ఈ వారం స్పెషల్

ఒక్క క్షణం.. జీవితాన్ని మార్చేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబర్ 10
ప్రపంచ ఆత్మహత్యల
నివారణ దినోత్సవం
**
ఓ యుద్ధం జరిగితే ప్రాణనష్టం
భారీగానే ఉంటుంది కదూ..
ఉన్మాద ఉగ్రవాదుల దాష్టీకాల్లో
మరణమృదంగ ఘోష గుండెను కదిపేస్తుంది కదూ...
ఏదో ఒక కారణంతో జరిగే ఘర్షణల్లో జననష్టానికి లెక్కేలేదు.
దానికి ఓ కారణం..నేపథ్యం ఉంటాయి.. అయినా ఏ పాపమూ తెలీని జనం... విధి నిర్వహణలో మునిగిపోయిన ఎంతోమంది జీవితాలు అలా ముగిసిపోతూంటే మనసు బరువెక్కుతుంది.
కానీ..
ఏ కారణం లేకుండా.. అంతకంటే ఎక్కువమందే
తనువుచాలిస్తున్నారంటే నమ్ముతారా?
* * *
కేవలం మానసిక బలహీనతతో.. బలవన్మరణాలకు పాల్పడుతున్నవారి సంఖ్య వీటన్నింటివల్ల జరుగుతున్న ప్రాణనష్టం కన్నా ఎక్కువ అంటే నమ్ముతారా?.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న గణాంకాలు అది నిజమేననిచెబుతున్నాయి.
ఈ ప్రపంచంలో బలవంతంగా ప్రాణం తీసుకుంటున్నది కూడా మనిషే. అదే విషాదం. ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం.. ఆక్రోశం.. ఏదో ఒక కారణం.. అనిశ్ఛితి, అభద్రత...ఏదోఒక ఆందోళన ఒత్తిడిని పెంచితే చటుక్కున ఒక్కక్షణంలో విలువైన ప్రాణాలను పణంగా పెట్టేస్తున్న అవివేకి మనిషే. వివేచన, విచక్షణ ఉన్న శక్తి ఏకైక జీవి మనిషి. అయినా బలవంతంగా నిండు ప్రాణాన్ని తనకు తానుగా బలిపెట్టుకుంటున్నదీ అతడే. పరిష్కారం ఉన్న సమస్యలనూ ఎదుర్కోలేని మానసిక బలహీనతే వారితో ఆ పని చేయిస్తోంది. ఆధునిక జీవనశైలిలో చివరకు ఆటలూ ప్రాణాంతకమైపోయాయి. అలా అర్థంతరంగా తనువుచాలించేద్దామనుకున్నవారిలో ఆలోచన రగిలేలా చేయాలంటోంది ప్రపంచం. జీవితం చాలించాలనుకుంటున్నవారు చివరిక్షణంలోనైనా...ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే..వారి ప్రయత్నాన్ని అడ్డుకునేలా వారిలో చైతన్యం తీసుకురాగలిగితే గండం గడచిపోతుంది. ఓ నిండుప్రాణం కొత్తజీవితాన్ని చూస్తుంది. అదే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
బలవన్మరణాల తీరు ఇదీ..
ప్రపంచం అంతటా రోజుకు 3వేలమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరి ప్రాణాలు పోతున్నాయన్నమాట. ఈ ప్రపంచంలో మనిషి మరణానికి కారణమవుతున్న వివిధ అంశాల్లో ఆత్మహత్య 13 ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది యువతీయువకులే. అదీ 15-29 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఏటా పది లక్షలమంది ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరో మూడేళ్లలో ఈ సంఖ్య 15 లక్షలకు పెరుగుతుందన్న ఆందోళనను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తం చేస్తోంది. అందుకే ప్రజల్లో చైతన్యం రగిల్చి ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూయిసైడ్ ప్రివెన్షన్ (ఐఎఎస్‌పి), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (డబ్ల్యుఎఫ్‌ఎమ్‌హెచ్) సంస్థలతో కలసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక
కార్యక్రమాలు చేపడుతోంది. సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని దాదాపు 40 దేశాలు అధికారికంగా చేపడుతున్నాయి. ర్యాలీలు, చర్చాగోష్టులు, సదస్సులు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. మానసిక ఆరోగ్యం వల్ల బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయచ్చన్నది ప్రధాన అంశం. దీనిపై విస్తృత ప్రచారం చేసే కార్యక్రమాలను చేపడతారు. ప్రతీ ఏటా ఒక నినాదాన్ని ప్రకటించి దానికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు పెద్దఎత్తున చేస్తారు. ఈ ఏడాది ‘ఒక్క నిమిషం తీసుకో.... నిండుజీవితం సాధించు’ (టేక్ ఒన్ మినిట్.. టేక్ ఎ లైఫ్) అన్న స్లోగన్‌తో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కారణాలు ఇవీ...
ప్రపంచం అంతటా జరుగుతున్న ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసింది ఐఎఎస్‌పి. వివిధ సమస్యలు ఉన్నప్పటికీ ఒంటరితనం, ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయి ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారని తేలింది. ఆర్థిక సమస్యలే ఎక్కువ మరణాలకు కారణం కాగా కుటుంబ కలహాలు ఆ తరువాతి సమస్యగా మారింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది యువతీ యువకులే. యుద్ధం, హత్యలు, నేరాలు, దాడులు వంటి వాటికన్నా ఆత్మహత్యల వల్లే ఎక్కువమంది చనిపోతున్నారన్నది ఆందోళన కలిగిస్తోందని అంటారు ఐఎఎస్‌పి అధ్యక్షుడు బ్రెయిన్ మిషర. ఇది నిజం. ప్రతి 40 సెకన్లకు ఒకరు అలా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రతి 40 సెకన్లకు 20మంది ఆత్మహత్యకు పాల్పడుతూంటే ఒకరు మరణిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. మానసికంగా ధృడంగా తయారవడం, కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం బలపడటం, కుంగుబాటులో ఉన్నవారిని గుర్తించి వారితో ప్రేమానురాగాలతో వ్యవహరించడం, మానసిక వైద్య చికిత్స అందించడం సమస్యకు అసలు పరిష్కారం. కాగా మనలాంటి చాలా దేశాల్లో మానసిక వైద్యం అంటే నామోషీ. అందువల్లే ఆసియా దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటోంది. మానసిక వైద్య చికిత్స తీసుకుంటే అదేదో పిచ్చిపట్టినవాళ్లకు చేసే చికిత్సగా భావించడం వల్లే ఈ సమస్య ఎక్కువైంది. మీకు తెలుసా! ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో ఎక్కువశాతం మంది అక్షరాస్యులు, విద్యాధికులు. అయినా ఎందుకు అలా చేస్తున్నారంటే మానసిక దౌర్బల్యమే కారణం. విరక్తి, అనాసక్తి జీవితాన్ని చాలించేలా చేస్తున్నాయి. చైనా, మలేసియా, స్లొవేనియా, ట్రినిడాడ్‌లలో ఆత్మహత్యల రేటు ఎక్కువ. స్విట్జర్లాండ్‌లో ఆత్మహత్యల రేటు తక్కువే. అయినా అక్కడి ప్రభుత్వం వాటి నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తేలింది. ప్రపంచం మొత్తంమీద ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్నది సౌత్ కొరియాలో. స్లొవేనియా, రష్యా, లాట్వియా, బెలారస్‌లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మహిళలకన్నా పురుషులు ఎక్కువమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఇద్దరు పురుషులు ఆత్మహత్యకు పాల్పడితే ఒక మహిళ అలా చేస్తున్నట్లు నిష్పత్తి తేలింది. ఆర్థికభారం, కుటుంబ కలహాలు ఊపిరితీయనివ్వకపోవడమే దానికి కారణం. 1996 నుంచి 2006 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు 60 నుంచి 90 శాతం పెరిగింది. ఆధునిక జీవనశైలిలో ఒంటరి జీవితాలు ఎక్కువై మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఓ పరీక్షలో విఫలమైతే జీవితానే్న ఫణంగా పెట్టి మనిషిగా ఓడిపోతున్నారు. ఎక్కువగా 15 నుంచి 34 సంవత్సరాల లోపు వారే ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఇదీ భారతం
మనదేశంలో ఆత్మహత్యలు ఎక్కువే. ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మనదేశం 22వ ర్యాంకులో ఉందని చెప్పొచ్చు. ఏటా లక్షా 35 వేలమంది ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 1987 -2007 మధ్య ఆత్మహత్యలు 7.9 నుంచి 10.3 శాతానికి పెరిగాయి. ఒక అధ్యయనం ప్రకారం 2010లో 187000మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 137600 మాత్రమేనని తేల్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే కేరళ, కర్నాటక, ఏపి, తెలంగాణ, తమిళనాడు త్రిపుర, మిజోరంలలో వరుసగా 16 శాతం మేరకు ఆత్మహత్యల సంఘటనలు నమోదయ్యాయి. పుదిచ్చేరి అన్నింటికన్నా ఎక్కువగా అంటే 38 శాతం మేరకు బలవన్మరణాలు నమోదైన ప్రాంతంగా తేలింది. ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా బిహార్ అగ్రస్థానంలో ఉంటే సిక్కిం, నాగలాండ్, మణిపూర్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అప్పులు, ఆరోగ్య సమస్యలు, వైఫల్యాలు, మానసిక దౌర్బల్యం బలవన్మరణాలకు కారణం. కాగా రైతులు ప్రాణాలు తీసుకోవడం ఇటీవలికాలంలో ఎక్కువైంది.
పురుగుమందులతో ప్రమాదం
ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది ప్రాణాలు తీసుకునేందుకు ఉపయోగిస్తున్నది క్రిమిసంహారక మందులనే. ఆయా సంఘటనల్లో దాదాపు 40 శాతం మరణాలు వీటివల్లే జరుగుతున్నాయి. మిగతా వాటిలో 38 శాతం ఉరి తీసుకోవడం వల్ల సంభవిస్తున్నాయి. అందుల్లే ఇటీవలి కాలంలో క్రిమిసంహారక మందులు, తాళ్ల విక్రయాలపై నిషేధం విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బ్లూవేల్ వంటి కిల్లర్ గేమ్ ఇప్పుడు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. సామాజిక మాధ్యమాల అందుబాటులోకి వచ్చిన తరువాత ఒంటరిగా ఉండే యువత వాటి మాయలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థలో పిల్లల పెంపకంపై శ్రద్ధ చూపడం, సహజ ధోరణికి భిన్నంగా ప్రవర్తిస్తున్న యువతీ యువకులను గమనించి మానసికంగా వారిని ఓదార్చడం, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుదని, బలవన్మరణం దానికి పరిష్కారం కాదని వారికి అర్థమయ్యేలా చేయడం అతిముఖ్యం. ఇది అందరి బాధ్యత. అప్పుడే వివేకవంతుడైన మనిషి జీవితానికి సార్థకత.
ఆ నిమిషం ఆలోచించగలిగితే..
తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి గురైన వారు ఆత్మహత్య శరణ్యం అని భావించి ప్రాణాలు చేసుకుంటారు. మారుతున్న జీవనశైలిలో ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది ఇలా చేస్తున్నారు. అలాంటి వారు ఒక్క నిమిషం ఆలోచించేలా చేయగలిగితే ఒక ప్రాణాన్ని కాపాడగలం. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సుమారు మూడు వేల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలకు అనుగుణంగా కాకుండా వారికి నచ్చినట్టు ఉండాలని నిర్దేశించడంతో మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయష్టాలను తెలుసుకొని ఆయా రంగాల వైపు ప్రోత్సహించాలి తప్ప ఒత్తిడికి గురిచేయవద్దు. సామాజిక మాధ్యమాలు సైతం పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. స్మార్ట్ఫోన్లతో గంటలకొద్దీ సమయాన్ని గడుపుతున్న యువత నిద్రలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. కొంత మంది మద్యతరగతి కుటుంబంలోని పిల్లలు స్మార్ట్ఫోన్ కొని ఇవ్వలేదని కృంగిపోతున్నారు. ఇలా రకరకాల కారణాలతో పిల్లలు తనువు చాలిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి, వారితో గడిపేందుకు రోజుకు రెండు గంటలు కేటాయించుకోవాలి, చనువుగా ఉంటూ వారిని ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలను తెలుసుకొని వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మందిని రక్షించవచ్చు. చిన్న విషయానికే కోపంతో ఊగిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకొని వారి బాధలను విని భరోసా కల్పించాలి. దీంతో వారిని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారిని మానసిక వైద్యుని వద్దకు తీసుకువెళితే ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
-డా.ఉమాశంకర్ , సూపరింటెండెంట్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల
మానసిక స్థైర్యం కీలకం
నేటి పోటీ యుగంలో ఎంతటి వత్తిడినైనా తట్టుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. తీవ్ర వత్తిడితో టెన్షన్‌కు గురికావటం, క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం వంటివి మనం చూస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు, వత్తిడి నివారణలో భాగంగా పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. దేవుడిచ్చిన ఎంతో విలువైన జీవితాన్ని తొందరపాటు నిర్ణయానికి బలి చేయటం తగదు. జీవితాన్ని చాలించుకోవాలన్న ఆలోచన వచ్చినపుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఆ ఒక్క నిమిషం ఆలోచనే నూరేళ్ల జీవితాన్ని కాపాడుతోంది. భరించలేని బాధలు, దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలున్న వారు వత్తిడి నుంచి బయటపడేందుకు నేడు అందుబాటులో ఉన్న పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలి. ఈ రకంగా ఆత్మహత్యలకు పాల్పడేవారిలో ఇతరులతో పోల్చితే కాస్త మానసిక స్ధైర్యం తక్కువేనని చెప్పవచ్చు. మన నిత్య జీవనంలో తప్పనిసరి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలైన కంప్యూటర్, సెల్‌ఫోన్, ట్యాబ్‌లకు ఎక్కువ సమయం అతుక్కుపోయి ఉండటం కూడా మానసిక ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటి వినియోగం వ్యసనంలా మారక ముందే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలి. ఆత్మహత్యల నివారణకు కృషి జరగటం అభినందనీయం. కొన్ని సందర్భాల్లో పెద్దల మానసిక వత్తిడి పిల్లపై కూడా దుష్ప్రభావం చూపుతోంది. భార్యభర్తల మధ్య గొడవల్లాంటివి పిల్లల్లో మానసిక ఆందోళన పెంచుతాయి. త ద్వారా వారు మానసికంగా ఎదగకపోవటంతో మానసిక పరిపక్వత చెందకుండా, చిన్న పాటి కష్టానికే, బాధకు ఆత్మహత్యే పరిష్కారమని భావించే అవకాశాలుంటాయి. పిల్లలు కంప్యూటర్ గేమ్స్‌కు అతుక్కుపోతుండటం ప్రస్తుతం ఆందోళన కల్గించే అంశం. దీంతో తలెత్తే దుష్పరిణామమే మానసిక వత్తిడి ,దీన్ని అధిగమించలేకపోయినా, ఎక్కువ ఆందోళన కల్గినపుడు, తనువు చాలించాలన్న ఆలోచన వచ్చినపుడైనా కూల్‌గా ఆలోచించటాన్ని అలవాటు చేసుకోవాలి.
-డా.అల్తాబ్ అలీ , సైకియాట్రిస్ట్, గ్లోబల్ ఆసుపత్రి
సమస్యకు పరిష్కారం ఉంటుంది
ఏ విషయానికి సంబంధించైనా ప్రశ్న ఉన్నపుడు జవాబు ఉంటుంది. అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం దొరకదనే భావనతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన మానసిక వత్తిడి గురైతే వారితో తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన తీరు చాలా కీలకమైంది. ఏ సమస్య వచ్చినా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో సమస్యను పంచుకుంటే తప్పకుండా పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రతి సమస్యకు పరిష్కారముందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ పరిష్కారాన్ని ఎలా పొందాలన్న దిశగా ఆలోచిస్తే ఫలితముంటుంది. ప్రేమ విఫలమయ్యే, ఆర్థిక ఇబ్బందులతోనే, కుటుంబ కలహాలతో ఆత్మహత్యలకు పాల్పడే వారు ఈ రకంగా ఆలోచించ గలిగితే, వారిలో అలాంటి శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలి. సమస్యకు పరిష్కారాన్ని గుర్తించే దిశగా కాకుండా మనుషులు తనకు తానే సొంతగా నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడే వాడి వ్వవహార శైలిలో తీవ్రంగా మార్పు వస్తోంది. ఈ మార్పును కుటుంబ సభ్యులు గమనించగలిగితే వారు ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కానీ ఈ దిశగా ఎక్కువ ప్రయత్నమేమీ జరగటం లేదనే చెప్పవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలన్న భావనతో ఉన్న వారు రెండు,మూడు రోజుల నుంచి వౌనంగా ఉండటం, ఎవరితో మాట్లాడినా విరక్తిగా ఫీల్ కావటం ముఖ్య లక్షణాలు వీటిని గుర్తించి, కొంత క్లోజ్‌గా మూవ్ అయితే వారిని ఆత్మహత్య నుంచి కాపాడే అవకాశాలు పెరుగుతాయి.
-డా.ఎం.ఎస్.హరికృష్ణ, ఎంపిటి (వోబిఎస్ అండ్ జివైఎన్), వైద్యుడు, హైదరాబాద్

-బి.శ్రీధర్