విశాఖపట్నం

వాళ్లు దోచేస్తోంటే వీళ్లు ముంచేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అధిక వడ్డీలతో ఫైనాన్సియర్లు ...
* భారీ లాభాలతో చిట్టీల నిర్వాహకులు ...
విశాఖపట్నం, డిసెంబర్ 18: ఒక పక్క అధిక వడ్డీలతో ప్రైవేటు ఫైనాన్సియర్లు దోచేస్తున్నారు. మరో పక్క భారీ లాభాలు ఎరవేసి ప్రైవేటు చిట్టీల నిర్వాహకులు అమాయక ప్రజలను ముంచేస్తున్నారు. ఇటీవల విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన కాల్‌మనీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడికి పోతోంది. విజయవాడ సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్సియర్లపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఒక్క విశాఖ నగరంలోనే సుమారు 10 మంది వరకూ ప్రైవేటు ఫైనాన్సియర్లుపై దాడులు నిర్వహించి ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు కూడా. అయితే ప్రైవేటు ఫైనాన్సియర్లను మించి ప్రైవేటు చిట్టీల నిర్వాహకులు దాష్టీకాలు చేస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడి అమాయక ప్రజలు అనుమతులు లేని, ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేని చిట్టీ నిర్వాహకుల దోపిడీకి బలవుతున్నారు. నగరంలో ప్రైవేటు ఫైనాన్సియర్ల స్థాయిలోనే ప్రైవేటు చిట్టీల నిర్వాహకులు ఉన్నారు. రోజువారీ కలెక్షన్ల నుంచి నెల మొత్తం ఒకేసారి చెల్లించే విధంగా వీరు చిట్టీలను నడుపుతున్నారు. చిట్టీ పాడుకున్న వారికి లాభాలు ఎక్కువగా చూపి, కొంతకాలం సక్రమంగా చెల్లిస్తుంటారు. స్థానికంగా పరిచయాలు పెరిగి చిట్టీల మొత్తం పెరగే వరకూ సజావుగా సాగే ఈ తరహా వ్యవహారంలో స్థానికులను ఆకట్టుకున్న తర్వాత సొమ్ముతో ఉడాయించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు పలు వెలుగు చూశాయి కూడా. లక్షల్లో సొమ్ముతో చిట్టీల నిర్వాహకుడు పరారుకావడం, లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరుగుతోంది. గడచిన 11 నెలల కాలంలో ఇటువంటి సంఘటనల్లో సుమారు మూడు కోట్ల వరకూ చిట్టీల నిర్వాహకులు అమాయకులను మోసగించిన కేసులు పోలీసుల వద్ద నమోదయ్యాయి. సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం మాదిరి చిట్టీ సంఘటనలు కూడా బట్టబయలయ్యే అవకాశాలున్నాయి. నిర్వాహకులు చేతులెత్తేయక ముందే పోలీసులు స్పందించి, ప్రైవేటు చిట్టీ నిర్వాహకులపై దృష్టిసారిస్తే అమాయకులకు చెందిన కోట్ల రూపాయలకు భత్రద చేకూరుతుందనడంలో సందేహం లేదు.

గుడివాడను నీడలా వెంటాడుతున్న పోలీస్‌లు
* వృద్ధుల ఇంటిని ఆక్రమించుకున్న రామకృష్ణ
* ఎంవిపిలో మరో కేసు నమోదు
విశాఖపట్నం, డిసెంబర్ 18: కాల్ మనీ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గుడివాడ రామకృష్ణను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. శుక్రవారం తిరుపతిలో ఉన్న రామకృష్ణ పోలీసుల రాకను గమనించి, తప్పించుకుని వేరే చోటికి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని నీడలా వెంటాడుతున్నారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలో రామకృష్ణను పట్టుకుంటామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పెదవాల్తేరులో రామకృష్ణ ఉంటున్న ఇల్లు పేద బ్రాహ్మణులది. వారి ఇంటిని తన సొంతం చేసుకునేందుకు 30 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేయించుకుని, కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. అతనిని అడిగే ధైర్యం లేక, ఆ వృద్ధ దంపతులు వౌనంగా ఉండిపోయారు. శుక్రవారం వారు ఎసి రవిబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంవిపి పోలీసులు రామకృష్ణపై మరొక కేసు కూడా నమోదు చేశారు.
వెలుగు చూస్తున్నవి కొన్ని ప్రాంసరీ నోట్లే
నగరంలో పోలీసులు కాల్ మనీ వ్యాపారుల దగ్గర నుంచి కట్టలు కట్టలుగా ప్రాంసరీ నోట్లు, బ్లాంక్ చెక్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇవి బస్తాలకొద్దీ దొరుకుతున్నాయని విశ్వసనీయ సమాచారం. వీటిలో కొన్నింటిని ఇప్పటికే కాల్ మనీ వ్యాపారులు కాల్చేయడం, లేదా వేరే చోటికి తరలించడం జరిగిపోయింది. దొరికిన ఈ పత్రాల్లో కొన్నింటిని మాత్రమే పోలీసులు వెలుగులోకి తీసుకువస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కొంతమంది అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోడానికి కూడా పోలీస్ శాఖలో కొంతమంది సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కాల్ మనీ కేసులు నమోదైనాయి. మహారాణిపేట, కంచరపాలెం, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్, పరవాడ, పద్మనాభం పోలీస్ స్టేషన్లలలో ఒక్కో కేసు నమోదైంది. ఎంవిపి పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదైనాయి.

‘చాట్ల’కు విశాఖతో అనుబంధం విడదీయలేనిది
విశాఖపట్నం, డిసెంబర్ 18: సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన నాటక రంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు నాటక రంగానికి ఆయన విశేష కృషి చేశారు. విజయవాడలో జన్మించారు. సిఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఎన్టీఆర్ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1954లో రస సమాఖ్య ప్రదర్శించిన ‘దొంగ వీరుడు, మాస్టర్జీ తదితర నాటకాలకు 12 బహుమతులు అందుకున్నారు. 1956లో రైల్వేశాఖలో టిక్కెట్ కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తొలి అనౌన్సర్‌గా పనిచేశారు. 12 ఏళ్ల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్రతో రంగస్థలానికి శ్రీకారం చుట్టారు. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ నాటక రంగానికి అంకితమయ్యారు. 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టేజి డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. నాటక రంగంలో ఎన్నో ప్రయోగాలకు నాందీ పలికారు. ఆయన పెద్ద తెర (సినిమా)కు, నాటక రంగానికి అనుసంధాన కర్త. హైదరాబాద్‌లో అనేక నటీనటులను తయారు చేసిన ఘనత ఆయనదే. నాటక రంగానికి పునరుజ్జీవింప చేశాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో షేక్స్‌పియర్ రాసిన మేక్‌బెత్, హేమ్‌లట్ వంటి నాటకాలను ప్రదర్శించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభానికి కృషి చేసిన కెవి గోపాలస్వామి సహకారంతో ఎన్నో నాటకాలను చాట్ల ప్రదర్శించారు. ఆయన నటించిన ‘మరో మొహంజదారో’ నాటిక చాలా ప్రసిద్ధి పొందింది. బికాం ఫైనలియర్ చదువుతున్న కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన అభ్యుదయ నాటక ఉత్సవాల్లో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి ‘మాస్టర్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాములు ఉత్తమ నటునిగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆనాటి నటుడు కె.వెంకటేశ్వరరావుతో కలసి ‘కాళరాత్రి’ అనే నాటకానికి దర్శకత్వం వహించాడు. కొర్రపాటి గంగాధరరావు రాసిన ‘విషకుంభాలు, డిటెక్టివ్, భవబంధాలు, తెలుగు కోసం వంటి నాటకాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ‘న్యాయం కావాలి, స్వప్న వంటి సినిమాల్లో నటించారు.

ఒప్పంద కార్మికులకు భద్రత కల్పించాలి
* ప్రిన్సిపల్ జడ్జి జయసూర్య
విశాఖపట్నం, డిసెంబర్ 18: ఒప్పంద కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందనిని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వి.జయసూర్య అన్నారు. శుక్రవారం ఉదయం ఎయు ప్లాటినం జూబ్లీలో ఏర్పాటు చేసిన ‘కాంప్లియన్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒప్పంద కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందించకుండా విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. వీరంతా భద్రత లేని జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి కార్మికులకు చట్టాలు రక్షణ కల్పిస్తాయన్నారు. చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శాశ్వత, తాత్కాలిక కార్మికుల మధ్య సత్సంబంధాలు ఉండే వాతావరణాన్ని కల్పించడం ఎంతో అవసరమన్నారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఒప్పంద కార్మికులు దోపిడీకి గురవుతున్నారన్నారు. నియమావళి, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్నారు. అధిక శాతం కాంట్రాక్టర్లే లాభపడుతున్నారని చెప్పారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడంలో లోపాలు ఉన్నాయన్నారు. ఔట్ సోర్సింగ్ విధానానికి సంస్థలు ఆసక్తి చూపుతున్నాన్నారు. కార్మికులు తమ హక్కులను పరిరక్షించుకుంటూ బాధ్యతతో మెలగాలన్నారు. ఈ సందర్భంగా ఒఎన్‌జిసి జనరల్ మేనేజర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఒప్పంద కార్మికులకు వేతన సవరణలు వర్తించని కారణంగా వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఒఎన్‌జిసి సంస్థలో ఒప్పంద కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా చేపడుతున్న విద్య, ఆరోగ్య భద్రత కార్యక్రమాలను వివరించారు. జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ నేడు 50 శాతం పైబడి ప్రతి సంస్థలో ఒప్పంద విధానంలో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి దర్శనమిస్తుందన్నారు. భారత్‌తో పోల్చితే ఒప్పంద కార్మికుల వేతనాలు చైనాలో రెండు రెట్లు, అమెరికాలో ఏడు రెట్లు అధికమన్నారు. పరిశ్రమల్లో సిబ్బందికి యంత్రాలపై అవగాహన కొరవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వీటిని యాజమాన్యం నిశితంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సుందరరావు కార్మిక చట్టాల ఆవశ్యకతను వివరించారు. కన్వీనర్ కె.జాన్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కన్వీనర్ డాక్టర్ జి.వెంకటరావు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

కొత్తదారుల్లో గంజాయి అక్రమ రవాణా
* 150 కిలోల గంజాయి పట్టివేత
* రెండు ఆటోలు, బైక్ స్వాధీనం
* ఏడుగురు అరెస్ట్
నర్సీపట్నం, డిసెంబర్ 18: గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్తదారులు వెతుకుతున్నారు. పోలీసులు దాడులు చేసి భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం కొత్త మార్గాలను అనే్వసిస్తూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. తాజాగా డోర్‌మ్యాట్‌ల మద్యన గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. పట్టణ పోలీసులకు అందిన సమాచారం మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మాటు వేసి వాహనాల తనిఖీ చేస్తుండగా డోర్ మ్యాట్‌ల మధ్య ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టణ సిఐ ఆర్‌వి ఆర్‌కె చౌదరి అందించిన వివరాల ప్రకారం చింతపల్లి నుండి రెండు ఆటోలు, ఒక మోటార్ బైక్‌పై గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు ప్రభుత్వ డిగ్రీకళాశాల వద్ద సిఐ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మల్లేశ్వరరావు వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న ఆటోలను ఆపి తనిఖీ చేయగా కొబ్బరి పీచుతో తయారు చేసిన డోర్‌మ్యాట్‌ల మద్య ఉన్న గంజాయిని గుర్తించామన్నారు. సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో తమిళనాడు రాష్ట్రం మధురై సమీపంలోని కడిపట్టి గ్రామానికి చెందిన హుడి (45), ఆరుణ్‌రాజ్‌వీరణం (30), పెరియా కరిపాట్ (45), చింతపల్లి మండలం బైలకించంగికి చెందిన సమ్మిరెడ్డి సతీష్ (27), పసుపులేటి రవికుమార్ (19), ఆటో డ్రైవర్ సిరిమట్ల సతీష్ (21), ఆటో డ్రైవర్ బోనంగి నానాజీ (25)లున్నారు. రెండు ఆటోలు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఆటోలు చింతపల్లికి చెందినవిగా గుర్తించినట్లు సిఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్సైలు మల్లేశ్వరరావు, అప్పలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
చోడవరం, డిసెంబర్ 18: జిల్లాలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ద్వారా 45వేల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించామని జిల్లా పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశరావు తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ భవనంలో వెలుగు, పిఎసిఎస్ సిబ్బందికి ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధివిధానాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. వీటిలో వెలుగు (డిఆర్‌డిఎ) ద్వారా ఎనిమిది, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 14 కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ కేంద్రాల వద్ద ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48గంటల వ్యవధిలో ఆయా రైతులకు ఆన్‌లైన్ విధానం ద్వారా చెల్లింపులు ఉంటాయన్నారు. ఖరీఫ్ రైతుల నుండి 45వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశముంటుందన్నారు. 1001, స్వర్ణ వంటి సాదారణ రకాలతోపాటు మేలు రకాలైన ఆర్‌జిఎల్, 1010 ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద సంబంధిత అధికారుల బృందం చిత్తశుద్ధితో వ్యవహరించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా నిబంధనల మేరకు సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అధికారులు పట్నాయక్, దేవరాజు, లక్ష్మీపురం, దండిసురవరం, వడ్డాది తదితర ఆరు పిఎసిఎస్‌లకు చెందిన సిబ్బంది, ఒమ్మలి, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, ఆనందపురం తదితర మండలాలకు చెందిన వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

కొండుపాలెంలో 60 మందికి డయేరియా
* బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులే అధికం
* మెరుగైన వైద్యానికి ఎం.పి,ఎమ్మెల్యే ఆదేశాలు
అనకాపల్లి, డిసెంబర్ 18: మండలంలోని కొండుపాలెం గ్రామంలో 60 మందికి డయోరియా రావడంతో వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అధికారులు, గ్రామస్తులు శుక్రవారం అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే కొండుపాలెం గ్రామానికి చెందిన సుమారు 60 మంది డయేరియాసోకడంతో శుక్రవారం మధ్యాహ్నం నుండి పసిపిల్లలకు, వృద్దులకు వాంతులు, విరోచనాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్.డి.ఓ పద్మావతి కొండుపాలెం గ్రామానికి చేరుకుని సంబంధిత అధికారులను అప్రమత్తం చేసారు. దీంతో అనకాపల్లి, సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్.డి.ఓ పద్మావతి రోగులను హుటాహుటీన తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు ఆమె ఆదేశించారు. అంతేకాకుండా ఎం.పి అవంతి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పీలాగోవింధసత్యనారాయణలకు ఈ సమాచారం అందడంచో ఎం.పి సోదరుడు మహేష్, తెలుగుదేశం నాయకులు తరలివెళ్లి సహాయసహకారాలు అందించారు. ఈ మేరకు డయోరియాకు గురైన వారు ఆయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సాంకేతికత, సదుపాయాల సమ్మిళితమే స్మార్ట్‌సిటీ
* వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు
విశాఖపట్నం, డిసెంబర్ 18: సాంకేతికత, సదుపాయాల సమ్మిళితమే స్మార్ట్‌సిటీ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు అన్నారు. శుక్రవారం ఉదయం ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలోని ఇంజనీరింగ్ కళాశాల ఆర్చిటెక్చర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘స్మార్ట్‌సిటీస్-కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్ హ్యూమన్ పెర్‌ఫార్మెన్స్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌సిటీల నిర్మాణంలో సాంకేతికతను విస్తరించడం, వినియోగించడం ఎంత ప్రధానమో అదే స్ధాయిలో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విశాఖ నగరానికి స్మార్ట్‌సిటీగా మర్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. నిరంతర విద్యుత్, నీటిసరఫరా, వేగవంతమైన రవాణా వ్యవస్థ, అవినీతి రహిత సత్వర సేవలు, కాలుష్య రహిత పరిసరాలు వంటివి ఉండాలన్నారు. తీరప్రాంత రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రావు ఎఐఎంఎస్‌సిఎస్ డైరెక్టర్ అల్లం అప్పారావు మాట్లాడుతూ విశాఖలో హుదూద్, చెన్నైలో వర్షాల నుంచి పాఠాలను నేర్చుకోవాల్సి ఉందన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, ప్రగతిలో ఆర్కిటెక్చర్, ప్లానింగ్ విభాగం ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. విపత్తులను తట్టుకొని నిలచే విధంగా నగర నిర్మాణాలు ఉండాలన్నారు. జ్ఞాన ఆధారిత నాయకత్వం సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యం, నాణ్యమైన జీవనం వంటివి పరిగణనలోకి తీసుకోవడం అవసరమన్నారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రధానమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్‌వి రామచంద్రమూర్తి ఆర్కిటెక్చర్ ప్రగతిని వివరించారు. ప్రొఫెసర్ రేవతిదేవి, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.సుదీర్‌కుమార్, విదేశీ ప్రతినిధి మెహదీ కమస్సీ తదితరులు ప్రసంగించారు.