అంతర్జాతీయం

హైడ్రోజన్ బాంబు పేల్చిన ఉత్తర కొరియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 6: ప్రపంచ దేశాలను ముఖ్యంగా బద్ధ శత్రువైన దక్షిణ కొరియాను విస్మయానికి గురి చేస్తూ ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు బుధవారం ప్రకటించింది. జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన బాంబు అంత శక్తి కలిగినదిగా నిపుణులు అంచనా వేస్తున్న ఈ బాంబు ప్రయోగంతో తమ దేశం అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్రరాజ్యాల సరసన నిలిచినట్లయిందని ఉత్తర కొరియా చెప్పుకొంది. అయితే తాముగా ఎవరిపైనా ఈ బాంబును ప్రయోగించబోమని, ఎవరైనా తమపై దాడి చేస్తే మాత్రం తప్పకుండా ప్రయోగించి తీరుతామని హెచ్చరించింది. అంతేకాక అమెరికా, దాని మిత్ర దేశాలు ఉత్తర కొరియా వ్యతిరేక విధానాన్ని కొనసాగించినంత కాలం తమ అణ్వస్త్ర పరిశోధనలు ఆగబోవని స్పష్టం చేసింది. కాగా, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించిన తర్వాత అమెరికా బలగాలతో కలిసి తన రక్షణ వ్యవస్థల పాటవాలను ద్విగుణీకృతం చేయాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనను ప్రంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు మాత్రం విశ్వసించడం లేదు. ఒక వేళ అదే గనుక నిజమైతే ఉత్తర కొరియా తన అణు పరిశోధనా రంగంలో గొప్ప పురోగతి సాధించిందనే భావించాలి.
హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా బుధవారం చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. జపాన్ ప్రధాని షింజే అబే ఈ పరీక్ష ఈ ప్రాంతమంతటికీ గొప్ప ముప్పని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి ఇది విరుద్ధమని అన్నారు. హైడ్రోజన్ బాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించగానే న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం అత్యవసరంగా సమావేశం కానున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఈ పరీక్షను ధ్రువీకరించలేదు కానీ ఉత్తర కొరియా జరిపే రెచ్చగొట్టే చర్య దేనికైనా దీటుగా స్పందించి తీరుతామని ప్రకటించింది.
కాగా, ఉత్తర కొరియాకు దౌత్యపరంగా అండదండగా ఉండే చైనా దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ ఈ పరీక్ష ఐరాస తీర్మానాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని చైనా అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ ఉత్తర కొరియా రాజధాని పోంగ్యాంగ్‌నుంచి పంపిన ఓ కథనంలో పేర్కొంది. భారత్‌సైతం ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా ఖండించింది. కాగా, ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా ఖండించిన ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ అంతర్జాతీయ శాంతికి ఉత్తర కొరియా పెనుముప్పనే విషయాన్ని ఈ పరీక్ష మరోసారి రుజువు చేసిందని అన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు దేశ తొలి హైడ్రోజన్ బాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ప్రకటించింది. అంతేకాకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తమ దేశం ఆధునిక అణ్వస్త్ర సామర్థ్య దేశాల సరసన చేరిందని కూడా ఆ టీవీ తెలిపింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు జరిపిన ఈ పరీక్షను మొదట గుర్తించిన అంతర్జాతీయ భూకంప కేంద్రాలు ఆ దేశంలోని ప్రధాన అణు పరీక్షల కేంద్రమైన పుంగీ-రీకి అనుకుని రిక్టర్ స్కేలుపై 5.1 పాయింట్ల తీవ్రతతో వచ్చిన భూకంపంగా పేర్కొన్నాయి. తమ దేశం ఇప్పటికే హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసిందని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ గత నెలలోనే ప్రకటించడం తెలిసిందే.

చిత్రం... ఉత్తర కొరియా టెలివిజన్ చానెళ్లలో ప్రసారమవుతున్న హైడ్రోజన్ బాంబు పేలుడు