ఈ వారం స్పెషల్

పుస్తకం.. ప్రియనేస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతులైన వారు తల్లిదండ్రుల సంపూర్ణ ప్రేమను పొందిన వారు కానే కాదు.. పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ ఆనందాన్ని పొందిన వారే.. మొదటి అంశం ఆధారపడటానికి దోహదం చేస్తే, రెండోది మంచి వ్యక్తిత్వానికి దారి తీస్తుంది..’’
-అని ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ పుస్తకంలో రాసిన మాటలు అక్షరసత్యాలు. ‘పుస్తకం’ అంటే కాగితాల సంగ్రహం మాత్రమే కాదు. మనిషిని మరో లోకంలోకి తీసుకువెళ్లే ఓ ‘శాటిలైట్’. మన కళ్లెదుట నవీన రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించి మైమరిపించే శక్తి పుస్తకానిదే. మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేది పుస్తకమే. మహానీయుల భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని , వారి అడుగుజాడలను ఆవిష్కృతం చేసేది పుస్తకమే. సమాచార సాంకేతిక విప్లవం ఎంతగా ఎదిగినా- పుస్తకం ‘ఎవర్‌గ్రీన్’!
పుస్తకం విజ్ఞాన ఖని, గత చరిత్రనూ, వర్తమానాన్ని నిక్షిప్తం చేసుకుని భవిష్యత్‌లోకి తీసుకువెళ్లే విజ్ఞాన భాండాగారం అది. చరిత్రను వర్తమానానికి పరిచయం చేసే వారధి, విజ్ఞానాన్ని అందించే కరదీపిక పుస్తకం. సమాజ పరిణామ క్రమంలో నిర్మితమైన చరిత్ర, సాహిత్యం, తాత్త్వికత, సంస్కృతి వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించే దూతగా వ్యవహరిస్తుంది పుస్తకం. పుస్తకం అంటే తరగతి గదికే పరిమితం కాదు, ఒక్కో పుస్తకం ఒక్కో చరిత్ర అయి ప్రపంచానే్న ప్రభావితం చేస్తుంది. పుస్తకాలు పలు రూపాల్లో ఉద్యమాలు నిర్మించాయి. అది మనం తెలంగాణలోనూ గమనించాం. అంతకు ముందు ఆంధ్రాప్రాంతంలోనూ చూశాం. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పుస్తకాలే ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే ఎంతో మంది ఆదర్శపురుషులు పుట్టుకొచ్చారు. గ్రీకు తత్త్వవేత్తలు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి మేధావుల ఆలోచనలకు మనకున్న ఏకైక సాక్షి పుస్తకమే. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకాలు పోషించే పాత్ర అనూహ్యం, అమోఘం.
పుస్తకాన్ని ఒక గుర్తింపుగా భావించకుండా తమ మానసిక పరిపూర్వత్వాన్ని సాధించుకునేందుకు ఒక వాహకంగా వినియోగించుకోవాలి. పిల్లల పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, నవలలు, కాల్పనిక సాహిత్యం వంటివి అమ్మకాల్లో ఎపుడూ ముందుంటున్నాయి. వీటి తర్వాతి స్థానంలో తరగతి పుస్తకాలు, జనరల్ నాలెడ్జి గ్రంథాలు ఎక్కువగా చదువుతున్నట్టు తేలింది. అనువాదనాలు, భాషా- సంస్కృతిపై మోనాగ్రాఫ్‌లు, అరవింద అడిగ నైట్ టైగర్ వంటి పుస్తకాలు, ఒమాబా జీవిత చరిత్ర, హ్యారీ పోటర్, , జిడ్డు కృష్ణమూర్తి కుతూహలం, ఇస్కాన్ భగవద్గీత, ఎడ్యుకేషన్ గ్రంథాలు, సామాజికశాస్త్ర గ్రంథాలు వంటివి అందర్నీ ఆకర్షిస్తుంటాయి.
ముఖచిత్రాలు చూసి కొనేవారు కొందరు, రచయితలను చూసి కొనేవారు మరికొందరు, విషయాన్ని అర్థం చేసుకుని పుస్తకం లోపలి విషయాలను తెలుసుకుని కొనేవారు ఇంకొందరు ఉంటారు. గొప్ప గొప్ప పుస్తకాలు ఒక్కో మారు అందమైన అట్టలు లేక పాలిపోయి, ఎవరి దృష్టినీ ఆకర్షించుకుండా అల్మరాలకే పరిమితం అవుతుంటాయి. ఇపుడిపుటే నేషనల్ బుక్ ట్రస్టు వంటి ప్రభుత్వ సంస్థలు, పలు ప్రైవేటు ప్రచురణ సంస్థలు కవర్‌పేజీలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి అబ్ స్ట్రాక్ట్ ఆర్టును కవర్‌పేజీలపై వేసుకుంటూ పుస్తకాలను అందంగా ముద్రిస్తున్నారు. కొంత మంది మూడ్ కోసం పుస్తకాలు చదివితే, మరికొంత మంది మూడ్ ఆఫ్‌ను పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదువుతుంటారు. కోపాన్ని తగ్గించుకునేందుకు, ప్రశాంతతను కోరుకునేందుకు పుస్తకాలు చదువుతుంటారు. ఇంకో పక్క నేటి తరంలో పుస్తక పఠనాన్ని పెంచేందుకు విభిన్నమైన మార్గాలను మానసిక శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. పుస్తకం చదివే అలావాటు ఏకగ్రతను పెంచుతుంది. రోజుకో అరగంట చదివినా చాలు, ఆ సమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో ధ్యానంగా మారుతుంది. మతిమరుపు ఇబ్బంది పెడుతూ ఉంటే పుస్తకాలు చదవడం మొదలుపెడితే చాలు- మెదడులోని న్యూరాన్లు యాక్టివ్‌గా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం దానిని ‘స్టోర్’ చేసుకోవడం.. ఇలా అన్నీ ఒకే మారు జరిగి మెదడును చైతన్యపరుస్తాయి. రప్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధ్యయనంలో- ‘వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేసే శక్తి పుస్తక పఠనానికే ఉంద’ని తేల్చి చెప్పింది. బాగా చదివే అలవాటున్న వారి మెదడు, వారి శారీరక వయస్సు కంటే తక్కువగా ఉండటాన్ని కూడా గుర్తించారు. మానసిక ధృడత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలను పుస్తక పఠనం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గట్టిగా చెపుతున్నారు నిపుణులు. ఒక్క పుస్తకం చేతిలో ఉంటే చాలు ఎందరో మనతో ఉన్నట్టే. మానసిక ప్రశాంతత , ఉత్సాహం అన్నీ లభిస్తాయి. ఒత్తిడికి సులువైన విరుగుడు పుస్తకం. చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. ఇక భాషా జ్ఞానం పెరగడం వంటి లాభాలు , అందరికీ అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం ఈ పుస్తక పఠనం వల్ల అని తెలిశాక దానితో స్నేహం చేయకుండా ఉండగలమా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకానొక సందర్భంలో స్వయంగా చెప్పుకున్నారు- తాను దాదాపు 70 వేల పుస్తకాలు చదివానని. అలా వందలాది పుస్తకాలు చదివిన హేమాహేమీలు చాలామంది ఉన్నారు.
‘అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. ‘పాత చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అని సంఘ సంస్కర్క, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. నిత్యం అన్వయించుకోదగిన అంశం ఇది. వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికే కాదు, ప్రపంచాన్ని చూసేలా మన దృష్టిని మార్చడానికి ఉపయోగపడే గొప్ప సాధనం పుస్తకం. ఎన్ని పుస్తకాలు చదివినా, మనలో ఉన్న ఉత్తమమైన వ్యక్తిత్వం బయటకు వచ్చినపుడే పఠనానికి సార్థకత దక్కుతుందని మహాత్మాగాంధీ ఎన్నో మార్లు చెప్పారు. పుస్తకం కన్నతల్లి పాత్ర పోషిస్తుందని రష్యన్ రచయిత మాగ్జిం గోర్కి పేర్కొన్నారు. ‘కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి’ అంటాడు బేకన్. మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్ని మనం చదవాలి. మనం చదువుకుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొలపని పక్షంలో అసలు చదవడం ఎందుకు? మంచి పుస్తకం ఒక గొప్ప సంఘటనలా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణంలా మనల్ని తీవ్రంగా కలచివేయాలి, అందరికీ దూరంగా ఏకంతంగా అరణ్యాలకు పోవాలనిపించేలా ప్రేరేపించాలి, పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలా పగలగొట్టాలి అంటారు కాఫ్కి. ఇలా పుస్తకాల గురించి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పారు. టీవీ, రేడియో, ఎఫ్‌ఎంలు, ఇంటర్నెట్ సహా ఎన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, పుస్తకాల చదువరుల సంఖ్య తగ్గలేదని ఇటీవలి సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అదే రోజును మనం పుస్తక, కాపీరైట్ దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాం. ప్రపంచ పుస్తక ప్రదర్శన న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లో వచ్చే ఏడాది జనవరి 5 నుండి 13 వరకూ జరగనుంది. అంతకంటే ముందే 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో ఈనెల 15 నుండి 25వ తేదీ వరకూ జరగనుంది. ఏటా పుస్తక ప్రదర్శనను దాదాపు 10 లక్షల మంది సందర్శిస్తుంటారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 500 స్టాల్స్ వరకూ ఏర్పాటు చేసే యోచనలో కమిటీ ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల నుండి పుస్తక ప్రచురణ కర్తలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు హాజరుకాబోవడం విశేషం.
వాస్తవానికి ప్రపంచ పుస్తక ప్రదర్శనపై విభిన్నమైన కథనాలున్నాయి. 17వ శతాబ్దం నాటి యూరప్‌లో ఆ రోజును సెయింట్ జార్జి డేగా పాటించేవారు. స్పెయిన్‌లో ఇదే రోజున ప్రతి పుస్తకం కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇచ్చేవారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కాగర్సిలాసో వేగా వంటి ప్రఖ్యాత రచయితలు 1616లో అదే రోజున మరణించారు. అంతేగాక జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిన్ ధ్రువాం ఇకా చాలా మంది ప్రఖ్యాత రచయితలకు ఈ తేదీతో ఏదో ఒక రకమైన అనుబంధం ఉంది. దీంతో అదేరోజున పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలను నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించాలని 1955లో యునెస్కో
ప్రకటించింది. 2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కోనాక్రీ నగరాన్ని , 2018లో గ్రీస్‌లోని ఎథీన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది.
ప్రపంచంలో మొదటి పుస్తకం చైనాలోని 8వ శతాబ్దంలో ముద్రించారని చరిత్ర చెబుతోంది. ఇందుకు ఉడ్ బ్లాక్స్‌ను వాడారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో చైనాతో పాటు కొరియా కూడా పుస్తకాలను ముద్రించడం ప్రారంభించింది. మొట్టమొదటి ఆంగ్ల పుస్తకం 1473లో విలియం కాక్సటన్ అనే వ్యక్తి ప్రింట్ చేశారు. దీని పేరు ‘రీసైల్ ఆఫ్ ద హిస్టరీస్ ఆఫ్ ట్రోయి’. కానీ అధికారికంగా చాసర్స్ సెంచురీ చ్యూరీ టైల్స్ అనే పుస్తకం మొట్టమొదటిసారి ఆంగ్లంలో ప్రచురితమైనదిగా నమోదైంది. అది 1477లో ప్రచురితమైంది. 1638లో మసాచుసెట్స్ బే కాలనీ ఓత్ ఆఫ్ ఫ్రీ మాన్ అనే పుస్తకం ముద్రితమైంది. రెండో పుస్తకం 1639లో ప్రచురించారు, దాని పేరు అల్కనాక్ ఫర్ ద లియర్ ఆఫ్ అవర్ లార్డ్.
ఇంకో విచిత్రమైన విషయం ఏమంటే మనకంటే పాశ్చాత్యదేశాల వారు ఎక్కువగా పుస్తకాలు చదువుతారనే భావన అందరిలో ఉన్నా, పుస్తకాలు ఎక్కువగా చదివేది భారతీయులేనని ఒక సర్వే వెల్లడించింది. భారతీయులు వారానికి 10 గంటల 42 నిమిషాల పాటు సగటున పుస్తక పఠనానికి కేటాయిస్తారు. భారత్ తర్వాత ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటున్న దేశం థాయిలాండ్. మూడో స్థానంలో చైనా ఉంది. మారుతున్న జీవనశైలిలోనూ ఇప్పటికీ భారతీయలే పుస్తక పఠనంలో అగ్రపథంలో ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.
మనిషికి మరణం ఉన్నా, పుస్తకానికి మరణం లేదు. అదో అద్భుతమైన కూడలి. తరతరాలుగా జ్ఞానాన్ని అందించే వారసత్వాన్ని కోల్పోని అద్భుతం పుస్తకం. అందుకే బమ్మెర పోతన ‘పుస్తకం హస్త్భూషణం’ అన్నారు. పుస్తక పఠనం ఆనందాన్ని, ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని, వివేచనను, నైతికతను పెంచుతుంది తద్వారా ప్రతి ఒక్కరిలో సాత్వికత అలవడుతుంది. అది మానసికంగానూ, శారీరకంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనలో ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుంది. వివిధ భాషలపై పట్టు పెంచుతుంది. ప్రపంచం ఏటుపోతోందన్న విషయాన్ని అరచేతిలో చూపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎంత చదివినా కలగని సంతృప్తి పుస్తకాలు చదివినపుడే కలుగుతుంది. దానికి కారణం- పఠనంలోని అనుభూతి శాశ్వతమైనది. ఆ మాటకొస్తే జీవితమే ఒక పుస్తకం. చాలా వరకూ పుస్తకాలు అన్నీ అనుభవాల సారాంశాలే. ఎందరో మహానుభావులు తమ జీవిత గాధలు, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సమాజంలో నిబిడీకృతమైన అద్భుతాలకు, అనూహ్య చారిత్రక సత్యాలకు ఆధారం పుస్తకాలే. గతకాలపు మధురస్మృతులను మనముందుంచి భవిష్యత్‌కు మార్గదర్శనం చేస్తుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ పుస్తకాలు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ఎలక్ట్రానిక్ పుస్తకాలు హవా కొంత కాలం కొనసాగినా, వాటిలో సాధారణ పుస్తకాన్ని చదివిన సౌకర్యం లేకపోవడంతో విముఖత పెరిగింది.
అందుకే ఒక చోట కవి సీతారాం పుస్తకాల గురించి రాస్తూ- ‘బహుశా తాము కారు కొనుక్కున్న రాత్రి కంటే పుస్తకాలు కొనుకున్న రాత్రి సుఖంగా నిద్రపోతారు’ అని పేర్కొన్నాడు. పుస్తకాల ప్రత్యేకత అది. పుస్తక ప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లా కళ్లకూ, హృదయానికి అద్దుకుని మరీ కొనుక్కుంటారని, బుక్కులకు బుక్కైపోయిన వారు ఎందరో ఉన్నారని సీతారాం పేర్కొన్నారు.
ఆ దాహం తీరనిది!
తెలుగులో అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, కవులు, అభ్యుదయవాదులు, విప్లవకారులు, ఆధ్యాత్మిక రచయితలు ఉన్నారు. పాల్కురికి సోమనాథుడి నుండి మొదలుపెడితే వందలాది మంది గొప్ప సాహిత్యకారులు తెలుగునేలపై ప్రభవించారు. వారు రాసిన గ్రంథాలు ప్రతి ఒక్కరి జీవితాలను మలుపుతిప్పేవే. తెలంగాణలో బమ్మెర పోతన, బద్దెన, మల్లినాథ సూరి, కంచర్ల గోపన్న, దాశరధి కృష్ణమాచార్య, కాళోజీ, వట్టికోట ఆళ్వార్‌స్వామి, బూర్గుల రామకృష్ణారావు, సామల సదాశివ, సి.నారాయణ రెడ్డి, దాశరధి రంగాచార్య, కపిలవాయి లింగమూర్తి, సురవరం ప్రతాప్‌రెడ్డి, గద్దర్, గోరటి వెంకన్న, సీతారాం, అఫ్సర్, ప్రసేన్, జూలూరి గౌరీశంకర్ వరకూ ఎందరో రచయితల గ్రంథాలు ప్రతి ఒక్కరిలో సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తాయి. ఆంధ్రా ప్రాంతంలో పరవస్తు చిన్నయ్య సూరి, ఆదిభట్ల, కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు, శ్రీపాద కృష్ణమూర్తి, చిలకమర్తి లక్ష్మీ నర్సింహం, విశ్వనాథ సత్యనారాయణ, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, తిరుపతి వెంకటకవులు, పార్వతీశ్వర కవులు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ, మాడపాటి, దేవులపల్లి, గుర్రం జాషువా, అడవి బాపిరాజు, నోరి నర్సింహశాస్ర్తీ, శ్రీరంగం శ్రీనివాసరావు, చలం, ఇలా ఎందరో రచయితలు రాసిన గ్రంథాలు చదవాలంటే ఒక మనిషి జీవితం వేల సంవత్సరాలున్నా చాలదేమో, ఆ దాహం తీరదేమో..!

-బీవీ ప్రసాద్ 98499 98090