అంతర్జాతీయం

వెల్లివిరిసిన మైత్రీ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మే 30: భారత్, జర్మనీల మధ్య ఫలితాలు సాధించే విధంగా పరస్పర సహకారం విస్తృతం కావల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉందని జర్మనీ చాన్సలర్ ఎంజీలా మెర్కెల్‌తో విస్తృత స్థాయి చర్చల సందర్భంగా స్పష్టం చేశారు. వాణిజ్యం, నైపుణ్య అభివృద్ధి, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధన వంటి అనేక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఎమిమిది కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. తరువాత మోదీ-మెర్కెల్‌లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయని వాటి లక్ష్యం, అంతిమ ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. మొదటి నుంచీ కూడా జర్మనీకి భారత్ శక్తివంతమైన మిత్రదేశంగా కొనసాగుతునే ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జర్మనీ చాన్సలర్‌తో తాను అర్ధవంతమైన చర్చలు జరిపానని మోదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఒప్పందంలో భాగంగా ఈ నాలుగో వార్షిక సమావేశం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై ఈ సందర్భంగా చర్చించారు. మొత్తం ద్వైపాక్షి సంబంధాలనే పునఃసమీక్షించామని మోదీ ప్రకటించారు. కేవలం చర్చిలతో సరిపెట్టకుండా నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా వీటిని ముందుకు తీసుకెళ్లే అంకితభావంతోనే పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు.
ఉగ్రవాదం, మొత్తం ప్రపంచ శాంతికే పెను ముప్పుగా మారిందని, దీన్ని మానవీయ శక్తులన్నీ ఉమ్మడి బలంతో అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ పిలుపునిచ్చారు. భారత్, జర్మనీల భాగస్వామ్యం వల్ల పరస్పరం లబ్ధిపొందడమే కాకుండా ప్రపంచ శాంతి, ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతగానో ఊతం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెర్కెల్ భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశమని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా రెండు దేశాలు ఎప్పటికప్పుడు సహకారాన్ని పెంపొందించుకుంటునే వస్తున్నాయని వెల్లడించారు. అణు సరఫరా గ్రూపులో భారత్ సభ్యత్వానికి జర్మనీ మద్దతు ఇచ్చినందుకు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రెండు దేశాలు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అంతర్జాతీయంగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తామని అదే విధంగా అంతర్జాతీయంగా అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి పట్టుదలగా పనిచేస్తామంటూ ఇరువురు నేతలూ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
ఇంత బిజీలోనూ...
ఓ పక్క జర్మనీ నాయకత్వంతో విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ తీరిక చేసుకుని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కలుసుకున్నారు. తన తాజా చిత్రం బేవాచ్ ప్రచారం కోసం ప్రియాంక ఇక్కడకు వచ్చారు. మోదీతో తాను కలుసుకున్న ఫొటోను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

చిత్రం... మంగళవారం బెర్లిన్‌లో జరిగిన విస్తృతస్థాయ చర్చల అనంతరం
జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ముచ్చటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ