’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె లెఫ్టినెంట్ హోదాలో సేవలందిస్తున్నారు.

పాయల్‌గుప్త
డెహరాడూన్‌కు చెందిన అమ్మాయి. ‘మా ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఆర్మీలో చేరుతుంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న నేను కూడా ఆర్మీలోనే చేరి, రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని ఆశ ఉండేది. గ్రాడ్యుయేషన్ తరువాత ఆర్మీకి అప్లై చేశాను. కానీ సెలెక్ట్ కాలేకపోయాను. గుర్గావ్ వెళ్లి మల్టీ నేషనల్ కంపెనీలో చేరాను. అక్కడ ఏడాదిన్నర పనిచేశాను. 2012లో నేవీకి అప్లై చేసి, సెలెక్ట్ అయ్యాను. అంతేకాదు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం కూడా కలిగింది. నేవీలో చేరిన తరువాత అక్కడ డెస్క్ వర్క్ అప్పగించారు. నౌకలో సముద్రయానం చేయాలనుకుంటే, డెస్క్‌కే పరిమితం చేశారన్న బాధ నాలో ఉండేది. అనుకోకుండా ఆల్ ఉమెన్ బోట్ తరణి వచ్చిన తరువాత అందులోకి జంప్ అయ్యాను.

బొడ్డపాటి ఐశ్వర్య
హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి రక్షణదళం యూనిఫారం ధరించిన ఉద్యోగం చేయాలన్న ఆశ ఉండేది. ఐశ్వర్య తండ్రి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తుండేవారు. ఐశ్వర్య ప్రాథమిక విద్య అంతా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న స్కూల్‌లోనే గడిచిపోయింది. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులను ఐశ్వర్య రోజూ చూస్తుండేది. వారిలాగే తను కూడా యూనిఫారం ధరించాలనుకునేది. చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంది. నేవీలో ఆమె చోటు సంపాదించింది. సెయిలింగ్ అన్నా, సాహస క్రీడలన్నా ఐశ్వర్యకు చాలా ఇష్టం. అయితే, ఆమెకు నేవల్ కన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం లభించింది. అండమాన్‌లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుంది. విధుల్లో చేరిన తరువాత ఐశ్వర్య మొట్టమొదటి ప్రయాణం మారిషస్. సముద్రంలో అంత దూరం ప్రయాణించడం అదే మొదటిసారి. ‘రుతుపవనాల సమయంలో బయల్దేరి వెళ్లాం. నౌకలను నడపడం చూసి నేర్చుకునే దశ నాది. మార్గ మధ్యంలో భారీ వర్షం నన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కనీసం రెయిన్ కోటు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఇది సాహస యాత్రలా లేదు. ప్రాణాపాయం పొంచి ఉందన్న భయం నాలో ఎక్కువైపోయింది. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. మళ్లీ సెయిలింగ్‌కు సన్నాహాలు ప్రారంభించాను. అప్పుడు నాతో మరో ఐదురుగు మహిళా నావికులు తోడయ్యారు. వీరిలో ఇద్దరు నేవీ కన్‌స్ట్రక్టర్స్, ఇద్దరు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఇద్దరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. 2015 ఏప్రిల్‌లో మహేదీ బోట్‌లో కేప్‌టౌన్‌కు సెయిలింగ్ బయల్దేరాలని అధికారులు నిర్ణయించారు. అప్పటికి తరణి సెయిలింగ్ బోటు ఇంకా నిర్మాణ దశలో ఉంది. మహేదీలో వౌలిక సదుపాయాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. అయితే, నీరు, ఆహారం తగు మాత్రమే తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆరుగురం అమ్మాయిలం. మాతో వచ్చిన ఆఫీసర్స్ మాకు ధైర్యాన్ని నూరిపోశారు. బయల్దేరే ముందు కఠోరమైన శిక్షణ ఇచ్చారు. మహేదీలో సెయిలింగ్ ద్వారా మేమంతా మహిళా సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం. మహిళల్లో ధైర్య సాహసాలను వెలికి తీసేందుకు నేవీ అధికారులు చేసే ప్రయత్నాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించుకుని కేప్‌టౌన్‌కు బయల్దేరాం. మార్గ మధ్యంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. తాగడానికి తీసుకువెళ్లిన నీరు మార్గ మధ్యంలోనే అయిపోయింది. మళ్లీ నీరు కావాలంటే, సముద్రంలోని ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి తాగాల్సిందే. అది కూడా చాలా తక్కువగా లభించేది. మాతోపాటు తీసుకువెళ్లి జ్యూస్‌లో కాస్తంత నీటిని కలుపుకొని తాగేవాళ్లం. కేప్‌టౌన్‌ను మరి కొద్ది రోజుల్లో చేరుకుంటామనగా మా దగ్గర కేవలం కొంచెం బియ్యం, మ్యాగీ మాత్రమే మిగిలాయి. వీటిని ఏయే రకాలుగా వండి తినాలో ఆలోచించాల్సి వచ్చేది. ఎట్టకేలకు మా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్నాం.’ అని ఐశ్వర్య తను సెయిలింగ్ అనుభవాలను చెప్పుకొచ్చింది.
ఆ అనుభవాలే కొత్త యాత్రకు స్ఫూర్తినిచ్చాయ. ఆల్ ది బెస్ట్.
గ్లోబును చుట్టి వచ్చేది ఇలా..
నావికా సాగర పరిక్రమ పేరుతో మొదలయ్యే ఈ యాత్ర వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ పదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఆరుగురు యువతులతో కూడిన బృందం గోవా నుంచి ఆస్ట్రేలియాలోని ఫ్రెమెంటల్‌కు బయల్దేరి వెళుతుంది. అక్టోబర్ 17వ తేదీన అక్కడికి చేరుకుంటుంది. అంటే 37 రోజులపాటు ఏకధాటిగా ఈ నౌక ప్రయాణిస్తుంది. అక్టోబర్ 30న ఫ్రెమెంటల్ నుంచి బయల్దేరి నూజిలాండ్‌లోని లెటిల్‌టాన్‌కు నవంబర్ 21న చేరుకుంటుంది. అంటే 22 రోజులపాటు ప్రయాణం సాగిస్తారు. నవంబర్ 23న అక్కడి నుంచి బయల్దేరి ఫాక్‌ల్యాండ్స్‌లోని పోర్ట్ స్టాన్లీకి జనవరి 3న చేరుకుంటారు. జనవరి 13వ తేదీన అక్కడి నుంచి బయల్దేరి 28 రోజులు ప్రయాణించి సౌత్ ఆఫ్రికాలలోని కేప్ టౌన్‌కు ఫిబ్రవరి 11న చేరుకుంటారు. అంటే 28 రోజులు విరామం లేకుండా ప్రయాణిస్తారు. కేప్‌టౌన్‌లో ఫిబ్రవరి 26న బయల్దేరి ఏప్రిల్ 9వ తేదీన అంటే 42 రోజులు ప్రయాణించి తిరిగి గోవాకు తిరిగి వస్తారు. మొదట ఈ నెల 5న యాత్ర ప్రారంభమవ్వాల్సి ఉనాన పదికి మార్చారు. వాతావరణం బట్టి యాత్ర షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చు.
నావికుల దేవత ‘తరిణి’
ఒడిశాలో బ్రహ్మపురం (బరంపురం) పట్టణానికి సమీపంలో ఉన్న ఆదిపరాశక్తి కొలువైన ఆలయం తరాతరిణి. రుషికుల్య నదీతీరంలో వెలసిన ఈ క్షేత్రంలో పూజలందుకుంటున్న అమ్మవారి పేరు తరాతరిణి. మత్స్యకారులు, సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నవారు, వ్యాపారులు కొలిచే దేవత ఆమె. సముద్రంలో ప్రయాణాలు, వ్యాపారాలు బాగా జరగాలని, క్షేమంగా తాము వచ్చేలా చూడాలని వారు ప్రార్థిస్తారు. గంగకు సోదరిగా ఆమెను భావిస్తారు. నావికాదళం సారథ్యంలో దేశీయంగా తయారైన సెయిలింగ్ బోట్‌కు ఆ అమ్మవారి పేరు ‘తరిణి’ అని పెట్టారు. ఒడిశావాసులకు ఇదెంతో ఆనందం కలిగించింది.
ఇదీ పరిక్రమ లక్ష్యం
భారత మహిళల శక్తిని ప్రపంచానికి చాటడం మొదటి లక్ష్యం. మహిళా సాధికారత దిశగా అడుగు వేయడం. సముద్రయానాన్ని ప్రోత్సహించేలా, మరిన్ని సాహసయాత్రలకు స్ఫూర్తినిచ్చేలా చేయడం మరో అంశం. సముద్రంలో కాలుష్యాన్ని, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసి లోకానికి చాటడం. తొలిసారిగా పూర్తి దేశీయంగా తయారు చేసిన నౌకలో ప్రయాణించి మేకిన్ ఇండియా నినాదాన్ని ఆచరణలో చూపించడం, ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం ఈ యాత్ర లక్ష్యం. నావికాదళంలో చేరేందుకు యువత ఆసక్తి పెరిగేందుకు ఈ సాహసయాత్ర ఉపయోగపడుతుందని విశ్వాసం. గతంలో కెప్టెన్ దిలీప్ దొండే (2009) సారధ్యంలో తొలిసారిగా ఏడేళ్ల క్రితం భారత నావికాదళ బృందం ఒంటరి సాహసయాత్ర నిర్వహించింది. మహేదీ పడవలో వారు ఈ యాత్ర చేశారు. ఇందులో మహిళలు, పురుషులు కలపి పదిమంది పాల్గొన్నారు. గోవా నుంచి మారిషస్ వరకు ఈ యాత్ర సాగింది. ఆ తరువాత కమాండర్ అభిలాష్ తోమి (2013) ఏకాధాటిగా ఒంటరిగా సాహసయాత్ర చేశారు. ఇప్పుడు కేవలం మహిళలతోనే సాగే పరిక్రమ యాత్ర ఆసియాలోనే తొలి ప్రయత్నం. ఈ బృందానికి దొండే శిక్షణ ఇవ్వగా, మహేది, తరిణి పడవలను రూపొందించినది అభిలాష్ తోమి. అండమాన్ నుంచి కేప్‌టౌన్‌కు, గోవా నుంచి మారిషస్‌కు 2014, 2016లలో శిక్షణలో భాగంగా వీరంతా సాహసయాత్రలు చేశారు. మహేది, తరిణి పడవల్లో దాదాపు 20వేల నాటికల్ మైళ్ల దూరం వీరి ప్రయాణం సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నౌకాదళంలోకి ప్రవేశించిన తరిణి బోట్‌లో ఇప్పటివరకు 8వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేశారు. ఈ బృందంలోని సభ్యుల్లో ఇద్దరు నావల్ ఆర్కిటెక్ట్‌లు, ఇద్దరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, మిగిలిన ఇద్దరూ నేవీ విద్యావిభాగంలో ఉద్యోగినులు.
మహేదీ.. తరిణి..
సముద్రంలో సాహస యాత్రల్లో తొలిసారిగా వాడిన దేశీయ నావ మహేది. స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఐఎన్‌ఎస్‌వి మహేది (ఇండియన్ నేవీ సెయిలింగ్ వెస్సెల్-ఐఎన్‌ఎస్‌వి) ఆరేళ్లపాటు సేవలందించింది. మరిన్ని మార్పులతో తరిణి నౌకను సిద్ధం చేశారు. న్యూజిలాండ్‌లో డిజైన్ చేసినప్పటికీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. తరిణి సెయిలింగ్ బోట్ పొడవు 17 మీటర్లు (56 అడుగులు). ఐదు మీటర్ల వెడల్పు, 23 టన్నుల బరువు ఉంటుంది. గోవాలోని ఆక్వారిస్ షిప్‌యార్డులో దీనిని తయారు చేశారు. ఇప్పటికే ఎన్నో పరీక్షలు, సముద్రయానాలు పూర్తి చేసుకుంది. ఒకేడెక్ ఉన్న ఈ బోట్ ముందుభాగంలో మాస్ట్స్ సెయిల్స్ ఉంటాయి. వెనుకభాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్ అమర్చారు. గుండ్రంగా ఉండే శాటిలైట్ యాంటిన్నా కూడా వెనుకభాగంలోనే ఉంటుంది. నెలకు 20 జిబి డేటాను వాడుకునే వెసులుబాటు ఉంది. రిఫ్రిజిరేటర్ ఉండదు. 40 రోజులకు సరిపడే రేషన్, రెండు ఎల్‌పిజి సిలెండర్లు సిద్ధంగా ఉంటాయి. కేవలం 600 లీటర్ల మంచినీళ్లు ఉంటాయి. ఓ ఆర్‌ఓ ప్లాంట్ ఉంది. సముద్ర జలాలను శుభ్రం చేసి అందిస్తుంది. గంటకు 30 లీటర్ల నీటిని అది అందించగలదు. 23 రకాల తాళ్లు అందుబాటులో ఉంచారు. ఏఏ సందర్భాలలో ఆ తాళ్లను ఎలా ముడులువేసి వాడాలో శిక్షణ ఇచ్చారు. కాలక్షేపం కోసం మ్యూజిక్ సిస్టమ్, డివిడిలు, సినిమాలు చూసే అవకాశం ఉంది. అందరూ లాప్‌టాప్‌లు తీసుకువెళుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాత్ర వివరాలు అందించేందుకు ఓ బ్లాగ్‌ను కూడా నిర్వహిస్తారు. పుట్టినరోజు వేడుకలూ నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. భూమధ్య రేఖను దాటినప్పుడల్లా వేడుక నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకున్నారు ఈ బృందం సభ్యులు. ఈ తరిణి బోట్ హల్‌ను పూర్తిగా ఫైబర్ గ్లాస్‌తో తయారు చేశారు. బోట్ నిర్మాణంలో కలప తక్కువగా, ఫైబర్‌ను, గ్లాస్‌ను ఎక్కువగా వాడారు. 25 మీటర్ల ఎతె్తైన్ మాస్ట్ గొప్ప అందాన్నిస్తోంది. తెల్లనిరంగులో మెరిసిపోతున్న తరిణికి ఏ ప్రమాదమైనా సంభవిస్తే ఎలాంటి మరమ్మతులు చేయాలో పూర్తి తర్ఫీదు పొందారు. హైదరాబాద్‌కు చెందిన బి.ఐశ్వర్య ఈ బృందంలో బోట్ నిర్మాణానికి సంబంధించిన ఇంజనీర్. తొమ్మిది టన్నుల బరువును తట్టుకునేలా హల్ నిర్మించారు.

ఇదీ అనుభవం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్‌వి తరణిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నౌకాదళ కమాండ్‌లకు చెందిన ఆరుగురు మహిళలు అత్యంత సాహసోపేతమైన నావికా సాగర పరిక్రమ యాత్రకు బయల్దేరనున్నారు. సుమారు 21,600 నాటికల్ మైళ్ల దూరం వీరు ప్రయాణించనున్నారు. వీరంతా వాయేజ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణ సమయంలో ఐఎన్‌ఎస్‌వి మహదిలో సముద్రంలో సుమారు 20 వేల నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించారు. వివిధ సముద్రాల తీరుతెన్నులు, యాత్రలో ఎదురైన అనుభవాలతో ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు. వీరి యాత్ర ఆరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్, దక్షిణ మహాసముద్రం, పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రాల మీదుగా సాగుతుంది. మొత్తం యాత్ర పూర్తిచేస్తే భూగోళాన్ని చుట్టివచ్చినట్లవుతుందన్నమాట. లోకంచుట్టిన వీరనారీమణలుగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు మనవాళ్లు.
*

-కె.వి.జి.శ్రీనివాస్