అంతర్జాతీయం

మసూద్‌పై ఆంక్షలను అడ్డుకోవడం అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 2: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ప్రధాన కుట్రదారు మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో ఉంచాలన్న తమ దరఖాస్తుపై చైనా సాంకేతిక అభ్యంతరాలను చూపించి అడ్డుకోవడం తమకు తీవ్ర నిరాశ కలిగించినట్లు భారత్ పేర్కొంటూ, ఈ చర్య అసమగ్రమైనదని అభిప్రాయ పడింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆరోపిస్తూ, ఈ చర్య మొత్తం ప్రపంచంపైనే తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. ఉగ్రవాదం ముప్పును కూకటి వేళ్లతో తుదముట్టించాలన్న కృతనిశ్చయాన్ని ఇది ఎంతమాత్రం ప్రతిబింబించడం లేదని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఆంక్షల జాబితాలో చేర్చాలన్న భారత్ అభ్యర్థనపై సాంకేతిక అభ్యంతరాన్ని చూపించడం తమకు ఎంతో నిరాశ కలిగించిందని వికాస్ స్వరూప్ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నందుకు 2001లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ను నిషేధిత జాబితాలో చేర్చిందని, అలాంటప్పుడు దాని వ్యవస్థాపకుడు, ఫైనాన్షియర్, ప్రోత్సాహకుడిని నిషేధిత జాబితాలో చేర్చడంపై సాంకేతిక కారణాలు చూపించడం ఏమాత్రం సబబు కాదని భారత్ అభిప్రాయపడుతున్నట్లు ఆయన చెప్పారు. మసూద్ అజర్‌ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకపోవడం కారణంగా ఎదురయ్యే ఫలితాలను భారత్ ఇప్పటికీ భరించాల్సి వస్తోందని గత జనవరి 2న జరిగిన పటాన్‌కోట్ దాడి నిరూపిస్తోందని, ఉగ్రవాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌లు కలిగి ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై ఉంటుందని ఆయన అన్నారు. భద్రతా మండలి తీర్మానాల లక్ష్యం జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర ముఠాల కార్యకలాపాల నుంచి అన్ని దేశాలను రక్షించేదిగా ఉండాలని కూడా వికాస్ స్వరూప్ అన్నారు.
బ్లాక్ లిస్ట్‌కు తగిన కారణాలు లేవు: చైనా
ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఎదుర్కోవడానికి వీలుగా మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా గుర్తించడానికి వీలులేదని, ఎందుకంటే భద్రతా మండలి ఆంక్షలు విధించడానికి అవసరమైన కారణాలు ఆయన విషయంలో లేవని ఐక్యరాజ్య సమితిలాంటి అంతర్జాతీయ వేదికల్లో ప్రతిసారీ పాకిస్తాన్‌కు మద్దతు తెలిపే చైనా వ్యాఖ్యానించింది. ఎవరినైనా బ్లాక్‌లిస్టులో చేర్చడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉండాలని ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి లియు జీయి శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన చైనా ఏప్రిల్ నెలకు రొటేషన్ పద్ధతిపై మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన సమయంలోనే లియు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి సమస్యలపైన చైనా ఎప్పుడు కూడా వాస్తవాల ఆధారంగా వాస్తవ దృక్పథంతో న్యాయమైన రీతిలో స్పందిస్తుందని చైనా విదేశాంగ ప్రతినిధి చెప్పారు.