ఈ వారం స్పెషల్

పుడమిని పూజిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్దెనిమిదో శతాబ్దం వరకు డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటీష్‌వారు తమ సామ్రాజాన్ని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. 19వ శతాబ్దంలో ఒకవైపు పారిశ్రామిక విప్లవం పుట్టుకొస్తే మరోవైపు స్మాల్పాక్స్, ఇన్ఫ్లుయెంజా, ప్లేగు, పోలియో వంటి అంటువ్యాధులు ఎంతోమందిని కబళించి ప్రపంచాన్ని వణికించాయి. వాటికి వ్యాక్సీన్లు కనుగొనడంలో శాస్తవ్రేత్తలు లీనమయ్యారు. పారిశ్రామికీకరణ జరుగుతున్న రోజుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కమ్యూనిస్టు దేశాల వరకు పోటీపడి మరీ ఫ్యాక్టరీల ద్వారా దట్టమైన పొగలను వదిలేవి. ఆకాశంలో ఎంత ఎక్కువ కారుమబ్బులతో పొగ కమ్ముకుంటే అంత సంపన్న రాష్ట్రం, దేశంగా పరిగణింపబడేవి. ఒకటో ప్రపంచ యుద్ధంతో ఇరవయ్యో శతాబ్దం మొదలైంది. గ్రేట్ డిప్రెషన్ నుంచి ఇంకా తేరుకోనేలేదు. ప్రపంచ దేశాలకు కంటికి కునుకు లేకుండా చేసి అరిపాదాల మీద నుంచునేటట్లు చేశారు రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికిన అడోల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ, ఫుమిమారో కోనో (జర్మనీ, ఇటలీ, జపాన్)ల త్రయం.
అంతవరకు భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణం, కాలుష్యం లాంటి పదాలు సైన్స్ పుస్తకాలకి, డిక్షనరీలకి మాత్రమే పరిమితమయ్యాయి. వాటి గురించి ఆలోచించే తీరిక, అవసరం ప్రపంచానికి లేకపోయింది.
జాన్‌మెక్ కానె్నల్ అనే శాంతి కార్యకర్త ప్రథమంగా ‘ఎర్త్ డే’ అనే పదాన్ని ప్రయోగించి 1970, మార్చి 21న ‘ఎర్త్ డే’ సంబరాలు జరిపారు. మార్చి 21న ఉత్తర అర్ధగోళంలో మార్చి ఈక్వినాక్స్ లేదా మార్చి విషువత్తు వసంత విషువత్తుగా మరియు దక్షిణ అర్ధగోళంలో శరదృతువు విషవత్తుగా పిలువబడుతుంది. గ్రెగేరియన్ క్యాలెండర్లో వసంత విషువత్తు ఎక్కువగా మార్చి 21న సంభవిస్తుంది. విషవత్తు లేదా ఈక్వినాక్స్ అంటే సూర్యుడు ఖగోళ భూమధ్యరేఖను దాటిన సమయం లేదా తేదీ. ఇది సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. మార్చి 20/21 మరియు సెప్టెంబర్ 22/23 భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉండి ఆ రోజున భూమి అక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగా దూరంగా కాకుండా సమాన దూరంలో ఉంటుంది కాబట్టి ఆ రోజున రాత్రి భాగం, పగటిభాగం సమానంగా ఉంటాయి.
1969లో కాలిఫోర్నియాలోని శాన్యాబార్బరాలో షిప్ నుంచి భారీమొత్తంలో చమురు చింది సముద్రంలో కోట్ల సముద్ర జీవులు మరణించిన ఘటన చూసి అప్పటి విస్కాన్సిన్ సెనేటర్ అయిన నెల్సన్ గళం విప్పాడు.
ప్రపథమంగా పర్యావరణ గూర్చి యోచన, యోజన చేయడానికి యాదృచ్చికంగా నెల్సన్ రూపంలో వేదిక ఏర్పడింది. వియత్నాంలో యుద్ధానికి వ్యతిరేకంగా అప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విద్యార్థులు అప్పటి ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్‌పై ఆగ్రహం వ్యక్తపరుస్తూ ఆందోళనలను, ఉద్యమాన్ని చేపట్టేరు. ఆ ఉద్యమం ప్రేరణతో నెల్సన్ వాయు మరియు నీటి కాలుష్యం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, పర్యావరణ రక్షణపై అవగాహన కలిపించడానికి నడుం బిగించాడు. అదే సరైన తరుణంగా భావించి విద్యార్థి సంఘాల బుర్రల్లోకి ఈ విషయం చొప్పించి అనంతరం నేషనల్ మీడియాకు పర్యావరణంపై జాతీయ బోధన అనే ఆలోచనను ప్రకటించారు. అలా అమెరికా విద్యార్థులు భూమి దినోత్సవం ఆవిర్భవించడానికి గాత్ర దానం చేస్తే, మీడియా ప్రప్రథమంగా పర్యావరణ రక్షణ అనే అంశానికి మొదటి పేజీలో చోటిచ్చి నేత్ర దానం చేసింది. అప్పుడే కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ నిక్సన్ కూడా తన వంతుగా పెద్ద పీట వేశారు. అలా తొలిసారి 1970లో ఎర్త్‌డేని పార్టీలకు అతీతంగా రిపబ్లికను, డెమొక్రాట్లు, పేద, ధనిక, బీదాబిక్కీ, కుర్రాళ్లు నుంచి వయోవృద్ధులు వరకు రైతులు, కార్మికులు, బ్యూరోక్రాట్లు ఇలా తారతమ్యాలు లేకుండా- నేను సైతం అన్న చందాన ఆ మహత్తరమైన కార్యానికి మద్దతు ఇచ్చి కార్యరూపం దాల్చడంలో కృషి చేశారు.
చరిత్ర విజేతలచే రాయబడుతుంది అన్నదానికి నిదర్శనంగా, జాన్ మెక్‌కానె్నల్ నిర్దేశించిన మార్చ్ 21న కాకుండా సెనేటర్ గేలోర్డ్ నెల్సన్ సూచించిన ఏప్రిల్ 22 నాడే మదర్ ఎర్త్ డేగా ఐక్యరాజ్య సమితి 2009లో సంకల్పించి స్పష్టత తెలియపరిచింది.
‘ఎర్త్ డే’ ఆవిర్భావం ద్వారా ప్రపంచ దేశాలు పర్యావరణ చట్టాలు చేసి అమలులోకి తెచ్చేయి. భారతదేశంలో కూడా ఎన్విరానె్మంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరియు క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, మరియు అంతరించిపోతున్న జాతుల చట్టాల ఏర్పాటుకు దారితీసింది. అలా 1970లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నాటిన బీజం నేడు పెద్ద మహావృక్షంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది మదర్ ‘ఎర్త్ డే’ జరుపుకునేటట్లు చేసింది.
1970ల వరకు అటు అగ్ర దేశాల నుంచి ఇటు అల్ప దేశాల వరకూ పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలు, నిబంధనలు పెట్టలేదు. ‘ఎర్త్ డే’ పుణ్యమాని అన్ని దేశాలూ ఒక్కసారి తుళ్ళిపడి వివిధ చట్టాలు చేయడం ఆరంభించాయి. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద, నదీ జలాలు, వన్యప్రాణి వంటి సహజ పర్యావరణాన్ని రక్షించడానికి, మెరుగుపరచడానికి,
సహజ వనరుల సద్వినియోగం కోసం రాజ్యాంగం 4 ఎ, ఆర్టికల్ 51 ఎ ఫండమెంటల్ రైట్స్ అనుసారం ప్రతి భారత పౌరుడిపై బాధ్యత మోపింది. 1972 నుంచి మిగతా దేశాలతో పాటు భారతదేశం కొన్ని ముఖ్య పర్యావరణ చట్టాలు చేసింది.
అటవీ నిర్మూలన, పట్టణీకరణ, భూమి అభివృద్ధి, అటవీ సంపద చోరీ, ఎగుమతి మాఫియాల కారణంగా ప్రతి సంవత్సరం మన భూగ్రహం పదహారు వందల కోట్ల చెట్లను కోల్పోతోంది. 2020లో ‘ఎర్త్ డే’ 50వ వార్షికోత్సవం నాటికి 780 కోట్ల మొక్కలను నాటాలని 2016లో రచించిన ప్రణాళిక, అంటే ఇంచుమించు భూగోళం మీద ఉన్న జనాభా 780 కోట్లు ప్రతి మనిషి కొరకు- ఒక చెట్టు, ప్రతి మనిషి చేత ఓ చెట్టు.
2015లో భూమి దినోత్సవం సందర్భంగా, పారిస్‌లో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో 190 దేశాలు ఏకాభిప్రాయంతో అంగీకరించిన ఈ ఒప్పందం- ‘పారిస్ ఒప్పందం’గా 2020లో అమలులోకి రానున్నది. ‘గ్లోబల్ వార్మింగ్’2అంటే- వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ దిగువకు ఉంచి, పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడానికి, ప్రమాదకరమైన వాతావరణ మార్పును నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రణాళికను రూపొందించారు.
భారతదేశంలో భూమాతను రక్షించడానికి సత్వర చర్య తీసుకోకపోతే, అది వాతావరణ మార్పుపై ప్రభావం చూపి తద్వారా పంటలు, నీటి వనరులు, ప్రజా ఆరోగ్యం, ఆహార సరఫరా మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలదు. తుపాన్లు, వరదలు, సునామీలు, భూ ప్రకంపనలు పెరిగే అవకాశం ఉన్నది.
పారిశ్రామిక అభివృద్ధి, టెక్నాలజీ, ప్రపంచీకరణ- యావత్ ప్రపంచానికి ఎంతో మేలు చేసినప్పటికీ వాతావరణం, ప్రకృతిపై మాత్రం ప్రతికూల ప్రభావాలను కలుగచేశాయ. ప్రపంచవ్యాప్తంగా పొగమంచు, కాలుష్యం, పురుగుమందులు,ఇతర కాలుష్య కారకాలు అధికంగా ఉపయోగించడం వల్ల జీవవైవిధ్యం క్షీణించి మరోపక్క పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి పరంగా జాప్యాలకు దోహదకారమవుతోంది. ధరిత్రి-దాని పర్యావరణ వ్యవస్థలు మన నివాస స్థలము. ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల యొక్క ఆర్థిక, సామాజిక, మరియు పర్యావరణ అవసరాల మధ్య సమతుల్యతను సాధించడానికి, పుడమి మరియు ప్రకృతితో సామరస్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే సకల చరాచర సృష్ట్టి ఇమిడి ఉంది.
వాతావరణంలో మార్పులు సముద్రపు నీటి పరిమాణం, మట్టాన్ని పెంచి భూమిలో ఉండే టెక్టోనిక్ ప్లేట్లలో అసమానతలను కలిగిస్తుంది. అంతేకాకుండా, మారుతున్న శీతోష్ణస్థితి కారణంగా గత కొనే్నళ్లుగా శీతాకాలం తక్కువస్థాయిలో ఉంటూ ఎక్కువ సమయముంటోంది. సుడిగాలులు, తుఫాన్లు, సునామీలు, అగ్ని పర్వతాలలో లావా ద్రవాలు, భూకంపాలు, వరదలు ప్రకృతి సహజమేమో కానీ భూమిపై అడవులను నరికివేయడం, శబ్ద, నీటి, వాయు కాలుష్యం మొదలైనవి వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచడంతో విస్తృతమైన మార్పులను తెచ్చి తద్వారా ప్రకృతి వైపరీత్యాలు తరచూ వచ్చేటట్టు చేస్తున్నాయి. నీటి లభ్యత క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున, ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ పట్టణంలో పైపుల్లో నీటి సరఫరా ఆపేసి తెల్లకార్డు ద్వారా తలా తొమ్మిదో, ఐదో లీటర్ల నీళ్లు మాత్రమే ఇవ్వడానికి సంకల్పించారు. ఇలాంటి మార్పులు, ప్రతికూల పరిస్థితులు మిగతా ఖండాలలో, పట్టణాలకు వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే మన బెంగళూరు నగరం నీటి కోసం క్యూ కట్టింది.
పౌరాణికంగా, చారిత్రాత్మకంగానూ రాజులు, దేశాలు భూభాగం కోసం యుద్ధాలు చేశారు. మహాభారతమైనా, రెండో ప్రపంచ యుద్ధం దీనికి తార్కాణం. ఇప్పటికే దేశాలు, రాష్ట్రాలు నదీ జలాల వాటా కోసం పోటీపడుతున్నాయి, పోరాటం చేస్తున్నాయి. కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ సంభవించినట్లయితే అది సరిహద్దుల కోసమే, అణుబాంబులు, పెట్రోల్ కోసమో కాదు. నీటి కోసం, గాలికోసం, నీడకోసం, తిండి గింజల కోసం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇది తథ్యం, సాధ్యం, అనన్యం...
కొవ్వు పదార్థాలు అధికంగా తింటే మన కాలేయం కంగారుపడుతుంది. రాళ్లు చేరితే కిడ్నీలు కుంగిపోతాయి. పోపు ఘాటుగా పెడితే ఊపిరితిత్తులొక్కసారి ఉలిక్కిపడతాయి. ఉల్లిపాయల ఘాటుకి బొటబొటా వస్తాయ కన్నీళ్లు. చిన్న ‘బ్లాక్’ ఉంటే చాలు ‘లబ్‌డబ్‌గాడు’ తట్టుకోలేక ఎమర్జెన్సీ మీట నొక్కుతాడు. రక్తం సరఫరా ఒక సెకన్ ఆలస్యమైనా మెదడుగారు మూర్ఛపోతారు. మరి- మనం భూదేవిని లేదా ప్లేనెట్ ఎర్త్‌ని మన ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నాము. మన శరీర భాగాల్లాగే సముద్రాలు, మంచు తొడుగులు, చెట్లు, పర్వతాలు మొదలగునవి భూమిలో భాగమే కదా..! పన్ను పీకితే నొప్పి పుడుతుంది మనకి. కానీ చెట్లు నరికితే భూదేవికి చీమ కుట్టినట్లు కూడా అనిపించకూడదా? సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇనప సామాన్లు భూస్థాపితం చేస్తే భూదేవి కాలేయం కెవ్వుమంటుంది. మన భాషలో అదే ఎర్త్‌క్వేక్, భూకంపం. వాహనాల, ఫ్యాక్టరీల పొగ, సెగ తట్టుకోలేక తుమ్ముతుంది! అదే మనకు సముద్రంలో అల్పపీడనం, విపరిణామంగా మహాసముద్రాలు ఉప్పొంగే తుపాన్. ఇంకా ధరణికి అధిక రక్తప్రసరణ వస్తే కొండ చరియలు విరిగిపడతాయి. కన్నీళ్లు పెట్టుకొంటే హిమానీ పర్వతాలు ద్రవీభవించి సునామీలొస్తాయి. ఇంకా మెదడు మొరాయించి మొద్దుబారితే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. ఇనే్నళ్ళుగా మన అడుగులకు మడుగులొత్తుతూ మన అడుగుల కింద ఉన్న భూమికి కూడా ఓ వ్యవస్థ ఉంది మన శరీర నిర్మాణం లాగే. భూమి కూడా తన వ్యవస్థతో వివిధ అంశాలలో సంఘర్షణ చెందుతుంది.
ఒకరోజు బయట హోటల్లో నీళ్లు తాగితే మన పొట్ట తట్టుకోలేక- ముక్కు కారుతూ, శరీరం మూలుగుతుంటుంది. అలాంటిది సిమెంట్ ఫ్యాక్టరీ సున్నపునీరు, షుగర్ ఫ్యాక్టరీ వ్యర్థ్యాలు , ఎరువుల, ఫార్మా, టెక్స్‌టైల్ పరిశ్రమలలో రసాయనాలు, ఆసుపత్రుల నుంచి టన్నుల కొలదీ మానవ వ్యర్థం నదుల్లో, సరస్సుల్లో కలుస్తున్నాయి.
పదిరోజుల్లో కుళ్లిపోయి భూమిలో ఐక్యం చెందే ఆకులను అలములను కాలుస్తున్నారు, రబ్బరు, గాజు, ప్లాస్టిక్‌ను భూమిలో పూడుస్తున్నారు. చెత్తని కాల్చడం ద్వారా వాయువుని కలుషితం చేస్తున్నాం. స్వచ్ఛమైన చెరువులు, వాగులు, నదుల్లోకి డ్రైనేజీ మురికినీరు, ఫ్యాక్టరీ రసాయనాలను పంపిస్తున్నారు. ఆ నీటినే ట్రీట్‌మెంట్లు ప్లాంట్లలో శుద్ధిచేస్తే మినరల్ వాటర్ అని డబ్బులిచ్చి కొంటున్నారు. గడ్డం గీసుకునేటప్పుడు కుళాయి నీళ్లు ధారగా పోతోందని అయ్య తిట్టాడని బాధపడకు. రేపు రాబోయే తన మనవరాలు నీళ్లు అంటే ఏంటో సముద్రం వరకు తీసుకెళ్లి చూపెట్టాల్సిన కర్మ నీకు పట్టకూడదని మీ తాతయ్య తాపత్రయం.
ధరణీ శాంతించు, తల్లీ కరుణించు, భూమాతా పాహిమాం.. రక్షమాం.. మా మానవుల చేత జరిగిన అపరాధమేదో జరిగినది, చింతించుచున్నాము. కానీ ఏదైనా శాప విమోచనం, వ్రతం ఆచరించి మా పాపాలు కడవగచ్చా? భూదేవి, వసుంధర, పృధ్వి, వసుధ, పుడమి, ధరణి, ధరితి, వసుమతి, మేధిని, క్షోణి.. భూదేవి -అంటూ అష్టోత్తరంతో ప్రార్థించాలా?
ఉపశమనం...
అమాయకుడిలా ఉన్నావు... బిడ్డల తప్పులను మన్నించి తల్లి అక్కున చేర్చుకొన్నట్టే మానవుల పాపాలు మోయడానికే- ఈ భూదేవి ఉద్భవించింది. సూత మహాముని చేత మీకు ఏదో ఒక వ్రతం ఆచరించమని లేదా ఫలానా వ్రతం చేయకపోతే లీలావతి, కళావతిల పెనిమిటి పడవ మునగడం లాంటివి ఏవీ నేను కోరను. నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు విరమించి మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి స్వచ్ఛమైన నీరు, గాలి పొందడానికి కింద ఇచ్చిన సూత్రాలను ఆచరించిన యెడల యావత్ భరతఖండం, ప్రపంచం ఎన్నో తరాల వరకు సుఖ సంతోషాలతో, ముఖ్యముగా పంచభూతాల కొరత లేకుండా వాటి సాక్షిగా జీవితం గడిపెదరు... తథాస్తు!
పరిహారములు...
* ‘ఎర్త్‌డే’ సందర్భంగా, భూమిని గౌరవించడానికి మనం ప్రతిజ్ఞలను బూనుదాం. సహజవనరులు, అటవీ సంపదని కాపాడుకోవడానికి కంకణం కడదాం. విద్య పురోగతికి పునాది. భూగ్రహానికి కలిగే వాతావరణ మార్పుల విషయంపై సమాజంలో ప్రతి ఒక్కరికీ పరిజ్ఞానం కల్పిద్దాం.
* నేటి తరమే రేపటి పౌరులు. ఈనాటి బాలలే రేపు ‘గ్లోబల్ వార్మింగ్’ వల్ల ఎదురయ్యే పరిస్థితులు అనుభవించేది, బాధపడేది. పర్యావరణ, శీతోష్ణ వాతావరణం పిల్లల సైన్స్ పుస్తకాలకు, మార్కులకే పరిమితం కాకుండా పిల్లల్ని చైతన్యం చేసి ఈ సంఘర్షణలో పాలు పంచుకొని వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనేట్లు ఉత్తేజపరుద్దాం.
* ‘ఎర్త్‌డే’ విశిష్టత, సంబరాలు కేవలం సోషల్ మీడియాకి, వాట్సాప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా భూగోళం కోసం తన వంతు ఉడత సాయం అందించాలి.
* గ్రీన్ టెక్నాలజీలను ఆవిష్కరించే స్టార్టప్‌లు, లఘు పరిశ్రమలు, సంస్థలకు చేయూతనిచ్చి ఆదుకోవాలి.
* సాధ్యమైనంతవరకు పకృతి సిద్ధమైన సౌరశక్తిని ప్రత్నామ్యాయ ఇంధనంగా ఉపయోగించాలి. అటవీ పరిరక్షణలో భాగంగా అడవుల్లో మంటలు పెట్టకుండా, మంటలు వ్యాప్తి చెందకుండా, కలప అక్రమ మార్గాన తరలింపు, అనధికార ఉపయోగం నివారణ ప్రతి పౌరుడి బాధ్యత. పంట చేతికొచ్చేక ఎండు గడ్డి, వ్యర్థం, చెరుకు పిప్పి, కొమ్మలు, ఆకులను కాల్చడం ద్వారా గాలిలోకి గ్రీన్ హౌస్ వాయువులు స్వయంగా, అకారణంగా విడుదల చేయకుండా రైతాంగానికి తెలియచేయాలి.
* నీటి ఎద్దడి కోసం ఇంకుడు గుంతలు ఏర్పాట్లు చేసుకొని వాటర్ హార్వెస్టింగ్ గురించి విస్తృతంగా తెలియచేయాలి.
* ‘ఎర్త్‌డే’ రోజే కాకుండా వీలైనప్పుడల్లా మొక్కలని నాటి సంరక్షణ చేయాలి. ఒక చెట్టు ఒక రోజులో నలుగురికి సరిపడా ఆక్సిజన్‌ను సమకూరుస్తుంది.
* గ్రామాల్లో, పట్టణాల్లో చెత్తని వేరు చేసే విధానం తు.చ. తప్పకుండా పాటించి, మున్సిపాలిటీ, పంచాయతీ, రోడ్లు ఊడ్చే ఉద్యోగులకు జాగృతి చేసి చెత్త వేరు చేసే విధానం నేర్పించడం మన బాధ్యత.
* అత్యధిక దేశాల ప్రజలు కార్లను బహిష్కరించి ప్రజా రవాణా, సైకిళ్ళపై మొగ్గు చూపుతున్నారు. కారు పూల్, మెట్రోరైళ్లను వీలైనంత మటుకు ఉపయోగించి వాహన కాలుష్యం తగ్గించవచ్చు.
* ప్లాస్టిక్ ఉపయోగం నిరోధించాలి. మనతోపాటు కార్లోనూ, స్కూటీలోనూ, బ్యాగులోనూ ఎప్పుడూ వస్త్రంతో తయారు చేసిన సంచిని ఉంచుకుంటే, ప్లాస్టిక్ సంచులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిలో ఉన్న కార్మికులు, వ్యాపారులకు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిలో అవగాహన, సహాయం చేసి వారిని ఆదుకోవాలి.
* ఒక్కరోజు నీరు లేకపోతే ఎంతో అసౌకర్యానికి గురవుతాము. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు నీటికోసం
నైలాన్ వస్త్రాలు : 30 నుంచి 40 సంవత్సరాలు
తోలు బూట్లు : 25 నుంచి 40 సంవత్సరాలు
పాల ప్యాకెట్, పానీయాల కవర్లు : 5 సంవత్సరాలు
నూనె, నెయ్యి, షాంపూ టెట్రా ప్యాక్ :
5 సంవత్సరాలు
సిగరెట్ ఫిల్టర్ : 1 నుంచి 12 సంవత్సరాలు
పత్తి : 1 నుంచి 5 నెలలు
పురికోస, కొబ్బరి తాడు :3 నుంచి 14 నెలలు
దారం : 3 నుంచి 4 నెలలు

రోజుకి పదికిలోమీటర్ల దాకా కాలినడకన ప్రయాణిస్తున్నారు. కోట్లమందికి పరిశుద్ధమైన తాగునీరు లభ్యం కావడం లేదు. నీటిని వీరు నిర్లక్ష్యంగా వాడుకుంటే భవిష్యత్తులో నీరు మనల్ని నిర్లక్ష్యం చేసి కనుమరుగు అవుతుంది. ఒకొక్క నీటి బొట్టుని అపురూపంగా వాడుకొందాం.
* నీటిని శుభ్రంగా ఉంచడానికి, రాబోయే తరానికి నీరు అందుబాటులో ఉంచడానికి ఈ రోజే పునాది రాళ్లు వేద్దాం. రైలు, బస్సు, విమానంలో ప్రయాణానికి కాగితపు టికెట్ అవసరం లేదు. మొబైల్, ఈ-మెయిల్‌లో టికెట్ చూపిస్తే చెల్లుతుంది. అవసరమున్నప్పుడే ప్రింట్లు చేస్తే కాగితం, కార్బన్‌ని ఆదా చేయొచ్చు.
* బ్యాంకు, మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లు, బిల్లులు, ఈ-మెయిల్ ద్వారా తెప్పించుకోవడం ద్వారా భద్రత, గోప్యతతో పాటు కాగితం ఆదా చేయొచ్చు.
* ఇళ్లలో, కార్యాలయాల్లో లైట్లు, ఫాన్లు, ఏసీ అవసరమున్నప్పుడే ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఆదా. భూమికీ మేలు కలుగుతుంది.
ఇవి మనకోసం, మన భూమి, ప్రకృతి కోసం సానుకూల ప్రభావం చూపడానికి కేవలం కొన్ని సులభమైన మార్గాలు. సాధ్యమైనంత వరకు సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్, రబ్బరు, గాజు వస్తువులు పునర్వినియోగం లేదా రీ సైకిల్ చేయాలి. మనం అవసరం తీరాక పారేసిన ప్లాస్టిక్ డబ్బా భూమిలో కలవడానికి కనీసం డెబ్భై సంవత్సరాలు పడుతుంది. చెత్తని అరికట్టి పునర్వినియోగం చేయడం ద్వారా ల్యాండ్ ఫిల్లని తగ్గించొచ్చు. నీరు గాలిని కలుషితం చేయడమే కాకుండా ల్యాండ్ ఫిల్లు అందమైన భూమిని ఆక్రమించి, పరిసరాలలో క్రిమి కీటకాలకు ఆశ్రయమిస్తాయి. వీటిలో ఉండే ప్లాస్టిక్, బ్లేడ్ వంటి ప్రమాదకర వస్తువులను సాధు జంతువులు, పెంపుడు జంతువులు తిని ప్రమాదానికి గురవుతున్నాయి.
‘పంచ రాక్షసులు’ ... పుట్టుక కారణం
ప్రపంచ వాతావరణ శాస్త వేత్తల పరిశోధన ప్రకారం ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ ధోరణి ప్రధాన కారణం-3గ్రీన్‌హౌస్ వాయువులు.22
కార్బన్ డయాక్సైడ్: అగ్నిపర్వత విస్ఫోటనల వంటి సహజ ప్రక్రియల ద్వారా, చెట్లు నరకడం, అటవీ సంపద నిర్మూలన, నేల ఉపయోగములో మార్పులు, అడవిలో మంటలు, భూగర్భ శిలాజ ఇంధనాలను కాల్చడం వంటి మానవ చర్యల ద్వారా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోంది. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన నాటి నుండి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ గాఢత 35 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. ఇది వాతావరణ మార్పులతో కలిగే దీర్ఘకాలిక సమస్య.
మీథేన్: ఇది సహజంగాను, మానవ కార్యకలాపాల ద్వారాను ఉత్పత్తి అవుతుంది. పశువుల వ్యర్థాలు, చెత్తగుట్టలు, వ్యవసాయం, ముఖ్యంగా వరి సాగు, నెమరువేసే జీర్ణవ్యవస్థ కల జంతు, పశుసంపదల విసర్జన వలన, చెద పురుగులు మరియు ఎరువుల వాడకం వంటివి వలన ఉత్పత్తి అవుతుంది. మీథేన్ వాయువు పాళ్లు వాతావరణంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా చురుకైన గ్రీన్‌హౌస్ వాయువు ఇది.
నైట్రస్ ఆక్సైడ్: మట్టి సాగు పద్ధతులు, ముఖ్యంగా వాణిజ్య, సేంద్రియ ఎరువుల ఉపయోగం, శిలాజ ఇంధనం కాల్చడం, పంటల వ్యర్థం, ఎండుగడ్డి, ఆకుల కాల్చడం ద్వారా ఉత్పన్నామయ్యే శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు.
క్లోరోఫ్లోరో కార్బన్లు: పలు పరిశ్రమల్లో ఉపయోగించే సింథటిక్ సమ్మేళనాలు. కానీ ప్రస్తుతం వీటి ఉత్పత్తి బాగా నియంత్రించబడుతున్నది. కార్బన్, ఫ్లోరిన్, క్లోరిన్ యొక్క అణువులను కలిగి ఉన్నవే సిఎఫ్‌సి రసాయనాలు. వీటిని ఏరోసోల్ స్పేస్ తయారీలో, ప్యాకింగ్ పదార్థాల కోసం, ఏజెంట్లను కరిగించడం, ద్రావకాల కరిగింపులో, ముఖ్యంగా రిఫ్రిజెరంట్లుగా ఉపయోగిస్తున్నారు.
నీటి ఆవిరి: ఇది అత్యంత సమృద్ధిగా ఉన్న గ్రీన్‌హౌస్ వాయువు. భూవాతావరణం వేడెక్కినప్పుడు నీటి ఆవిరి పెరుగుతుంది. ఇది ముఖ్యంగా- వాతావరణం ప్రతిస్పందనకు ముఖ్య కారకం.
శాంతి మంత్రం..
ప్రభుత్వం, అధికారులు కలిసి చట్టాలు చేసినా, అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు, పౌరసమాజం, సంబంధిత భాగ స్వాములు, ఎన్జీవోలు, మీడియా కలిసి ఎంత ప్రచారం చేసినా- ప్రతి వ్యక్తిలో అవగాహన పెంపొందించి పర్యావరణానికి తన వంతు కృషి చేయడమే తక్షణ కర్తవ్యం. అవగాహన, సంఘీభావంతో పుడమి తల్లిని, ప్రకృతి మాతని కాపాడుకొని పర్యావరణాన్ని పరిశుభ్రంగా చేసుకుని విపత్తుల నుంచి బయటపడదాం. వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చవి చూస్తున్నాము. గనుక ఏడాది పొడవునా భూమిని గౌరవించాలి, జాగ్రత్త తీసుకోవాలి.. ‘ఎర్త్ డే’ని ఘనంగా జరుపుకోవాలి.
------------------------------------
* అపరాధముల పట్టిక
ఒక్కో రకమైన వస్తువు మట్టిలో పూర్తిగా కలిసిపోయి, భూగర్భంలో విలీనం చెందడానికి కొంత కాలం పడుతుంది. ఈ జాబితాను చూశాక భూమి గురించి అవగాహన పెరిగి, మన చర్యల్లో మార్పు వచ్చి తగు జాగ్రత్తలు వహించేటట్లు చేస్తుంది.
గాజుసీసాలు : 1,000,000 సంవత్సరాలు
ప్లాస్టిక్ బ్యాగు : 500 నుంచి 1000 సంవత్సరాలు
నాప్కిన్లు, డైపర్లు : 500- 800 సంవత్సరాలు
అల్యూమినియం డబ్బా : 200 సంవత్సరాలు
ప్లాస్టిక్ సీసాలు : 70 నుంచి 450 సంవత్సరాలు
టిన్ డబ్బాలు: సుమారు 50 సంవత్సరాలు
నైలాన్ వస్త్రాలు : 30 నుంచి 40 సంవత్సరాలు
తోలు బూట్లు : 25 నుంచి 40 సంవత్సరాలు
పాల ప్యాకెట్, పానీయాల కవర్లు : 5 సంవత్సరాలు
నూనె, నెయ్యి, షాంపూ టెట్రా ప్యాక్ :
5 సంవత్సరాలు
సిగరెట్ ఫిల్టర్ : 1 నుంచి 12 సంవత్సరాలు
పత్తి : 1 నుంచి 5 నెలలు
పురికోస, కొబ్బరి తాడు :3 నుంచి 14 నెలలు
దారం : 3 నుంచి 4 నెలలు

* పర్యావరణ పరిరక్షణకు భారత్‌లో చేసిన చట్టాలు
1. వన్యప్రాణి రక్షణ చట్టం- 1972
2. అటవీ పరిరక్షణ చట్టం- 1980
3. నీటి కొరత నివారణ మరియు కాలుష్య నియంత్రణ చట్టం- 1974
4. వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం - 1981
5. పర్యావరణ రక్షణ చట్టం- 1986 పర్యావరణ రక్షణలో భాగంగా మరి కొన్ని ప్రత్యేక చట్టాలు, నిబంధనలు, ఆంక్షల కోసం 2010లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ వంటివి.
6. ప్రమాదకర వ్యర్థ నిర్వహణ నిబంధనలు చట్టం- 2008. ప్రమాదకర వ్యర్థాలు - రసాయనాల ఉత్పత్తి, నిల్వ, దిగుమతి మరియు హానికర వ్యర్థాల నిర్వహణ, బయోమెడికల్ వేస్ట్ నియమాలు- 1998, మున్సిపాలిటీల ఘన వ్యర్థాలను శాస్ర్తీయ పద్ధతిలో పారవేసేందుకు ఉద్దేశించిన లక్ష్యం వంటివి అమలులో ఉన్నాయి.

గ్రీన్ హౌస్ వాయువులు ఉష్ణ పరారుణ పరిస్థితిలో వికిరణం లేదా రేడియో ధార్మికతను గ్రహించి వాతావరణంలోకి విడుదల అవుతాయి.
ప్రధాన హరిత గృహ వాయు ఉద్గారాలు:
కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) 76 శాతం
మిథేన్ (సిహెచ్4) 16 శాతం
నైట్రస్ ఆక్సైడ్ (ఎన్2ఓ) 6 శాతం
ఫోరినేటెడ్ గ్యాస్ (హెచ్‌ఎఫ్‌సి)
2 శాతం

భూమి అష్టోత్తరం
ఏటా ఎర్త్‌డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క థీమ్ రూపొందిస్తోంది. ఆ సంవత్సరమంతా ఆ విషయం ప్రాధాన్యతను సంతరించుకొంటుంది.
2018 : ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ (ప్లాస్టిక్ ద్వారా ఉత్పన్నమయ్యే కాలుష్యానికి స్వస్తి చెబుదాం)
2017 : పర్యావరణ మరియు వాతావరణ అక్షరాస్యత
2016 : భూమి కోసం మొక్కలు నాటుదాం
2015 : నీటితో కూడిన అద్భుతమైన, పరిశుద్ధమైన పచ్చని ప్రపంచం నిర్మించడం
2014 : పచ్చని పట్టణాలు
2013 : వాతావరణం మార్పు ముప్పు
2012 : భూమిని చైతన్యం చేయడం
2011 : గాలిలో తేమ, కాలుష్యం నివారణ
2010 : వాడకం తగ్గించాలి. కార్బన్, కాలుష్యం తగ్గి రీ సైకల్, రీ యూజ్ కూడా తగ్గుతుంది.
2009 : శిలాజ ఇంధనం వాడకం తగ్గించి సైకిల్, కార్‌పూల్, పబ్లిక్ రవాణాని ఉపయోగించాలి.
2008 : దయచేసి మొక్కలు నాటండి, పెంచండి, కాపాడండి.
2007 : భూమిపై దయ ఉంచి సహజ వనరులను కాపాడండి.
*

-సునీల్ ధవళ (ఫర్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియా మరియు ఫాక్స్) సెల్ : 97417 47700