అంతర్జాతీయం

ఎన్నాళ్లో.. వేచిన ఉదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 10: మరో 24 గంటల్లో ఆవిష్కృతం కానున్న అద్భుతాన్ని చవిచూసేందుకు ప్రపంచ దేశాలు కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాయి. ఆ అద్భుతం మరేదో కాదు. సింగపూర్ వేదికగా ట్రంప్-కిమ్ భేటీ.
మొన్నటివరకూ వాళ్లిద్దరూ శత్రువులు. ఒకరిమీద ఒకరు జోకులేసుకున్నారు. ఒకరినొకరు ఈటెల్లాంటి మాటలతో ఎత్తిపొడుచుకున్నారు. మాట వినకుంటే మూల్యం చెల్లించుకుంటావంటూ ఒకరు వార్నింగ్ ఇస్తే.. నువ్వొ పెద్ద పుడింగివి, మాట వినడానికి. నిన్ను మించిన పదునైన ఈటెలు (అణ్వాయుధాలు) నావద్దా ఉన్నాయంటూ మరొకరు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. ఒకరు రెచ్చగొడితే మరొకరు రెచ్చిపోయారు. ‘ఇక యుద్ధం అనివార్యం’ అనుకుంటున్న వేడి వాతావరణంలోకి ఒక్కసారిగా నైరుతి పవనాల్లాంటి మేఘాలు చొచ్చుకొచ్చాయి. ఇరు దేశాల మధ్య వాతావరణం చల్లబడింది. పెద్దన్న దేశం పలకరిస్తే.. ఉత్తర దిక్కు దేశం ఊకొట్టింది. వెరసి ‘మాట్లాడుకుందామా?’ అంటూ పరస్పరం ప్రతిపాదించుకున్నారు. కత్తులు దూసుకున్న దేశాధినేతలు కరచాలనతో మాట్లాడుకోడానికి రెడీ అయిపోయారు. పద్దెనిమిది నెలల ప్రయత్నాలకు బ్రేకులు పడుతూ అంతలోనే అవాంతరం. కబుర్లకు ‘కండిషన్లు అప్లై’ అంది అమెరికా. ‘నన్ను నేనే కంట్రోల్ చేసుకోను. నీ కండిషనే్లంటి?’ అంటూ నిలదీసింది ఉత్తర కొరియా. యూ ‘లిటిల్ రాకెట్ మేన్’ అని 71ఏళ్ల ట్రంప్ హూంకరిస్తే,.. యూ ఆర్ ‘మెంటల్లీ డీరేంజ్డ్’ అంటూ వయసుపై పదునైనా ఆయుధాన్ని ఎక్కుపెట్టాడు ఉత్తర కొరియన్ కిమ్ జోంగ్. మళ్లీ ప్రతిష్ఠంభన.. వేడెక్కిన వాతావరణం చూసి ఈసారి యుద్ధమే శరణ్యం అనుకున్నాయి ప్రపంచ దేశాలు. అంతలోనే అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరు నేతలూ శాంతించారు. మరోసారి ఉష్ణానికి అవకాశం లేకుండా కమ్ముకున్న మేఘాలు వాన కురిపించాయి. ముందనుకున్న ముహూర్తమూ దగ్గర పడింది. అదే, జూన్ 12. ఔను, వీళ్లిద్దరూ సింగపూర్‌లోని ద్వీపంలో సెంటోసా రిసార్ట్‌లో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో మాట్లాడుకోబోతున్నారు. ఆ టైంలో ఏం జరగబోతోంది.. వాళ్లిద్దరి నిర్ణయాలు ఎలా ఉంటాయి? ప్రపంచ దేశాలకు లాభమా? నష్టమా? అన్న ఆలోచనలతో భూమీదున్న బిలియన్ల జనం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
మొత్తానికి ఇద్దరూ ‘ఫేస్ టు ఫేస్’కు రెడీ అయ్యారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక రోజు ముందే ప్రత్యేక విమానంలో సింగపూర్‌లో అడుగుపెడితే, అటు జీ 7 సమ్మిట్‌ను ఆదరాబాదరా ముగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆదివారం సాయంత్రానికి సింగపూర్ ఫ్లైటెక్కాశారు. నిజానికి అధికారంలోవున్న అమెరికా అధ్యక్షుడిని అధికారంలోవున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు నేరుగా కలుసుకోవడం చరిత్రలో ఇదే ప్రథమం. అదీ అద్భుతం.
జీ 7 సమ్మిట్ నుంచి సింగపూర్‌కు బయలుదేరే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాట ‘శాంతి కోసం చిరు ప్రయత్నం’. ఉత్తర కొరియన్ల కోసం కిమ్ జోంగ్ ఏదో చేయాలని అనుకుంటున్నాడన్నది నా భావన. అదే నిజమైతే ఇంతకుమించిన మంచి అవకాశం ఉండదు. ఇది విఫలమైతే, మళ్లీ ఇలాంటి అవకాశం రాదు’ అని ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కిమ్‌తో భేటీ ‘ఏ మిషన్ ఆఫ్ పీస్’ అన్నారు. ‘అతనితో మాట్లాడటం మొదలైన తొలి నిమిషంలోనే తన మనసు భావన ఏమిటన్నది పసిగట్టేస్తాను. తేడా అనిపిస్తే వచ్చేస్తాను. నిజానికి ఇది రెండు దేశాల మధ్య సాగే చర్చలు కాదు. అంతకంటే ఎక్కువ. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి అవకాశం కలిగే సమావేశం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘చర్చలు విజయవంతమవుతాయా?’ అన్న ప్రశ్నకు ‘ఆ విషయం తరువాత. ముందు ఒకరినొకరు చూసుకుంటాం, కలుసుకుంటాం కదా. అంతకుమించి సక్సెస్ ఏముంటుంది?’ అన్నారు. ‘నేను సింగపూర్ ప్రయాణంలో ఉన్నా. ఉత్తర కొరియాకు, ప్రపంచానికి మంచి జరిగే ఓ బృహత్తర కార్యక్రమంపై వెళ్తున్నా’ అంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు. ‘ఇది కచ్చితంగా విజయవంతమయ్యే సమావేశమే. ఎందుకంటే, కిమ్ జోంగ్ తన దేశ ప్రజలకు ఏదో చేయాలని అనుకుంటున్నాడు. దొరికిన ఒక్క అవకాశాన్నీ మేమైతే జారవిడుచుకోము’ అంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు.

చిత్రాలు..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఆదివారం సింగపూర్
చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్
*కెనడాలో జి-7 సదస్సు ముగించుకుని నేరుగా సింగపూర్‌కు బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్