ఈ వారం స్పెషల్

అమీ తుమీ సెమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ మాయాజాలం ఫలిస్తుందా..?
యువనేత రాహుల్ రాణిస్తాడా..?
ఇతర పార్టీల జాతకాలెలా ఉంటాయి..?
... అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలెలా ఉండబోతున్నాయన్న విషయమై దేశ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. 2019 లోక్‌సభ సమరానికి ముందు జరుగుతున్న అసలు సిసలు ‘సెమీఫైనల్స్’ కావడంతో రాజకీయ పక్షాలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనే కేంద్రీకరించాయి. సార్వత్రిక ఎన్నికల ‘నాడి’ని పసిగట్టే ఎన్నికలు కావడంతో వీటికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇటీవలి ఉప ఎన్నికల్లో పరాభవాలను చవిచూసిన భాజపా ఈ ఎన్నికల్లో ఆధిక్యాన్ని చాటుకోవడం కత్తిమీద సామే! 2014 లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించిన ‘మోదీ సేన’కు ఇటీవలి ఉపఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆరునెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు పార్టీ శ్రేణుల్ని కదనరంగంలో నడిపిస్తున్నారు. భాజపా కన్నా కాంగ్రెస్‌కు ఇప్పుడు అత్యంత కష్టకాలం. వరుస ఓటములతో పరువు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే దిశగా కాంగ్రెస్ అడుగులేస్తోంది. ‘సెమీఫైనల్స్’లో భంగపాటుకు గురైతే వచ్చే సార్వత్రిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కాంగ్రెస్‌కు పెను సవాలే!
అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం కావడంతో దేశంలో ఎన్నికల రుతుపవనాలు జోరుగా వీస్తున్నాయి. ఈనెల నుంచి సుమారు ఏడెనిమిది నెలల పాటు సుదీర్ఘ ‘రాజకీయ క్రతువు’ జరగబోతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 12న మొదలైన పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 7 వరకూ కొనసాగుతుంది. ఈ ఎన్నికలు దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఓటర్ల మనోభావాలను ఆవిష్కరిస్తాయి. ‘సెమీఫైనల్స్’ ఫలితాలు జాతీయస్థాయిలో ‘సార్వత్రిక ఎన్నికల’పై ఓటర్లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజానీకం ఇచ్చే తీర్పుపై ‘పాంచ్ పటాకా’ ప్రభావం చూపడం తథ్యం.
ఎక్కువ రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంటే 2019 లోక్‌సభ ఎన్నికలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలమని భాజపా నాయకత్వం భావిస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకున్న ‘కమల దళం’ ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుందన్నది కీలక ప్రశ్న. పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సమరంలో ఎంతవరకూ సత్తా చాటుతుందన్నదీ కీలకమే. 2014 లోక్‌సభ ఎన్నికలు ముగిసే నాటికి భాజపా ఖాతాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య అయిదు మాత్రమే. ప్రస్తుతం భాజపా, దాని మిత్రపక్షాలు కలిపి మొత్తం 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇందిరా గాంధీ హయాంలో ఒకప్పుడు 18 రాష్ట్రాలను కాంగ్రెస్ పాలించింది. ‘శతాధిక’ వత్సరాల కాంగ్రెస్ ప్రస్తుతం పంజాబ్, మిజోరం, కర్నాటక (జేడీఎస్ భాగస్వామ్యంతో) రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటి గడ్డు పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. కాంగ్రెస్‌లో చీలికలు, ప్రాంతీయ పార్టీల హవా వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ తడాఖా చూపించగలిగితేనే వచ్చే లోక్‌సభ సమరం నాటికి ఆ పార్టీకి తిరిగి ఊపిరి లభించినట్టు అవుతుంది. ప్రధాని రేసులో ఉన్న రాహుల్ నాయకత్వానికి మద్దతు లభిస్తుంది, నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గనుక తన బలాన్ని కూడదీసుకొనేందుకు ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పెద్ద అవకాశం అని చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఎలాగైనా విజయ దుందుభి మోగించి, విపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్ శ్రమిస్తుండగా, పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నెలకొల్పి గెలుపు తీరానికి చేరాలని భాజపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. భాజపా తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు, కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
సుదీర్ఘ ప్రక్రియ..
మావోయిస్టుల హింసతో శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే రెండు దశల్లో పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో 119 స్థానాలకు డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. రాజస్థాన్‌లోని 200 సీట్లకు డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లోని 230 సీట్లకు, మిజోరంలోని 40 సీట్లకు నవంబర్ 28న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. శాంతిభద్రతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు గాను- ఈనెల 12న తొలిదశలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇక్కడ రెండో విడతగా నవంబర్ 20న మిగతా 72 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తానికి ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఒకే దశలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి ‘నిర్వాచన్ సదన్’ ప్రకటించిన పోలింగ్ షెడ్యూల్ సుదీర్ఘమైనది కావడంతో మొదటిగా పోలింగ్ ముగిసే ఛత్తీస్‌గఢ్‌లో ఫలితాల కోసం నెలరోజుల పాటు నిరీక్షించాల్సిందే. ఇక, ‘ముందస్తు’గా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నూతన రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధాన పక్షాల నడుమ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలుండగా, మిజోరంలో కాంగ్రెస్, తెలంగాణలో ‘తెరాస’ అధికారంలో ఉన్నాయి.
కాంగ్రెస్‌లో కొత్తఆశలు..
అయిదు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై పలు సంస్థలు నిర్వహించిన ‘సర్వే’ నివేదికలు కాంగ్రెస్‌కు కొంత ఊరట కలిగించాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సైతం ఆ పార్టీకి అనుకూలత నెలకొంటోందని కొన్ని ‘సర్వే’లు తేల్చాయి. ఈ సర్వేల నేపథ్యంలో ప్రస్తుతం తాను అధికారంలో ఉన్న రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ‘పీఠం’ కాపాడుకోవడం భాజపాకు అతి పెద్ద సవాలే! రెండు బలమైన హిందీ రాష్ట్రాలలో (రాజస్థాన్, మధ్యప్రదేశ్) తాము అధికారాన్ని కోల్పోతే- ఆ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై గణనీయంగా ఉంటుందని ‘కమలనాథులు’ కలవరపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే గనుక- ప్రస్తుతం కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఉత్సాహంపై నీళ్లు చల్లడమే గాక, లోక్‌సభ ఎన్నికల్లో ‘రాహుల్ బృందాని’కి కొత్త ఉత్తేజం వస్తుంది. వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టి సుదీర్ఘ కాలం పాటు మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భాజపా సర్కారుపై సహజంగానే ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అపసవ్య పాలనతో, అన్ని విధాలుగా అపఖ్యాతి పాలైన రాజస్థాన్‌లోని భాజపా ప్రభుత్వానికి బలంగానే ఎదురుగాలి వీస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ చాలాకాలంగా కొనసాగుతున్న భాజపా ప్రభుత్వం మావోయిస్టులను అణచివేయడంలో వైఫల్యం చెంది చెడ్డపేరు తెచ్చుకుంది. ఈ పరిణామాలన్నీ సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పాలన పట్ల జనం అసంతృప్తితో ఉన్నా- ప్రతికూల పరిస్థితులను తప్పక నెట్టుకొస్తామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వే నివేదికల్లోని సారాంశాన్ని మనం యథాతథంగా నమ్మాల్సిన పని లేకున్నా.. రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని భాజపా తిరిగి నిలబెట్టుకోవడం ఆషామాషీ కాదన్నది కాదనలేని కఠోర వాస్తవం. కాగా, ఎలాంటి పొత్తులూ లేకున్నా ఈ మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు తమకేనన్న విశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో తొణికిసలాడుతోంది.
‘ముందస్తు’ వ్యూహం..
అభివృద్ధి పథకాలకు విపక్షాలు అడ్డుతగులుతున్నాయని, మరోసారి తమకు పగ్గాలు అప్పగిస్తే హామీలన్నీ ఆచరణలో పెడతామని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏరి కోరి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. దాదాపు ఎనిమిది నెలల అధికార వైభోగాన్ని ‘త్యాగం’ చేసి, ‘ముందస్తు’ సాహసం చేసింది. అమిత నష్టాన్ని అడ్డుకోవాలని, అధిక లాభాన్ని పొందాలని ‘ముందస్తు’కు ముస్తాబైన తెరాస అధినేత కేసీఆర్ ఆకాంక్షలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఇప్పుడే జవాబు చెప్పలేని ప్రశ్న! కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల కలయికతో ఆవిర్భవించిన ‘మహాకూటమి’ కేసీఆర్ హవాను ఏమేరకు నిలువరిస్తుందో త్వరలోనే తేలబోతోంది.
నిన్న ‘ఔను’.. ఇవాళ ‘కాదు’..
ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో భాజపా కన్నా కాంగ్రెస్ పార్టీ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. తెలంగాణలో ‘పొత్తు రాజకీయాల’కు సిద్ధమైన కాంగ్రెస్ మిగతా చోట్ల సొంతంగానే బరిలోకి దిగింది. రాజస్థాన్‌లో పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉందనుకున్నా అక్కడ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది చెప్పే పరిస్థితి కాంగ్రెస్‌లో లేదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లో అలకలు, అసంతృప్తులు, ఆందోళనలు ఎలాగూ తప్పవు. ఆ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. ఈ కారణంగానే ‘ముఖ్యమంత్రుల అభ్యర్థిత్వాల’ జోలికి కాంగ్రెస్ పోలేదు. పొత్తులు లేకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోటీకి దిగి కాంగ్రెస్ సాహసం చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఉమ్మడిగా పోరాడతాయనుకున్న కాంగ్రెస్, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీలు ఇపుడు వేరు కుంపట్లు పెట్టాయి. తన పరిస్థితి గతంలో కంటే ఎంతో ‘మెరుగ్గా’ ఉన్నందున పొత్తు పేరిట ‘సీట్ల’ను త్యాగం చేయడం సరికాదని కాంగ్రెస్ భావించింది. మొన్నటి వరకూ తాను స్నేహం చేసిన బిఎస్పీ, ఎస్పీలతో లడాయికి దిగింది. ఇటీవలి ఉపఎన్నికల్లో విపక్షాలు ఐక్యతతో ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడం వల్లే భాజపాను నిలువరించగలిగామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు మూడు కీలక రాష్ట్రాల్లో సొంత బలాన్ని నమ్ముకుంది. అయితే, ‘మహాకూటమి’ ఏర్పాటుతో తెలంగాణలో తమదే విజయమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. విపక్షాల ఐక్యత ముఖ్యమని, ఉమ్మడిగానే మోదీని ఎదిరించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ‘సెమీఫైనల్స్’లో ఇతరుల అండదండలు లేకుండా ఎలా నెగ్గుకొస్తుంది?
భాజపాకు ‘ఉల్లి ఘాటు’!
కూరగాయలు, పప్పులు, డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్ ధరలు పెరిగి జనం ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజలకే కాదు, మధ్యప్రదేశ్‌లో భాజపా నేతలకు సైతం ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఉల్లి ధరలు ఎందుకు తగ్గడం లేదని నిలదీస్తున్నారు. క్వింటా ఉల్లిపాయల ధర కొద్దిరోజుల క్రితం 800 రూపాయల నుంచి అమాంతం 1,600 రూపాయలకు పెరగడంతో అధికార భాజపా నేతలు వోటర్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
‘వీర భక్త’ రాహుల్!
హిందూ దేవుళ్లు భాజపాకు మాత్రమే సొంతం కాదని, తాము కూడా హిందుత్వ ప్రతినిధులమేనని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు తాపత్రయ పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లే ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. తనను శివభక్తుడిగా అభివర్ణించుకున్న ఆయన ఇటీవల మానస సరోవర్ యాత్ర కూడా చేశారు. హిందువులను ఆకట్టుకునేందుకు ఆయన రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గుడులకు వెళ్లి స్వయంగా పూజాదికాల్లో పాల్గొంటున్నారు. అర్చకుల, స్వామీజీల ఆశీస్సులు పొందుతున్నారు. ఎన్నికల వేళ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించాక ఇందిరా గాంధీ ప్రధాని పదవిని చేపట్టారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. కమత్‌నాథ్, పీతాంబర్ వంటి ప్రముఖ ఆలయాల్లోనూ రాహుల్ పూజలు చేశారు. నర్మదా నదీ తీరంలో భక్తులు ఇచ్చే హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. గో సంరక్షణ, నర్మదా నది పరిరక్షణకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అన్ని గ్రామాల్లోనూ గోశాలలు నిర్మిస్తామని హిందువుల కోసం మరో వాగ్దానం చేసింది. భాజపాకు మాత్రమే పరిమితమైన హిందూ వోటు బ్యాంకును చీల్చేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడలు వేసింది.
వ్యూహ ప్రతివ్యూహాలు...
వివిధ రాష్ట్రాల్లో విజయ పరంపర కొనసాగేందుకు భాజపా ప్రధానంగా రెండు సూత్రాలను అమలు చేస్తోంది. అభివృద్ధి మంత్రం, హిందూ జాతీయవాదం- అనేవి ఆ పార్టీ విజయ రహస్యాలు. వీటికి తోడు భాజపా అధ్యక్షుడు అమిత్ షా అమలు చేసిన ‘సోషల్ ఇంజనీరింగ్’ (కుల, మత, వర్గ, ప్రాంతీయ సమీకరణలు) వ్యూహం కూడా బాగానే పనిచేసింది. ఈ వ్యూహాల ముందు కాంగ్రెస్ చెబుతున్న పురాతన ‘లౌకిక వాదం’ ఫలించడం లేదు. అమిత్ షా ‘అపర చాణక్యం’ కారణంగా త్రిపుర, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ‘కాషాయ ధ్వజాన్ని’ భాజపా ఎగురవేసింది. అయితే, ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో, మరికొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందుకే ఇపుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటాలని అమిత్ షా తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో ఒంటిరి పోరు కారణంగా అధికార తెరాసకు గట్టి పోటీ ఇవ్వలేకపోయినా, మిగతా నాలుగు రాష్ట్రాల్లో తడాఖా చూపాలని భాజపా వ్యూహరచన చేసింది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి వసుంధర రాజె వల్ల భాజపా కొంత ప్రతికూలతను ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నందున ఓటర్లు మార్పు కోరే అవకాశం ఉందన్న వాదనలను భాజపా నేతలు కొట్టిపారేస్తున్నారు. భాజపా వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలను అమలు చేస్తూ, రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ జనం మద్దతు పొందడానికి కాంగ్రెస్ కష్టపడాల్సి ఉంటుంది.
‘రుణం’ తీర్చుకుంటాం..
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. జనం కలలో సైతం ఊహించని వరాలను కురిపించేందుకు రాజకీయ పార్టీలు తెగ ఉత్సాహపడుతుంటాయి. దేశంలో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువ కావడంతో అన్ని పార్టీలు రైతులను ప్రలోభ పెట్టేందుకు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులకు రుణాలను మాఫీ చేస్తామని, కర్షకుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భాజపా, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు హామీలు కురిపించాయి. ఈమేరకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు సంక్షేమమే ధ్యేయమంటూ విధి విధానాలను ప్రకటించాయి. ‘స్వశక్తి’ మహిళలకు రెండు లక్షల రూపాయల వరకూ వడ్డీలేని రుణాలిస్తామని భాజపా భరోసా ఇచ్చింది. రైతు రుణాలన్నీ రద్దు చేస్తామని, కుటుంబంలో ఒకరికి నెలకు పదివేల రూపాయలు చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సహాయం అందజేస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చింది. రైతులకు విద్యుత్ బిల్లుల్లో 50 శాతం రాయితీ ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. తాము అధికారం చేపడితే పదిరోజుల్లోగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అభయం ఇచ్చింది. చిన్న రైతుల కుమార్తెల వివాహానికి రూ. 51 వేలు అందజేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలన్నింటికీ మద్దతు ధరలిస్తామని, రెండున్నర ఎకరాల లోపు భూమి ఉండి- అరవై ఏళ్లు దాటిన రైతులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు 50 శాతం రాయితీతో రుణాలిస్తామని, భూమి రిజిస్ట్రేషన్ల ఫీజులో రాయితీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు రైతులకు వరాలు ప్రకటించారు. ‘మహాకూటమి’ని గెలిపిస్తే రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తాము మళ్లీ అధికారం చేపడితే ‘రైతేరాజు’ అని నిరూపించేందుకు మరింతగా కృషి చేస్తామని తెరాస ప్రకటించింది.
తొలిసారిగా వీవీప్యాట్‌లు
పోలింగ్‌లో అనుమానాలను, అపోహలను నివృత్తి చేసేందుకు, ఎన్నికల ప్రక్రియపై వోటర్లకు విశ్వాసం కలిగించేందుకు దేశంలో తొలిసారిగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రం (ఈవీఎం)పై ‘మీట’ను నొక్కి వోటరు తనకు నచ్చిన అభ్యర్థికి వోటు వేసేవాడు. అయితే, తన వోటు ఆ అభ్యర్థికే పడిందా? లేదా? అనే అనుమానం వచ్చినా చేసేదేమీ లేదు. ఇపుడు అలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈవీఎంలకు వీవీప్యాట్‌లను అనుసంధానం చేస్తున్నారు. ఈవీఎంపై వోటరు ‘మీట’ను నొక్కిన వెంటనే పక్కనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో ఆ వోటు ఎవరికి వేశారన్నది- చిన్న అద్దం వెనుక ఓ కాగితం ముక్కపై కొన్ని క్షణాల పాటు కనిపిస్తుంది. అది చూశాక తాను ఎవరికి వోటు వేశానన్నది వోటరు నిర్ధారించుకుంటాడు. వోటరు చూసిన అనంతరం ఆ ‘స్లిప్’ వీవీప్యాట్‌లో కిందకు చేరుతుంది. ఈవీఎంపై ఏ ‘మీట’ నొక్కినా ఒకే పార్టీ అభ్యర్థికి వోట్లు పడుతున్నాయన్న ఆరోపణలు గతంలో వచ్చేవి. ఇకపై అలాంటి ఆరోపణలకు, అనుమానాలకు తావుండదని ఎన్నికల సంఘం చెబుతోంది. పోలింగ్ కేంద్రంలోని కంట్రోల్ యూనిట్‌కు ఈవీఎంను, వీవీప్యాట్‌ను అనుసంధానం చేస్తారు. ఈవీఎం పనితీరుపై అభ్యంతరాలున్నపుడు వీవీప్యాట్‌లోని ‘స్లిప్’లను సైతం లెక్కించే వీలుంటుంది. వోటింగ్ ప్రారంభించేముందు ఈవీఎం, వీవీప్యాట్‌ల అనుసంధానం సరిగా ఉందో లేదో పోలింగ్ ఏజెంట్లకు ఎన్నికల అధికారులు చూపిస్తారు. *
బరిలో ‘చతుస్సేనలు’!
తెలంగాణ
మొత్తం స్థానాలు - 119
పోలింగ్ తేదీ - డిసెంబర్ 7

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ‘ముందస్తు’ సమరంలో బలాబలాలను తే ల్చుకొనేందుకు ‘నాలుగు సేనలు’ మో హరించాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ నేతృత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’, కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి కలయికలో ‘మహాకూటమి’, సీపీఎం సారథ్యంలో ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’, ఒంటరిగా ‘కమల దళం’ బరిలో నిలిచాయి. అభివృద్ధిని అడ్డుకొంటున్న విపక్షాలకు గుణపాఠం చెప్పేందుకు, సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు మరోసారి తమకు అధికారం ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సాహసించారు. ‘బంగారు తెలంగాణ’కు దీక్ష వహించిన తమ పార్టీని ప్రజలు మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. శాసనసభను రద్దు చేసిన రోజునే ఎవరూ ఊహించని రీతిలో ఆయన 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించారు. తమకు మళ్లీ టిక్కెట్లు దక్కుతాయని ఊహించని ‘సిట్టింగ్ ఎమ్మెల్యేలు’ సైతం కేసీఆర్ ప్రకటనతో విస్మయానికి లోనయ్యారు. అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రచార పర్వంలో కూడా మిగతా పార్టీల కంటే తెరాస ముందంజలో ఉంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సీట్ల సర్దుబాట్లు, ఫిరాయింపులు, అలకలు, నిరసనలు, ఆందోళనలు, బుజ్జగింపులతో అన్ని పార్టీల్లోనూ కోలాహలం నెలకొంది.
తెరాసను ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో.. ‘నిప్పు-ఉప్పు’లాంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికల్లో జత కట్టడం ఊహించని పరిణామం. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెజస పార్టీలు ఐక్యతతో పనిచేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ‘మహాకూటమి’ నేతలు చెబుతున్నారు. ఇలాంటి కూటముల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని తెరాస శ్రేణులు ప్రకటిస్తున్నాయి. ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్‌తో పేచీ పడకుండా కేసీఆర్‌ను గద్దె దించడమే ధ్యేయంగా పనిచేయాలని తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘మహాకూటమి’కి అధికారం అప్పచెబితే తెలంగాణలో చంద్రబాబు పాలన వస్తుందని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన తెరాస అధినేత కేసీఆర్ ఆ తర్వాత ‘తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్లు’ తమ బిడ్డలేనని ప్రకటించారు. కాగా, ఉద్యమ సమయంలో పనిచేసిన ‘తెలంగాణ సెంటిమెంట్’ ఇప్పుడు పనిచేయదని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. సాగునీటి పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పేరిట తాము చేపట్టిన అభివృద్ధే తమకు ‘శ్రీరామరక్ష’గా మారుతుందని తెరాస భావిస్తోంది. ‘అభివృద్ధి మంత్రం’ కచ్చితంగా ఫలిస్తుందన్న ధీమాతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తెరాస సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత, తాము ఇస్తున్న హామీలే ‘మహాకూటమి’ని గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో విపరీతమైన జాప్యం జరిగినా ఎలాంటి ఇబ్బంది ఉండదని టీపీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారు. రాహుల్ గాంధీ ఇమేజ్, చంద్రబాబు వ్యూహం, సీపీఐ, తెజస కార్యకర్తల బలం వంటి అంశాలు ‘కూటమి’కి కలిసొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ స్థాపించిన ‘తెజస’ పార్టీ వల్ల ‘మహాకూటమి’కి జనాదరణ ఖాయమంటున్నారు.
సీపీఎం నేతృత్వంలో 28 చిన్నాచితకా పార్టీలు, ప్రజాసంఘాలు ‘బహుజన వామపక్ష కూటమి’ (బిఎల్‌ఎఫ్) పేరుతో బరిలో నిలిచాయి. ఈ ఫ్రంట్ ప్రభావం అంతగా ఉండదని తెరాస, ‘మహాకూటమి’ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం భాజపా అంతగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. పొత్తు రాజకీయాలకు దూరంగా ఈసారి భాజపా ఒంటరిగానే సమరాంగణాన నిలిచింది. కేవలం పాతబస్తీకి, ఓ మతానికి పరిమితమైన మజ్లిస్ పార్టీ ఎనిమిది నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో నెగ్గిన ఏడు స్థానాలతో పాటు ఇప్పుడు కొత్తగా రాజేంద్రనగర్‌పై మజ్లిస్ దృష్టి సారించింది. తెరాసతో సన్నిహితంగా ఉంటున్న మజ్లిస్ తనకు పట్టున్న నియోజకవర్గాల్లోనే తలపడుతోంది. 119 సీట్లు ఉన్న తెలంగాణలో తెరాస- మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మిగతా పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది.

కొత్త పార్టీతో ఎవరికి చేటు?
ఛత్తీస్‌గఢ్
పోలింగ్ తేదీలు
తొలిదశ- నవంబర్ 12
స్థానాలు- 18
రెండోదశ- నవంబర్ 20
స్థానాలు- 72
మావోయిస్టుల హింసాకాండకు నిలయమైన ఛత్తీస్‌గఢ్‌లో ‘కొత్త పార్టీ’ వల్ల ఏ మేరకు నష్టం జరుగుతుందని భాజపా, కాంగ్రెస్‌లు అంచనా వేసుకుంటున్నా యి. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీ ‘జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్’ పేరిట కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించడమే కాకుండా బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. జోగీ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గుతాయని భాజపా అంచనా వేస్తుండగా, తమ ఓటుబ్యాంకు పదిలంగానే ఉంటుందని కాంగ్రెస్ వాదిస్తోంది. భాజపాతో కొత్తపార్టీ అంతర్గతంగా ఒప్పందం కుదర్చుకుందని, కాంగ్రెస్‌ను ఓడించాలన్నదే జోగీ పంతం అన్న వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న భాజపాను మరోసారి అధికారంలోకి తేవాలని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. రమణ్ సింగ్‌పై దివంగత మాజీ ప్రధాని వాజపేయి కోడలు కరుణా శుక్లాను తన అభ్యర్థిగా కాంగ్రెస్ నిలబెట్టింది. ఆదివాసీలు అధికంగా నివసించే ఛత్తీస్‌గఢ్‌లో ఎలాగైనా తమ ఆధిపత్యం చాటుకోవాలని కాంగ్రెస్, భాజపాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. నిత్యం మావోయిస్టుల హత్యాకాండ, పోలీసుల గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లతో సతమతమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 12న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 70 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చి, పలుచోట్ల విధ్వంస చర్యలకు దిగారు. తొలిదశ పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నికల సంఘం భారీ ఎత్తున సాయుధ బలగాలను మోహరించింది. మావోల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తొలి విడత పోలింగ్ జరిగిన 18 నియోజకవర్గాల్లో ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ అవసరమని వారు తేల్చిచెప్పారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడి, ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు మావోలు మరణం నేపథ్యంలో తొలి విడత పోలింగ్ విజయవంతమైంది. రెండో విడత పోలింగ్‌లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం సకల చర్యలను తీసుకుంటోంది.
‘హ్యాట్రిక్’ కోసం
కాంగ్రెస్ కుస్తీ
మిజోరం

మొత్తం స్థానాలు- 40
పోలింగ్ తేదీ- నవంబర్ 28
1987లో మిజోరం రాష్ట్రం ఆవిర్భవించగా, 1989 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ నాలుగు సార్లు, మిజో నేషనల్ ఫ్రంట్ రెండు సార్లు గెలిచాయి. అధికార పగ్గాలు చేపట్టాలని గత పాతికేళ్లుగా భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 2008, 2013 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆధిక్యం చాటుకుని ‘హ్యాట్రిక్’ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా, పదేళ్ల తర్వాత ప్రభుత్వం మారడం మిజోరంలో ఓ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఈశాన్య భారతంలో ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సొంతంగా పోటీ చేస్తున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి గద్దె దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఎన్నికల ముందు కొందరు నేతలు పార్టీ వీడడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. ఈ రాష్ట్ర శాసనసభలో తొలిసారిగా బోణీ కొట్టాలని భాజపా ఆశిస్తోంది. మిజోరంలో గెలిచి, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేయాలన్నది ‘కమలనాథుల’ తపన. తనకు మెజారిటీ రాకున్నా, స్థానిక పార్టీలకు మద్దతుగా నిలిచైనా కాంగ్రెస్‌ను అధికార పీఠం నుంచి కిందకు దింపాలన్నదే భాజపా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అసోం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో సొంతంగాను, మేఘాలయ, నాగాలాండ్‌లలో సంకీర్ణంలో అధికారంలో ఉన్న భాజపా ఇపుడు మిజోరంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. క్రైస్తవ ఓటు బ్యాంకును పదిలపరచుకుంటూ భాజపా, మిజో నేషనల్ ఫ్రంట్‌లకు ఎదురీదుతూ మిజోరంలో అధికారాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్‌కు పెను సవాల్‌గా మారింది.
మళ్లీ ‘రాజె’యోగం ఉందా?
రాజస్థాన్

మొత్తం స్థానాలు- 200
పోలింగ్ తేదీ- డిసెంబర్ 7

సార్వత్రిక సమరానికి ముందు ‘సెమీఫైనల్స్’ కదన రంగంలో భాజపా, కాంగ్రెస్‌లు భీకరంగా తలపడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను ఎలాగైనా కాపాడుకోవాలని, మిజోరంలో కాంగ్రెస్ సర్కారును గద్దె దింపాలని కసరత్తు చేస్తున్న భాజపాకు మూడు రాష్ట్రాల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో పరిస్థితి ‘కమల దళాని’కి కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వసుంధర రాజె వ్యవహార శైలితో భాజపాకు ఎదురుగాలి వీస్తోందని దాదాపు అన్ని సర్వేల్లోనూ తేలింది. వరుసగా రెండోసారి అధికారాన్ని ఏ రాజకీయ పార్టీకి రాజస్థాన్ ప్రజలు అప్పగించరన్న ప్రచారం వసుంధరగా తలనొప్పిగా మారింది. సొంత నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి వల్లే తాము రాజస్థాన్‌లో సర్వశక్తులనూ ఒడ్డాల్సి వస్తోందని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. సర్వే నివేదికలు నిరాశ కలిగిస్తున్నప్పటికీ, ‘మోదీ మంత్రం’ ఫలించి తాము ఎలాగైనా గట్టెక్కుతామన్న ధీమా వీరిలో వ్యక్తమవుతోంది. రాజస్థాన్ ప్రజలు 1998 నుంచి భాజపా, కాంగ్రెస్‌లకు చెరోసారి అధికారం అప్పగిస్తున్నారు. వరుసగా ఏ పార్టీ కూడా రెండోసారి ‘పీఠం’ దక్కించుకునే సంప్రదాయమే ప్రస్తుత ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధిక ధరలు, రైతుల ఆత్మహత్యలతో పాటు రాజ్‌పుట్‌లు, గుజ్జర్లు వంటి సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాలు భాజపాను ఇబ్బంది పెడుతున్నాయి. భాజపాలో తమకు న్యాయం దక్కడం లేదని పలు సామాజిక వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. బ్రాహ్మణులు సైతం భాజపాను వ్యతిరేకిస్తున్నారు. భాజపాలో అసమ్మతి నేత ఘన్‌శ్యామ్ తివారీ స్థాపించిన కొత్తపార్టీ పట్ల బ్రాహ్మణుల్లో ఆసక్తి పెరుగుతోంది. అమిత్ షా సహా పలువురు కేంద్రనేతలతో ముఖ్యమంత్రి వసుంధరకు సత్సంబంధాలు లేకపోవడం కూడా కార్యకర్యలను కుంగదీస్తోంది. భాజపాలో విభేదాలు, ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతతో పాటు సర్వే నివేదికలు తమకు అనుకూలంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈసారి అధికారం తమకు ఖాయమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. గుజ్జర్ వర్గానికి చెందిన యువనేత సచిన్ పైలట్‌కు ఈ రాష్ట్రంలో కీలక బాధ్యతలను అప్పజెప్పి, పార్టీలో కుమ్ములాటలను నివారించడంలో కాంగ్రెస్ విజ్ఞతను చూపింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి, ‘మాలి’ సామాజిక వర్గానికి కాంగ్రెస్ చేరువైంది. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండా జాగ్రత్త పడడమే కాకుండా, సచిన్ పైలట్- అశోక్ గెహ్లాత్‌లు ఉమ్మడిగా పనిచేసేలా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలు భాజపాకు దూరం కావడం కాంగ్రెస్‌కు వరంలా మారే అవకాశం ఉంది.

ఇరు పార్టీల్లోనూ ధీమా..

మధ్యప్రదేశ్

మొత్తం స్థానాలు - 230
పోలింగ్ తేదీ- నవంబర్ 28
పదిహేనేళ్లు గా అధికారంలో ఉన్నందున కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తాము నెట్టుకొస్తామని మధ్యప్రదేశ్‌లో భాజపా నేతలు అంచనాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హయాంలో ‘వ్యాపం కుంభకోణం’ వంటి కొన్ని మచ్చలున్నా, మొత్తానికి ఆయన పాలన బాగానే ఉందని ప్రజలు భావిస్తున్నట్టు భాజపా నేతలు చెబుతున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తెస్తాయని ముఖ్యమంత్రి చౌహాన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యువతను ఆకట్టుకునేందుకు ఆయన పలు పథకాలను చేపట్టారు. ఈసారి వర్గ విభేదాలకు అతీతంగా కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లు పార్టీ విజయం కోసం కలసి పనిచేస్తున్నారు. దళితులు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ చెబుతుండగా, హిందూ ఓటు బ్యాంకు తమను కాపాడుతుందని భాజపా నమ్ముతోంది. పొత్తు రాజకీయాలు లేకపోవడంతో ఈసారి బహుజన సమాజ్ పార్టీ కాంగ్రెస్‌కు దూరమైంది. బిఎస్పీతో చెలిమి లేకున్నా తాము సొంతంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారు. కాగా, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరించాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల దళితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామం తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ సంబరపడుతోంది. ఏది ఏమైనా మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదంటే తమదని భాజపా, కాంగ్రెస్ చెబుతున్నాయి. ఈసారి కాంగ్రెస్‌కు వాతావరణం అనుకూలంగా ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికలు భాజపాను కలవరపెడుతున్నాయి. బిఎస్పీ, ఎస్పీలతో పాటు కొన్ని చిన్నాచితకా పార్టీలు బరిలో నిలిచినా, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, భాజపాల మధ్యే నెలకొంది.
బ్రెయిలీ లిపిలో
ఓటరు కార్డులు

మనదేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా అంధులకు బ్రెయిలీ లిపిలో ఓటరు గుర్తింపు కార్డులను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అంధులు వేరొకరి సహాయంతో వోటు హక్కు వినియోగించుకొనేవారు. అయితే, ఇపుడు వారి కోసం ప్రత్యేకమైన వోటరు కార్డులను జారీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో వోటు వేసే ముందు బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రం ద్వారా అంధులకు అవగాహన కల్పిస్తారు. వోటు వేసే సమయంలో ఈవీఎంను వేళ్లతో తడుముతూ రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులను గుర్తించేలా బ్రెయిలీ లిపితో ఏర్పాట్లు చేస్తారు. అంధులు, దివ్యాంగులు ఎవరి సహాయం అవసరం లేకుండా వోటు వేసేందుకు తొలిసారిగా వినూత్న సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమ శాఖ కసరత్తు చేసింది. దివ్యాంగులను వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. బహుళ అంతస్థుల్లో పోలింగ్ కేంద్రం ఉంటే- కింది అంతస్థులోనే దివ్యాంగులు వోటు వేయవచ్చు. తెలంగాణలో సుమారు పదిన్నర లక్షల మంది దివ్యాంగులు ఉండగా, వీరిలో నాలుగు లక్షల మందికి వోటరు కార్డులున్నాయి. ఇందులో 56 వేల మంది అంధులున్నారు.
*

-పి.ఎస్.ఆర్.