అంతర్జాతీయం

పాక్‌లో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 25: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా ఫైజాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి అనేక నగరాల్లో శనివారం నాడు అనూహ్యంగా అల్లర్లు చెలరేగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బందిపై కొన్ని మతవాద సంస్థల కార్యకర్తలు రాళ్లు విసురుతూ ఘర్షణలకు దిగారు. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు స్థానిక యంత్రాంగానికి సహకరించాలని ప్రభుత్వం సైన్యానికి హుకుం జారీ చేసింది. రాజధాని ఇస్లామాబాద్‌లో ఎటుచూసినా సైన్యం కదలికలే కనిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాక్ రాజ్యాంగంలోని 245 అధికరణం మేరకు ఆర్మీని రంగంలోకి దింపారు. ఆర్మీ అధిపతి జనరల్ ఖ్వమార్ దేశాధ్యక్షుడు షాహిద్ అబ్బాసీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అనంతరం అనేక చోట్ల సైన్యం రంగ ప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యం తక్షణ చర్యలను ప్రారంభించింది. పలు నగరాల్లో రహదారులను నిర్బంధించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రయత్నించగా భారీ స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఓ పోలీసు
అధికారి మరణించగా, సుమారు 200 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఫైజాబాద్‌లోని ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ వేను, ముర్రీ రహదారిని ఆందోళనకారులు మూసివేశారు. ఫలితంగా ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుకు, రావల్పిండికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఇస్లామాబాద్‌కు వెళ్లే రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత పోలీసులు, పారా మిలటరీ దశాలు రంగ ప్రవేశం చేయగా అల్లర్లు చెలరేగి ఓ పోలీసు అధికారి మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఫైజాబాద్ వద్ద రహదారులపై తిష్ట వేసిన తెహ్రీక్-ఏ లాబాయిక్ పార్టీ కార్యకర్తలను ఖాళీ చేయించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఫైసలాబాద్, పెషావర్, సిలాకోట్, వాజీరాబాద్ రహదారులను కూడా ఆందోళనకారులు నిర్బంధించారు.
పాకిస్తాన్ న్యాయశాఖామంత్రి జహీద్ హమీద్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో గత ఇరవై రోజులుగా ఇస్లామాబాద్- రావల్పిండి రహదారిని నిరసనకారులు నిర్బంధించారు. ఓ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖా మంత్రి హమీద్ తీరును తప్పు పడుతూ తెహ్రీక్ ఏ- లాబాయిక్ యా రసూల్ అల్లా పార్టీకి చెందిన సుమారు రెండువేల మంది కార్యకర్తలు ఈనెల 6 నుంచి ఇస్లామాబాద్-రావల్పిండి రహదారిని నిర్బంధించారు. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ఓ బాలుడు మరణించాడు. ఈ పరిణామాలపై ఇస్లామాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారిపై ఆందోళనకారులను తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను అంతర్గత భద్రతాశాఖా మంత్రి అహ్సన్ ఇక్బాల్ అమలు చేయకపోవడంతో హైకోర్టు మండిపడింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం నాడు పోలీసులను, పారా మిలటరీ దళాలను రంగంలోకి దింపింది. అయినా ఫలితం లేకపోవడంతో సైన్యాన్ని రప్పించింది. పోలీసులు, భద్రతాదళ సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అనేక నగరాల్లో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ మరోవైపు పరిస్థితి విషమిస్తూనే ఉంది.
సామాజిక మీడియాపై నిషేధం
పోలీసులు, భద్రతాదళాలు ఆందోళనకారులను తొలగించేందుకు ప్రయత్నించిన సమయంలో పాక్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మీడియాను నిలిపివేసింది. అన్ని న్యూస్ చానళ్లను రద్దు చేసిన తర్వాత సామాజిక మీడియాను నిలిపివేశారు. ఇతర ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం చూపాల్సిందిగా ఆర్మీ అధిపతి క్వమర్ కవెద్ బజ్వా ప్రధాన మంత్రి షహీద్ అబ్బాసీతో ఫోన్‌లో మాట్లాడినట్లు మిలటరీకి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. ఆందోళనకారులను తొలగించడంతో పోలీసులు విఫలం కావడంతో భద్రతాదళాలను రంగంలోకి దించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో 35 మంది భద్రతాసిబ్బంది గాయపడ్డారు. రహదారిపై నుంచి తొలగని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనకతప్పదని ఇస్లామాబాద్ నగర మెజిస్ట్రేట్ ఆందోళనకారులను శుక్రవారం హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం నుంచే భద్రతాదళాలు ఇస్లామాబాద్-రావల్పిండి రహదారికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. సుమారు 8వేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆందోళనకారులను తొలగించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కోర్టు ఆగ్రహం చెందడంతో భద్రతాదళాలు ఇంకా తమ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.