అంతర్జాతీయం

అందరి దృష్టీ సింగపూర్‌పైనే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 11: నెలల తరబడి ఎనలేని ఉద్రిక్తత... ఎదురుబడితే ఒకరినొకరు ఏం చేసుకుంటారోనన్న టెన్షన్... అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సాగిన ఉద్రిక్తతలపై యావత్ ప్రపంచమే ఆందోళన చెందింది. అలాంటిది ఇరు దేశాలు శాంతి శకంలో అడుగుపెట్టబోతున్నాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ ఉత్తర కొరియా ముందుకొచ్చింది. అందుకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా ఆహ్వానం పలికారు. వీరిద్దరి శిఖరాగ్ర భేటీకి సింగపూర్ వేదిక అయింది. ఈ చారిత్రక చర్చల్లో ఇటు ట్రంప్, అటు కిమ్ పట్టువిడుపులతో ముందుకు సాగుతారా? లేక పట్టిందే పట్టుగా వ్యవహరించి వ్యవహారాన్ని ముదరబెడతారా అన్నది ఉత్కంఠ కలిగిస్తున్న అంశం. ఇద్దరికీ తమ తమ ప్రయోజనాలే ముఖ్యం. రాజీపడే ధోరణి అంతకంటే కాదు... ప్రపంచ శాంతి, కొరియాల మధ్య సఖ్యత అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో సింగపూర్ భేటీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాల్సిందే.
అమెరికా ఆఫర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మధ్య చారిత్రక శిఖరాగ్ర సదస్సు జరగనున్న తరుణంలో అగ్రరాజ్యం భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. పరిపూర్ణ అణు నిరాయుధీకరణకు, ఎలాంటి అవరోధాలకు తావులేని తనిఖీలకు ఉత్తర కొరియా ఆమోదం తెలిపే పక్షంలో భద్రతాపరంగా అనూహ్యమైన హామీలను అందిస్తామంటూ ట్రంప్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాల మధ్య సానుకూల రీతిలో ఏమాత్రం పురోగతి సాధ్యమైనా దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఉత్తర కొరియాను అన్నివిధాలుగా ఆదుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. ఈ శిఖరాగ్ర సదస్సు అనుకున్న రీతిలో విజయవంతమైతే ఆసియా పసిఫిక్ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, పరిణామాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ట్రంప్ - కిమ్‌ల మధ్య చారిత్రక శిఖరాగ్ర సదస్సు జరగనున్న తరుణంలో అమెరికా ఈ సానుకూల సంకేతాలను అందించడం చర్చల ఫలితాలను గుణాత్మక రీతిలో మలుపు తిప్పాలన్న ఆలోచనేనన్న వాదనా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చర్చల పట్ల ట్రంప్ కూడా ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఉత్తర కొరియా పెంపొందించుకుంటూ వస్తున్న అణ్వాయుధ సమస్యకు ఈ చర్చలు శాశ్వత పరిష్కారాన్ని అందించగలవన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని సెంటోసా దీవిలో గల కాపెల్లా హోటల్లో ఈ శిఖరాగ్ర భేటీకి అన్నివిధాలుగా రంగం సిద్ధమైంది. దీర్ఘకాలంగా నువ్వా నేనా అన్న రీతిలో విమర్శలు సంధించుకోవడంతో పాటు దాదాపు యుద్ధం స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లిన ట్రంప్-కిమ్ అనూహ్య రీతిలో శాంతి బాట పట్టడం ఆశావహ పరిణామాలకు ఆస్కారం ఇచ్చింది. ఈ చర్చలు సఫలమైతే అమెరికా - ఉత్తర కొరియాల మధ్య సంబంధాల్లో కూడా గుణాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ చర్చలకు సంబంధించిన వాతావరణం సానుకూలంగా ఉందని అన్నివిధాలుగా సానుకూల ఫలితాలు వచ్చే రీతిలో గుణాత్మక వాతావరణమూ బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులను తొలగించి ఆశావహ రీతిలో మంచి ఫలితానే్న ఈ చర్చలు అందించగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ కూడా సానుకూల దృక్పథంతో ఆసక్తితో మంచి ఫలితాలను సాధించగలమన్న నమ్మకంతో ఈ చర్చల్లో పాల్గొంటున్నారని పాంపియో తెలిపారు. అణ్వాయుధాలను పూర్తిగా ఉత్తర కొరియా విసర్జించే పక్షంలో ఆ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని ట్రంప్ ఇప్పటికే బలంగా చెప్పారని పాంపియో గుర్తుచేశారు. కిమ్‌తో తాము జరపబోయే చర్చలు ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలను ఇచ్చే అవకాశం ఉంటుందని, అణు విసర్జన విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నది కూడా ప్రపంచానికి తేటతెల్లం అవుతుందని పాంపియో తెలిపారు. ఈ చర్చల ఫలితాలు పూర్తిగా ఉత్తర కొరియా పరిపూర్ణ రీతిలో అణ్వాయుధాలను విసర్జించడానికి అంగీకరించడంపైనే ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు.

భేటీకి భారీ ఖర్చు
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ట్రంప్-కిమ్ శిఖరాగ్ర భేటీకి సింగపూర్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు.. పెడుతున్న ఖర్చుపై అందరి దృష్టీ పడింది. మంగళవారం జరిగే ఈ చారిత్రక శిఖరాగ్ర భేటీ నిర్వహణకు దాదాపు 20 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని సింగపూర్ ప్రధాని లీ లూంగ్ వెల్లడించారు. సింగపూర్‌లోనే ఈ భేటీ ఏర్పాటుచేయడానికి ప్రధాన కారణం అటు అమెరికాతోనూ, ఇటు ఉత్తర కొరియాతోనూ దీనికి సన్నిహితమైన దౌత్యపరమైన సంబంధాలు ఉండటమే, అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ రకమైన సంబంధాలు కలిగివున్నాయ. అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ ప్రయత్నానికి తమ వంతు చేయూతగా శిఖరాగ్ర భేటీ నిర్వహణకు ముందుకొచ్చామని సింగపూర్ ప్రధాని తెలిపారు. అలాగే ట్రంప్-కిమ్ మధ్య జరిగే ఈ చర్చలు సఫలమైతే ప్రయోజనం పొందే దేశాల్లో తాము కూడా ఉన్నామన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ శిఖరాగ్ర భేటీ వార్తలు అందించేందుకు 2,500మంది పాత్రికేయులు సింగపూర్ చేరుకున్నారు. ప్రపంచ శాంతి కోసమే తాము ఇంత ఖర్చును భరించి ఈ భేటీకి ఆతిథ్యాన్ని ఇస్తున్నామని లూంగ్ అన్నారు.

చిత్రం..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌తో చర్చలు జరిపేందుకు సోమవారం సింగపూర్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చిన విందులో మూడు రోజుల ముందుగానే పుట్టిన రోజు కేక్‌ను అందించి ఆనందిస్తున్న సింగపూర్ ప్రధాన మంత్రి లీ లూంగ్ తదితరులు