ఈ వారం స్పెషల్

జలదరింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టికి పురుడుపోసే మంత్రసాని
ప్రకృతి మాతకు నెచ్చెలి
రైతన్నకు తోబుట్టువు
సమస్త జీవకోటికి ప్రాణాధారం
చినుకు..
ఆ చినుకే పడకపోతే బతుకు శూన్యం.
నీరు.. సమస్త జీవకోటికి ప్రాణాధారం. అలాంటి ప్రాణాధారమైన జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. గొంతు తడుపుకోడానికి గుక్కెడు నీరు కూడా దొరక్క జనాలు అల్లాడిపోయే పరిస్థితి దాపురిస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవడం పౌరుల కర్తవ్యం. ప్రకృతిని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం సమాజం బాధ్యత. వనరుల పట్ల ముందుచూపు నాయకుల ప్రాథమిక విధి. ఈ మూడింటిలో దేని సమతౌల్యం దెబ్బతిన్నా జల జగడమే.. సంక్షోభమే..
మానవ జీవితం ప్రారంభమైంది నీటితోనే అని చెబుతారు శాస్తవ్రేత్తలు. తల్లిగర్భంలో అందరూ ఊపిరి పోసుకునేది ఉమ్మ‘నీటి’లోనే.. మానవ శరీరంలో కూడా అరవై శాతానికి పైగా నీరే.. భూమిలో మూడొంతులు ఉన్నదీ నీరే.. అయినా ఏం లాభం? స్వచ్ఛమైన తాగునీరు ఉన్నది ఒక్కశాతం మాత్రమే.. అది కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోతూ ఎండిన గొంతుకకు బొట్టునీరు కూడా దొరకని పరిస్థితికి చేరువలో ఉన్నాం. అందుకే ఒక్కో నీటిబొట్టును ఒడిసిపడితే ఒదిగిపోయి జీవితాలని పండిస్తుంది. విడిచిపెడితే వినాశనమే చేస్తుంది.
ప్రతినీటి చుక్కనూ కాపాడుకుందామనే బరువైన నినాదాలు చేస్తున్నారు తప్పితే.. అమృతం లాంటి జలాలను శాశ్వత ప్రాతిపదికపై పరిరక్షించుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఫలితంగా జలం కాలక్రమేణా అడుగంటిపోతోంది. రాబోయే రోజుల్లో గొంతు తడుపుకోడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. మానవులకే కాదు పశుపక్ష్యాదులకు, చెట్టూ చేమలకు కూడా నీరే జీవనాధారం. నీరు లేకుండా ప్రాణం నిలవదు. అలాంటి నీటిని మానవుడు తన అవసరాలకు తగినట్లుగా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు తరాలకు నీటి కొరత రాకుండా చూడవలసిన తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. అటు సాగునీటి జలాలు, ఇటు తాగునీరు అందరికీ ఎంతో అవసరమైనప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో నీటి కటకట నడుస్తూనే ఉంది. మనదేశంలో కనీసం 84 కోట్ల మందికి పైగా ప్రజలు తాగేందుకు చుక్క నీరు దొరక్క దుర్భర జలదారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. రానురానూ ఈ నీటి కరవు మరింత పెరుగుతుందని, దేశంలో సగభాగానికి పైగా ప్రజలకు జలగండం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో కానీ, ప్రజల్లో కానీ ఎటువంటి కదలికా ఉండటం లేదు. వేసవి వస్తే చాలు.. అనేక ప్రాంతాల్లో ప్రజలకు నీటి బాధలు మరింత వెక్కిళ్లు పెట్టిస్తున్నాయి.
నేడు నిస్సందేహంగా నీటికోసం పోరాటం జరుగుతోంది. జనవనరుల కోసం జనం కొట్టుకునేరోజు, గుక్కెడు నీళ్ల కోసం గొంతులు కోసే రోజులు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి యెమన్‌లో ఎదురయ్యింది కూడా.. అక్కడ నీటి కోసం జరిగే ఘర్షణల్లో ఏటా నాలుగు వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారట! ఒకప్పుడు అధిక వర్షపాతానికి నెలవైన అస్సాంలోని చిరపుంజి నేడు బీడుభూమిగా మారిపోయింది. కారణం మానవ
తప్పిదమే.. యథేచ్ఛగా చెట్లను కొట్టేయడం, అడవుల్ని నాశనం చేయడం ఇవన్నీ మనిషి స్వార్థానికి సాక్ష్యాలే.. అయినా కూడా భూమీద ఎంతో కొంత నీరు మిగిలే ఉంది. ఇకనుంచైనా మనిషి తన అవసరానికి తగినట్లు భూమిపై ఉన్న జలనిధిని తూకమేసినట్లు ఒబ్బిడిగా వాడుకుంటే సరి! ఇప్పటి పరిస్థితుల ప్రకారం మనిషి అవసరానికి మించి దాదాపు ఇరవై రెట్లు ఎక్కువగా నీటిని వాడుకుంటున్నాడట! నేటి నీటి కరువైనా, రేపటి నీటి యుద్ధమైనా నీటి దుబారాకు సాక్ష్యాలే..
నా పిల్లలు, వారి పిల్లలూ అంటూ మనిషి ఏడు తరాల వరకూ ఆస్తిపాస్తులను కూడబెడతాడు. అలాంటిది ప్రకృతి సంపద విషయానికొచ్చేసరికి ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు? నీటి విషయంలో ఇంత సంకుచిత దృష్టా? వందేళ్ల తర్వాతో, నూటయాభై ఏళ్ల తర్వాతో.. తన మనవడో, మునిమనవడో గుక్కెడు నీళ్లు దొరక్క గొంతెండి చచ్చిపోయే పరిస్థితి.. మనిషి తన మనవడి కోసం సంపాదించిన ఆస్తులేవీ గొంతుతడిపి ప్రాణాన్ని నిలబెట్టలేవన్న సత్యం మనిషి తెలుసుకునేదెప్పుడు? ఈ రోజు ఓ బిందెడు నీళ్లు ఆదాచేస్తే అవే అమృతమై రేపటి తరాల్ని బతికిస్తాయి. ఈకాలంలో అసలు సిసలు ఆస్తులంటే బంగారమూ, భవనాలూ కాదు.. అచ్చంగా నీళ్ళే! అనగనగా కథలో ఓ పండు ముసలి భవిష్యత్తు కోసం మామిడి మొక్కను నాటినట్లు మనిషి కూడా జలవనరుల్ని భద్రపరచాలి.
చిక్కిపోతున్న నదులు
ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం మంది భారతదేశంలో ఉండగా, వినియోగానికి అవసరమైన నీటివనరులు మాత్రం నాలుగు శాతమే ఉన్నాయి. పైగా లభ్యమయ్యే నీటిలో కూడా అనేక అసమానతలు. అందుకే దేశంలోని అత్యధిక ప్రాంతాలలోని ప్రజలు తరచూ నీటిసమస్యను ఎదుర్కొంటున్నారు. తలసరిగా లభ్యమవుతున్న నీరు 1947 నాటితో పోలిస్తే నేడు దాదాపు 75 శాతం తక్కువ. ఫలితంగా దేశంలో 25 శాతం ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సంవత్సరం మొత్తం ప్రవహించే జీవనదులు అనేకం కొన్ని రోజుల ప్రవాహానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అనేక చిన్న నదులు అంతరించిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి నదీజలాల్లో నీటిమట్టం సగానికి సగం పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య సున్నితత్త్వం కారణంగా జలవివాదాల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.
మనదేశంలో ప్రతి సంవత్సరం 4,000 క్యూబిక్ కిలోమీటర్ల వర్షపాతం కురుస్తున్నది. అంటే తలసరి ఒక మిలియన్ గ్యాలన్ల తాజా నీరు లభిస్తోందన్నమాట. అయితే 85 శాతం వర్షపాతం ఎక్కువగా హిమాలయ ప్రాంతాలైన గంగ, బ్రహ్మపుత్ర నదుల పరీవాహక ప్రాంతాల్లోనే కురుస్తోంది. మరోవైపు తూర్పు, వాయువ్య, దక్షిణాది ప్రాంతాల కన్నా ఈశాన్య ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురుస్తోంది. కానీ ఈ వర్షపాతం సద్వినియోగం కావడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో విపరీతంగా చెట్ల నరికివేత, కాలుష్య కారక రసాయనాలు, విచక్షణారహితంగా నదీ జలాల వినియోగం, అడ్డగోలుగా ఆనకట్టల నిర్మాణం, నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించడం వంటి చర్యల వల్ల నదులు వేగంగా కుంచించుకుపోతున్నాయి. రాబోయే 15 సంవత్సరాల్లో మనిషి మనుగడకు అవసరమైన నీటిలో కేవలం యాభై శాతం మాత్రమే లభ్యమవుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరో విషయమేంటంటే రాబోయే ఇరవై సంవత్సరాల్లో జీవనదులు కూడా కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయని ఓ అంచనా.
సర్కారు సాయం
ఖజానాలోని ప్రతి రూపాయికీ బాధ్యత వహించినట్లే.. భూమిలోని ప్రతి నీటిబొట్టుకూ సర్కారు వారు సంరక్షకుల్లా వ్యవహరించాలి. నదులు, కాలువలు, చెరువులన్నీ రకరకాల వ్యర్థాలతో భరించలేనంత కాలుష్యానికి గురై, ఆ నీరు తాగిన ప్రజలు పలు రకాల వ్యాధులతో అవస్థలు పడుతూనే ఉన్నారు. నీటివనరులను పరిరక్షించుకోవడానికి, కాలుష్య భూతాన్ని తరిమికొట్టడానికి ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవడం లేదు. దేశంలో సుమారు 450కి పైగా నదీనదాలున్నా, ఇటీవలి కాలంలో కాలుష్యానికి గురైన నదుల సంఖ్య 275కు పైగా పెరిగిందని కేంద్ర కాలుష్య నివారణ మండలి చెబుతున్నా పాలకులకు అది శ్రవణ ప్రాయంగానే ఉంటోంది తప్ప ఆ వాస్తవాల్ని జీర్ణించుకునే స్థితిలో ఉండటం లేదు. దీంతో దేశంలోని పలుప్రాంతాలు కలుషిత నీటితో కుళ్ళిపోతున్నాయి. ఈ నీటిని తాగి ఏటా ప్రాణాలు పోగొట్టుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఇక్కట్లు చాలవన్నట్లు నీటిలో ఫ్లోరైడ్‌ను కలపడం వల్ల అనేకమంది ప్రజలు మరింతగా బాధపడుతున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ రక్కసి ఇంకా ఇంకా విరుచుకుపడుతూనే ఉందని నిపుణులు ఎన్నిసార్లు స్పష్టంగా హెచ్చరిస్తున్నా పాలకుల చెవికెక్కడం లేదు.
‘నీటి ఆడిట్’ ద్వారా ప్రాజెక్టుల్లోని నీరు ప్రతి ఎకరాకు ఎంత పరిమాణంలో చేరుతుందో లెక్కగట్టే పద్ధతి ఉండాలి. పారిశ్రామిక రంగానికి అప్పజెప్పిన నీటిని, ఆయా సంస్థలే బాధ్యత వహించేలా చూడాలి. అత్యాధుని టెక్నాలజీ ద్వారా నీటిని తిరిగి వాడుకునేలా ప్రోత్సహించాలి. రసాయనాలతో నదుల్ని కలుషితం చేసే పరిశ్రమలను మూసేయాలి. నీటి సరఫరాలో లోపాలను.. అంటే కాలువలు, పైపులైన్ల మరమ్మతు ద్వారా జలసంపద వృథాను అరికట్టవచ్చు. ఈ బాధ్యత అంతా సర్కారుదే..
జలసిరిని కాపాడుకుందాం..
ప్రజలకు ఆహార భద్రత, ఇంధన భద్రత కంటే ముందుగా నీటి భద్రత కల్పించాలి. నదులు కాలుష్య బారిన పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షపునీటిని నిల్వ ఉంచుకునే సదుపాయం లేకపోవడంతో నదీజలాలు 80 శాతానికి పైగా సముద్రాల్లో కలుస్తున్నాయి. ఎందుకంటే మన దేశంలో కేవలం 30 రోజుల వర్షపాతాన్ని మాత్రమే నిల్వచేసుకునే సామర్థ్యం ఉన్నది. ఈ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటే జలసిరిని పెంచుకోవచ్చు. నీటిని పొదుపుగా, పద్ధతిగా ఉపయోగించినప్పుడే జీవకోటి అవసరాలు తీరతాయి. అలాకాక విచక్షణారహితంగా నీటిని వృథా చేస్తే ప్రకృతి సైతం నీటి అవసరాలు తీర్చలేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ‘జల అత్యవసర పరిస్థితులు’ వచ్చేశాయి. కారణం నీటి పునర్‌లభ్యత సామర్థ్యం కంటే నీటి వినియోగం అధికంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచైనా నీటి పొదుపును పాటిస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయి.
* ఏటా వేలాది టీఎంసీల నీరు వాగులు, వంకలు, నదుల ద్వారా సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఈ జలాలను పరిరక్షించుకోవాలి.
* రైతులకు నీటి తిప్పలు తప్పడం లేదు. అందుకే రైతులు సంప్రదాయ పద్ధతిలో కాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటల్ని పండిస్తే 80 శాతం నీటిని పొదుపు చేయవచ్చు.
* సాగునీటి కాలువలకు సోలార్ పలకలను అమర్చడం ద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టి కొంతవరకు నీటి నష్టాన్ని నివారించవచ్చు.
* నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి. నీటి వృథాకు కారకులయ్యేవారిని కఠినంగా శిక్షించాలి.
* పట్టణాలు, నగరాలు కాంక్రీటు జంగిళ్లుగా మారిపోతున్నాయి. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితిలేదు. దీన్ని అధిగమించడానికి ప్రతి ఇంట్లో, కార్యాలయంలో ఇంకుడు గుంతలు తవ్వాలి. గులకరాళ్లు, ఇసుక వేసి ఇంకుడు గుంతను ఏర్పాటు చేస్తే వర్షపునీరు చాలావరకు భూమిపొరల్లోకి ఇంకుతుంది.
* గొట్టపు బావుల మాదిరిగా భూ ఉపరితలం నుంచి లోతుగా ఇంజక్షన్ వెల్స్ తవ్వి వర్షపునీరు అందులోకి వెళ్లేలా చేస్తే భూగర్భజలాలను కాపాడుకోవచ్చని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. దీనే్న ‘ట్యూబ్ రీచార్జ్’ అంటారు.
* పట్టణాలు, నగరాల్లో ‘రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ను ప్రోత్సహించాలి. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి.
* ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) ప్రాంగణంలో నీటిని ఒడిసిపడుతున్నారు. రెండు పెద్ద ట్యాంకులను నిర్మించి వర్షపునీటిని సమర్థంగా భద్రపరుస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలను పెంపొందించడంతోపాటు అవసరమైనప్పుడు సాగుకు నీటిని అందిస్తున్నారు. ఇక్రిశాట్ సహకారంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టి మంచి ఫలితాలను రాబడుతున్నారు.
* నీటి సంరక్షణ గురించి పాఠ్యాంశాల రూపకల్పనతో సరిపెట్టకుండా ఒకప్పుడు జలవనరులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి కారణాలు ఏంటి? తదితర ప శ్నలకు సమాధానాలను వివరిస్తూ విద్యార్థి దశ నుంచే పిల్లలను నీటి పొదుపు చేసేలా ప్రేరేపించాలి. అలా అయితేనే వారి భవిష్యత్తు తరాలకు కూడా నీటిని మిగుల్చుకోగలుగుతారు.
* నీటి సంరక్షణ గురించి స్నేహితులతో, పక్కవారితో చర్చించేలా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో పిల్లలు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు నీరు, పర్యావరణం పట్ల సరైన అవగాహన కలిగించగలుగుతాం.
* సమర్థ నీటి యాజమాన్య పద్ధతులను అమలుచేస్తున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* పట్టణాల్లో, నగరాల్లో ప్రతి ఇంటికీ నీటి మీటర్లు బిగించాలి. పరిమితికి మించి నీటిని వినియోగించే వారి నుంచి భారీగా రుసుము వసూలు చేయాలి.
* నదులు, కాలువలను కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాలి. ఇది కూడా జలసంరక్షణే. కాబట్టి పట్టణాలు, నగరాల్లోని వందశాతం మురుగునీటిని సీవేజ్ ట్రీట్‌మెంట్ తరువాతే కాలువల్లోకి వదలాలి.
ఇలా ఇప్పటినుంచైనా జలాన్ని ఓ అవసరంగా, ఓ వనరుగా చూడటం మానేసి గొంతును తడిపే అమృతంగా భావిస్తే.. ఎప్పటికీ నీరు నిండుకోదు.. నోరు ఎండిపోదు.
*
‘నీటి’ కథ
రాము, సోములు అన్నదమ్ములు. వారిద్దరి మధ్య ఆస్తి తగవు వచ్చింది. తండ్రి మరణించేముందు తామిద్దరికీ సమానంగా ఆస్తి పంచలేదంటూ, ఈ సమస్యను తీర్చమని రాము, సోము తమ ఊరి పెద్దమనిషి మర్యాదరామన్న ఇంటికి వెళ్లారు. మర్యాదరామన్న ఇద్దరినీ కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రమ్మని చెప్పి చెరో చెంబుడు నీళ్లను చూపించాడు. రాము ఆ నీళ్లని గబగబా కాళ్ల మీద కుమ్మరించుకుని విసుగ్గా లోపలికి వెళ్లాడు. సోము అందులోని నీళ్లతో పాదాల్సి కడుక్కుని మిగిలిన నీళ్లతో ముఖం, చేతులు కడుక్కుని ఇంకా కొన్ని నీళ్లు మిగిలున్న ఆ చెంబును జాగ్రత్తగా యథాస్థానంలో పెట్టి లోపలికి వెళ్లాడు. వాళ్ళ నీటి వాడకాన్ని బట్టి ఆ పెద్దమనిషికి రాము దుబారా మనిషనీ, సోము పొదుపరి అని అర్థమైంది. రాము దుబారా వాడు కాబట్టే ఆస్తులన్నీ కరిగించుకున్నాడనీ, సోము పొదుపరి కాబట్టి ఇచ్చిన ఆస్తికి మరింత సొమ్మును పోగేసుకున్నట్లు తెలుసుకున్నాడు పెద్దమనిషి. అందుకే న్యాయంగా, పొదుపుగా బతుకుతున్న సోము వైపే తీర్పు చెప్పాడు మర్యాదరామన్న.

ఆర్థికంగా..
కార్పొరేట్ శక్తులు నీటిని కూడా అంగడిసరుకు చేసేశాయి. సీసాల్లో బంధించి వాటికి వెలకడుతున్నాయి. అంతర్జాతీయ నీటి వ్యాపారుల నుంచి స్థానిక ట్యాంకర్ మాఫియా వరకు ఎవరికి వారు సామాన్యుడి సంపాదనను జలగల్లా పిండేస్తున్నవారే.. వాడుకోవడానికి ట్యాంకర్లు.. తాగడానికి క్యాన్లు.. ఇదీ నేటి సామాన్యుడి పరిస్థితి. నీటి వ్యాపారం చిన్నది కాదు. వేల కోట్ల సామ్రాజ్యం. ఏటా ఇది విస్తరిస్తోందే తప్ప ఇసుమంతైనా తగ్గడం లేదు. పట్టణాల్లో సాధారణ ఉద్యోగిగా బతుకుతున్న వ్యక్తి నీటి అవసరాల కోసం నేడు నెలకు మూడు వేల రూపాయలదాకా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీస్తోంది. ఇదే మొత్తాన్ని ఏ భవిష్యనిధికో మళ్లిస్తే జీవన మలిసంధ్యలో ఆ వ్యక్తికి చింతలుండవు.. ఆర్థిక వేత్తలు తరచుగా వాటర్ పావర్టీ అనే మాటను ఉపయోగిస్తుంటారు. ఆ నిర్వచనం ప్రకారం.. ఎన్ని సౌకర్యాలున్నా తాగడానికి గుక్కెడు నీళ్లులేకపోతే అది జలదారిద్య్రమే కదా! ప్రభుత్వాలు జనానికి నీటిని అందించే బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ప్రైవేటు సంస్థలకు నీటి సరఫరా బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకోకూడదు. అలాంటివాటిని జనం ఏమాత్రం సహించరు.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి