ఈ వారం స్పెషల్

సెగపట్టులో భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం... ఈ వరుస క్రమంలో ఏటా రుతువులు వస్తాయన్నది ఒకప్పుడు మనం స్కూల్‌లో నేర్చుకొన్న పాఠం.. రుతువులు గతి తప్పడం, మితిమీరిన ప్రభావం చూపడం ఇప్పుడు మనకు అనుభవం నేర్పుతున్న పాఠం.. రుతువులు మనం రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి కావు.. వాటి కాలమానం ప్రకారం అవి వచ్చేస్తాయి... రుతుధర్మం సజావుగా సాగితే సమస్యే లేదు.. మూడు కాలాలూ భరించలేనివిగా పరిణమించడం సమకాలీన ప్రాకృతిక వైపరీత్యం.. బెంబేలెత్తించే ఎండలు.. బతకలేం అనిపించే వానలు.. బాబోయ్ అనిపించే శీతల గాలులు ఇపుడు విశ్వవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.. వాతావరణంలో మార్పులతో అవనీతలంపై అసాధారణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.. దీంతో వడగాడ్పులు, చలిగాలులు, ఈదురుగాలులు, వరదలు, పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఇసుక తుపానులు, కరవు కాటకాలు వంటి విపత్తులు అనివార్యంగా సంభవిస్తూ మానవాళిని సంకట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి..
పర్యావరణం సకల విధాలుగా నాశనమవుతున్న నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు భూగోళాన్ని హడలెత్తిస్తున్నాయని నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అయిదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగక తప్పదని పరిశోధకుల తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గణాంకాలను తరచి చూస్తే ‘ఉపరితల ఉష్ణోగ్రతల సగటు’ అత్యధికంగా నమోదవుతున్నట్టు అవగతమవుతుంది. ఈ ఒరవడి ప్రస్తుత దశాబ్దంలో స్పష్టంగా గోచరిస్తోంది. ఉష్ణోగ్రతల సగటు పెరుగుదల గణాంకాలు 1850 నుంచి అందుబాటులో ఉన్నందున, వాటిని పర్యావరణ శాస్తవ్రేత్తలు విస్తృత స్థాయిలో విశే్లషించి రాబోయే ముప్పు గురించి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలకు సంబంధించి బ్రిటన్ వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఎవరికైనా ఆందోళన కలిగించక మానవు. పారిశ్రామిక పూర్వయుగం నాటితో పోల్చి చూస్తే అంతర్జాతీయ వార్షిక ఉష్ణోగ్రత సగటు పెరుగుదల తొలిసారిగా 2015వ సంవత్సరంలో ఒక డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిందని నిపుణుల విశే్లషణలో వెల్లడైంది. 2015 తర్వాత వరసగా మూడేళ్ల కాలం పాటు అధిక వేడిమి యావత్ ప్రపంచాన్నీ భీతావహ పరచింది. వాతావరణంలో ‘ఉష్ణతాపం’ దూకుడు పెరగడంతో 2014-2023 సంవత్సరాల మధ్యకాలం గత 169 ఏళ్లలో ‘అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దం’గా ఆవిర్భవిస్తుందని నిపుణులు అంచనా వేశారు. 2019- 2023 మధ్యకాలంలో కనీసం ఒక్క ఏడాదైనా ‘ఉష్ణోగ్రత సగటు’- పారిశ్రామిక యుగం నాటి సగటుతో పోల్చి చూస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో 2018వ సంవత్సరం నాలుగవ స్థానంలో ఉండడం ఆందోళనకర పరిణామం అని అంగీకరించక తప్పదు.
ఏటా ఏదో రూపంలో విపత్తులు..
పెరిగిన ఎండలు, కల్లోల సాగరాలు, వరదలు, ఉరుములు, పిడుగులు, భూమి బీటలు వారడం వంటి వైపరీత్యాలు కొనసాగుతుండగా 2018లో వేడిమి 0.41 డిగ్రీల మేరకు పెరిగినట్లు నమోదైంది. గత సంవత్సరం వాతావారణం ‘అసాధారణం’ అని పర్యావరణ శాస్తవ్రేత్తలు తేల్చి చెప్పడానికి ఎన్నో స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రభావం 2018లో అత్యంత స్పష్టంగా గోచరించింది. భారత్‌కు సంబంధించి చూస్తే 1981- 2010 మధ్యకాలంలో నమోదైన సగటు ఉష్ణోత్రల కంటే గత ఏడాది వేడిమి అధికంగా నమోదు కావడం ఆందోళనకర పరిణామం. వందేళ్లకు పైగా గణాంకాలను పరిగణనలోకి తీసుకొని 2018లో కొనసాగిన అసాధారణ పరిస్థితులపై భారతీయ వాతావరణ శాఖ కొన్ని వివరాలను ఇటీవల ప్రకటించింది.
విశ్వవ్యాప్తంగా ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రభావం నానాటికీ అధికమవుతోందని, దీంతో ఇక ఏటేటా ఎండలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేని పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇకముందు ప్రతి ఏడాదీ ఏదో ఒక రూపంలో విపత్తులు సంభవించడం అనివార్యం కాగలదని వారు స్పష్టం చేస్తున్నారు. 1901 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో 2018 కూడా ఒకటి. 2004- 2018 వరకూ మొత్తం ‘పదకొండు వేడి సంవత్సరాలు’ నమోదు కావడం గమనార్హం. భారత్‌లోని దక్షిణాది ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కేవలం 56 శాతం మేర వర్షపాతం కురవడంతో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. 1901 నుంచి ఇప్పటి వరకూ ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అత్యల్ప వర్షపాతం నమోదైన ఆరు సంవత్సరాలలో 2018 ఒకటి అని వాతావరణ శాఖ తేల్చింది. గత ఏడాది దేశవ్యాప్తంగా వరదలు, భారీ వర్షాలకు సుమారు 800 మంది మరణించగా, పిడుగులు పడి 166 మంది మృత్యువాత పడ్డారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అత్యధిక ఎండ తీవ్రత కొనసాగిన 5 సంవత్సరాల జాబితాలోనే గాక, మార్చి నుంచి మే వరకూ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడు వేడి సంవత్సరాల జాబితాలోనూ 2018కి స్థానం లభించింది. గత ఏడాది మన దేశంలో 85 శాతం వర్షపాతం నమోదు కాగా, నైరుతి సీజన్‌లో 90.7 శాతం వర్షం నమోదైంది. ఇదే కాలంలో దక్షిణ, వాయవ్య భారతంలో 98 శాతం, మధ్య భారతంలో 93 శాతం, తూర్పు ఈశాన్య భారతంలో కేవలం 76 శాతం వర్షపాతం నమోదైంది.
అట్టుడికిన ఆస్ట్రేలియా..
గతంలో ఎన్నడూ లేనంతగా ఆస్ట్రేలియా వాసులు ఇటీవల ఉష్ణతాపాన్ని ఎదుర్కొన్నారు. ఆ దేశంలో సగటు ఉష్ణోగ్రతను మించి 12 డిగ్రీల సెల్సియస్ మేరకు వేడిమి పెరగింది. ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పెరగడం సర్వసాధారణమైంది. గత ఏడాది డిసెంబర్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నందున ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పలు మార్గదర్శకాలను జారీచేసింది. వరుసగా ఇరవై రోజులపాటు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొనసాగడం, ఒక సందర్భంలో అది 50 డిగ్రీలను అధిగమించడంతో ఆస్ట్రేలియాలో వేడిమి ఎంతగా విషమించిందో తెలుస్తుంది. వాతావరణంలో వేడి ప్రభావం సముద్రంపైనా పడింది. సాగర జలాల్లో నీరు వేడెక్కడంతో చేపలు ఇతర జలచరాలు భారీ సంఖ్యలో మరణించాయి. ఎండవేడిని భరించలేక సాగర తీరాల్లో సేద తీరుదామని అనుకున్న వారికి అక్కడా ప్రతికూల వాతావరణమే కనిపించింది. భారీ స్థాయిలో చేపలు మరణించడం ఉష్ణతాపం విషమించిందనడానికి ప్రమాద ఘంటిక అని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు.
అత్యంత వేడిమి ప్రాంతాలు
అతి ఉష్ణం, అతి శీతలం.. ఈ రెండూ మానవాళిని భయపెట్టే స్థాయిలో కొనసాగడం ప్రకృతిలో సమాంతర పరిణామం కావడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం వరకూ ‘ఆర్కిటిక్ చలి’తో అమెరికా గజగజలాడింది. కనీవినీ ఎరుగని చలి గాలులతో అమెరికా నిలువెల్లా వణికింది. ‘పోలార్ వొర్టెక్స్’ (అతి శీతల వాతావరణ పరిస్థితి) ప్రభావంతో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అమెరికాలోని అనేక రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీల సెల్సియస్ (మైనస్ 65 డిగ్రీల ఫారిన్‌హీట్) వరకూ పడిపోవడం ప్రపంచాన్ని నివ్వెర పరచింది. అమెరికాలో అతి శీతల వాతావరణం కొనసాగినట్లే ప్రపంచంలోని పలు ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలకు ఆలవాలంగా మారాయి.
* శీతల వాతావరణంతో గడ్డకట్టే అమెరికాలోనే ‘డెత్ వ్యాలీ’ (కాలిఫోర్నియా రాష్ట్రం) అత్యధిక ఉష్ణోగ్రతల్లో చరిత్ర సృష్టించింది. 1913లో ‘డెత్ వ్యాలీ’లో 1913లోనే 56.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. వేసవిలో 47 డిగ్రీల సగటు ఉష్ణోత్రలు ఇక్కడ నమోదు కావడం సర్వసాధారణం.
* లిబియాలోని అజీజియాలో 1922లో 58 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏటా ఎండలు ముదిరినపుడు 48 డిగ్రీలు మించి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
* ఇథియోపియాలోని దల్లోల్ ప్రాంతంలో 1960 నుంచి 1966 వరకూ 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ స్థాయిలోనే ఉష్ణతాపం కొనసాగడం ఇక్కడ వింతేమీ కాదు.
* సూడాన్‌లోని ‘వడి హల్ఫా’లో 1967 ఏప్రిల్‌లో 53 డిగ్రీల అధిక వేడి నమోదైంది. ఏటా జూన్‌లో 41 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇక్కడ సర్వసాధారణం. ఇథియోపియాలోని టింబుకు ప్రాంతం శీతాకాలంలోనూ అత్యంత ఉష్ణ ప్రాంతంగా గుర్తింపు పొందింది.
* ఇరాన్‌లోని దస్త్-ఇ లూట్ ఎడారి భూ ఉపరితలంపైనే అత్యధిక ఉష్ణ ప్రాంతంగా వాసికెక్కింది. 2003- 2007 మధ్యకాలంలో ఈ ఎడారిలో 70.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. అందుకే ఈ ప్రాంతం జననివాసానికి అనుకూలంగా లేకుండా మిగిలింది.
* ఇజ్రాయల్‌లోని టిరట్ జ్వీ ప్రాంతం ఆసియా ఖండంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. 1942 జూన్‌లో ఇక్కడ 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇజ్రాయల్‌లోని ఎడారికి సమీపంలోని ప్రాంతాల్లో చలికాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
* ట్యునీషియాలోని కెబిలి తదితర ఎడారి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉండడం పెద్ద విశేషమేమీ కాదు. గతంలో ఇక్కడ 55 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగింది.
* లిబియాలోని ఘడమెస్ ప్రాంతంలో సుమారు ఏడువేల జనావాసాలు ఏటా ఎండవేడిని భరిస్తున్నాయి. ఇక్కడ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు ఉండడం సహజం. గతంలో ఒకసారి 55 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నెలకొనడం రికార్డుగా మిగిలింది.
* ఇరాన్‌లోని బండర్-ఇ-మహ్‌శ్రార్ ప్రాంతం ‘చెమటలు కక్కే ప్రాంతం’గా గుర్తింపు పొందింది. 2015 జూలైలో ఇక్కడ రికార్డు స్థాయిలో 74 డిగ్రీల సెల్సియస్ మేరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తరచూ 51 డిగ్రీల వరకూ ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
అంతా స్వయంకృతం..
శీతోష్ణస్థితిలో విపరిణామాలు, విపరీత మార్పులు మన స్వయంకృతాపరాధమే.. అటవీ హననం, పారిశ్రామిక కాలుష్యం, జల కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తకుండీలుగా మారుతున్న సముద్రాలు.. ఇలా ప్రకృతి యావత్తూ నాశనమవుతున్నందున ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం ప్రమాదంలో పడింది. శీతోష్ణ మార్పులు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నప్పటికీ సంక్షోభ నివారణ దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రమాద స్థాయిని పెంచుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సదస్సులు తరచూ జరుగుతున్నా, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అత్యున్నత సంస్థలు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదన్నది కాదనలేని కఠోర వాస్తవం. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి ఇప్పటికే విషమించిందని, ఓజోన్ పొరకు చిల్లు పడిందని, శీతోష్ణస్థితిలో అనూహ్య మార్పులతో సముద్ర మట్టాలు అంచనాకు మించి పెరుగుతున్నాయని, తీర ప్రాంత ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని, తుపానులు విరుచుకుపడుతున్నాయని వాతావరణ నిపుణులు అనేక సదస్సుల్లో హెచ్చరికలు చేస్తునే ఉన్నారు.
తీరంలో ఘోరం..
తీర ప్రాంత నియంత్రణ నిబంధనలను (సీఆర్‌జెడ్) వాణిజ్య అవసరాల కోసం సులభతరం చేయడంతో మన దేశంలో సముద్ర తీరాలకు ప్రమాదం పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల వల్ల మంచుకొండలు విరిగిపోవడం.. ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోవడంతో తీర ప్రాంతంలో నివసించేవారికి మనుగడ దుర్లభమయ్యే పరిస్థితి దాపురిస్తోంది. సముద్ర తీరాల్లో నిర్మాణాల వల్ల, భూ ఉపరితలంపైకి అలలు చొచ్చుకుని రావడం వల్ల 2050 నాటికి మన దేశంలో సుమారు నాలుగు కోట్ల మంది తీర ప్రాంత వాసుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా జరిగే కష్టనష్టాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యూఎన్‌ఈపీ’ విభాగం పలు హెచ్చరికలు చేసింది. శీతోష్ణస్థితిలో విపరిణామాల వల్ల- మన దేశంలో సుమారు 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న తీర ప్రాంతం సమస్యలకు నిలయంగా మారుతోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్‌లో ఎన్నో చట్టాలున్నా అవి సమర్థవంతంగా అమలు జరగడం లేదు. పారిశ్రామిక కాలుష్యం, సముద్ర తీరంలో చెత్తకుప్పలు, గాలిలో కర్బన ఉద్గారాల జోరు వంటి పరిస్థితులను చూస్తే చట్టాలు ఏ మేరకు పనిచేస్తున్నాయో, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో ఎవరైనా సులభంగా ఊహించవచ్చు. పర్యావరణ పరిరక్షణ అనేది జీవన్మరణ సమస్యగా మారినా పాలకుల్లో అంతగా చలనం కానరావడం లేదు. అంతర్జాతీయ ఒప్పందాల పుణ్యమాని మన పాలకులు అరకొర చర్యలు తీసుకుంటున్నారే తప్ప, మన చట్టాలను అమలు జరపడం పట్ల దారుణ ఉదాసీనతను చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజల సమస్యగా ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే- ఎన్నికల వాగ్దానాల్లో గానీ, చట్టసభల్లో గానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన ఉండడం లేదు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల గురించి జనంలోనూ తగిన అవగాహన లేదు. జనం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాల్లోనూ ఎలాంటి కదలిక కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ‘పర్యావరణ నిర్వహణ సూచీ’లో భారత్ అట్టడుగున ఉండడం వింతేమీ కాదు. గాలి, నీరు, పర్యావరణ పరిరక్షణకు ఇపుడున్న చట్టాలను కొంతవరకైనా అమలు చేసి ఉన్నట్టయితే పరిస్థితి కొంతైనా మెరుగ్గా ఉండేది. తీర ప్రాంత నియంత్రణ నిబంధనలను (సీఆర్‌జెడ్) కార్పొరేట్ సంస్థల ప్రాపకం కోసం సడలించడం చూస్తే చట్టాల పట్ల పాలకులు నిజాయితీ ఎంతో తెలుస్తుంది. పారిశ్రామికీకరణ, పెట్టుబడులు రాబట్టడం, భారీ ప్రాజెక్టులు, నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ వంటి పేర్లతో చట్టాలకు తూట్లు పొడిచే పాలకుల నిర్వాకంతో పర్యావరణం నాశనమవుతోంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం విషతుల్యమవుతోంది, శీతోష్ణస్థితి గతి తప్పుతోంది. వాణిజ్య వర్గాలకు మేలు చేయాలన్న తలంపుతో ప్రకృతిపై పాలకుల ఆధిపత్యం పెరగడంతో అనేక వైపరీత్యాలు అనివార్యమవుతున్నాయి. ప్రకృతి విధ్వంసం నిరాటంకంగా సాగిపోవడంతో అధిక ఉష్ణోగ్రతలు, తుపానులు, వరదల సమయంలో జనం విలవిలలాడుతున్నారు. ప్రపంచ బ్యాంకు అయిదేళ్ల క్రితం ప్రకటించిన గణాంకాల ప్రకారం- భారత్‌లో పర్యావరణ హాని వల్ల, తద్వారా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం ఎనిమిది వేల కోట్ల డాలర్లట! వాయు కాలుష్యం వల్ల భారత్‌లో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ అంచనాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం విషమించిన పనె్నండు నగరాల్లో పదకొండు మన దేశంలోనే ఉండడం గమనార్హం.
జన చైతన్యం తక్కువే..
కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం పర్యావరణ చట్టాలను ప్రభుత్వాలు సజావుగా అమలు చేయడం లేదు. ఈ విషయం తెలిసినా- నిలదీసే చైతన్యం ప్రజల్లో కొరవడింది. భూతాపాన్ని నివారించేందుకు 2015లో అంతర్జాతీయ స్థాయిలో ‘పారిస్ ఒప్పందం’ కుదిరింది. దాని ప్రభావం కొన్నాళ్లు మాత్రమే కనిపించింది. ఆ తర్వాత భారత్ సహా అనేక దేశాల్లో కర్బన ఉద్గారాల తీవ్రత పెరిగింది. అమెరికా (2.5 శాతం), చైనా (4.7 శాతం) కంటే ఈ తీవ్రత భారత్‌లో 6.3 శాతంగా పెరిగింది. కాలుష్య నివారణకు, కర్బన ఉద్గారాల నియంత్రణకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి భారత్‌లో ఇంకా జన చైతన్యం చోటుచేసుకోలేదు. దీంతో పాలకులను నిలదీసే పరిస్థితులు కనిపించడం లేదు.
పుడమితల్లికి కష్టం..

వాతావరణంలో వేడిమి పెరగడంతో పంటపొలాలు సాగు యోగ్యం కాకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. పర్యావరణ విధ్వంసకర విధానాలతో భూమి నానాటికీ నిస్సారమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఐక్యరాజ్య సమితి జరిపిన అధ్యయనం మేరకు భూముల విస్తీర్ణంలో ఇప్పటికే 75 శాతం నిస్సారమైపోయిందని తేలింది. పర్యావరణ పరిరక్షణ దిశగా తగిన చర్యలు తీసుకోని పక్షంలో ‘ఎడారీకరణ’ తీవ్ర రూపం దాల్చి, 2050 నాటికి దాదాపు 90 శాతం భూమి నాశనమైపోతుందని ఆ అధ్యయనం చెబుతోంది.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ‘ఎడారీకరణ’ వల్ల జరిగే నష్టం 23 ట్రిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. జీవ వైవిధ్యం దిగజారడం, భూమిలో కర్బన శాతం తగ్గడం, నీటి లభ్యత క్షీణించడం, ప్రకృతికి హాని కలిగించే వ్యవసాయ విధానాలను చేపట్టడం వల్ల భూములు నిస్సారమవుతున్నాయి. వాతావరణంలో విపరిణామాల వల్ల ఇప్పటికే అనేక దేశాల్లో భూమిలోపల సూక్ష్మజీవులు, వానపాములు వంటివి అంతరించిపోతున్నాయి. పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోకచిలుకలు సైతం కానరావడం లేదు. ప్రకృతికి ఇదే తీరున నష్టం జరిగితే సూక్ష్మజీవులకు, జలచరాలకు, వన్యప్రాణులకే కాదు.. మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సమతూకం సక్రమంగా ఉన్నపుడే జీవ వైవిధ్యం సాధ్యం. శీతోష్ణస్థితిలో మార్పులతో భూములు నిస్సారమైతే పంటల ఉత్పత్తులు తగ్గడం, ఆహార సమస్య ఏర్పడడం కూడా మనం చవిచూడాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే పర్యావరణ పరిరక్షణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మొక్కల పెంపకం, అడవుల పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలు చేపడితే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

-పి.ఎస్.ఆర్.