ఈ వారం స్పెషల్

ఉగ్రమూకలపై ఉక్కు పిడికిలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి భారత్-పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అదను చూసి పాక్ సేనలు మన భూభాగాలపై వికృత చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి, తరచూ యుద్ధాలకు కాలు దువ్వుతూనే ఉన్నాయ. చావు దెబ్బలు తప్పక పోతూ ఉండడంతో ప్రత్యక్ష పోరుకు స్వస్తి పలికి, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ప్రచ్ఛన్న యుద్ధానికి పాక్ పాలకులు దిగుతూనే ఉన్నారు. యుద్ధాలలో భారత్ ఘన విజయాలు సాధిస్తున్నా ఒక విధంగా భారత్ ఆత్మరక్షణలోనే ఉంటూ వచ్చింది. ప్రపంచ దేశాలు సైతం మన రెండు దేశాల మధ్య విడిపోయి, ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకొంటూ వచ్చాయి. ఇటువంటి పరిస్థితులు ఒక విధంగా పాకిస్తాన్ జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాలకు అదునుగా మారుతున్నాయి.
అయతే, కొన్ని సంఘటనలు చరిత్ర గతినే మారుస్తాయి. అటువంటి సంఘటనలే గత నెల పుల్వామా, బాలాకోట్‌లలో జరిగాయి. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామా వద్ద 19 ఏళ్ళ యువకుడు అదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో ఒక కారులో వచ్చి, సెంట్రల్ రిజర్వు పోలీస్ దళం (సీఆర్‌పీఎఫ్) వాహన శ్రేణిలో ప్రవేశించి.. మానవ బాంబుగా మారాడు. ఆ భారీ పేలుడులో 49 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. మానవ బాంబు రూపంలో అదిల్ అహ్మద్ అత్యంత విషాదకర పరిస్థితిని సృష్టించాడు. ఈ దారుణ ఉగ్రదాడిని తాము ఏ విధంగా జరిపామో అంటూ తమ ఘనకార్యాన్ని వివరిస్తూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మొహమ్మద్ (జైష్) వెంటనే ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ తన దాడి గురించి వివరిస్తూ.. ‘ముస్లింలు మేల్కొని ఈ బానిసత్వపు సంకెళ్లను తెంచుకోవాలి’ అంటూ కశ్మీర్‌లోయలోని ప్రజలకు పిలుపు ఇచ్చాడు. పైగా తమపై హిందువులు భయానక పరిస్థితులు కలిగిస్తున్న దారుణమైన కథనాలను దృష్టిలో ఉంచుకొమ్మని సూచించాడు. గోమూత్రం తాగే వారికి తమ ‘జిహాదీ’ దాడులను ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశాడు. హిందువులను ఉద్దేశించి ‘గోమూత్రం తాగేవార’ని అంటూ ఇస్లాం మతోన్మాదులు తరచూ పద ప్రయోగం చేస్తుంటారు. ఈ సందర్భంగా భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన పలు దాడులను కూడా అదిల్ అహ్మద్ ప్రస్తావించాడు. ఈసీ 814 విమానం హైజాక్, భారత పార్లమెంట్ పై దాడి, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడులతో పాటు భారత అధికారులను చంపే లక్ష్యంగా ఈ మధ్య జరిగిన పలు దాడులను కూడా ఆ యువకుడు ఉదహరించాడు. పైగా, ముస్లింలు ఆదమరిస్తే- నిద్రపోతున్న ‘హిందూ పులులు’ మేల్కొంటాయని హెచ్చరించాడు. అల్లకల్లోలం సృష్టించడం ద్వారా వారిని ‘ఇస్లాం’ ముందు తలవంచేటట్లు చేయాలని కూడా హితబోధ చేశాడు. ఇవన్నీ అతని మాటలుగా మనం భావించలేము. భారత్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని, బాహ్యశక్తుల ఎత్తుగడలు ఉన్నాయని, మనం కొద్దిమంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని స్పష్టం అవుతుంది. పుల్వామా దాడి జరగగానే పాకిస్తాన్ కేంద్రంగా గల ఉగ్రవాద సంస్థలన్నీ సంబరాలు చేసుకున్నట్లు టీవీ చానళ్లలో అనేక కథనాలు వెలువడ్డాయి కూడా.
వాస్తవానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇటీవల ఏనాడు ఎరుగని రీతిలో అత్యధిక సంఖ్యలో సుమారు 500 మంది ఉగ్రవాదులను కశ్మీర్‌లోయలో మట్టుపెట్టడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యకు దాదాపు సమానం. అయితే పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి గానీ అదుపులోకి రావడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో చెప్పుకోదగిన మార్పు రావాలి అంటే రాజకీయ నిర్ణయం అవసరం అని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ నుండి జమ్మూ కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారుల వరకూ ఎందరో ప్రముఖులు పలు సందర్భాలలో స్పష్టం చేశారు. బలమైన రాజకీయ ప్రక్రియ లేకుండా కేవలం సైనికులు పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం ఎంత మాత్రం సాధ్యం కాదు. రాజకీయ ప్రక్రియ అంటే కేవలం ఇరుదేశాల మధ్య చర్చలు జరపడం కాదు. కఠినమైన నిర్ణయాలను మన రాజకీయ నాయకత్వం తీసుకోవడం. బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం వంటి నిర్ణయాలు మరిన్ని అవసరం.
అత్యంత కీలకం కశ్మీర్...
పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా- పాక్‌కు కశ్మీర్ ‘గుండె’ వంటిదని చెప్పాడంటే వ్యూహాత్మకంగా గిల్గిట్-బాల్తిస్తాన్ ప్రాంతానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అని గమనించాలి. అపారమైన వనరులు కూడా ఉన్న ఈ ప్రాంతంపై పరోక్షంగా ఆధిపత్యం సాధించడం కోసం మొదట బ్రిటన్, తర్వాత అమెరికా, ఇప్పుడు చైనా ఈ విషయంలో పాక్ ఆశలకు అండగా ఉంటూ, ఈ ప్రాంతంలో భారత్‌ను బలహీన పరచడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. కశ్మీర్‌లో స్థావరం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొత్తం ఆసియా దేశాలపై ఆధిపత్యం వహించవచ్చని వీరంతా ఎత్తుగడలు వేశారు.
ఆక్రమిత కశ్మీర్ గాని, గిల్గిట్-బాల్తిస్తాన్ గాని చారిత్రాత్మకంగా కశ్మీర్ లోయలో భాగం కావు. లడక్ లో భాగం. అందుకనే కశ్మీర్ లోయలో సుదీర్ఘకాలం రాజకీయ ఆధిపత్యం వహించిన ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు ఆయా ప్రాంతాలపై భారత్‌కు ఎటువంటి ప్రవేశం లేకుండా చేయడంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయ. వివిధ కారణాలపై ఆయా ప్రాంతాలపై భారత్‌కు, ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న న్యాయపరమైన, చారిత్రిక పరమైన అధికారాల సాధికారికం కోసం మన పాలకులు గత 70 ఏళలుగా అంతర్జాతీయంగా చెప్పుకోదగిన కృషి చేయనే లేదు.
తొలి నుండి పాకిస్తాన్‌తో శాంతియుత సహజీవనం కోరుకొంటున్న దృష్ట్యా ప్రతి భారత దేశ ప్రధాన మంత్రి చర్చల ద్వారా సంబంధాలు మెరుగు పరచుకోవాలనే ప్రయత్నాల పట్ల ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చారు. అయితే ఇందుకు ప్రతిగా పాక్ నుండి మనం ఎన్నో అవమానాలనే ఎదుర్కొంటూ వస్తున్నాము. లాహోర్‌కు నాటి భారత ప్రధాని వాజపేయి బస్సులో వెళ్లిన తర్వాత కార్గిల్ యుద్ధం జరగడం, కర్తపూర్‌కు ఉమ్మడిగా రహదారి నిర్మాణం చేపట్టిన తర్వాత పుల్వామా దాడి జరగడం గమనార్హం.
న్యాయపరంగా, చారిత్రక పరంగా కశ్మీర్ ప్రాంతంపై భారత్‌కు గల హక్కులలో ఎటువంటి ఢోకా లేదు. నిజానికి పాకిస్తాన్‌కు ఈ ప్రాంతంలో వేలు పెట్టే అధికారమే లేదు. కశ్మీర్ మహారాజు తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేస్తూ సంతకం చేయడం, ఈ అంశం పరిశీలించాలంటే ముందుగా ఆక్రమిత కశ్మీర్ నుండి పాకిస్తాన్ వైదొలగాలనే షరతును ఐక్యరాజ్యసమితి విధించడం - భారత్‌కు తిరుగులేని చట్టబద్ధతను వెల్లడి చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రాంతానికి మనం కల్పిస్తున్న ప్రజాస్వామిక హక్కులను యావత్ ప్రపంచం కొనియాడుతోంది.
ఆక్రమిత కశ్మీర్‌లో ఎటువంటి ప్రజాస్వామ్య పాలన లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేవు. సైనిక పాలనే కొనసాగుతున్నది. కానీ మన కశ్మీర్ లోయలో వరుసగా ఎన్నికలు జరగడం, ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటూ ఉండటం, కేంద్రంలోని అధికార పక్షంతో విభేదించే పార్టీలు కూడా అధికారంలోకి వస్తుండటం జరుగుతూ వస్తున్నది. పాక్ ప్రోత్సాహంతో ఇక్కడ వికృతరూపం దాలుస్తున్న ఉగ్రవాదం, హింసాయుత దాడులు ఆ ప్రాంత ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి.
మెరుపుదాడితో పాక్‌కు షాక్..
సరిహద్దు దాటి ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో నెలకొన్న జైషే ఉగ్రవాద స్థావరంపై భారత్ వాయుసేన గతనెల 26వ తేదీన తెల్లవారు జామున దాడులు జరిపి, ధ్వంసం చేయడం ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులలో అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది. మొదటిసారిగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా నిలబడవలసి వచ్చింది. ఇటువంటి సమయాలలో ఆ దేశానికి అండగా ఉంటూ వస్తున్న చైనా, సౌదీ అరేబియాలు కూడా కనీసం సానుభూతి వ్యాఖ్యలు పలుకక పోవడం, భారత్‌కు మద్దతు తెలపడం దాయాది దేశాన్ని షాక్‌కు గురిచేసింది. పాకిస్తాన్ నిస్సహాయతను కూడా ప్రపంచానికి ఈ మెరుపు దాడి వెల్లడి చేసింది.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, చకోటిలలోనే కాకుండా ఆ దేశం లోపలకు వెళ్లి బాలాకోట్ వద్ద గల ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత వాయుసేన దాడులు జరిపింది. క్షణాలలో క్షేమంగా మన సేనలు వెనుకకు తిరిగి వచ్చాయి. గతంలో సరిహద్దు దాటి దాడులు జరపరాదనే విధానానికి కట్టుబడి ఉన్న భారత్ ఇక తాము అటువంటి పరిమితులకు, కట్టుబాట్లకు కట్టుబడి ఉండబోమని, అవసరమైతే ఎంతటి తీవ్ర చర్యలకైనా సిద్ధం అనే సందేశాన్ని ఇచ్చింది. ఇక ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ భూభాగాలలోకి కూడా చొచ్చుకుపోవడానికి సిద్ధం అనే సంకేతం స్పష్టంగా ఇచ్చాం. అంతేకాదు, ఇప్పటి వరకు పాక్ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని, ఆ దేశంపై దాడికి పాల్పడితే ఉపఖండం అణ్వాయుధాలతో రణరంగంగా మారుతుందని ప్రపంచం అంతా భయపడుతూ వచ్చింది. అయితే, శత్రుదేశం తేరుకొనే లోగా ఆ దేశంలోని స్థావరాలను మటుమాయం చేయగల సత్తా తమకు ఉన్నదని భారత్ నిరూపించింది. అత్యాధునికమైన ఎఫ్-16 యుద్ధ విమానాలను సాంకేతికంగా నాలుగు దశాబ్దాల వెనుక ఉన్న మిగ్-21తో మన కెప్టెన్ అభినందన్ కూల్చివేయడం గమనిస్తే ఆధునిక ఆయుధాలు పాక్‌ను ఏ మాత్రం కాపాడలేవనే సందేశం కూడా ఇచ్చిన్నట్లు అయింది. ఈ సారి వాయుసేనను ఉపయోగించడం ద్వారా మన మెరుపు దాడులను భూమిపైనే పరిమితం కావని, ఎటువంటి పద్ధతులనైనా అనుసరించడానికి సిద్ధమని స్పష్టం చేశాం.
అసాధారణమైన దౌత్యనీతి..
గతంలో ఊరి ఉగ్రదాడి అనంతరం జరిపిన మెరుపు దాడుల గురించి సైనిక అధికారులు మీడియాకు వివరించగా, ఈ పర్యాయం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఆ సమాచారం వివరించడం గమనిస్తే ఈ దాడిని దౌత్యపరమైన అంశంగా ప్రయోగించామని వెల్లడవుతోంది. ఈ సందర్భంగా గోఖలే ‘సైనికేతర, ముందస్తు జాగ్రత్త చర్య’ అంటూ రెండు దౌత్యపరమైన పదాలను వాడారు. అంటే తమ ఉద్దేశం పాకిస్తాన్ పై సమరానికి వెళ్లడం కాదని, ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడమే అని చెప్పడంతో ప్రపంచ దేశాలు మారు మాట్లాడలేక పోయాయి.
అటు పాకిస్తాన్ కూడా మనం జరిపిన దాడి తీవ్రతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేయవలసి వచ్చింది. అదే సమయంలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా కాకుండా, ‘ముందస్తు జాగ్రత్త కోసం దాడి చేశామ’ని చెప్పడం ద్వారా పాక్‌కు, అంతర్జాతీయ సమాజానికి ద్వంద్వార్థం తెలిపే సంకేతం ఇచ్చినట్లు అయింది. ఇకపై ఉగ్రదాడులు జరిగితే ఆత్మరక్షణకు పాల్పడటం, ప్రతీకార దాడులు దిగడం కాకుండా, ముందుగానే దాడులను పసిగట్టి ప్రతిఘటన ఇస్తామని సంకేతం ఇచ్చాం. పుల్వామా దాడులకు సాక్ష్యాలు చూపితే, విచారణ జరిపిస్తామని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పగానే, వారి దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి కాగితాలపై కాకూండా భూమిపై సాక్ష్యాలను చూపాము.
మరోవిధంగా చూడాలంటే మెరుపు దాడుల ద్వారా ప్రపంచానికే మనం ఒక హెచ్చరిక చేశాం. భారత్ కేవలం క్లిష్ట పరిస్థితులలో ఏ దేశమైనా చేయవలసిన విధంగా ఆత్మరక్షణ చర్యలకు మాత్రమే పాల్పడుతున్నది. ఆసియా ప్రాంతంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదానికి దన్నుగా నిలచిన పాకిస్తాన్ వంటి ‘వంచక దేశా’న్ని జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు అండగా ఉండకుండా కట్టడి చేయవలసిందే అని స్పష్టం చేసాం. అయితే ఈ దాడులతో దాయాది దేశం తగిన గుణపాఠం గ్రహించి మారిపోతుందని అనుకోలేము. ఆ మరుసటి రోజుననే మన సైనిక స్థావరాలపై వైమానిక దాడి జరిపే ప్రయత్నం చేసి, మనం ప్రతిఘటన ఇవ్వడంతో పాకిస్తాన్ తోకముడవడాన్ని చూసాం. అప్పటి నుండి రోజుల తరబడి వాస్తవాధీన రేఖను ధిక్కరించి కాల్పులు జరుపుతూనే ఉంది. మరేమైనా జరుపవచ్చు. మనం అన్నింటికీ సిద్ధంగా ఉండవలసిందే, విపరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవలసిందే.
కర్తపూర్ కారిడార్ ఒక కుట్ర..!
పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగిన వెంటనే మొదటగా అప్రమత్తమైనది పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రమే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం పంజాబ్ సరిహద్దులపైనే అని ఆయన గ్రహించారు. స్వయంగా ఆయన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం ఆడుతున్న నాటకాన్ని పంజాబ్ అసెంబ్లీలో ఎండగట్టారు. పాకిస్థాన్ సైనికాధిపతి జావేద్ బజ్వాను ఉద్దేశించి- ‘పంజాబీ అయిన బజ్వా తెలుసుకోవాలి.. మేమూ పంజాబీయులమే (్భరత్‌లో).. మీ ముఖంపై కొట్టడానికి వస్తాం..’ అంటూ అమరీందర్ హెచ్చరించారు. పుల్వామా వద్ద జరిగిన అనాగరికమైన ఉగ్రవాద దాడిని ఖండించాలంటూ ఆయన బజ్వాకు సవాల్ చేశారు. ఈ సందర్భంగా కర్తపూర్ కారిడార్ పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న నాటకాన్ని ఆయన బహిర్గతం చేశారు. పంజాబ్‌లో ఉగ్రవాదులకు క్రియాశీల మద్దతు ఇవ్వడాన్ని పాక్ సైన్యం పునరుద్దరించినదని పేర్కొంటూ ఈ ఉగ్రవాద సవాల్ ను ఎదుర్కోవడానికి 81 వేల మంది పంజాబ్ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి అమరీందర్ స్పష్టం చేసారు. ఒక వంక సిక్కులపై, మరో వంక భారతీయ సేనకులపై దాడులు జరుపుతూ పాక్ సైన్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నదన్న విషయాన్ని గ్రహించాలని భారత జాతీయ నాయకత్వానికి ఆయన హితవు చెప్పారు.
ఒకవంక కశ్మీర్‌లో, మరోవంక పంజాబ్‌లో వేర్పాటు వాదాన్ని పాకిస్తాన్ రెచ్చగొట్టుతున్నదని పేర్కొంటూ, పావు శతాబ్దం తర్వాత ఇంకా పంజాబ్‌లో ఖలిస్థాన్ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నదని అమరీందర్ పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ వలే దేశంలోని రాజకీయ నేతలందరూ రాజకీయ విభేదాలను పూర్తిగా విస్మరించి, పాకిస్తాన్ దుష్ట పన్నాగాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోగలగాలి. ఉమ్మడి వ్యూహం ఏర్పరుచుకోవాలి. మన రాజకీయ నాయకులు భిన్నస్వరాలతో మాట్లాడటం ఆపివేయాలి. అప్పుడే పాక్‌కు తగిన గుణపాఠం చెప్పగలం.
భారత నిఘా వర్గాల సమాచారం మేరకు ఖలిస్థాన్‌వాది గోపాల్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తాయిబా వ్యవస్థాపకుడు హాఫిజ్ సరుూద్‌కు కుడిభుజం వంటివాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ, పాక్ సైన్యాధిపతులతో కలసి పనిచేస్తున్నాయనడం బహిరంగ రహస్యం. 1980వ దశకంలో దశాబ్దకాలం పాటు పంజాబ్‌లో తీవ్రవాదులకు తాను మద్దతు ఇచ్చినప్పటికీ పంజాబ్‌ను భారత్ నుండి పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం వేరు చేయలేక పోయింది. ఇప్పుడు కర్తపూర్ కారిడార్ పేరుతో రావి నదికి ఇరువైపులా ఉన్న పంజాబీయుల మధ్య రాకపోకలు ప్రోత్సహించడం ద్వారా పంజాబ్ ప్రజలకు గులాబీ పూలు చూపుతూ పంజాబ్‌లోని సిక్కు లను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం ప్రారంభించింది. కర్తపూర్ గురుద్వారాకు మార్గం ఏర్పాటు చేయడం ఈ ఎత్తుగడలో భాగమే. పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వంటి వారు ఇటువంటి కుట్రలకు పావులుగా మారవచ్చు. కానీ ఈ కుట్ర స్వరూపాన్ని మొదటగా గ్రహించిన నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రమే.
అణ్వాయుధ ప్రయోగం అసంభవం!
రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రళయం ఏర్పడుతుందని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ ఘర్షణలతో అలాంటి విపత్తు రాకూడదని చాలా దేశాలు పాక్‌ను దువ్వే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే గత వారం టెలివిజన్ ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చరిత్ర పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. పొరపాటు అంచనాలతో యుద్ధానికి దిగితే మొత్తం నాగరికత అంతరించి పోతుందంటూ, అవరసరమైతే తాము అణ్వాస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధం అన్నట్లు సంకేతం ఇచ్చారు. అయితే, భారత్ తాను మొదటగా అణ్వాయుధాలు ప్రయోగించానని స్పష్టం చేసింది. పాకిస్తాన్ మొదటగా అణ్వాయుధాలు ప్రయోగిస్తే భారత్ ప్రతిఘటన ఎంతో తీవ్రంగా ఉంటుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. మనం ఒక అణ్వాస్త్రం ప్రయోగిస్తే భారత్ ఇరవై వరకూ ప్రయోగిస్తోంది.. అప్పుడు పాకిస్తాన్ అదృశ్యం అవుతుందంటూ భవిష్యత్ వాణిని ఆయన వినిపించారు.
పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించదలిస్తే అనేక యుద్ధ పరికరాలను ముందుగా మోహరించి వలసి ఉంటుంది. ఉగ్రవాద స్థావరాలు విస్తారంగా ఉండటం, సైన్యంలోనే ఉన్నత స్థానాలలో ఉగ్రవాదులకు మద్దతు దారులు ఉండడంతో వాటిలో కొన్ని ఉగ్రవాదుల వశమైనా ఆశ్చర్యం ఉండదు. అందుకనే ఈ విషయంలో పాక్‌కు చైనా, అమెరికా వంటి దేశాలు మద్దతు ఇవ్వలేవు. పాకిస్తాన్ ఒక్క ఆయుధం ప్రయోగించి, భారత్ కు కొంతమేరకు నష్టం కలిగించ గలిగితే ఆ తర్వాత భారత్ వద్ద గల అత్యాధునిక అణ్వాయుధాలు పాక్‌ను చరిత్రలోకి నెట్టివేయడానికి ఎంతోసేపు పట్టదు.
గత 70 ఏళలుగా అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా ఏ దేశం కూడా అణ్వాయుధాలను ప్రయోగించడం లేదు. పాక్ ప్రయోగిస్తే ముందుగా తన రక్షణ కోసం దగ్గరలో ఉన్న ఇరాన్ వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఇరాన్‌తో యెమెన్‌లో ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్న సౌదీ అరేబియా ఉత్పత్తి చేపడుతుంది.
అణ్వాయుధాలు ప్రయోగిస్తే మధ్య ఆసియా నుండి భారీ పెట్టుబడుల కోసం, ఐఎం ఎఫ్ నుండి రుణాలకోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడుతుంది. సిల్క్ రోడ్ లో భారీ పెట్టుబడులు పెట్టిన చైనా సహితం పాక్ లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేయడాన్ని సహించలేదు. పైగా భారత్ పాక్‌తో యుద్ధంలో చిక్కుకుంటే భారత్ లోని చైనా పెట్టుబడులకు విఘాతం ఏర్పడుతుంది. చైనానుండి భారత్ దిగుమతులు ఆగిపోతాయి. అప్పుడు చైనా తీవ్రమైన ఆర్థిక వత్తుడులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే పాక్ అణ్వాయుధాలను బైటకు తీసే అవకాశం ఇప్పుడు లేదని చెప్పవచ్చు.
పాక్‌ను ఏకాకి చేసిన భారత్
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిగా చేయడంలో భారత్ దౌత్యనీతి విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయ వేదికలపైనా కూడా పాక్‌ను ఏకాకి చేసి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)ల నుంచి పాక్‌కు ఎలాంటి ఆర్థిక సాయం అందకుండా చేసి, తద్వారా ఆ దేశంలో ఉగ్రవాదాన్ని దెబ్బకొట్టాలన్నదే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఈ ప్రయత్నాలు కనుక ఫలిస్తే ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. అంతర్జాతీయ వత్తిడుల కారణంగానే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను బేషరతుగా విడుదల చేయవలసి రావడం గమనార్హం. గతంలో ఎన్నడూ ఆ విధంగా మన దాయాదీ దేశం చేయనే లేదు. కశ్మీర్‌పై పాక్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలంటే ఆ దేశంపై ఒక వంక ఆర్థికపరమైన ఆంక్షల్నీ తీసుకు రావడం, మరోవంక ఉగ్రవాదంపై పోరును మరింత క్రియాశీలం కావించడమే మార్గాలుగా ఇప్పుడు భారత్ గుర్తించింది. అరబ్ దేశాల ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సదస్సుకు భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. ఆమెను ఆహ్వానించడంతో ఓఐసీ వ్యవస్థాపక సభ్యదేశమైన పాక్ మండిపడింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సదస్సును బహిష్కరించారు. అయినా ముస్లిం దేశాలు ఏవీ లెక్కచేయక పోవడం గమనార్హం.
కంగారులో పాక్.. స్థిమితంగా భారత్
బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరంపై భారత్ వాయుసేన దాడులు జరుపగానే పాకిస్తాన్ తీవ్ర కలవరపాటుకు గురైది. కాగా, పుల్వామా ఉగ్రదాడి జరిగిన రోజు నుండి భారత్ చాలా స్థిమితంగా వ్యవహరించింది. ప్రధానమంతి నరేంద్ర మోదీ తన అధికార, రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకోలేదు. పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూనే ఆయన ఉగ్రదాడులపై వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యూహాల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, సైనికాధికారులు మీడియాకు వివరాలు ఇస్తూ వచ్చారు. తద్వారా ఉగ్రవాదంపై భారత్ పోరాటమంతా నిపుణుల సారథ్యంలో జరుగుతున్నదనే సంకేతం ఇచ్చారు.
కానీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఖురేషి తరచూ ప్రకటనలు చేయడం, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఒక వంక భారత్‌కు హెచ్చరికలు చేస్తూ, మరోవంక తమ దేశ ప్రజలకు నచ్చచెప్పుకొనే ప్రయత్నం చేయవలసి వచ్చింది. రోజుల తరబడి ఆ దేశంలో విమానాశ్రయాలను మూసివేశారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులను పాక్ ప్రజలు ఎదుర్కొన్నారు. పలు ప్రధాన నగరాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. పలు కీలక ప్రదేశాలను సైన్యం తన అధీనంలోకి తెచ్చుకోంది.
మొదటి సారిగా భారత్ ఒక్కడుగు వేస్తే, పాక్ మరొకడుగు వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడింది. తామేదో ఘన విజయం చేశామని చెప్పుకోవడం కోసం- తమకు పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్ వీడియోను విడుదల చేయడం పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిగా చేసింది. అప్పటి వరకు అతను పాక్ కు భారత్ పట్టుబడినట్లు కూడా భారత్ పేర్కొన లేదు. జెనీవా ఒప్పందం ప్రస్తావన తేవడంతో అంతర్జాతీయంగా భారత్ మద్దతు కూడదీసుకో గలిగింది. దాంతో 60 గంటల లోపల అభినందన్‌ను పాక్ విడుదల చేయవలసి వచ్చింది. ఈ సందర్భంగా భారత్ విదేశాంగ శాఖ, సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశాయ.
భారత్ దారికి పాక్ రాక తప్పదు !
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి, పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరం కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు జైష్, లష్కర్ ఏ తోయబాలకు సురక్షిత స్థావరంగా పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పాక్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రశిబిరంపై భారత్ దాడి చేయడంతో- మొదటిసారిగా చైనా పాక్‌కు దూరంగా జరిగింది. భారత్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేసుకొంటూ పోతే రాబోయే రోజులలో దాయాది దేశం మనల్ని ఏ విషయంలో కూడా భయపెట్టే పరిస్థితి ఉండదు. రెండు దేశాల మధ్య సంబంధాల స్వరూపాన్ని భారత్ నిర్దేశించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఈనాటి యుద్ధం కాదిది...
పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత ప్రభుత్వం వెంటన రంగంలోకి దిగి పలు దౌత్య, ఆర్థిక, సైనికపర చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరోసారి అలముకొంది. అయితే ఈ యుద్ధ వాతావరణం నేడు కొత్తగా ఏర్పడింది కాదు. దేశ విభజన సమయం నుండి నెలకొన్నది. శత్రుమూకలు నిరంతరం పలు విధాలుగా సరిహద్దు దాటి మన దేశంలోకి ప్రవేశించి- ఇక్కడ కల్లోలం, అస్థిరతలను సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ విధమైన కల్లోలం సృష్టించే వారిని- ‘మేధావులు’ , ‘మానవహక్కుల యోధులు’ , ‘కశ్మీరీ వాదం వినిపించే వారు’ అంటూ పలు పేర్లతో పిలుస్తున్నారు. మన సైనికులపై రాళ్లు రువ్వుతున్న యువకులు, హురియత్ నేతలు ఈ ప్రక్రియకు అనుబంధంగా వ్యవహరిస్తున్న వారే. వారిచ్చే నినాదాలకు, చేస్తున్న ప్రకటనలకు- అదిల్ అహ్మద్ వీడియో ప్రసంగానికి మధ్య పెద్దగా తేడా కనిపించదు. పాక్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రుల ప్రసంగాలకు, వీరి చర్యలకు మధ్య సహితం చెప్పుకోదగిన తేడా ఉండదు. ద్వేష భావాన్ని, ఏర్పాటు వాదాన్ని, అస్థిరతను వ్యాప్తి చేయడమే వారందరి లక్ష్యం. ఇది స్వాతంత్య్రం కోసం, హక్కుల కోసం సాగిస్తున్న యుద్ధం కానేకాదు. సైద్ధాంతిక భూమికతో సాగిస్తున్న యుద్ధం. నేడు వీరంతా ‘పోరాటం’గా చెబుతున్న ఈ అల్లకల్లోలంలో ప్రజల భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం వంటి అంశాల ప్రస్తావన ఏమీ ఉండక పోవడం గమనార్హం. కశ్మీర్‌లో పరిస్థితి ఇట్లా ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతంలోని ప్రజల దుస్థితి మరెంత దారుణంగా ఉంటుందో చెప్పనలవి కాదు.
మతపరమైన తొలి రాజకీయ పక్షం ‘అఖిల భారత ముస్లిం లీగ్’ అలనాడు బెంగాలీ కాశ్మీరీ సర్ సలీముల్లా ఖాన్ ఇంట్లో ప్రారంభమైంది. మరో కాశ్మీరీ కవి డా. అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ ఉపఖండంలో మతప్రాతిపదికగా ప్రత్యేక దేశం ముస్లింలకు ఏర్పడాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. అప్పటి నుండి పథకం ప్రకారం కశ్మీర్‌లోయలో జనాభా నిష్పత్తిని మార్చే కుటిల ప్రయత్నం జరిగింది. తీవ్రవాద స్వరాలు పెరుగుతూ వచ్చాయి. భారత్ అనుకూల స్వరాలను అణచివేస్తూ వచ్చారు. ఇవన్నీ జిహాదీ తీవ్రవాద ప్రభావాన్ని రెచ్చగొట్టడంలో భాగంగా జరుగుతూ జరిగాయి.
ప్రమాదకర సంస్థ జైషే...

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద సంస్థ. పవిత్ర యుద్ధం పేరుతో భారత్‌పై అనేక పర్యాయాలు తెగబడ్డ అత్యంత ప్రమాదకరమైన ఉన్మాద ఉగ్రవాద సంస్థ ఇది. గత రెండు దశాబ్దాల్లో ఘాతుక జైషే వల్ల రెండు దేశాలు కనీసం రెండు సార్లు యుద్ధం అంచులవరకు వెళ్లాయ. అనేక భీతిగొల్పే దాడులకు జైషే పాల్పడింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, యూరీలోని ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కేంద్రం, శ్రీనగర్‌లోని బాదమీబాగ్ కంటోనె్మంట్, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ వద్ద బాంబు పేలుళ్ల ఘటనకు సూత్రధారి జైషే మహ్మదే. భారత పార్లమెంట్‌పై దాడులకు తెగబడింది జైషే ఉగ్రవాదులే. ఈ దాడుల తరువాత 2001లో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. పార్లమెంట్‌పై దాడి తరువాత అత్యంత దారుణమైన సంఘటన పుల్వామాలో జరిగింది.
ఫిబ్రవరి 14న పుల్వామాలో దాడికి తెగబడ్డ జైషే ఉగ్రవాదులు 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ముష్కర ముఠాకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2017 నవంబర్ 17న పాకిస్తాన్‌లోని ఒకారా జిల్లాలో అల్‌ఖైదా సమావేశం జైషే నాయకత్వంలోనే జరిగింది. అప్పుడే పవిత్ర యుద్ధం పేరుతో భారత్‌పై దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కరుడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, అమెరికా దాడుల్లో హతుడైన అల్‌ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్‌తో జైషే మహ్మద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. 1999లో ఐసీ-818 విమానాన్ని హైజాక్ చేసినపుడు జైలులో ఉన్న ఉగ్రవాది మసూద్ అజార్ విడుదలయ్యాడు. విడుదలైన తరువాతే జైషే మహ్మద్‌ను ఏర్పాటు చేశాడు. బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఎం16 ఏజెంట్ ఒమర్ షేక్‌ను మసూద్‌తో పాటు విడుదల చేశారు. ఒమర్ కూడా అత్యంత దుర్మార్గుడే. 2002లో జరిగిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పాత్రికేయుడు డానియల్ పెర్ల్ హత్యకు కుట్రదారుడు అతడే. అలాగే, అమెరికాపై 9/11 దాడికి నిధులు సమకూర్చిందీ ఒమర్ షేక్ కావడం గమనార్హం.
జైషే ముఠా భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో వరుస దాడులకు తెగబడింది. 2000 ఏప్రిల్‌లో కశ్మీర్ లోయలో కారుబాంబు దాడితో 30 మందిని పొట్టనబెట్టుకుంది. అదే సంవత్సరం శ్రీనగర్‌లోని బట్మాలూ బస్టాండ్‌లో ముగ్గురు పోలీసులను జైషే ఉగ్రవాదులు కాల్చి చంపారు. 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి చేసి 31 మందిని జైషే బలితీసుకుంది. భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై జైషే మహ్మద్ జరిపిన దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. 9/11 దాడి జరిగిన మూడు వారాల తరువాత పార్లమెంటుపై దాడికి తెగబడ్డారు.అల్‌ఖైదా అధినాయకుడు బిన్‌లాడెన్ ఆఫ్గనిస్తాన్‌లోని బోరా గుహల్లో దిగ్బంధనం వార్తలొచ్చిన వారం తరువాతే పార్లమెంట్‌పై దాడి జరిగింది. టోరాబోరా గుహల్లో లాడెన్‌ను చుట్టుముట్టేయడంతో జైషే రంగంలోకి దిగి పాకిస్తాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇందులో జైషే మహ్మద్, మరో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఇందులో కీలక పాత్ర పోషించాయి. 9/11 దాడిలో కీలక కుట్రదారుడు ఖలీద్ షేక్ మహ్మద్‌ను జైషేనే కాపాడింది.

-చలసాని నరేంద్ర 98495 69050