ఈ వారం స్పెషల్

కోటి ఆశల కోలాహలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిగేల్‌మనే విద్యుత్ వెలుగులు..
అబ్బురపరిచే సెట్టింగులు..
కాక్‌టెయిల్ విందులు..
స్టార్ డీజేల జోష్..
రాక్‌బ్యాండ్, మ్యూజిక్ నడుమ.. ఉరకలేసే ఉత్సాహంతో యువత నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటుంది. పబ్బులు, హోటల్స్, రిసార్ట్స్ డిసెంబర్ 31 రాత్రి నుంచే మ్యూజిక్‌తో హోరెత్తుతుంటాయి. ‘నయాసాల్’కి ఘన స్వాగతం పలికేందుకు ఖర్చుకు కూడా వెనుకాడరు. సంబరాలు అంబరాన్నంటేలా యువత ఉత్సాహంతో కేరింతలు కొడుతూ గడుపుతుంటారు. కేకులు, బొకేలు, గిఫ్ట్‌లు, నావెల్టీస్ కోసం ఎగబడుతుంటారు. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఎంతకైనా సరే అనే స్థితి అది.. కానీ వెనక్కి తిరిగి చూడాలి. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటూనే ఒక్కసారి- గతంలోకి తొంగి చూడాలి. ఎందుకంటే వర్తమానానికి పునాది గతమే కదా..! పాత సంవత్సరం మొదలైనప్పుడు మనం కొత్తగా అప్పుడే ఏవో నిర్ణయాలు చేసుకునే ఉంటాం. తప్పకుండా కొత్త సంవత్సరం నుంచి మన అలవాట్లు, అభిరుచులు మార్చుకుంటామని ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన మనఃసాక్షికి ప్రామిస్ చేసుకునే ఉంటాం. వాటిని మనం ఆ ఏడాది పొడుగునా ఏ మేరకు అమలు చేశామని అవలోకనం చేసుకోవాలి.. మన సంతోషాలు 2019లో మరింత రెట్టింపు కావాలంటే 2018 సంవత్సరపు నిర్ణయాలను మరొకసారి స్మృతిపథంలోకి తెచ్చుకోవాల్సిందే.. చేసిన తప్పొప్పులను నిజాయితీగా అంగీకరిస్తూనే సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు ఆనందం మరింత రెట్టింపవుతుంది. కాదంటారా?
కొత్త ఏడాది వేడుకల వెనుక బోలెడు ఆసక్తికర విషయాలు, ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చదివేద్దామా..!
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం రోమ్ పట్టణంలో మొదలైనట్లు చరిత్రకారులు చెబుతారు. క్రీస్తు కంటే ముందు 700 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి న్యూమా పాంటీలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను కొత్తగా కేలండర్‌లో చేర్చినట్లు చెబుతారు. అంతకుముందు వరకు నూతన సంవత్సరం మార్చిలో మొదలై డిసెంబరుతో ముగిసేది. కేవలం పదినెలల పాటే రోమన్ కేలండర్ కొనసాగేది. ఏడాదిలో ఉండే రోజులన్నీ ఆ పదినెలల్లోనే సర్దుబాటు చేశారు. పాంటీలియస్ చక్రవర్తి జనవరి, ఫిబ్రవరిలను జత చేయడంతో జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం తొలిరోజుగా మారింది.
నెలల పేర్లు..
* ప్రారంభానికి ఆదిదేవత అయిన రోమ్ దేవత ‘జానూస్’ పేరిట తొలినెలకు ‘జనవరి’ అని నామకరణం చేశారు. జానూస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి గతం వైపు చూస్తుంటే.. మరోటి భవిష్యత్తు వైపు చూస్తుంటుంది.
* ‘ఫెరు’ అనే రోమన్ పండుగ పేరు నుంచి ‘్ఫబ్రవరి’ నెల పేరు ఏర్పడింది.
* రోమన్‌ల యుద్ధ దేవత పేరును అనుసరించి ‘మార్చి’నెల ఏర్పడింది.
* ‘ఎపెరిర్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘ఏప్రిల్’ నెల పేరు ఏర్పడింది.
* రోమన్‌ల దేవి పేరు ‘మయిమా’.. ఈ పదం నుండి ‘మే’ నెల ఏర్పడింది.
* స్వర్గానికి రాణి- ‘జానో’.. ఈ పదం నుండి ‘జూన్’ నెల ఏర్పడింది. * ‘జూలియస్ సీజర్’ పేరు నుంచి ‘జులై’ నెల పేరు వచ్చింది.
* రోమ్ చక్రవర్తి పేరు ‘అగస్టన్’. ఈ పేరు ఆధారంగా ‘ఆగస్ట్’ నెల పేరు ఏర్పడింది.
* లాటిన్ భాషలోని ఆధారంగా ‘సెప్టెంబర్’ నెల పేరు వచ్చింది.
* ‘అకో’ అనే లాటిన్ శబ్దం నుండి ‘అక్టోబర్’ నెల పేరు ఏర్పడింది.
* ‘నవమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘నవంబర్’ నెల పేరు వచ్చింది.
* ‘డసమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘డిసెంబర్’ నెల పేరు వచ్చింది.
క్రిస్టియన్ శకంలోని మధ్యకాలంలో యూరోప్ ప్రాంతంలో జీసస్ జన్మదినమైన డిసెంబర్ 25న, అలాగే మార్చి 25న నూతన సంవత్సరం జరుపుకునేవారు. 1582లో మరింత కచ్చితత్వంతో గ్రెగేరియన్ కేలండర్ అందుబాటులోకి వచ్చినా కూడా 1752 వరకు బ్రిటీష్ రాజ్యం, అమెరికన్ కాలనీలు మాత్రం మార్చిలోనే నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా అమెరికా దేశాలు జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. ఫలితంగా ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు వ్యాపించింది.
ఆసక్తికర అంశాలు...
* నూతన సంవత్సరం మొదలయ్యే క్షణంలో ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటూ గడపాలని నలభై నాలుగు శాతం మంది అమెరికా యువతీ యువకులు భావిస్తున్నారట.
* దాదాపు అరవై ఆరు శాతం మంది ఒకటో తేదీన దైవప్రార్థన తప్పనిసరి అంటున్నారు.
* అమెరికాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి గడియారం పనె్నండు కొట్టిన తరువాత ముద్దుతో పవిత్రతను చేకూర్చుకుని, దుష్ట ఆత్మలను తరిమి కొట్టడానికి పెద్దపెద్దగా శబ్దాలు చేస్తారు.
* ఇంగ్లండులో కూడా నూతన సంవత్సర ప్రారంభ సమయంలో వచ్చే తొలి అతిథి తమకు కానుకలను తెచ్చివ్వాలని కోరుకుంటారు. కానుకలు తెచ్చే వ్యక్తి ముందు ద్వారం నుంచి లోపలికి వచ్చి వెనుక ద్వారం నుంచి నిష్క్రమించడాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ సమయంలో ఖాళీ చేతులతో వచ్చే అతిథిని లేదా తమంటే ఇష్టపడని వారిని ముందుగా ఇంటి లోపలికి ప్రవేశించకుండా చేస్తారు.
* నూతన సంవత్సరం వచ్చే క్షణంలో సంబరాల ప్రస్తావనేమీ లేకుండానే నిద్రకే ప్రాధాన్యం ఇస్తున్న వారి శాతం దాదాపు అరవై పైనేనట.
* నూతన సంవత్సర సంబరాల్లో అత్యధిక ‘వైన్’ను వినియోగించేది అమెరికనే్లనట.
* మెక్సికన్లు అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్షపండ్లను తింటారు. ఆ వెంటనే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
* పెరూలో కూడా ఇదేవిధంగా పనె్నండు ద్రాక్షలను తినడంతో పాటు అదనంగా 13వ ద్రాక్షను కూడా తింటారట. కాకపోతే ఆ ద్రాక్ష తమ అదృష్టాన్ని బీమా చేయిస్తుందని వారి నమ్మకం.
* జపాన్‌లో అయితే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తమ ఇంటి ప్రాంగణాన్ని వెదురు బద్దలతో అలంకరించుకుంటారు. వెదురు ఉదాత్తమైన భావాలకు, ఆశయాలకు చిహ్నాలుగా భావిస్తారు.
* గ్రీస్‌లో అయితే నూతన సంవత్సర ప్రారంభం రోజున బ్రెడ్ పీస్‌లో కాయిన్ ఉంచి.. అందరికీ బ్రెడ్‌ను అందిస్తారు. ఎవరికైతే కాయిన్ ఉన్న బ్రెడ్ ముక్క వస్తుందో వారిని దేవుడు అనుగ్రహించినట్లు భావిస్తారు. అలాగే కొంతమంది ముగిసిపోయిన సంవత్సరంలో తమను బాధపెట్టిన విషయాలను, తప్పులను ఒక పేపర్‌పై రాసి దాన్ని మంటల్లో వేస్తారు. ఈ చర్య ద్వారా తమలోంచి ఆ ప్రతికూలత తొలగించుకున్నట్లు వారు భావిస్తారు.
* నార్వేలో కూడా కొత్తసంవత్సర ప్రారంభం రోజున రైస్ పుడ్డింగ్‌లో ఆల్మండ్ పెట్టి వండుతారు. ఆ పదార్థాన్ని వడ్డించినప్పుడు ఎవరికైతే ఆల్మండ్ వస్తుందో వారికి ఆ సంవత్సరం సంపద వస్తుందని నమ్ముతారు.
* సిసిలీలో కొత్తసంవత్సరం రోజున ‘లసగ్న’ను వడ్డిస్తారు. ఇతర నూడిల్స్‌ను వారు ఆ రోజు చేయరు. అది దురదృష్టాన్ని తెస్తాయని వారి నమ్మకం.
* 2008, 2002, 1991,1980, 1973, 1963, 1952, 1946, 1935, 1924.. ఇలా వీటిలో ఏ సంవత్సరపు కేలెండర్‌నైనా 2019 సంవత్సరపు కేలండర్‌గా వాడుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో వచ్చే వారాలు, తేదీలూ అన్నీ ఒకటే..!
* ప్రపంచమంతా 2019లోకి అడుగుపెడుతుంటే ఇథియోపియాలో మాత్రం ప్రస్తుతం 2011వ సంవత్సరం నడుస్తోంది. ఇథియోపియా వాళ్ల కాలెండర్లో మొత్తం పదమూడు నెలలు ఉంటాయి. పనె్నండు నెలలు.. ఒక్కోటి ముప్ఫై రోజులు ఉండగా.. పదమూడో నెలలో మామూలు సంవత్సరం ఐదు రోజులు, లీపు సంవత్సరంలో ఆరు రోజులూ ఉంటాయట. ఈ నెలను వారు ‘ఇంటర్ కాలరీ నెల’ అంటారు. వాళ్లు నవంబర్ 11న (లీపు సంవత్సరం ముందు ఏడాదైతే 12న) నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. 2018 అక్టోబరులో వాళ్లు 2011వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. క్రీస్తు జనన సంవత్సరం గురించిన విషయంలో అక్కడ చర్చిలు అనుసరించే లెక్కలకూ, మిగతా దేశాల చర్చిల్లో లెక్కలకూ తేడావల్లే ఇలా జరుగుతోంది.
* రష్యాలో నూతన సంవత్సర వేడుకల్ని రెండుసార్లు జరుపుకుంటారు. జనవరి ఒకటిన కొత్త కేలండర్ ప్రకారం, రెండోది జనవరి 14న పాత కేలండర్ ప్రకారం.
* నూతన సంవత్సరాన్ని జనవరి ఒకటిన జరుపుకోని దేశాల్లో చైనా, కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఆయాదేశాల కేలండర్ల ప్రకారం అక్కడ వేడుకలు జరుపుకుంటారు.
* న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ గార్డెన్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపునేందుకు దాదాపు పది లక్షల మంది చేరతారట. అందులో ఐదో వంతు వివిధ దేశాల నుంచి వేడుకలను చూసేందుకు వచ్చేవారేనట. ఇక్కడ దాదాపు 900 కిలోల రంగు కాగితపు ముక్కలను జనంపైకి చల్లుతారట.
* కొత్త ఏడాది వచ్చిన వెంటనే మనం చూసే వ్యక్తిని బట్టి మంచి లేదా చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే చాలా దేశాల్లో ఆ సమయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారట.
* ప్లాండర్స్ (బెల్జియం), నెదర్లాండ్స్‌లో ఏడో శతాబ్దంలో సంవత్సరం మొదటిరోజున బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం మొదలైంది.
ఎవరు ముందు..?
ఇక ఒక్కరోజు ఆగితే మనం 2019లోకి ప్రవేశించబోతున్నాం. కానీ కొన్ని దేశాలు మాత్రం మనం 2019లోకి ప్రవేశించినా ఇంకా 2018లోనే ఉంటాయి. అది ఎలాగో.., కొత్త ఏడాది సంబరాలు అందరికంటే ముందు ఎవరు చేసుకుంటారో చూద్దాం..
* మనకి డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 నిముషాలు అవుతుండగానే పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’ దేశం 2019లోకి అడుగు పెట్టేస్తుంది. అక్కడ సంప్రదాయ నృత్యాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు స్థానికులు. సమోవాతో పాటు కిరిబాటి దేశ పరిధిలోని క్రిస్‌మస్ ద్వీపంలోనూ ఇదే సమయంలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.
* కొత్త ఏడాదిని ఆహ్వానించడంలో మనకంటే అయిదున్నర గంటలు ముందుంటుంది ఆస్ట్రేలియా. తూర్పునున్న దేశాల్లో కొత్త ఏడాది కోలాహలం ఎక్కువ కనిపించేది ఇక్కడే! ‘సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్’ దగ్గర లక్షలమంది వేడుకల్లో పాల్గొంటారు. హార్బర్ పొడవునా అరవై ఐదు కిలోమీటర్ల మేర రాత్రి తొమ్మిదింటి నుంచి 80 వేల రకాల బాణసంచా పేలుస్తూ పండుగ చేసుకుంటారు.
* సూర్యోదయ భూమి(నిప్సన్)గా పేరున్న జపాన్ మనకంటే మూడున్నర గంటలు ముందే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియాలో కొత్త సంవత్సర సంబరాలు జరుపుతారు. మనకంటే చైనా రెండున్నర గంటల ముందు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు ముప్ఫై నిముషాల ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
* కొత్త సంవత్సరంలోకి ‘సమోవా’ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు మనం అడుగుపెడతాం. శ్రీలంక కూడా మనతోపాటే అడుగుపెడుతుంది.
* ఒకటో తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఒకేసారి 43 దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటరీ, ఐరోపాలతో పాటు కాంగో, అంగోలా, ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి.
* మన తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో వేడుకలు మొదలవుతాయి.
* మనకు ఉదయం 10:30 అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్త సంవత్సరం వేడుకలు మొదలవుతాయి. అక్కడ ‘టైమ్ స్క్వేర్’లో జరిగే బాల్ డ్రాపింగ్ సంబరం ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణ. ఆరడుగుల చుట్టుకొలతతో 1070 పౌండ్ల బరువుండే ‘వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్ బాల్’ను స్తంభంపై ఉంచుతారు. 11:59 నిముషాలకు ఆ బాల్ కిందకు జారడం మొదలై సరిగ్గా పనె్నండింటికి నేలను తాకుతుంది. అంతే.. ఆ క్షణంలో శుభాకాంక్షల హోరు మిన్నంటుతుంది.
* చివరిగా అమెరికాలోని ‘సమోవా’తో కొత్త సంవత్సరం వేడుకలు ముగుస్తాయి. ఈ ప్రాంతం అమెరికా పరిధిలోకి వస్తుంది. అప్పటికి భారత్‌లో సాయంత్రం నాలుగున్నర అయ్యుంటుంది. నూతన సంవత్సరం ఆఖరిగా వచ్చేది అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు. అమెరికా సమోవాకు ఇక్కడికీ గంట తేడా. ఇక్కడ జనావాసాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా అక్కడుంటే చివరిగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేది వారే.. కన్‌ఫ్యూజ్ కాకండి.. పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’లో మొదట నూతన సంవత్సరం ఆరంభమవుతే.. అమెరికాలోని ‘సమోవా’లో ఒకరోజు తర్వాత నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పేర్లు ఒక్కటే కానీ ప్రాంతాలు వేరు..
* స్వీడన్, ఫిన్లాండ్‌లను ‘మ్యూనియో’ నది విభజిస్తుంది. ఫిన్లాండ్ సమయం, స్వీడన్ కంటే గంట ముందు. ఫిన్లాండ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన తరువాత పదిహేను నిముషాలు నడిచి వంతెన దాటితే స్వీడన్లోకి వెళ్లచ్చు. అక్కడ మళ్లీ 2019కి స్వాగతం పలకవచ్చు. ఈ రెండు నగరాల్లోకి యువతకు ఇది భలే సరదా.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోడానికి కేవలం పదిహేను నిముషాలు సమయం పట్టడంతో వారు మొదట ఫిన్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు చేసుకుని తర్వాత స్వీడన్లోకి వెళతారు.
‘టాప్ టెన్’ సెలబ్రేషన్స్..
గడిచిన సంవత్సరానికి ‘గుడ్ బై’ చెప్పి, నూతన సంవత్సరానికి ‘వెల్‌కమ్’ చెబుతూ యావత్ ప్రపంచమంతటా వేడుకలు జరుపుకుంటుంది. మారే ప్రతిరోజూ కొందరిలో అదనపు మార్పును తెస్తే ఇంకొందరిలో ఏ మార్పూ లేకుండా మారుతూనే ఉంటుంది. కొత్త సంవత్సర వేడుకలు, పద్ధతులు పాశ్చాత్యీకరణ అయినప్పటికీ మనిషి వేగంగా పరిణామం చెందుతుండంతో ఇప్పుడు ఈ వేడుకల్లో అందరూ పాల్గొంటున్నారు. చరిత్రలోకి వెళితే గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం జనవరి ఒకటి కొత్తసంవత్సరంగా పరిగణించబడుతుంది. దీంతో చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్, అమెరికా వంటి చాలా దేశాల్లో జనవరి ఒకటి సెలవుదినంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా జరుపుకునే టాప్ టెన్ సిటీస్ ఇవే..
లండన్
లండన్ వాసులు థేమ్స్ నదీతీరాన ట్రాఫల్గర్ స్వేర్‌లో బాణసంచా, రంగురంగుల బెలూన్లతో కొత్తసంవత్సరానికి స్వాగతం చెబుతారు.
పారిస్
నిత్యం వీధి దీపాల వెలుగుల్లో మురిసిపోయే పారిస్ నగరం నూతన సంవత్సరం నాడు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో మెరిసిపోతుంది. ఈఫిల్ టవర్ సాక్షిగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు చాంప్స్ ఎలిసే వీధుల్లో బారులు తీరుతారు.
మాడ్రిడ్
యాత్రికుల స్వర్గ్ధామం అయిన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రజలు నూతన సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమదైన ప్రత్యేక ఒరవడితో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. వారు ప్యూర్ డెల్ సోల్ స్వేర్ గడియారం ముందు చేరి ప్రతి ఒక గంట చప్పుడుకు ఒక ద్రాక్ష పండ్లు తింటూ పనె్నండు ద్రాక్షలను సరిగ్గా అర్ధరాత్రి పనె్నండు గంటలకు ముగించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
సిడ్నీ
కొత్త సంవత్సర వేడుకలకి ప్రసిద్ధిగాంచిన నగరం సిడ్నీ. ఇక్కడ ప్రజలు నదీ తీరాలకు చేరుకుని బాణసంచా కాంతుల్లో వెలిగిపోతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలుకుతారు.
న్యూ యార్క్
న్యూ యార్క్ టైం స్కేర్ కొత్త సంవత్సరపు వేడుకలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాంతం అంతా మామూలు రోజుల్లోనే నియాన్ లైట్లతో వెలుగొందుతుంది. ఇక కొత్త సంవత్సరం అంటే చెప్పనక్కరలేదు. ఈ నగరంలో ప్రసిద్ధిగాంచిన బ్రాడ్‌వే, సెవెన్త్ అవెన్యూ ఈ రెండూ ఒకచోట కలిసే టైం స్వేర్‌లోని లక్షల మంది ప్రజలు చేరి పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడం కన్నుల పండుగగా ఉంటుంది.
లాస్‌వేగాస్
బాణసంచా వెలుగులతో మిరుమిట్లు గొలిపే లాస్‌వేగాస్‌లోని యంజియం గ్రాండ్, ది బెల్లాగియోలో ప్రజలు ఆనంద పరవశాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
రియో డి జెనిరో
నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగే నగరాల్లో ఒకటి బ్రెజిల్లోని రియో డి జెనిరో. విభిన్న వేషధారణలతో ప్రజలు బీచ్‌లలో, సముద్ర తీరాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అర్ధరాత్రి దాటాక నీటి అలల్లోకి పూలను విసురుతూ సముద్ర దేవతల మెప్పును పొందడం చూడటానికి వేడుకలా ఉంటుంది.
బీరుట్
బీరుట్ నగరానికి కేంద్ర బిందువైన నెజెమే స్వేర్‌లో ప్రజలు గుంపులుగా చేరి సందడిగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 1933 నాటి ఆర్డ్ డెక్ క్లాక్ టవర్‌లో లైట్ షో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
టోక్యో
సూర్యుడు ఉదయించే జపాన్‌లోని టోక్యో నగరం గుడిగంటల చప్పుడుతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంది.
క్రిస్‌మస్ ఐలాండ్
పరిణామ క్రమంలో భాగంగా మొట్టమొదటిసారి జనసంచారం కనిపించిన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకునే క్రిస్‌మస్ ఐలాండ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి జనాభా కేవలం ఐదు వేలు మాత్రమే. అందుకే అందరూ కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
*
ఆలోచన.. ఆచరణ..
కొత్త ఏడాది సందర్భాన్ని ఆరోగ్యానికో, డబ్బుకో, అలవాట్లకో సంబంధించి తీర్మానాలు చేసుకోవడం అమెరికా దేశస్థుల్లో ఎక్కువ. దాదాపు యాభైశాతం మంది ఇలా తీర్మానాలు చేసుకుంటే అందులో సుమారు సగంమంది జనవరి రెండో వారంలోనే వదిలేస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫై శాతం మంది నూతన సంవత్సరం సందర్భంగా తమ జీవితంలో మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతూ న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారట. ఇలాంటివారిలో ఎక్కువమందికి ‘బరువు తగ్గడం’ అనేదే లక్ష్యం. డబ్బును పొదుపుచేయాలి.. ధూమపానం మానేయాలి.. జిమ్‌కు వెళ్లాలి.. అనేవి రెజల్యూషన్స్‌లో ప్రధాన అంశాలు. ఇలాంటివి మనదేశంలో కూడా మొదలయ్యాయి.
* కొత్త సంవత్సరం వచ్చిందంటే జిమ్‌లకు పండగే పండగ. మరోపక్క వైన్‌షాపులు, పాన్‌షాపులూ వెలవెలబోతాయి. ఆరోగ్యానికి మేలుచేసే ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. తెల్లారి ఎనిమిదైనా నిద్రలేవని కుర్రాళ్లు, వణికించే చలిని కూడా లెక్కచేయకుండా జనవరి ఒకటిన ఉదయానే్న టంచనుగా జిమ్‌లో వాలిపోతుంటారు. అందుకే మొదటిరోజు ఇలాంటి కేంద్రాలన్నీ సామర్థ్యానికి మించి కిటకిటలాడతాయి. పదిహేను రోజులయ్యేసరికి జనాల సంఖ్య పలచపడుతుంది. ఇక నలభై ఐదు రోజులు గడిచేసరికి ఒకటో తారీఖున జిమ్‌లలో చేరిన వాళ్లలో అరవై శాతం రావడం మానేస్తుంటారని సర్వే చెబుతోంది. మరో నలభై ఐదు రోజులకు ఆ సంఖ్య ఎనభై శాతానికి పడిపోతుంది. ఈ పరిణామానికి అన్నిచోట్లా ప్రధానంగా కనిపించే ఒకే ఒక్క కారణం.. బద్ధకం.
* ‘ఇదే నా జీవితంలో ఆఖరి సిగరెట్టు..’- డిసెంబరు 31 అర్ధరాత్రి చాలామంది పొగరాయుళ్ల నుంచి వినిపించే మాట ఇది.. ఎక్కువమంది ఒట్టేసి, గట్టున పెట్టేసే జాబితాలో దీనిది రెండో స్థానం. సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండేది పదిహేను శాతం మందే.. ఈ కోవలోకే వస్తుంది ‘మద్యం మానేయాలి’ అనే నిర్ణయం కూడా..
* ఆరోగ్యానికి విలువిచ్చే వాళ్లంతా జంక్ ఫుడ్‌కీ, నూనె పదార్థాలకూ దూరంగా ఉండాలనీ ఈ రోజే ఒట్టు పెట్టుకుంటారు. నాలుగు రోజులు కాగానే అప్పుడప్పుడూ ఫర్వాలేదని నియమాలను సవరించుకుంటారు. ఇక సెలవులు, పండుగలూ వచ్చినప్పుడు కష్టపడేదే తినడానికైనప్పుడు రాజీపడటం ఎందుకని ఆహార సూత్రాలను పక్కన పెడతారట. దాంతో ఏడాది చివరికి కనీసం పదిశాతం మంది కూడా లక్ష్యాన్ని చేరుకోవట్లేదు. మిగిలిన తొంభై శాతం మంది.. మళ్లీ కొత్తసంవత్సరం వస్తుందిగా అని సర్దిచెప్పుకుంటున్నారు.
* కేలండర్ మారగానే ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మొదలుపెట్టాలన్నది భారతదేశం వంటి దేశాల్లో ఎక్కువమంది తీసుకునే నిర్ణయాల్లో ఒకటి. ఏడాది చివరికల్లా ఇల్లో, కారో కొనాలని కొత్త సంవత్సరం ప్రారంభంలోనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఏడాది ముగిసేసరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకునేవాళ్ల సంఖ్య ఐదు శాతంలోపే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
సర్వేలన్నీ ఏం చెప్పినా, మారాలనుకునేవాళ్లకు జీవనశైలి నిపుణులు రెండే విషయాలను సూచిస్తున్నారు.
ఒకటి.. మంచిపని చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదని..
రెండు.. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవడానికి సాకులు కాదు, చేరుకోవడానికి కారణాలూ, దారులూ వెతుక్కోవాలని.. *
జ్ఞాపకాల్లో ఆనందం
ఇవి పాతవే అయినా గొప్పవి. గత సంవత్సరం జ్ఞాపకాలను పదిల పర్చుకోవచ్చు. అప్పుడప్పుడూ గతాన్ని తిరగేసి ఆనందాన్నీ పొందవచ్చు. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ పాత సంప్రదాయాలకు మళ్లీ కొత్తగా తెరతీయండి..
డైరీలు: న్యూ ఇయర్ అనగానే డైరీలకు బాగా డిమాండ్. తమ జ్ఞాపకాలను పదిల పరచుకునేందుకు ఇవి చక్కటి సాధనాలు. స్నేహితులకు ప్రెజెంట్ చేయడానికి డైరీ కూడా మంచి కానుక. పాకెట్ డైరీల నుంచి పెద్ద డైరీల వరకు వివిధ డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న డైరీలు చూడండి. వాటిని చూడగానే ఈ సంవత్సరం నుంచైనా డైరీ రాయాలన్న బుద్ధి పుడుతుంది. మరి అలాంటి డైరీలను ఆత్మీయులకు కానుకలుగా ఇచ్చి తమ జ్ఞాపకాలను పదిల పర్చుకునేలా చేయండి.
గ్రీటింగ్ కార్డ్స్: శుభాకాంక్షలు చెప్పడానికి రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ మార్కెట్లో ఉండనే ఉంటాయి. స్నేహితుల అభిరుచిని అనుసరించి దానికి మీ అభిరుచిని కూడా జతచేసి పంపే గ్రీటింగ్స్ ఒక ఆత్మీయమైన కరచాలనం వంటిది.
బహుమతులు: ఎదుటివాళ్ళతో మన అనుబంధాన్ని పదేపదే జ్ఞప్తికి తెచ్చేలా చేయడంలో బహుమతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కలర్‌ఫుల్ గ్రీటింగ్స్‌తో పాటు మీరు కోరిన విధంగా కానుకలను అందించే షాపులు నేడు అంతటా ఉన్నాయి. ఒక్క కానుక ఇస్తే అది చెరగిపోని జ్ఞాపకమై వచ్చే ఏడాదంతా వారి హృదయంలో మీ చోటు పదిలం చేస్తాయి.
*
గడచిన ఏడాది కొందరి జీవితాల్లో ఆనందానికి చోటిస్తే మరికొందరిలో అంతులేని వేదనని, రోదనని మిగిల్చి ఉంటుంది. వచ్చే సంవత్సరం అయినా ఆ వేదనలు తొలగిపోయి అంతులేని సంతోషాలు దరిచేరాలని 2018కి ప్రేమ గా వీడ్కోలు పలుకుతూ ఆనందంగా 2019కి ఆహ్వానం పలుకుదాం.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి