ఈ వారం స్పెషల్

సెలవుల నెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోయగాల విందులకై వేయి కనులు కావాలి!’.. అవును నిజ మే.. ఈ విశాల విశ్వంలో ప్రకృతి రమణీయతకు, అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఎనె్నన్నో ప్రాంతాలు.. గజి‘బిజీ’ జీవితంలో కాస్త భిన్నంగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు బయలుదేరే వారికి ఎనె్నన్నో ఆహ్వాన గీతాలు.. సమ్మోహన పరచే ప్రకృతి దృశ్యాలకు, ఘనమైన చరిత్రకు, మహోన్నత సంస్కృతికి పట్టుగొమ్మలైన ప్రాంతాలను సందర్శించాలన్న తపన లేని వారు ఎవరు?
లోయలు, గుహలు, నదులు, కొండలు
అభయారణ్యాలు, సముద్ర తీరాలు
వెండి జిలుగుల్లాంటి జలపాతాలు
ఆహ్లాదపరచే పచ్చదనాలు...
వేసవిలో కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో విహరించడానికి ఎనె్నన్నో సుందర ప్రదేశాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యతీర్థాలు..
తీర్థయాత్ర అయినా, విహారయాత్ర అయినా- పరమార్థం ఒక్కటే.. మనం నూతనోత్తేజాన్ని పొందడం, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం..
‘ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో?’- అన్నది నిజంగా పాతపాటే. అన్ని రకాలుగా అవకాశాలు పెరిగిన ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రపంచంలో ఏ మూలకైనా ఇట్టే వెళ్లిరావచ్చు.. అలాగని అద్భుత ప్రదేశాలు ఎక్కడో ఉన్నాయని వ్యయ ప్రయాసలు పడనక్కర్లేదు.. ఆహ్లాదకర దృశ్యాల కోసం ఎక్కడో ఉన్న ఊటీకి వెళ్లనక్కర్లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయకు, హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి వెళ్లినా అదే అనుభూతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే పరమ భక్తులకైనా, అందచందాల్ని ఆస్వాదించే సౌందర్య పిపాసులకైనా ‘యాత్రల’ లక్ష్యం ఒక్కటే.. ఈతిబాధలను మరచిపోయి మానసిక వికాసం పొందడం, మనల్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవడం. సరికొత్త ‘గమ్యాల’కు చేరుకుంటే మనల్ని మనం ‘రీఛార్జి’ చేసుకోవడమే.
మట్టివాసనను ఆఘ్రానించేందుకు పల్లెసీమలకు వెళ్లాలనుకుంటున్నారా?
సువిశాల సాగర తీరాల్లో, నదీ సంగమ స్థలాల్లో షికారు చేద్దామనుకుంటున్నారా? పచ్చని పచ్చికలపై, వృక్షాల నీడలో సేదతీరుదామనుకుంటున్నారా?
ఇంకెందుకు ఆలస్యం..? విహారయాత్రకు ‘లగేజీ’ సర్దుకోండి..
తెలంగాణ
ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు..
ముక్కోటి దేవతలు కొలువైన ఆలయాలు..
ఆకుపచ్చని అరణ్యాలు..
ఆకాశం నుండి దూకే జలపాతాలు..
ఇలా.. ఒక్కటని కాదు.. ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు 31 జిల్లాలూ వేటికవే సాటి. కొత్త జిల్లాల నేపథ్యంలో పర్యాటక రంగం మరింత శోభను సంతరించుకుంది. ఈ వేసవిలో ఏయే జిల్లాలు పర్యాటకానికి అనువైనవో, ఏయే జిల్లాల్లో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయో తెలుసుకుందాం.
*
హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చారిత్రక నగరం. నాలుగు వందల చరిత్ర కలిగిన వైభవోపేత చరిత్ర నగరం సొంతం. అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలెన్నో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో పాటు భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈ కట్టడాల్లో కనిపిస్తుంది. ఇండో, అరబిక్, పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు ప్రతీక. చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా పాలెస్, పురానా హవేలీ.. ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలు. సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, జీఎస్‌ఐ.. ఇలా పలు సంగ్రహశాలలు గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. నెహ్రూ జూపార్క్‌లో వన్యప్రాణులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
నల్లగొండ
నాగార్జున సాగర్, చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జలాల్లో ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు ఈ జిల్లాలోనే ఉంది. రాణీ రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను కూడా ‘హెరిటేజ్ టూరిజం’లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. నల్లగొండకు హైదరాబాద్ నుంచి విరివిగా బస్సులు ఉన్నాయి. రైల్వే సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 153.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. విడిదికి నాగార్జున సాగర్‌లో టూరిజం హోటల్, చాలా ప్రైవేటు హోటల్స్ ఉన్నాయి.
యాదాద్రి - భువనగిరి
గుట్ట కొలనుపాక జైన దేవాలయం, ఏకశిలపై వెయ్యేళ్ళ క్రితం నిర్మించిన భువనగిరి కోట ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. భువనగిరి కొండ రాక్ క్లైంబింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం. త్వరలో యాదాద్రి - భువనగిరి కోటపైకి తెలంగాణ పర్యాటక శాఖ ‘కేబుల్ కార్’ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నుంచి యాదాద్రి 62 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. పెద్దసంఖ్యలో బస్సులు ప్ర తిరోజూ హైదరాబాద్ నుంచి యాదాద్రికి తిరుగుతాయి.
సూర్యాపేట
పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయాలు, పిల్లలమర్రి, వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశవ ఆలయం చూడదగ్గ ప్రదేశాలు. హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట ఉంది. హైదరాబాద్, నల్లగొండల నుంచి బస్సు సౌకర్యం ఉంది.
మహబూబ్‌నగర్
ఒకప్పుడు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి చేసే ప్రాంతంగా విలసిల్లింది పాలమూరు. నిజాం పాలనలో దీనిని మహబూబ్‌నగర్‌గా మార్చారు. ఇక్కడ పిల్లలమర్రి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మర్రిచెట్టు మూడెకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటకశాఖ ప్రదర్శనశాల, వస్తు ప్రదర్శనశాల ఉన్నాయి.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పురాతన విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ జలాశయం, పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రధాన పర్యాటకాలు. హైదరాబాద్ నుంచి పాలమూరు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలమర్రి ప్రాంతం హైదరాబాద్‌కు 99 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
జోగులాంబ- గద్వాల
కృష్ణా, తుంగభద్ర నదులు నడయాడే ప్రాంతం జోగులాంబ-గద్వాల జిల్లా. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలగలసిన నేల ఇది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన ఆలంపూర్ ఈ జిల్లాలో ఉంది. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్ర ఖ్యాతి పొందాయి. తెలంగాణలో మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, చంద ఘడ్ కోట, పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వరస్వామి దేవాలయం, జూరాల జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు. హైదరాబాద్ నుంచి గద్వాలకు విరివిగా బస్సులు నడుస్తాయి.
వనపర్తి
ఒకప్పుడు సంస్థానాధీశుల పాలనలో ఉన్న వనపర్తి ప్రస్తుతం జిల్లాగా ఆవిర్భవించింది. వనపర్తికోట, శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం, రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గరుడ పుష్కరిణి, ఘన్‌పూర్ కోట చూడదగిన ప్రదేశాలు. మహబూబ్‌నగర్ నుంచి వనపర్తికి బస్సు సౌకర్యం ఉంది.
నాగర్ కర్నూలు
వందేళ్లక్రితమే జిల్లాగా ఉన్న నాగర్‌కర్నూలును తిరిగి జిల్లా చేశారు. 1794 నుంచి 1904 కాలం వరకు నాగర్‌కర్నూలు జిల్లాగా ఉంది. పొడవైన కృష్ణాతీరం, సోమశిల అందాలు, నల్లమల అభయారణ్యం, నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం, ఎత్తిపోతల ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమకాల్వ సొరంగం, సోమశిల సప్తనదుల సంగమం, మల్లెల తీర్థం జలపాతం, పరహాబాద్ వ్యూపాయింట్ చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే నదిలో పడవ ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. నల్లమలలోని ఉమామహేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయాలు ప్రసిద్ధి.
వరంగల్ అర్బన్
ఓరుగల్లు పేరుతో విలసిల్లిన వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా నగరం చుట్టూ ఉన్న మండలాలన్నీ కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా అవతరించింది. సికింద్రాబాద్ తర్వాత అతి పెద్ద రైల్వే జంక్షన్ ఓరుగల్లులోని కాజీపేటలో ఉంది. భద్రకాళి దేవాలయం, చారిత్రక వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలం నాటి మామునూరు విమానాశ్రయాలు పర్యాటక ప్రాంతాలు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగవచ్చు. ఇక్కడ అనేక ప్రైవేటు హోటల్స్, తెలంగాణ టూరిజం శాఖ హోటల్ ఉంది.
వరంగల్ రూరల్
వ్యవసాయానికి పెద్ద పీట వేసిన జిల్లా వరంగల్ గ్రామీణం. కాకతీయుల పాలనకు గుర్తుగా మిగిలిన చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం, భీమునిపాదం జలపాతం, కొమ్మాల జాతర పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధి. గంగదేవిపల్లి గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయితీగా పేరుగాంచింది.
మహబూబాబాద్
వరంగల్ నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లా మహబూబాబాద్. ఒకప్పుడు మానుకోటగా పేరుగాంచిన ఈ జిల్లా గిరిజనులకు ఆలవాలం. ఈ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. ప్రకృతి ప్రేమికులకు ఈ జిల్లా అతి పెద్ద పర్యాటక ప్రాంతమని చెప్పవచ్చు. అనంతారం వెంకటేశ్వరస్వామి, నర్సింహులపేటలో శ్రీ వెంకటేశ్వరస్వామి, డోర్నకల్ చర్చి, భీమునిపాదం దర్శనీయ ప్రాంతాలు.
జయశంకర్ భూపాలపల్లి
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక భూమిక వహించిన ఆచార్య జయశంకర్ సార్ పేరు మీదుగా ఏర్పాటైన జిల్లా ఇది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాగా, గోదావరి ప్రవహిస్తున్న జిల్లాగా దీనికి గుర్తింపు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, చారిత్రక రామప్ప దేవాలయం, శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, గణపురం కోటగుళ్లు, రేగొండ పాండవుల గుట్ట, కోటంచ నర్సింహస్వామి ఆలయం, రామప్ప, లక్నవరం చెరువులు, బోగత జలపాతం పర్యాటక కేంద్రా లు. వేసవికాలంలో ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుండి 209 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జిల్లా.
జనగామ
ఒకప్పుడు జైనుల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే ప్రాంతంగా గుర్తింపు పొందింది. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, జీడికల్ వీరాచల శ్రీ సీతారామచంద స్వామి, పెంబర్తి లోహ హస్తకళ, మహాకవి పోతన జన్మస్థలం బమ్మెర, కవి పాల్కురికి సోమనాధుడి జన్మస్థలం ఇక్కడ పర్యాటక ప్రాంతాలు. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి.
కరీంనగర్
హైదరాబాద్ సంస్థానంలో ఎలగందులగా ప్రసిద్ధి చెందిన జిల్లా కరీంనగర్. ఎలగందుల కోట, మనారు జలాశయం, దీనిపై నిర్మించిన డ్యాం, వెండితో వస్తువులు తయారుచేసే ఫిలిగ్రీ కళ, ఇల్లందుకుంట దేవాలయం, పురావస్తు ప్రదర్శన శాల చూడదగినవి. జిల్లా ప్రధాన బస్‌స్టేషన్ నుంచి సిటీ బస్సులతో పాటు వివిధ రూట్లతో ఆయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం కలదు.
పెద్దపల్లి
రామగిరి ఖిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్‌మడుగు జలాశయం, సబితం జలపాతం, రాముని గుండాలు ఈ జిల్లాలో పర్యాటక ప్రాంతాలు. ఓదెల మల్లన్న దేవాలయం ఈ జిల్లాలోనే పెద్ద దేవాలయం. పెద్దపల్లితో పాటు రామగుండంలో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. బస్సు సౌకర్యం కలదు.
జగిత్యాల
ఈ జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక్కడ పలు దేవాలయాలు ఉన్నాయి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, జగిత్యాల కోట, క్లాక్‌టవర్ ప్రధాన
పర్యాటక కేంద్రాలు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి జగిత్యాలకు, కొండగట్టుకు, ధర్మపురికి బస్సులు ఉన్నాయి.
సిరిసిల్ల
చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. మరనేత, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడ ఎగువ మానేరు జలాశయం ఉంది. సిరిసిల్ల చేనేత పరిశ్రమ, వేములవాడ, నాంపల్లి గుట్ట మొదలైనవి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సుసౌకర్యం కలదు.
భదాద్రి కొత్తగూడెం
భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన దేవాలయం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. దీనితో పాటు పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కినె్నరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఈ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి దూరం 309 కిలోమీటర్లు. ప్రత్యేక బస్సులు, రైలు సౌకర్యం ఉంది.
ఖమ్మం
స్వయంభువుగా వెలసిన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈ జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. దీంతోపాటు నగరంలోని ఖిల్లా, నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం, భర్తరామదాసు నివాసం ప్రముఖమైనవి. వైరా, లంకాసాగర్ పా జెక్టులు, సత్తుపల్లి ఉపరితల బొగ్గుగని చూడదగిన ప్రాంతాలు. హైదారాబాద్ నుంచి ఖమ్మం 193 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం కలదు.
నిజామాబాద్
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పుట్టిల్లు నిజామాబాద్. గోదావరి నదిపై కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. బడాపహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. వీటితో పాటు బ్రిటీష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్యకళాశాల చూడదగ్గ ప్రాంతాలు.
కామారెడ్డి
నిజాం నవాబులు కేవలం ఏడు సంవత్సరాలలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు, బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, కాల భైరవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, బుగ్గరామలింగేశ్వర, బసవేశ్వర ఆలయాలు, పోచారం కౌలాస్నాలా ప్రాజెక్టు, దోమకొండ సంస్థానం కోట, పోచారం అభయారణ్యం పర్యాటక ప్రాంతాలు.
మెదక్
హైదరాబాద్‌కు సమీపంలో ఉండి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్. నిజాం కాలంలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, మెదక్ ఖిల్లా, కొల్చారంలోని జైనమందిరం, నర్సాపూర్ అడవులు, పోచారం జలాశయం, పోచారం అభయారణ్యం ప్రధాన పర్యాటక ప్రాంతాలు. వీటితో పాటు ఏడుపాయల వనదుర్గా జాతర జిల్లాలో ప్రముఖమైంది. హైదారాబాద్ నుంచి మెదక్ 101 కిలోమీటర్లు ఉంటుంది.
మెదక్ నుంచి అన్నిప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
సిద్దిపేట
కొమురవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతీ క్షేత్రం, కొండపోచమ్మ, 600 సంవత్సరాల చరిత్ర కలిగిన నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ములుగు పాండురంగ ఆశ్రమం, జగదేవ్‌పూర్ వరదరాజుస్వామి, కోటిలింగేశ్వర ఆలయం, కోమటిచెరువు పర్యాటక కేంద్రాలు. హైదరాబాద్ నుంచి 103 కిలోమీటర్ల దూరం ఉంది. రాజధాని నుంచి కరీంనగర్‌కు వెళ్లే బస్సులు సిద్ధిపేట మీదుగానే వెళతాయి.
సంగారెడ్డి
సింగూరు జలాశయం, ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం ప్రధాన పర్యాటక కేంద్రాలు.
వికారాబాద్
తెలంగాణా ఊటీ అనంతగిరి. 41 వేల హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం. ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం, అనంతగిరి పద్మనాభుడు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. బుగ్గరామేశ్వరం, భూకైలాస్, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొండంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు చూడదగినవి.
మేడ్చల్
కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. జైన, బౌద్ధమతాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఇక్కడ వెలుగుచూశాయి. ద్రాక్షతోటలు, అందమైన విల్లాలు ఈ ప్రాంతపు ఆకర్షణలు.
రంగారెడ్డి
రెండో తిరుపతిగా పేరొందిన చిల్కూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి ఆలయం, హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ప్రసిద్ధ పర్యాటకాలు.
నిర్మల్
చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాది పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగిన అందమైన జిల్లా ఇది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్‌లకు పెట్టింది పేరు. 400 సంవత్సరాల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయనపేరుపై వెలిసిందే నిర్మల్. బాసర సరస్వతీ ఆలయం, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయం, స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతోపాటు సదర్మాట్ బ్యారేజీ, పొచ్చెర, కుంటాల, కడెం జలపాతాలు, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ వంటివి ప్రధాన పర్యాటక కేంద్రాలు.
మంచిర్యాల
అపారమైన బొగ్గునిల్వలు, ప్రాణహిత, గోదావరి నదుల కలయికతో పునీతమైన జిల్లా మంచిర్యాల. గాంధారి ఖిల్లా, గాంధారి వనం, మొసళ్ల అభయారణ్యం, కృష్ణజింకల అభయారణ్యం, పులుల అభయారణ్యాలు ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు. గూడెం గుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మరో అన్నవరంగా పిలుస్తారు.
కుమరం భీం ఆసిఫాబాద్
కుమరం భీం పోరాడిన జోడేఘాట్ ఇప్పుడు తెలంగాణలో అతి పెద్ద పర్యాటక ప్రా ంతంగా రూపుదిద్దుకుంటోంది. మార్లవాయి హేమండార్ఫ్ దంపతుల స్మారకస్థలం, సప్తగుండాల, సముతుల గుండం జలపాతాలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. వాంకిడిలో కాకతీయుల నాటి శివాలయం ప్రసిద్ధి. కుమరం భీం ప్రాజెక్టు, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, జగన్నాథ్ సాగర్, పాల్వాయి సాగర్ జలాశయాలు ఈ జిల్లాలో ముఖ్యమైనవి. రాజధాని నుంచి 307 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జిల్లా. ఇక్కడికి బస్సుసౌకర్యం ఉంది.
ఆదిలాబాద్
ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో పొచ్చర, గాయతి , కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడ ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఉంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా అడవుల్లోనే ఉన్నాయి. కాబట్టి వసతి సౌకర్యం జిల్లా కేంద్రంలోనే అనుకూలం. హైదరాబాద్ నుంచి 304 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదిలాబాద్. ఇక్కడికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి.
పొచ్చెర జలపాతం
సహ్యాద్రి పర్వతాల్లోంచి జాలువారే పొచ్చెర అందాలను ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే.. కుంటాలతోపాటు పొచ్చెర, గాయత్రి, మిట్టె, గుత్పల, సమితుల.. వంటివి ఎన్నో జలపాతాలు పర్యాటక పుటల్లోకి ఎక్కకపోయినా అవి పంచుతున్న మధురానుభూతులు ఎన్నో.. ఎనె్నన్నో.. ఆకాశగంగే పెంకితనంగా దివి నుండి భువికి దూకుతున్న భావన కలుగుతుంది పొచ్చెర జలపాతాన్ని చూస్తే.. పొచ్చెర, గాయత్రి, సవతుల గుండం, కనకదుర్గ, బుంగనాల, గన్‌పూర్ జలపాతాలన్నింటినీ కలిపి సప్తగుండాలుగా వ్యవహరిస్తారు. బోథ్ క్రాస్‌రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఉంది.
కుంతాల జలపాతం
సహ్యాది పర్వతప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం కుంతాల జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కడెం నదిపై హోరుమంటూ దూకే ఈ జలపాతం అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కేంద ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కవ్వాలా టైగర్ జోన్ కూడా ఈ పరిధిలోకే వస్తుంది. నేరడిగొండ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ
జలపాతం ఉంటుంది. దుష్యంతుడి భార్య శకుంతల నుండి కుంతాల పేరు ఈ జలపాతానికి వచ్చిందని స్థానికుల నమ్మకం. ఈ జలపాతం, ఇక్కడి అందాలను చూసి మైమరిచిపోయిన శకుంతల తరచూ స్నానానికి ఇక్కడికే వచ్చేదని వారి నమ్మకం. కుంతాల జలపాతం వంద అడుగుల ఎత్తునుండి కిందపడే జలధార మధ్యలో ఓ గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. శివరాత్రి నాడు శివభక్తులు ఇక్కడి సోమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. ఇక్కడ నిర్వహించే జాతరను సోమన్నజాతరగా పిలుస్తారు.
*
ఆంధ్రా...
ఘనమైన చరిత్ర , సంస్కృతి, ప్రకృతి రమణీయతలను ప్రతిబింబించే ప్రదేశాలు మనదేశంలో కోకొల్లలు. ఆకట్టుకునే అందాలు, కొండలు, అడవులు, జలపాతాలు, మ్యూజియంలు, జంతుప్రదర్శనశాలలు, బీచ్‌లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎనె్నన్నో అందాలు మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. నిత్యజీవనానికి భిన్నంగా, మార్పుకోసం విహారయాత్రలు చేస్తుంటాం. అయితే వెళ్లాలి అనుకోగానే ఎక్కడికి? ఎలా? అనే అనే్వషణ మొదలవుతుంది. పిల్లల కేరింతలతో, భాగస్వామి చిరునవ్వులతో కలిసి విహారానికి వెళ్తే ఆ ఆనందమే వేరు. విహారయాత్ర అనగానే ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించుకుని ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా పర్యటన మధురానుభూతుల్ని మిగులుస్తుంది. ముందుగానే మనం వెళ్లే విహార ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడికి చేరుకోవడానికి సులభమార్గం, విడిది వంటివాటిని ముందుగానే నిర్ణయించుకుంటే విహారం ఆనందమయమవుతుంది.
శ్రీకాకుళం
ఒకప్పుడు బౌద్ధమతానికి ఇది ముఖ్యస్థానంగా వర్ధిల్లింది.
శాలిహుండం, దంతపురి, జగతి మెట్టలలో బౌద్ధారామాలు ఉండేవి. ఆరో శతాబ్దం నుండి పధ్నాలుగో శతాబ్దం వరకు శ్రీకాకుళాన్ని గాంగేయులు పాలించారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధి. మహేంద తనయ నది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం బారువా బీచ్. దంతపురం, శాలిహుండంలోని చారిత్రక కట్టడాలు, బౌద్ధ విహారాలు. తేలినీలాపురం వలస పక్షుల కేంద్రం, కళింగపట్నం బీచ్, మందసలో పురాతన వాసుదేవ ఆలయం ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు.
విజయనగరం
అలనాటి రాచరికానికి చెక్కుచెదరని గురుతులు- బొబ్బిలి, విజయనగరం కోటలు. వీటితో పాటు అలకనంద ప్యాలెస్, బొబ్బిలి అతిథి గృహం, కోరుకొండ ప్యాలస్, రాజమహల్, మోతీమహల్, ఓర్ద్ ఖానా, పీర్లహోం, పొందూరు ఖద్దరు, గంటస్తంభం, తాటిపూడి రిజర్వాయర్, తోటపల్లి రిజర్వాయర్ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు.
విశాఖపట్నం
విశాఖ జిల్లాలో ‘ఆంధ్రా ఊటీ’ అరకు అందాలను చూస్తే పర్యాటకులు పరవశించిపోతారు. ఎటుచూసినా పచ్చదనం, వివిధ జంతువుల కిలకిలారావాలు.. ఎగిసిపడే జలపాతాల హొయలు అరకు సొంతం. ‘ఆంధ్రా కాశ్మీర్’గా పేరుతెచ్చుకున్న లంబసింగి ఈ జిల్లాలోనే ఉంది. చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకుని ప్రకృతి అందాలను వెదజల్లుతుంది. భారతదేశంలోనే లోతైన గుహలు బొర్రా గుహలు. దాదాపు నూరు మీటర్ల ఎత్తు నుండి జాలువారే అనంతగిరి జలపాతం, పాడేరు, ఆర్.కె.బీచ్, మత్స్యగుండం, డాల్ఫిన్ నోస్, కైలాసగిరి, ముదసర్లోవ, రుషికొండ, బావికొండ బౌద్ధ స్థూపం, ఏటికొప్పాక బొమ్మలు, ‘కురుసుర’ జలాంతర్గామి మ్యూజియం, విశాఖ మ్యూజియం, వుడా పార్క్, గంగవరం బీచ్, భీమిలి బీచ్, భీమునిపట్నం, అప్పికొండ, ముత్యాలపాలెం, తొట్లకొండ బీచ్‌లు, ఎర్రమట్టి దిబ్బలు, శంకరం గుహలు, తడ పార్క్, రాజమహల్, ఉంపాక, యారాడ.. ఇలా ఇవన్నీ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలే..
తూర్పు గోదావరి
కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడిపోతూ ఉంటుంది ఈ జిల్లా. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, గోదావరి గలగలలు.. అత్యద్భుతాలు. గోదావరి వంతెన, ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ మ్యూజియం, రాళ్ళబండి మ్యూజియం, కోరింగ అభయారణ్యం, ఇస్కాన్ టెంపుల్, ఆదుర్రు బౌద్ధారామం, పుష్కర ఘాట్, హోప్ ఐల్యాండ్, కాకినాడ బీచ్, కడియపులంక, కందుకూరివారి ఇల్లు, గోదావరి తల్లి పాదాల చెంత కట్టిన దిండి రిసార్టులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే పర్యాటక ప్రదేశాలు.
పశ్చిమ గోదావరి
అఖండ గోదావరికి అటూ ఇటూ నీలి, ఆకుపచ్చ రంగుల మేలు కలయికతో ఠీవిగా నిలబడి ద్వారపాలకులు కనిపిస్తాయి పాపికొండలు. రాజమండ్రి నుంచి పాపికొండల వరకూ గోదావరిలో సాగే పడవ ప్రయాణాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. యాంత్రికత నిండుకున్న గజిబిజి జీవితానికి దూరంగా ప్రకృతి కాంత ఒడిలో సేద తీరినట్లుగా ఉంటుందీ ప్రయాణం. గుంటుపల్లి బౌద్ధారామాలు, కొల్లేరు సరస్సు, పేరుపాలెం బీచ్, పెదవేగి వంటివి మరికొన్ని పర్యాటక ప్రాంతాలు.
కృష్ణా
కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం 130 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది గొప్ప విహార క్షేత్రం. ఇక్కడ జలక్రీడలు, సాహసక్రీడలను ఏర్పాటుచేశారు. పిల్లలకు ఇవి ప్రధాన ఆకర్షణలు. ప్రకాశం బ్యారేజ్, అక్కన్న మాదన్న గుహలు, హంసలదీవి, కొండపల్లి కోట, ఘంటశాల, బౌద్ధారామం, చల్లపల్లికోట, కూచిపూడి, మొగల్రాజపురం గుహలు, మంగినపూడి బీచ్, సిబార్ డిస్నీల్యాండ్, విక్టోరియా మ్యూజియం, కొండపల్లి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు.
గుంటూరు
ఆంధప్రదేశ్ రాజధానిగా మారిన ‘అమరావతి’కి పూర్వనామం ‘్ధన్యకటకం’. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమరావతి బౌద్ధ, జైన మతాలకు ప్రసిద్ధి. అమరావతిలో ఉన్న అమరేశ్వరాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ధ్యాన బుద్ధ భట్టిప్రోలు మహాస్థూపం, అమరావతి మ్యూజియం, నాగార్జున కొండ, ఎత్తిపోతల జలపాతం, గుత్తికొండ గుహలు, మానస సరోవర్ పార్క్, సూర్యలంక బీచ్ పర్యాటక ప్రాంతాలుగా పేరుపొందాయి.
ప్రకాశం
స్వాతంత్రోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల-పేరాల ఉద్యమం పేరుగాంచినది. గుండ్లకమ్మ జలపాతం అన్ని కాలాల్లోనూ కొండలపైనుండి జాలువారుతూ కనువిందు చేస్తుంది. చందవరం బౌద్ధారామం, భైరవకోన, గుండ్ల అభయారణ్యం, చీరాల, కొత్తపట్నం, మోటుపల్లి, ఓడరేవు బీచ్‌లు చూడాల్సిన ప్రదేశాలు.
నెల్లూరు
నెల్లూరు సమీపంలో అతి పొడవైన సాగరతీరం మైపాడ్ బీచ్. ఆకుపచ్చని చెట్ల వరుస, సముద్రపు అలల తాకిడి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అతిథులుగా వచ్చే వలస పక్షులతో కళకళలాడే మంచినీటి సరస్సు పులికాట్. దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సు ఇది. శ్రీహరికోట ద్వీపం బంగాళాఖాతాన్ని, పులికాట్ సరస్సును వేరుచేస్తుంటుంది. ఇక ‘ఇస్రో’ ప్రయోగాలకు వేదికగా నిలిచిన శ్రీహరికోట గురించి తెలియనివారు ఎవ్వరూ ఉండరు. నేలపట్టు పక్షుల కేంద్రం, కండలేరు డ్యాం, కోడూరు బీచ్, కృష్ణపట్నం పోర్ట్, ఉదయగిరి కోట, వెంకటగిరి కోటలు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు.
కర్నూలు
లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి, ‘్భగోళిక వింత’గా పేరుతెచ్చుకున్న బెలూం గుహలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇవి భారతదేశంలోనే అతి పెద్దవి. వీటిని సున్నపురాయి గుహలు అని కూడా అంటారు. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఈ జిల్లాలోనే ఉంది. వీటితోపాటు కొండారెడ్డి బురుజు, మల్లెల తీర్థం, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, నల్లమల అటవీప్రాంతం, శ్రీశైలం డ్యాం, ఆధోని కోటలను చూడవచ్చు.
అనంతపురం
ఏకశిలా నంది విగ్రహం, మధ్యయుగం నాటి అతి పెద్ద పురాతన శివాలయం, పాము చుట్టుకుని ఉన్న శివలింగం, అద్భుత శిల్పకళతో అలరారుతున్న స్తంభాలు.. ఇవన్నీ లేపాక్షి ప్రత్యేకతలు. బెలుం గుహలు, రాయదుర్గం కోట, కుంభకర్ణ గార్డెన్, పుట్టపర్తి, ధర్మవరం, తిమ్మమ్మ మర్రిమాను, కళ్యాణి డ్యాంలు ఈ జిల్లా ప్రత్యేకతలు.
కడప
భారతదేశంలోనే అతి పెద్ద గిరి దుర్గం- గండికోట. ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రదేశం ఇది. ఎందరో రాజులు, రాజవంశ పరాక్రమాలు, అలనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు నిలువుటద్దం ఈ కోట. ఎటుచూసినా కమనీయ దృశ్యాలు, అందమైన లోయలే కనిపిస్తాయి. ఒంటిమిట్టలో అతి పురాతమైన ఏకశిలా ఆలయం రామాలయం. వందల చరిత్ర కలిగిన ఈ గుడిలో రాములవారిని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. వీటితో పాటు శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం, సిద్ధవటం కోట, శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, మైలవరం డ్యాం చూడదగిన ప్రదేశాలు.
చిత్తూరు
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రగిరికోట నేటికీ అదే రాచఠీవితో ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించక ముందు ఇక్కడే పెరిగాడు. ఇక్కడి రాజమహల్, రాణీమహల్ అప్పటి ఘన చరిత్రకు సాక్ష్యాలు. ఇక అంతర్జాతీయంగా అత్యధిక ఆదాయం కలిగిన క్షేత్రం తిరుపతి. ఈ క్షేత్రం గురించి, శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అతి పొడవైన జలపాతం తలకోన అందాలు చూడతరమా..! దాదాపు 272 అడుగుల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతం అందాలు చూడటానికి రెండు కనులూ సరిపోవు. చుట్టూ చెట్టూచేమలు, ప్రకృతి అందాలు అదరహో.. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి అనువైన ప్రదేశం తలకోన. ఇంకా గుర్రంకొండ కోట, హార్సిలీ హిల్స్, కైలాసనాథ కోన, కైగల్ జలపాతం, శిలాతోరణం, యన్.టి.ఆర్ జలాశయం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు.
అరకు అందాలు
చుట్టూ ఎతె్తైన కొండలు..
లోతైన లోయలు..
మంచుతెరల మధ్య చల్లగాలి గిలిగింతలు..
వృక్షాల మధ్యలో నుండి దోబూచులాడే మయూఖ తంత్రులు..
జలజల జాలువారే జలపాతాల హొయలు..
ఇలా.. ఒకటేమిటి..? ప్రకృతిలో ఉన్న అందాలన్నీ తనలోనే ఇముడ్చుకున్న భూతల స్వర్గం- ‘ఆంధ్రా ఊటీ’- అరకు. కనుచూపుమేర పచ్చటి తివాచీ పరిచినట్లు, రమణీయమైన సోయగాలతో, అందమైన లోయలతో ప్రకృతి ప్రేమికులను రమ్మంటూ స్వాగతం పలికే అందమైన ప్రదేశం అరకు.
విశాఖపట్నానికి 115 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా , ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న తూర్పుకనుమల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారు 600 నుండి 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం అత్యంత సుందరమైనది. విశాఖ నుండి 105 కిలోమీటర్ల మేర సాగే రైలు ప్రయాణం పర్యాటకులను ఆహ్లాదపు ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. పచ్చటి కొండల మధ్య వయ్యారంగా ఒంపులు తిరుగుతూ దాదాపు 46 వంతెనలు, 56 సొరంగాలను దాటుకుంటూ, మధ్యమధ్యలో ఎదురయ్యే సెలయేర్లను పలకరించుకుంటూ సాగే
రైలు ప్రయాణం పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అడుగడుగునా ప్రకృతికాంత పులకింతలు, సహజసిద్ధమైన అందాలే..
ఇక్కడ గిరిజనుల జీవనశైలికి అద్దం పట్టే అద్భుత కళాఖండాల సమాహారం ట్రై బల్ మ్యూజియం ఉంటుంది. గిరిజనుల సంప్రదాయాలు, వారు వాడే ఆయుధాలు, రోజువారీ వస్తువులు.. ఇలా అన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు బొమ్మల రూపంలో దర్శనమిస్తాయి. గిరిజన సంస్కృతిలో భాగమైన ‘్ధంసా’ నృత్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్థానిక ఆదివాసీ మహిళలు లయబద్ధంగా చేసే ఈ నృత్యం చాలా హుషారుగా సాగుతుంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్ కూడా తూర్పు కనుమలలో ఓ భాగం. ఇక్కడ అందమైన పూలమొక్కలు, వివిధ వృక్షజాతులు కనువిందు చేస్తాయి. ఈ గార్డెన్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కూరగాయలను పెంచేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి దీన్ని కేవలం కూరగాయలను పండించడానికే కాకుండా హార్టికల్చరల్ నర్సరీగా అభివృద్ధి చేశారు.
మేఘాలను తాకే ఎతె్తైన కొండల నడుమ పచ్చటి తివాచీ పరిచినట్టుగా మైళ్ళ తరబడి సుగంధ పరిమళాలను వెదజల్లే కాఫీతోటలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి అనంతగిరి హిల్స్. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో బొర్రా గుహలు ఉంటాయి. ఈ గుహలను బ్రిటిష్ భూగర్భ పరిశోధకుడు విలియం కింగ్ 1807లో వెలుగులోకి తీసుకొచ్చాడు. గోస్తనీ నది ఈ గుహల్లోనే పుట్టి జలపాతంగా మారి తూర్పుదిక్కుగా ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
*
ప్రయాణంలో యాప్‌లు
ప్రతిరోజూ దేశం మొత్తం మీద వేల సంఖ్యలో రైళ్లు తిరుగుతుంటాయి. లక్షల మంది ప్రయాణీకుల్ని అవి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే రైలు రిజర్వేషన్ కష్టతరంగా మారింది. కానీ ఇప్పుడు రైలు ప్రయాణానికి అవసరమైన టికెట్లకు సాయపడే యాప్‌లు, వెబ్‌సైట్లూ చాలా వచ్చాయి. రైలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నపుడు వెయిటింగ్ లిస్ట్ చూస్తే టికెట్ బుక్ చేయాలా? వద్దా? అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో టికెట్ ‘కన్‌ఫర్మ్’ అవుతుందో లేదో ఎవరైనా చెబితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అందుకు ఉపయోగపడుతుంది ‘ట్రైన్‌మేన్’ అనే యాప్. టికెట్ బుక్ చేయకముందే వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో ఈ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తే మనకు కావాల్సిన సమాచారం చెప్పేస్తుంది. ‘తత్కాల్’ టికెట్ బుక్ చేసుకోవడంలోని మెలకువలూ, పీఎన్‌ఆర్ స్టేటస్ వంటి వివరాలనూ తెలుపుతుంది ఈ యాప్.
ట్రిపోసో యాప్
వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ యాప్ మంచి నేస్తం. మన రాష్ట్రంలోనే కాదు.. దేశ విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి కూడా ఇది బహుప్ర యోజనకరం. ఒక్కసారి దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకున్నా కూడా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. ప్రయాణ సమయంలో దిక్సూచిగా తోడ్పాటును అందిస్తుంది. మనం వెళ్ళాలనుకున్న ప్రదేశాల మార్గాన్ని మ్యాప్ ద్వారా చూపిస్తుంది. మనం ఉన్న చోటు నుంచి వెళ్లాలనుకున్న ప్రదేశం ఎంత దూరంలో ఉందో చెబుతుంది. అంతేకాదు.. అక్కడి వాతావరణ పరిస్థితులను కూడా తెలియజేస్తుంది. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను కూడా వివరిస్తుంది.
ట్రివాగో
ఈ యాప్ మనం వెళ్లే ప్రదేశంలోని హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఏయే హోటళ్లలో ఎలాంటి సౌకర్యాలున్నాయి? ఎంత ఖర్చు అవుతుంది? అనే సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.
యాత్ర
విహారయాత్రకు చక్కని ప్లానింగ్ ఇచ్చే యాప్ ఇది. దీని ద్వారా టికెట్ల బుకింగ్ చాలా వేగవంతంగా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో లభించే టూరిజం ప్యాకేజీలను కూడా తెలుసుకోవచ్చు. కారు చౌక విమానం టికెట్‌లు అందిస్తున్న సంస్థల గురించి కూడా ఈ యాప్ తెలుపుతుంది. హోటల్ బుకింగ్, డిస్కౌంట్ ఆఫర్ల గురించి కూడా చక్కగా తెలియజేస్తుంది.
ట్రావెల్ ఖానా
రైల్లో సుదూర తీరాలకు రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ట్రావెల్ ఖానా యాప్ సహాయపడుతుంది. ఏ స్టేషన్‌కు చేరినప్పుడు భోజనం కావాలో ఈ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆర్డరు పెడితే ఆ స్టేషన్‌కు పార్శిల్ వచ్చేస్తుంది. పీఎన్‌ఆర్, రైలు వివరాలు అందులో పొందుపరిస్తే చాలు, సీటు దగ్గరికే భోజనాన్ని అందిస్తారు.
రైల్ రెస్టో
రైలు ప్రయాణికులకు కేటరింగ్ సేవల్ని అందించే మరో సంస్థ ఇది. వీరి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ముందుగా లేదంటే ప్రయాణంలో ఉన్నప్పుడు భోజనాన్ని ఆర్డరు ఇవ్వచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బులు కూడా చెల్లించవచ్చు. లేదా పార్శిల్ ఇచ్చాక డబ్బు నేరుగా ఇవ్వవచ్చు.
టికెట్ జుగాడ్
మనం ప్రయాణాలు ఎక్కువగా చేసేది సెలవురోజుల్లో లేదా పండుగలప్పుడే కదా. ఆ సమయంలో కాస్త ఆలస్యం చేసినా ‘కన్‌ఫర్మ్’ టికెట్లు దొరకవు. అలాంటప్పుడు మన దగ్గర ఉండాల్సిన యాప్- ‘టికెట్ జుగాడ్’. ఇది ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించి మనం వెళ్ళే దారిలో ముందూ, వెనుకా స్టేషన్లలో ఎక్కడ నుంచైనా టికెట్లు అందుబాటులో ఉన్నాయేమో చూసి చెబుతుంది. సెలవుల్లో దూర ప్రయాణాలు చేసేవారికి ఎంతో మేలుచేస్తుంది.
ఐఆర్‌సీటీసీ
రైలు ప్రయాణానికి ముందే సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడటానికి, ప్ర యాణంలో భోజనం ఆర్డరు చేయాలన్నా, రైలు దిగిన తర్వాత ‘క్యాబ్’ బుక్ చేయాలన్నా ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఈ యాప్‌లోనూ ఉంటాయి. దీనిలో యాత్రల్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
ఎన్‌టీఈఎస్
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్) యాప్‌ను ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టింది. రైలు సకాలంలో నడుస్తుందో లేదో చూడటానికి, రైళ్ల రద్దుపై సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాదు ఇక్సిగో టై న్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, వెయిటింగ్ బెర్త్ కన్‌ఫర్మేషన్ వంటి వాటిని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను తెలుగులో కూడా ఉపయోగించుకోవచ్చు. టికెట్ గురించి మొత్తం సమాచారాన్ని ఇచ్చే యాప్ ఒకటుంది అదే- కన్‌ఫర్మ్ టికెట్ యాప్. అలాగే మనం వెళ్లాల్సిన రైలు వచ్చిందో లేదో చెప్పే యాప్ కూడా ఒకటుందండోయ్.. అదే- ‘వేర్ ఈజ్ మై టై న్’.. ఇది రైళ్ల షెడ్యూళ్లనీ, పీఎన్‌ఆర్ స్టేటస్‌నీ, బెర్త్ ఖాళీలనీ, రైలు ఛార్జీలను కూడా తెలియజేస్తుంది. ఈ యాప్‌కి ఇంటర్నెట్ అవసరం లేదండీ.. ఎక్కడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
*
ప్రయాణాల్లో జీవనశైలి
పర్యటనలకు వెళ్ళాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణం సాఫీగా సాగి ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆ జ్ఞాపకాలను భద్రపరచుకోవాలంటే కొన్ని ముందస్తు చర్యలను చేపట్టాలి.
* విహారయాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా మెడికల్ కిట్ దగ్గర పెట్టుకోవాలి. ప్రయాణంలో చిన్న చిన్న గాయాలకు ప్రథమ చికిత్స చేసేందుకు ఉపయోగపడే వస్తువులు, జ్వరం, జలుపు, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగించే మందు బిల్లలు వంటివి కుటుంబ వైద్యుని సలహా మేరకు తీసుకెళ్లాలి.
* మధుమేహ వ్యాధి ఉన్నవారు ఇన్సులిన్‌తో పాటు, కొన్ని సందర్భాల్లో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు తీసుకునేందుకు పండ్లు, ఆహార పదార్థాలను తీసుకెళ్ళాలి.
* ప్రయాణాల్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారికి అవసరమైన మందులు, వస్తువులు, వారు తినే తినుబండారాలు తీసుకెళ్లాలి.
* వేసవి విహారానికి ఎతె్తైన కొండలు, పర్వత ప్రాంతాలు, చల్లని ప్రదేశాలకు వెళ్ళేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకు చలిని కాచే దుస్తులను పట్టుకెళ్లాలి.
* చాలామందికి బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహార పదార్థాలు, నీళ్లు పడకపోవచ్చు. అలాంటివారు ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకుండా ఫిల్టర్ వాటర్ లేదా ఇప్పుడు ఎక్కడైనా వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి, వాటిని కొని తాగవచ్చు.
* వేసవి కాలం కాబట్టి పెద్దలు, పిల్లలూ తరచూ కొబ్బరినీళ్లు, లస్సీ వంటివాటిని తాగుతుండాలి.
* ప్రయాణాల్లో తేలికరంగుల్లో ఉన్న కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.
* టోపీలు, చలువ కళ్లద్దాలు వెంట తీసుకుపోవడం మరువకండి.
* నడకకు అనువైన చెప్పులను కానీ, బూట్లను కానీ వేసుకోవడం మంచిది.
* ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ ఉరుకుల, పరుగుల, బిజీ జీవితంలోని ఒత్తిడిని వెంట తీసుకుని విహార యాత్రకు వెళితే.. ప్రశాంతత లభించదు. అసంతృప్తే మిగులుతుంది.
* వన్యప్రాణులు, పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా గమనించాలి. ఆ ప్రాంతపు నియమ నిబంధనలు పాటించాలి.
* చిన్న పిల్లలను ఎప్పుడూ వెంటబెట్టుకునే ఉండాలి. ఏమరుపాటుగా కూడా వారిని వదలకూడదు. ముఖ్యంగా జలపాతాల దగ్గర పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే విహారయాత్ర ఎంతో ఆనందంగా సాగుతుంది.
*
గంటలో వెంకన్న దర్శనం
ఇది నిజమే! తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి తిరుమలకు విమానంలో తీసుకెళ్లి, అక్కడ కేవలం గంట వ్యవధిలో స్వామి దర్శనం చేయించి, చుట్టుపక్కల దేవాలయాలను చూపించి, తిరిగి రాత్రికి హైదరాబాద్ చేర్చేలా తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పదివేల రూపాయలతో ఒకరోజు, పదమూడు వేలతో రెండు రోజుల ప్యాకేజీలను ప్రకటించింది తెలంగాణ పర్యాటక శాఖ. ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి అన్నీ ఈ ధరలోనే. ఒకరోజు యాత్రలో భాగంగా ఉదయం 6:55కి విమానంలో బయలుదేరి 8:10కి రేణిగుంటకు, అక్కడి నుంచి 9:30కు తిరుమల చేరుకునే యాత్రికులకు, ఉదయం 12:30 గంటల్లోపు దర్శనం, మధ్యాహ్నం మూడుగంటలకు భోజనం, విశ్రాంతి, ఆపై తిరుచానూరు అమ్మవారి దర్శనం, సాయంత్రం 5:35 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్ళి, రాత్రి 7:45కు హైదరాబాద్‌కు చేర్చేలా ప్యాకేజీ ఉంటుంది. రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా తొలుత శ్రీకాళహస్తి, ఆపై భోజన విరామం, సాయంత్రం కాణిపాకం లేదా తిరుచానూరు, రాత్రికి ఫార్చ్యూన్ కేన్సస్‌లో బస, మరుసటి రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం, ఆపై విశ్రాంతి, సాయంత్రం తిరుచానూరు అమ్మవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటాయి. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి పర్యటనకు వెళ్లాలనుకునేవారు ‘తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థం’ (టీఎస్ టీడీసీ) సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.
*
ఆర్థిక ప్రణాళిక
విహారానికి ఎప్పుడు వెళుతున్నాం? ప్రయాణానికి ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నాం? వంటి విషయాలను బట్టి ఎంత సొమ్ము అవసరమవుతుందో ముందుగానే అంచనా వేసుకోవాలి. అవసరమనుకున్నదానికంటే కొంత ఎక్కువ సొమ్మునే జమచేసుకుంటే అత్యవసర సమయాల్లో పనికొస్తుంది. కొంతమంది విహార యాత్రలకు నెల నుంచి మూడు నెలల వరకు సమయం కేటాయిస్తారు. అలాంటివారు ముందుగానే అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలి. అంటే గృహ, వ్యక్తిగత, వాహన రుణ వాయిదాలు ఉంటాయి. అవి బకాయి పడకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకని ముందుగానే వాటికి చెల్లించాల్సిన మొత్తం జమచేసుకుని పెట్టుకోవడం మేలు. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ చెల్లింపులే కదా అని లిక్విడ్ క్యాష్ పెట్టుకోవడం మరువకూడదు. అలాగే మొత్తంగా లిక్విడ్ క్యాష్ కూడా తీసుకెళ్ళకూడదు. ప్రయాణాల్లో నగదు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అవసరం మేరకు కొంత లిక్విడ్ క్యాష్, క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకెళ్ళడం మంచిది. బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బులు ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల క్రెడిట్ కార్డులను వాడరు కాబట్టి.
విహారయాత్ర ఆనందకరంగా సాగి తీపి జ్ఞాపకాలను మిగల్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కష్టాలు చెప్పిరావు. అందుకే ముందుగానే మనం అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలి. దాదాపు అన్ని సాధారణ బీమా సంస్థలు ప్రయాణ బీమాను అందిస్తున్నాయి. లగేజీ, క్రెడిట్, డెబిట్ కార్డులు పోగొట్టుకున్నప్పుడు బీమా పరిహారం అందుతుంది. ప్రయాణాల్లో ఎలాంటి అనారోగ్యం కలిగినా బీమా ఆదుకుంటుంది. రైల్వేలు కొద్దిపాటి పైకాన్ని మాత్రమే వసూలు చేసి బీమా రక్షణను కల్పిస్తున్నాయి. ‘ప్ర యాణ బీమా’ చేయించే ముందు అన్ని విషయాలను పరిశీలించి తగిన బీమా చేయించుకోవడం చాలా మంచిది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా విహారయాత్రలు శుభప్రదం అవుతాయి.
*
లేడీస్ స్పెషల్!
‘సోలో టూరు.. సో బెటరు..’ అని స్వేచ్ఛాగీతాలు ఆలపిస్తూ ఏకాంతంగా విహారయాత్రలకు వెళ్లే మగువల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇలాంటి వారి కోసం ఓ అందాల ద్వీపం స్వాగతం పలుకుతోంది. ఈ పర్యాటక ద్వీపంలోకి మగాళ్లకు ఎంతమాత్రం ప్రవేశం లేదు. ఫిన్‌లాండ్ తీరంలో 8.4 హెక్టార్లలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ద్వీపం పేరు ‘సూపర్ షీ’. పేరుకు తగ్గట్టే దీన్ని మహిళా పర్యాటకుల కోసం తీర్చిదిద్దారు. అత్యంత విలాసమైన కాటేజీల్లో ఒకేసారి పదిమంది మహిళలకు మాత్రమే వసతి కల్పిస్తారు.
ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న ఈ పర్యాటక దీవిని క్రిస్టినా రోథ్ అనే మహిళ నందనవనంగా తీర్చిదిద్దారు. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఖరీదైన కాటేజీలు, అత్యాధునిక ‘స్పా’లు, యోగ, ధ్యానం, ఫిట్‌నెస్ కేంద్రాలు ఈ దీవిలో ఉన్నాయి. అందాల్ని వీక్షించడమే కాదు, గార్డెనింగ్ చేస్తూ హాయిగా కాలక్షేపం చేయవచ్చు. ఇన్ని సౌకర్యాలున్న ఈ దీవిలో ఆతిథ్యం పొందడం కాస్త కష్టమే! ఆసక్తి, డబ్బు ఖర్చు చేసే ఆ శక్తి ఉన్న మహిళలు ముందుగా ‘సూపర్ షీ’లో సభ్యత్వం తీసుకోవాలి. నిర్వాహకురాలు క్రిస్టినా జరిపే ‘ముఖాముఖి’లో విజేతలుగా నిలిచిన వారికే ఈ దీవిలోకి ప్రవేశం లభిస్తుంది. వ్యాపార దృక్పథంతో ‘సూపర్ షీ’కి రూపకల్పన చేసినప్పటికీ, మహిళల జీవనశైలిని మెరుగుపరచడం, వారిలో వ్యక్తిత్వ వికాసం పెంచడం తన లక్ష్యమని క్రిస్టినా చెబుతున్నారు.
*
దిక్సూచి చిటికెలో...
ట్రిప్‌గేటర్ అనే యాప్‌ను భారత పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. దేశంలోని దాదాపు 350 ప్రాంతాల వివరాలు ఇందులో దొరుకుతాయి. సాహసయాత్ర లు చేయదగ్గ ప్రాంతాల వివరాలు మరో అదనపు సౌకర్యం. ప్రాంతాలు, కాలాల వారీగా పర్యాటక ప్రాంతాలను సూచిస్తుంది. అంతర్జాలంలో దొరికే అన్ని రకాల సమాచారాన్ని శోధించి మన ముందు ఉంచుతుంది ‘ట్రిప్‌గేటర్’. హోటళ్ల వివరాలు కూడా చిటికెలో మన ముందుంటాయి. బడ్జెట్ ప్లానింగ్‌కు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.
*
తోడుగా శుద్ధజలం
కొత్తప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నీళ్ళు తాగితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కొందరికి. జలుబు చేయడం, కడుపునొప్పి, విరేచనాలు.. ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిప్రాంతాల్లో కొందామన్నా శుద్ధజలం లభించదు. కొండప్రాంతాలు, మారుమూల ప్రదేశాలకు వెళ్లనప్పుడు తాగునీటి సమస్య ఎదురవుతుంది. అంతేకాకుండా అక్కడ బాటిల్ నీళ్ల ధర కూడా మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతంలోనైనా, ఎలాంటి నీళ్లనైనా క్షణాల్లో శుద్ధజలంగా మార్చే వాటర్ ఫిల్టర్ బాటిళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వీటిని కొనుక్కోవడం వల్ల ఎక్కడికి వెళ్లినా మంచినీటి సమస్య ఉండదు. ఇందులో ముప్పావు నుంచి లీటరు నీళ్ళదాకా పట్టే బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నీళ్లు పోసిన ముప్ఫై సెకన్లకే నీటిని వడగట్టేస్తుంది. ఈ నీళ్ళను హాయిగా తాగేయచ్చు. ఈ ఫిల్టర్‌లలో ఎలాంటి రసాయనాలు కూడా ఉండవు. ఫిల్టర్ పనిచేసేందుకు విద్యుత్, బ్యాటరీలు కూడా అవసరం లేదు. అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారుచేశారు. నాలుగు వేల లీటర్ల నీటిని వాడుకున్న తరువాత ఫిల్టర్‌ని మార్చుకోవచ్చు. ఇవి పర్యటనలకి చాలా అనుకూలమైనవి.
*
సెల్ఫీలతో జాగ్రత్త!
కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సాగే విహారయాత్రలు మధురానుభూతులను మిగల్చాలి. జలపాతాలు, కొండశిఖరాలు, రైల్వే ట్రాక్‌లు వంటి ప్రాంతాల్లో ‘సెల్ఫీ’ల పేరుతో సాహసాలకు దిగితే విహారంలో విషాదం తప్పదు.
*
సొరంగ ప్రయాణం
ప్రపంచంలోని అతి పెద్ద నదీ సొరంగం గురించి మీకు తెలుసా? ఫిలిప్పీన్స్‌లోని పియర్టో ప్రినె్ససా అనేది ఓ భూగర్భ నది. భూగర్భ నది అంటే ఏంటి? దీనిలో ప్రయాణం చేయవచ్చా? అనుకుంటున్నారు కదూ.. సున్నపురాతి కొండలతో కూడుకున్న కొండ కింది గుహల్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ నదికి భూగర్భ నది అని పేరు. ఈ అతిపెద్ద సొరంగంలోని దృశ్యాలు చాలా అందంగా, వివిధ ఆకారాల్లో కనులకు విందు చేస్తాయి. ఈ నదిపై ఎంచక్కగా ప్రయాణం చేయవచ్చు. సొరంగంలోకి కూడా వెళ్లి ప్రయాణంలో మరింత థ్రిల్‌ని పొందవచ్చు. అందుకే ఇది ప్రపంచంలోని గొప్ప పర్యాటకప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
స్పెయిన్ రాకుమారి యులాలియా గుర్తుగా కూడా ఈ ప్రాంతానికి పియర్టో ప్రినె్ససా అనే పేరు వచ్చిందని చెబుతారు. ఫిలిప్పీన్స్‌లోని పియర్టో ప్రినె్ససా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని ఓ రక్షిత అటవీ ప్రాంతంలోనే ఈ భూగర్భ నది ఉంది. ఈ నది సాఫీగా సాగిపోతూ పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సొరంగాల్లో కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైపెచ్చు చుట్టూ ఉన్న వివిధ రకాల సున్నపు మేటలను చూస్తూ ఆహ్లాదంగా పడవ ప్రయాణం చేయవచ్చు కూడా.
*
వైజాగ్‌లో స్కూబా డైవ్
అది కడలి తరంగాలు ఉవ్వెత్తున్న పోటెత్తే ప్రాంతం. ఆ ప్రాంతం గురించి భయంతో కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడవన్నీ ఒట్టి కథలే అని తేలిపోయింది. ఆ ‘అల’జడి వెనుక ఏ మాయలూ, మంత్రాలు లేవని తెలిసిపోయింది. అంతే కాదండోయ్.. అలల జడితో ఉన్న ఈ సముద గర్భంలో ఓ అద్భుతం వెలుగుచూసింది. దాదాపు శతాబ్దం కిందట అక్కడ మునిగిన ఓ భారీ నౌక ఆనవాళ్లు బయటపడ్డాయి. విశాఖ స్కూబా డైవర్స్ ఈ భారీ నౌకను కనుగొన్నారు. స్కూబా డైవింగ్ కడలి లోపలి అందాలు కళ్లముందుంచే అద్భుత విన్యాసం. గోవా తీరంలో, అండమాన్ అంచుల్లో, పుదుచ్చెరీ బీచ్‌లో బాగా డిమాండ్ ఉన్న ఈ సాహసక్రీడకు ఇప్పుడు వైజాగ్ కూడా అడ్డాగా మారింది. నడిసంద్రంలోకి వెళ్లి.. డైవింగ్ సూటూ, బూటూ వేసుకుని.. ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకుని.. నీటిలోకి దూకేయడం కాదు స్కూబా డైవింగ్ అంటే.. సముద్రంలో తేలుతూ.. మన ముందు నుంచి వెళ్తున్న జలచరాలను కళ్లారా చూడటం, సాగరంలోని ప్రకృతి అందాలను మనసులో జ్ఞాపకాలుగా ముద్రించుకోవడం.. అబ్బా.. తలచుకుంటుంటే చాలా బాగుంది కదూ. వీటన్నింటి కంటే విశాఖలో అంతకుమించిన ఆనందం సొంతమవుతుంది. ఎందుకంటే ఇక్కడ సముద్ర గర్భంలోని అందాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడో మునిగిన నౌక తాలూకు అందాలను కూడా వీక్షించవచ్చు. మునిగిపోయిన నౌక విడిభాగాలు 500 మీటర్ల వరకు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని విశాఖ స్కూబా డైవర్స్ గుర్తించారు. ఇవి కేవలం ఏడు మీటర్ల లోతులోనే ఉండటం మరో విశేషం. ఇక్కడ సముద్రంలో ‘విజన్’ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. దాదాపు ముప్ఫై మీటర్ల వరకూ చక్కగా కనిపిస్తుంది. దీంతో జలచరాల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. భీమునిపట్నం నుంచి సుమారు ముప్ఫై నిముషాల పాటు బోటులో ప్రయాణిస్తే నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఈతరాని వాళ్లు కూడా స్కూబా డైవింగ్ చేయవచ్చు. పర్యాటక శాఖ ఉద్యోగులు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే డైవింగ్‌కు తీసుకెళ్తారు. ముందుగా స్విమ్మింగ్‌పూల్‌లో స్కూబా డైవింగ్‌లో తర్ఫీదును ఇచ్చిన తరువాత సముద్రంలోకి తీసుకెళ్తారు. స్కూబా డైవింగ్ చేసేవారితో పాటు సహాయకులు (ఇన్‌స్ట్రక్టర్స్) కూడా ఉంటారు. సముద్రంలో దాదాపు 45 నిమిషాల వరకు గడపవచ్చు.
*
అందమైన ఊరు..
ఎటు చూసినా ఇసుక తినె్నలే..
మధ్యలో ఒయాసిస్..
దానిచుట్టూ ఏర్పడిన అందమైన చిన్న ఊరు..
ఆ ఊరి పేరు ‘హువాకా చైనా’. అక్కడి జవాభా 200లోపే.. కానీ అక్కడికి ఏటా వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అంత గొప్ప ఏముందబ్బా అక్కడ అనుకుంటున్నారు కదూ..
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలోని ఇకా జిల్లాలోని ఓ ఎడారి ప్రాంతంలో ఒయాసిస్ చుట్టూ ఉంది హువాకా చైనా. అందుకే దీన్ని ‘ఒయాసిస్ ఆఫ్ అమెరికా’ అని పిలుస్తారు. ఈ ఊరు చాలా అందమైనది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున్న ఈ చిన్ని ఊరును చూడటానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్ర కృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఇసుకలో సాండ్ బోర్డింగ్, డూన్ బగ్గీ డై వింగ్ వంటి చాలా ఆటలను ఆడుతుంటారు ఇక్కడకి వచ్చే పర్యాటకులు. ఇంత అందమైన ప్రదేశంలో ఎత్తుగా ఉన్న ఇసుకతినె్నల పైనుంచి బోర్డ్ ద్వారా కిందకు జారుతుంటే భలే మజాగా ఉంది అంటుంటారు పర్యాటకులు.
ఎటుచూసినా ఇసుకమేటలు కనిపించే ఈ ప్రాంతంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సముద్రం ఉండేదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వందలకొద్దీ తిమింగలాల శిలాజాలు బయటపడ్డాయట. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని అనుకునేరు! కానీ ఈ ప్రాంతపు ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు మించదు. ఊరి మధ్యలో ఉండే ఒయాసిస్సులో చాలా ఔషధగుణాలున్నాయని చెబుతారు ఇక్కడివారు. ఈ ఊర్లోని సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్భుతమే! ఇసుకలోంచి బయటకి నెట్టినట్లుగా వచ్చే సూర్యుడు, అలాగే సంధ్యాసమయంలో ఇసుకలోకి కూరుకుపోతున్నట్లుగా ఉండే సూర్యుడిని చూడటానికి రెండూ కళ్ళూ సరిపోవు. సంధ్యాసమయంలో కెంజాయవర్ణం ఇసుకతినె్నలపై పడి మెరుస్తుంటే ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు జిల్లా కేంద్రంలో విడిది చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఈ ఊరు రావడానికి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి.
*
విహారంలో ఆహారం
విహార యాత్రలో తినే వేళలు, ఆహార పదార్థాల విషయంలో దాదాపు అందరూ నిర్లక్ష్యం వహిస్తుంటారు. దీనివల్ల అనారోగ్యం దరిచేరి ప్రయాణం భారంగా మారుతుంది. ఆహారంలో విషయంలో కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ప్రయాణం ఆద్యంతం ఆనందంగా సాగుతుంది.
* ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి రెండుగంటలకోసారి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల జీవక్రియలు సాఫీగా సాగుతాయి.
* మంచినీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎండల్లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
* అన్ని ప్రదేశాల్లో నచ్చిన ఆహారం దొరకదు. అందుకే పండ్లు, డై ఫ్రూట్స్, బిస్కట్లు, చాక్లెట్లు దగ్గర ఉంచుకోవడం ఉత్తమం. ఇంటి నుంచి తెచ్చుకున్న జంతికలు, మురుకులు అయితే మరీ మంచిది.
* ప్రయాణాల్లో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం అత్యుత్తమం.
* ప్రయాణాల్లో నచ్చిన ఆహారం దొరకడం కష్టం. అందుకే దొరికిన ఆహారమేదైనా మితంగా తినడం మంచిది.
* వేసవి ప్రయాణాల్లో మసాలాలకు దూరంగా ఉండాలి. లేకపోతే దాహం ఎక్కువవడమో, గ్యాస్ బారిన పడటమో ఖాయం.
* ఎలక్ట్రాల్ పౌడర్, ఓఆర్‌ఆర్ వంటి వాటిని వెంట తీసుకుని వెళ్లడం మంచిది.
* అప్పుడప్పుడూ కొబ్బరి బొండాలు, లస్సీ వంటివాటిని తీసుకోవడం వల్ల ఎండదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు.
*

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి