అంతర్జాతీయం

కన్నుమూసిన కృష్ణబిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 14: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ (76) బుధవారం శాశ్వతంగా ఈ లోకాన్ని వీడారు. కేంబ్రిడ్జిలోని తన స్వగృహంలో ప్రశాంతంగా కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కృష్ణబిలాలపై ఆయన చేసిన లోతైన పరిశోధనలు జగద్విఖ్యాతం. ఐన్‌స్టీన్‌తో సమాస్థాయి శాస్తవ్రేత్తగా పరిగణన పొందారు. స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942, జనవరి 8న జన్మించారు. సరిగ్గా 300 సంవత్సరాల ముందు, అదే రోజున ప్రఖ్యాత వ్యోమగామి, భౌతికశాస్తవ్రేత్త గెలీలియో గాలిలీ మరణించాడు. హాకింగ్ ‘అమెయోట్రోఫిక్ లేటరల్ స్ల్కిరోసిస్ (ఎఎల్‌ఎస్) వ్యాధితో బాధపడ్డారు. నిజానికి ఈ వ్యాధి సోకినవారు ఎంతోకాలం జీవించరు. 1963లో, హాకింగ్ 21వ ఏట ఈ వ్యాధిని తొలిసారి గుర్తించారు. డాక్టర్లు కూడా ఈయన కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని తేల్చేశారు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో
తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్తవ్రేత్తగా రూపొందారు హాకింగ్. ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత ఈ రంగంలో అంతటిస్థాయి శాస్తవ్రేత్తగా గుర్తింపు పొందింది స్టీఫెన్ హాకింగ్ మాత్రమే.
ఎఎల్‌ఎస్ వ్యాధి ఆయన్ను వీల్‌ఛైర్‌కు మాత్రమే పరిమితం చేసింది. కేవలం కొన్ని చేతివేళ్లు మాత్రమే కదిలించగలిగే స్థితి. మిగిలిన శరీరభాగమంతా చచ్చుబడిపోయింది. పూర్తిగా ఇతరులపైన లేదా సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారం. వీల్‌ఛైర్‌పైనే జీవితాన్ని గడిపిన స్టీపెన్ హాకింగ్, ప్రత్యేక పద్ధతిలో మాట్లాడేవారు. ఆయన జీవితం దృఢసంకల్పానికి ఒక గొప్ప ఉదాహరణ.
హాకింగ్, తన సహచర శాస్తవ్రేత్త రోజర్ పెన్‌రోజ్‌తో కలిసి 1970లో కృష్ణబిలాలపై తొలి పరిశోధనను ఆవిష్కరించారు. ఇందులో ఆయన కృష్ణబిలాలకు సంబంధించిన గణితాన్ని, మొత్తం విశ్వానికి వర్తింపజేశారు. 1982లో ‘‘క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్’’ గురించి మొట్టమొదట వివరించిన వారిలో హాకింగ్ కూడా ఒకరు. విశ్వంలో గెలక్సీలు వేగంగా విస్తరించడానికి ఈ క్వాంటమ్ ఫ్లక్చువేషనే్స కారణం కావచ్చని ఆయన ఊహించారు.
‘‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’’ పుస్తకంతో ఒక్కసారిగా ఆయన ప్రతిష్ఠ అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఈ పుస్తకం తొలిసారి 1988లో ప్రచురితమైంది. ‘ది సండే టైమ్స్’లో ఎకబిగిన 237 వారాలు సీరియల్‌గా వచ్చి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. మొత్తం 10 మిలియన్ కాపీలు అమ్ముడు పోగా, 40 భాషల్లోకి అనువాదమైంది.
ఆయన మేధస్సుకు అనేక అవార్డులు వరించాయి. ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, ఓల్ఫ్ ప్రైజ్, కోప్లే మెడల్, ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ వంటివి వాటిల్లో ఉన్నాయి. అయితే ఆయన నోబెల్ బహుమతికి మాత్రం ఎంపిక కాలేదు. బ్రిటిష్ పౌరుడైనప్పటికీ, యుఎస్ అత్యున్నత అవార్డు అయిన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా అందుకున్నారు.
తనకు ఈ వ్యాధి సోకిందని మొట్టమొదట నిర్ణయించిన తర్వాత తానెలా భావించింది, 2013లో రచించిన తన స్వానుభవాల్లో ఈవిధంగా పేర్కొన్నారు, ‘‘చాలా అన్యాయం. ఈ వ్యాధి నాకే ఎందుకు సోకాలి? నా జీవితం ముగిసినట్లేనని భావించా. నాలో ఉన్న సంభావ్య శక్తిని నేనాడు గుర్తించలేదు. కానీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత... నాజీవితం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నా.’’ ఒకసారి ఆయన ఇలా అన్నారు, ‘‘స్ఫూర్తిపరమైన వైకల్యం లేనంతవరకు, భౌతిక వైకల్యాలకు భయపడాల్సిన లేదా పరిమితం కావాల్సిన అవసరం లేదని నేను ప్రజలకు చూపదలచుకున్నా’’.
2014లో ‘ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ చిత్రం స్టీఫెన్ హాకిన్‌పై తీసిందే. ఇందులో ఎడ్డి రెడ్‌మయేన్ శాస్తవ్రేత్త పాత్రను పోషించారు. ఇందుకు ఆయన ఆస్కార్‌కూడా అందుకున్నారు.
స్టీఫెన్ హాకింగ్ మృతికి బ్రిటిష్ ప్రధాని థెరిస్సామే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2016లో ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ ఆవార్డును అందించే సమయంలో హాకింగ్ అన్న మాటలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతిరోజూ నేను ఎన్నో సంక్లిష్టమైన గణిత సంబంధ అంశాలపై అధ్యయనం చేస్తుంటాను. కానీ బ్రిగ్జిట్ గురించిన నన్ను ప్రశ్నించవద్దు’’ అని అన్నప్పుడు తన నోట మాటరాలేదని పేర్కొన్నారు. కాగా హాకింగ్ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోది, సత్య నాదెండ్ల తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
*
కాలము వేసిన కాటుకు
కాలూచేయాడనట్టి కష్టాల్లోనూ
కాలముతో ఢీకొంటూ
కాలానికి కారణాలు కనుగొనెనితడే!