అంతర్జాతీయం

‘హద్దు’మీరితే బుద్ధి చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 16: శత్రువులు నిర్లక్ష్యంగా, దుందుడుగా ఏదయినా చర్య తీసుకుంటే పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెబుతుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం హెచ్చరించారు. భారత్ సరిహద్దుకు ఆనుకుని పంజాబ్ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో జరిగిన సైనిక విన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శత్రువులు ఏదయినా నిర్లక్ష్యంగా, దుందుడుగా వ్యవహరిస్తే ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ‘రాద్ ఉల్ బర్క్’ సైనిక విన్యాసాలు నిరూపించాయని ఆయన అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని నావల్పూర్ సమీపంలోని ఖైర్‌పూర్ తమేవాలిలో జరిగిన సైనిక విన్యాసాలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యమ్రానికి నవాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, సైనిక దళాల ప్రధానాధికారుల కమిటీ చీఫ్ జనరల్ రషీద్ మహవౌద్, త్రివిధ దళాల ప్రధానాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సైనిక విన్యాసాలు మన సైన్యం సన్నద్ధతకు అద్దం పడతాయన్న నవాజ్ షరీఫ్ ఏ దేశం కూడా తమ దేశ భద్రతకు ఎదురయిన ప్రమాదాలను చూస్తూ ఊరుకోదన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఏడుగురు పాకిస్తానీ సైనికులు భారత జవాన్ల చేతిలో హతమైన రెండు రోజులకే జరిగిన ఈ సైనిక విన్యాసాల్లో జెఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, అల్-ఖాలిద్ యుద్ధ ట్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేశాయి.
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న విధానాన్ని పాకిస్తాన్ పాటిస్తోందని, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికోసం ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని ఆశిస్తోందని షరీఫ్ అన్నట్లు పాకిస్తాన్ రేడియో పేర్కొంది. అయితే ఈ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో మనకెలాంటి సంబంధం లేదని భావిస్తూ ఊరుకోలేమని దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే ప్రయత్నాలను గట్టిగా తిప్పి కొట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
జమ్మూ, కాశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ, భారత్, పాకిస్తాన్‌ల మధ్య ముఖ్యమైన వివాదంగా అది ఇప్పటికీ మిగిలి ఉందని షరీఫ్ చెప్పారు. జమ్మూ, కాశ్మీర్‌లో ఇటీవల ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాలను అణచివేయడానికి వాడుతున్న అమానుష యత్నాలు ఎలాంటి ఫలితాలనివ్వబోవని ఆయన అంటూ, నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులను, పౌరులను హత్య చేయడం ఒక విధంగా దురాక్రమణ చర్యేనని, దీన్ని తప్పకుండా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కారణంగా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని కూడా షరీఫ్ అన్నారు. దక్షిణాసియా ఘర్షణలకు లోనయ్యే ప్రాంతంగా ఉండిపోవడం దురదృష్టకరమని కూడా ఆయన అన్నారు.