క్రీడాభూమి

గుప్టిల్ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30 బంతుల్లో 93 పరుగులు శ్రీలంకపై కివీస్ రెండో విజయం

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 28: మార్టిన్ గుప్టిల్ మెరుపు ఇన్నింగ్స్ శ్రీలంకతో సోమవారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో న్యూజిలాండ్‌కు పది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. అతను కేవలం 30 బంతుల్లో 93 పరుగులు చేసి, కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 0-2 తేడాతో వెనుకబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. నువాన్ కులశేఖర 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే ఆ జట్టు వైఫల్యాలు ఏ స్థాయిలో కొనసాగాయో ఊహించుకోవచ్చు. మాట్ హెన్రీ 33 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టగా, నాథన్ మెక్‌గ్లీనగన్ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. వీరిద్దరి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన లంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
శ్రీలంకను ఓడించి, సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించడానికి 118 పరుగుల లక్ష్యంతో కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. గుప్టిల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫస్ట్‌స్లిప్స్‌లో ఫీల్డర్ క్యాచ్‌ని వదిలేయడంతో లభించిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కులశేఖర వేసిన ఒక ఓవర్‌లో 14 పరుగులు సాధించిన అతను ఆ వెంటనే దుష్మంత చమీర ఓవర్‌లో 26 పరుగులు రాబట్టాడు. 16 పరుగులో అర్ధ శతకాన్ని సాధించి ఎబి డివిలియర్స్ నెలకొల్పిన రికార్డును సమం చేసే అవకాశాన్ని గుప్టిల్ కేవలం ఒక బంతి తేడాతో కోల్పోయాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గుప్టిల్ చివరి వరకూ అదే దూకుడును కొనసాగించాడు. 30 బంతులు ఎదుర్కొని అజేయంగా 93 పరుగులు చేసిన అతని స్కోరులో 9 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. 20 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేసిన లాథమ్ అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు. గుప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరుబోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: దనుష్క గుణతిలక సి సాంట్నర్ బి హన్రీ 17, తిలకరత్నే దిల్షాన్ సి టేలర్ బి హెన్రీ 7, లాహిరు తిరిమానే సి హెన్రీ బి మెక్‌క్లీనగన్ 1, దనీష్ చండీమల్ ఎల్‌బి డౌగ్ బ్రాస్‌వెల్ 9, ఏంజెలో మాథ్యూస్ సి రోన్చీ బి మెక్‌క్లీనగన్ 17, మిలింద సిరివర్ధనే సి నికోలస్ బి మెక్‌కీలగన్ 12, చమర కపుగడేర రనౌట్ 12, నువాన్ కులశేఖర సి లాథమ్ బి హెన్రీ 19, సచిత్ర సేనానాయకే బి హెన్రీ 0, దుష్మంత చమీర సి రోన్చీ బి సోధీ 9, జెఫ్రీ వాండర్సే నాటౌట్ 7, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (27.4 ఓవర్లలో ఆలౌట్) 117.
వికెట్ల పతనం: 1-20, 2-29, 3-31, 4-54, 5-56, 6-81, 7-81, 8-81, 9-94, 10-117.
బౌలింగ్: డౌగ్ బ్రాస్‌వెల్ 6-2-31-1, మాట్ హెన్రీ 9.4-2-33-4, నాథన్ మెక్‌క్లీనగన్ 8-0-32-3, మిచెల్ సాంట్నర్ 1-0-5-0, ఇష్ సోధీ 3-0-12-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ నాటౌట్ 93, టామ్ లాథమ్ నాటౌట్ 17, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (8.2 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 118.
బౌలింగ్: దుష్మంత చమీర 2-0-41-0, నువాన్ కులశేఖర 2-0-19-0, సచిత్ర సేనానాయకే 2.2-0-22-0, జెఫ్రీ వాండర్సే 2-0-34-0.