రంగారెడ్డి

భగీరథపైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 21: మిషన్ భగీరథ పనులపై ప్రజలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న తరుణంలో మిషన్ భగీరథ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయని ఎదురు చూస్తున్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలోని గ్రామాలలో 50 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 50 శాతం పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో పైపులైన్ నిర్మాణం పనులతోపాటు నీటి ట్యాంకుల నిర్మాణాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రారంభ దశలో కొన్ని, తుది దశకు చేరిన నిర్మాణాలు మరికొన్ని దర్శనమిస్తున్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఫరూఖ్‌నగర్ మండల శివారులోని కమ్మదనం అటవీ ప్రాంతం వద్ద మిషన్ భగీరథ ప్రధాన జలకేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబందించిన పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రధాన జలకేంద్రం నుండి నియోజకవర్గంలోని 98 గ్రామాలకు, గిరిజన తండాలకు నీటిని అందించే దిశగా పైపులైన్ల పనులు చేపట్టారు. షాద్‌నగర్ మీదగా కొందుర్గు వైపునకు వెళ్లే పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల పనులు మినహా మిగతావి పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. పురపాలక సంఘంతోపాటు ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో నీటి నిలువ చేసే ట్యాంకులను తరలించేందుకు సంపులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై అధికారులు కసరత్తులు కొనసాగిస్తున్నారు. నీటి ట్యాంకుల నిర్మాణాల కోసం పురపాలక సంఘం పరిధిలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎంపిక చేయాల్సి ఉంది. 2018 ఫిబ్రవరి నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికి సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం గడువును 2018 డిసెంబర్ వరకు పొడగించింది. ఈ వేసవిలో భగీరథ నీరు ప్రజలకు అందే అవకాశం లేనట్టేనని చెప్పవచ్చు. వచ్చే ఏడాదికైనా నీరు అందిచేలా చూడాలన్న లక్ష్యంతో అధికారులు ఎమ్మెల్యే పర్యవేక్షణలో ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తగ్గుతున్న భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ పథకం నీరు సకాలంలో వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నీటి ట్యాంకుల నిర్మాణాలు
నియోజకవర్గ పరిధిలో నీటి ట్యాంకుల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఫరూక్‌గనర్ మండలంలో 45 నీటి ట్యాంకులు, కొత్తూరు మం డలంలో 20 నీటి ట్యాంకులు, నందిగామ మండలంలో 16 నీటి ట్యాంకులు, చౌదరిగూడ మండలంలో 17 నీటి ట్యాంకులు, కొందుర్గు మండల పరిధిలో 24 నీటి ట్యాంకులు, కేశంపేట పరిధిలో 28 ట్యాంకులు ఇప్పటికే మంజురై వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని ట్యాంకులు మంజూరు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో నీటి నిలువకు ఆస్కారం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద, చించోడ్, బూర్గుల వంటి గ్రామాలకు 1.20 లక్షల లీటర్ల సామర్య్థం కలిగిన నీటి ట్యాంకులు మంజూరు చేశారు. కిషన్‌నగర్ గ్రామానికి 90వేల లీటర్ల, దూసకల్, వెలిజర్ల గ్రామాలకు 70వేల లీటర్ల ట్యాంకులు, అయ్యావారిపల్లి, కమ్మదనం, కాశిరెడ్డిగూడ, ఎలికట్ట, మధురాపూర్, చౌలపల్లి, కంసాన్‌పల్లి, దేవున్‌పల్లి గ్రామాలకు 60వేల లీటర్ల ట్యాంకులు మంజూరు చేశారు. మిగతా గ్రామాలు, తండాల్లో అక్కడి జనాభాకు అనుగుణంగా 10వేల నుంచి 40వేల లీటర్ల సామర్య్థం కలిగిన ట్యాంకులను నిర్మిస్తున్నారు. మరికొన్ని తండాలు, గ్రామాలకు అవరమైన ట్యాంకులను త్వరలో మంజూరు చేయనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పేర్కొంటున్నారు.

అటవీ సంరక్షణ సామాజిక బాధ్యత
మేడ్చల్, మార్చి 21: రాబోయే తరాలకు ఆస్తులు.. అంతస్తులు అక్కర్లేదని.. వాతావరణ సమతుల్యం కోసం పచ్చదనమే భవిష్యత్ తరాలకు భారీ ఆస్తి అని అటవీశాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డును ఆనుకునివున్న ఆక్సిజన్ పార్కును ఆటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రామన్న మాట్లాడుతూ నగరం చుట్టూ అటవీ స్థలాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెప్పారు. పర్యావరణంలో ఏర్పడుతున్న మార్పులతో భవిష్యత్ తరాలు నష్టపోయే అవకాశమున్నందున విరివిగా చెట్లను పెంచే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ పెద్ద ఎత్తున అటవీ స్థలాలు ఉన్నాయని దేశంలో ఏ రాజధానికి కూడా ఇలాంటి సౌకర్యం లేదని వివరించారు. నగరం చుట్టూ 130 సైట్‌లలో 180 బ్లాక్‌లను లక్షా 50 వేల ఎకరాల అటవీ స్థలాన్ని అభివృద్ధి పరచి నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఇప్పటికే 26 బ్లాక్‌లను అభివృద్ధి చేశామని తెలిపారు. సమాజాన్ని కాపాడుకోవడానికి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. జీవమున్న ప్రతి జీవరాశికి ప్రాణవాయువు తప్పనిసరని పేర్కొన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దూరదృష్టితో ఎన్ని అవమానాలెదురైనా హరితహారాన్ని విజయవంతం చేసేందుకు అటవీశాఖ తరఫున తమ సిబ్బంది అంకితభావంతో కృషి చేస్తున్నారని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కోరిక మేరకు కీసరగుట్ట చుట్టుపక్కల గల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కు స్థలాన్ని పరిశీలించారు. పార్కులో ఏర్పాటుచేసిన వివిధ ఆకృతులను మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆటవీశాఖ అధికారులు పీకే ఝా, మునీంద్రా, జీ.చంద్రశేఖర్ రెడ్డి, రఘువీర్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, మల్లికార్జున్ నాయక్, మంజుల, చంద్రయ్య, శ్రీనివాస్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ శైలజ హరినాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి, సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.