ఈ వారం స్పెషల్

శివేన సహమోదతే॥

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మాసంలోనూ, అమావాస్య ముందటి రోజు చతుర్దశిని మాస శివరాత్రి అని పేర్కొంటారు. అనగా సంవత్సరంలో పనె్నండు శివరాత్రులు వస్తాయి. అయితే, మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని, రాత్రి అంతా ఉండే చతుర్దశి తిథి గల రాత్రిని, మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివ’ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం - చీకటి. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి - శివరాత్రి.
చతుర్దశి నాడు మనస్సుకు చెందిన 16 కళలలో 15 లయమై ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ ఒక్క కళను లయము గావించే నిమిత్తమై శివచింతన, శివనామ సంకీర్తనలతో గడిపి, మంగళకరముగా మార్చుకొనటానికి మార్గాన్ని చూపేది - శివరాత్రి.
శివరాత్రి అంటే ఏమిటి?
శివరాత్రి ఒక గొప్ప పర్వదినం. రాత్రి అయినా నిద్రపోకుండా జాగరణ చేస్తాము. కనుక ఇది పగలే. పగటి పూట, రాత్రిలాగా ఉపవాసం చేస్తాము, కనుక రాత్రి. రాత్రి అజ్ఞానమునకు సంకేతమైనా, మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? ఉపవాసము, జాగరణ, మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు, బిల్వార్చన, నామస్మరణలతో అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది, మహాశివరాత్రి పర్వదినాన. అందుకే, శివరాత్రి మంగళప్రదమయింది.
‘శివ ఏవ కేవలః’ సృష్టికి పూర్వం నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి, వేద మంత్రములు. సృష్టి, స్థితి లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపములలో, ఒకానొక ప్రత్యేకత విశిష్ఠత ఉంది. పరమశివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం.
శివ శబ్దార్థం
‘శం’ అంటే నిత్య సుఖం, ఆనందం, ‘ఇ’ కారము పరమ పురుషుడు, ‘వ’ కారం అమృత స్వరూపిణి యగు ‘శక్తి’. ఈ మూడింటి సమ్మేళనమే ‘శివ’ అవుతుంది. అనగా, ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థము.
సకల విధ కర్మలను తన వశంలో ఉంచుకొనేవాడు ‘వశి’ అని పిలువబడుతాడు. ‘వశి’యే ‘శివ’ అయింది. అనగా జితేంద్రియత్వం. కనుక ‘శివ’ అంటే జితేంద్రియుడని అర్థము. జితేంద్రియుడైన శివుణ్ణి ఆరాధిస్తే, అభిషేకిస్తే, ఉపాసిస్తే మనం కూడా జితేంద్రియుల మవుతాం. ఇంద్రియాల్ని జయించే శక్తిమంతుల మవుతాం అని పేర్కొన్నది శివపురాణం.
‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసే వాడు శివుడు. ‘శేతే సజ్జన మనస్సు ఇతి శివః’ సజ్జనుల మనస్సులో శయనించి ఉండేవాడు - శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమనగా వేదము. ‘ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః’ అని ఈ విశ్వానికి శాంతి మార్గాన్ని చూపి, ప్రపంచాన్ని శాంతింపజేయు, చేయగల వేదము శివమవుతుంది. దీని యోగము గలవాడు శివుడు. ‘శివప్రదత్వాత్ శివః’ మంగళములను శుభములను ఇచ్చేవాడు శివుడు.
చతుర్దశి నాడే ఎందుకు చేయాలి?
మహా శివరాత్రి మాఘ మాసంలోనే ఎందుకు చేయాలి? చతుర్దశి నాడే ఎందుకు ఆచరించాలి? మఖా నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం గల మాసం - మాఘ మాసం. మానవుని అఘములను అనగా పాపములను హరించే మాసం, మాఘమాసం. త్రిమూర్త్యాత్మకుడైన సూర్య భగవానుని జయంతి మాఘమాసంలోనే వస్తుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు మొదటిసారిగా భూమి మీదతన కిరణములను ప్రసరింప చేశాడని పురాణాలు చెప్తున్నాయి. చతుర్దశి, అమావాస్యలలో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు. ‘చంద్రమామనసో జాతః’ చంద్రుడు మనస్సుకు కారకుడు, అధిదేవత. చంద్రకళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే మనసుకు చేరిన పదహారు మాలిన్యములలో (అష్టమదములు -8, అరిషడ్వర్గములు -6, మనస్సు -1, అహంకారం -1) ఒక్కటే మిగిలి ఉంటుంది. ఆ శేషించి ఉన్న ఒక్క మాలిన్యాన్ని దూరం చేసికోవటానికి మాఘకృష్ణ చతుర్దశి శ్రేష్ఠమైన తిథిగాను, ఆ రాత్రి జ్ఞాన వెలుగునిచ్చే మహా శివరాత్రిగాను చెప్పబడింది.
ఉపవాసము: ‘ఉప’ అనగా సమీపము. వాసము అంటే ఉండటము. ఈశ్వరునికి సమీపముగా ఉండటమే ఉపవాసమంటే. అనగా ఆ రోజంతా దైవచింతనలో ఉండటం.
అభిషేకములు, బిల్వార్చన: ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. కనుక నమక చమకములతో మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, వివిధ రకములైన అభిషేక ద్రవ్యములతోనూ, పంచామృతములతోనూ ఆచరిస్తారు. ‘త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం’ అంటూ బిల్వార్చన చేస్తారు. మానవులను ప్రభావితం చేసే సత్వ రజో తమో గుణములకు, త్రికాలములకు, తాపత్రయములకు మూడు దళములతో కూడిన బిల్వపత్రము బిల్వదళము - శ్రీ మహాలక్ష్మీ కటాక్షం. పుష్పించకుండా ఫలించే వృక్షం - మారేడు వృక్షం. ఈ శరీరమే ‘బిల్వదళము’ త్రిగుణముల ఏకత్వాన్ని సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఏకత్వాన్ని తెలియపరచేదే ఈ బిల్వదళం. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు మనస్సు వెరసి పదకొండు తత్వాలు, మానవుని విషయ వాసనల్లోకి దింపి బంధములకు కారణభూతులౌతాయి. వాటిని మన అధీనంలో ఉంచుకోవటానికి ఏకాదశ రుద్రాభిషేకం.
జాగరణ: అంటే నిద్రను జయించటం. ఏ విధంగా జయించాలి? నిరంతన భగవత్ చింతన, నామ సంకీర్తనములతో రాత్రి అంతా సత్కాలక్షేపము, సద్గోష్ఠితో గడుపుటయే జాగరణ. లక్ష్మణుడు అరణ్యవాస దీక్షను జాగరణతోనే గడిపాడు. పరబ్రహ్మ స్వరూపుడు, నాద సుధారస స్వరూపుడు అయిన ధర్మమూర్తి శ్రీరామచంద్రుని, చేతనా చేతన జీవరాశికి ప్రతీక అయిన లోకపావని సీతామాతను సేవిస్తూ గడిపి తరించాడు.
భన్మధారణం ఏం చెపుతుంది?
మనిషి భూమి మీదకు వస్తూ తెచ్చిందేమీ లేదు. పోయేటప్పుడు తీసికొని పోయేదేమీ లేదు. పుట్టుక మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది ‘్భస్మంగానే’. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము’ అన్నాడు గదా అన్నమయ్య. స్వార్థ రహితంగా, త్యాగబుద్ధితో నలుగురికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తూ, బతికినంత కాలం మంచిగా జీవించి ఆదర్శంగా ఉండమని చెప్తోంది.
శ్మశాన వాసిత్వం ఎందుకు?
ఎంతటి వారైనా ఏదో ఒక రోజు శ్మశానానికి చేరవలసిందే. తనతో వచ్చిన వారందరూ వెళ్లగా దుఃఖిస్తుంది సూక్ష్మప్రాణి. ఒంటరి అయిన నీకు ఈ శ్మశానంలో నేనున్నానని అభయాన్నివ్వడానికే శ్మశాన వాసిగా ఉంటాడు పరమశివుడు. ఒక వ్యక్తి తన సమాధి మీద యిలా వ్రాయమని చెప్పాడట. ‘మీలాగా నేనుండేవాణ్ణి నాలాగే మీరౌతారు’ తన ఉనికి అశాశ్వతమని గుర్తుంచుకొని, అహంకారాన్ని రూపుమాపుకొని, వినయాన్ని విస్మరించక, వివేకంతో పరిమిత జీవితాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసికోవాలని హెచ్చరిస్తున్నాడు శ్మశానవాసియైన పరమశివుడు.
భూచరీ ముద్రలో ఉండటం..
నేత్ర దృష్టి నాసికాగ్రంపై కేంద్రీకృతమై ఉంటుంది. సిద్ధయోగ సమాధి. ఆజ్ఞా చక్రంలో శివుడితో శక్తి ఐక్యమవుతుంది, ఆజ్ఞాచక్రమే శివనివాసం. తదుపరి, చంద్ర మండలమైన సహస్రారం, ఆపైన తురీయం. ఆజ్ఞా చక్రం యోగ శాస్త్రాలకు కేంద్ర బిందువు. నేత్రద్వయం దగ్గర ప్రారంభమై రెండున్నర అంగుళాలు ఎగువ భాగానికి వ్యాపించి ఉంటుంది అందుకే అడ్డంగా భస్మం ధరిస్తారు.
శివతాండవం
హిమాలయం ఒక ఉన్నతమైన పర్వతరాజం. అందులో ఉన్నతోన్నతమై, అతి పవిత్రమైనది కైలాస శిఖరం. ఆ మహాశిఖర మందు మనోహరమైన మానస సరోవరం. కైలాస శిఖరం మీద శివతాండవం బ్రహ్మాది దేవతలు శివతాండవ దర్శనానికి విచ్చేశారు. శివతాండవానికి మానస సరోవరం స్పందిస్తుంది, దానిలోనే శివతాండవ నాట్య ప్రతిఫలనం. అది ఆనందమయం. అందుకే అది ఆనంద శివతాండవం. సరోవర మధుర స్పందనల సమాహారం గంగా ప్రవాహం. అప్పుడే, అనంత విశ్వంలోని నిరంతర చైతన్య స్వరూపమే మహాశివుడని, శివతాండవం దర్శింపజేస్తుంది. చీమ నుంచి బ్రహ్మ వరకు - సర్వమూ సర్వేశ్వరుని లీలా విలాసమే. ఆనంద శివతాండవంలో స్వామి, నటరాజ స్వామిగా దర్శనమిస్తాడు. ఇది ప్రదోషకాల పూజ. దోషము అంటే రాత్రి. రాత్రికి ముందు సమయము - ప్రదోష కాలం. ప్రదోష కాలపూజ శివునికి ప్రీతికరం.
నంది వాహనం ఎందుకు?
పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు? పరమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో, జీవ తత్త్వానికి నంది చిహ్నము. పశుత్వముతో కూడిన జీవ తత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పక, ఈశ్వరుని వైపు త్రిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందింది, నంది. నందికి ఈశ్వరునికి మధ్యలో, ఎవరూ అడ్డు తగలకూడదు. నంది ధర్మానికి ప్రతీక. నంది శృంగముల మధ్య నుండి ఈవ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు. పశుత్వము నుండి ధర్మాన్ని ఆచరిస్తూ దైవత్వాన్ని చింతించటం ద్వారా, నంది ఈశ్వరునిగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు. పశుతత్త్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరుని వైపు మరల్చి ధర్మ మార్గంలో నడవటం చేతనే నంది, నందీశ్వరుడుగా మారిపోయాడు.
లింగరూప విశిష్టత
నశించే దానికి సాక్షి శివమే. మన శరీరాన్ని దీని చుట్టూ పరచుకొని ఉన్న ఈ ప్రపంచాన్ని నిత్యమూ గమనిస్తున్నది మన ‘జ్ఞానం’ దీనికి ‘చిత్’ అని పేరు, వేదాంత పరిభాషలో. తానుండే గదా దేనినైనా గమనించవలసింది. ఈ ఉండటానికే ‘సత్’ అని పేరు. పరిపూర్ణమైన సత్ చిత్‌ల సమాహారమే - శివస్వరూపం. అవి నామ రూపాలన్నింటి నిలయం చేసికొని నిరాకారంగానే శేషించిన భావాలు గనుక - లింగ రూపం. రూపం గాని రూపమిది. శివత్త్వానికి ఆది మధ్యాంతాలు లేవని చెప్పడానికే దాన్ని లింగ రూపంగా భావన చేశారు. ఇది నిరాకార నిర్గుణ నిరంజన తత్వం ‘లీనం గమయతీతి లింగం’.
అర్ధనారీశ్వర తత్త్వం
అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉన్నది. దీని అర్థమేమిటి? చిద్రూపం శివతత్త్వమైతే, సద్రూపం శక్తితత్త్వం. సత్‌చిత్‌ల ‘వినాభూతమైనవ’ని చూపటమే అది దానికి రూపకల్పనమే ఆయన అర్ధనారీశ్వర తత్త్వం. కాళిదాస మహాకవి ‘వాగర్ధా వివసంపృక్తౌ..’ వాక్కు అర్థం మాదిరిగా, సూర్యుడు సూర్యకాంతి మాదిరిగా శివపార్వతులు కలిసే ఉంటారని చెప్పారు గదా. ఇదే శివశక్తి సామరస్యం. ఏకేశ్వరోపాసన. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నది లలితా సహస్ర నామం. ‘శివ’ అంటే మహాశివుడు, ‘శివా’ అంటే పార్వతీమాత.
శివరాత్రి మాహాత్మ్యం
మహాశివరాత్రి పర్వదినంలో, మృగములను వేటాడే నిమిత్తం ఒక వేటగాడు చెట్టుపైకెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి పెట్టాడు. ఎంత రాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. ఈ జాగరణలో చెట్టు ఆకులను త్రుంచి క్రింద వేయసాగాడు. అతను ఎక్కి కూర్చున్నది ఒక బిల్వ వృక్షము. అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున శివునికి బిల్వార్చన చేశాడు. తెల్లవారింది. ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది, ఉపవాసం చేసింది. దీని ఫలితంగా భార్యాభర్తలిద్దరూ శివసాన్నిధ్యాన్నందుకున్నారనే గాథ, శివరాత్రి మహాత్మ్యానికి స్ఫూర్తినిచ్చింది.
లింగోద్భవం.. కల్యాణం
శ్రీరాముడు జన్మించిన రోజునే కల్యాణం చేస్తాం. ఇది ఆగమ శాస్తర్రీత్యా జరుపుతారు. అలాగే లింగోద్భవ కాలంలో శివ పార్వతుల కల్యాణం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ అభిషేకాదులు నిర్వహిస్తారు.
శివలీలా వైభవం
మానవ శరీరంలో ఉండే అవయవాలు వాటి పని అవి చేస్తాయి. దేని లక్షణం దానిదే. అనగా కళ్లు చూస్తాయి. చెవులు వింటాయి. కాని, స్వతంత్రంగా అని తమ పని చేయలేవు. ఈ దేహంలో ఉన్నంత వరకే అవి పని చేస్తాయి. మన భౌతిక రూపం కూడా అంతే. అది వివిధ అంగముల కలయికతో ఏర్పడుతుంది. మరణానంతరం నశించిపోతుంది. అప్పుడది కనిపించదు. దీన్ని ‘రూపము’ అన్నారు. ‘స్వ’ అనగా ‘తన’ అంటే రూపమునకు ‘స్వ’ ముందు చేరిస్తే ‘స్వరూపము’ అయింది. అంటే తన నిజస్వరూపము. అనగా తన అసలు రూపము. గమనించవలసిన విషయమేమిటంటే, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు మనకు ఏదైతే కనిపిస్తోందో, అది స్వతంత్రమైనది కాదు. దానికి శక్తిని అందిస్తున్నది మరొకటేదో ఉన్నది. ఆ మరొకటేదో అనేదే దేహము యొక్క నిజ రూపము. అదే స్వరూపం. అదే నిరాకార నిరంజన రూపం, పరబ్రహ్మ స్వరూపం, అదే పరమశివ స్వరూపం, ఇదే శివలీలా వైభవం.
నాద స్వరూపుడు - మహాశివుడు
సాకార, నిరాకార రూపాల్లో పరమశివుణ్ణి ఆరాధిస్తాం, ఉపాసిస్తారు. సాకారంలో శివ విగ్రహం. ఆయన అష్టమూర్తి. అయిదు పంచభూతములు, అనగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము, సూర్యచంద్రులు, జీవుడు మొత్తం ఎనిమిది. పరమ శివుడు సపత ప్రకృతి శరీరుడై నాద తనువుగా భాసిల్లుతాడని వివరించబడింది. పరమ శివుని సద్యోజాత, ఈశాన, అఘోర, వామదేవ, తత్పురుష అనే పంచ వక్త్రములు అనగా ముఖముల నుండి సరిగమాది సప్త స్వరములు ఆవిర్భవించినాయి. అంతశ్శరీర చిదాకాశమందు ప్రాణానల సంయోగంతో ‘నాదం’ ఏర్పడుతుంది. అది అకారాది అక్షర స్వరూపంగా రూపొందిం. అది సర్వదేవతా మంత్రచ్ఛందో మూలమైన ప్రణవ నాదంగా రూపొందింది. ప్రణవ నాదమే వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. సరిగమపదని -సప్తస్వరములు ప్రణవ నాదం నుండి ఆవిర్భవించాయి. నాదం - అమృతమయం. నాదస్వరూపుడు పరమశివుడు. ‘యోవేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం. ఓంకారం - కాలస్వరూపం. కాల స్వరూపుడు - పరమశివుడు. ‘నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’ అన్న చిత్తరంజని రాగకీర్తనలోను, ‘శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా జగన్మోహిని రాగ కీర్తనలోను, శివతత్త్వాన్ని శివలీలా వైభవాన్ని అత్యంత గంభీరంగా కూలంకషంగా అందించారు - బ్రహ్మవిద్యా సార్వభౌముడు సద్గురు నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి. ఈ రెండు కీర్తనలను, సంగీతం రాకపోయినా, వచనంగా చదువుకున్నా చాలు, మహాశివరాత్రి పుణ్య ఫలం మనకు లభిస్తుంది.
పరమశివుడు - పంచభూతములు
శివుని భస్మానులేపనం పృథ్వికి, గంగాజటాజూటం జలానికి, ఫాలనేత్రం అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం - ఆకాశానికి సంకేతమైతే, చంద్రశేఖరత్వం - మనస్సుకి, వృషభ వాహనం- బుద్ధికి, ధర్మానికి సంకేతం. సత్వ రజ తమో గుణాల గురించి చెప్తుంది ఆయన చేతిలోని త్రిశూలం.
* * *
నాలుగు పురుషార్థాలలో, అర్థకామాల్ని ధర్మంతో అనుభవించాలని, అప్పుడు మనిషి, పశుత్వం నుంచి విముక్తుడై, పశుపతి తత్త్వాన్ని అందుకోగలడని, పాశుపతమైన ఈ దీక్ష ఉంటే, పశుపతి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని, తనలో ఉండే పశు రాక్షస గుణాల్ని అణచుకొని మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, మొలకెత్తుతున్న అంతర్లీన దైవ తత్త్వాన్ని ప్రజ్వలింప చేసుకుంటూ సర్వజనుల శ్రేయస్సుకి ఉపకరించే, కార్యములను స్వార్థ రహితంగా చేస్తూ, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని, అదే శివతత్త్వమని, శివారాధన ఆంతర్యమని, మహాశివరాత్రి బోధిస్తోంది. *

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464