అంతర్జాతీయం

ఫలించిన శిఖరాగ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 12: దాదాపు ఏడు దశాబ్దాల వైరానికి స్వస్తి పలికి అమెరికా, ఉత్తర కొరియా దేశాలు చారిత్రక రీతిలో చేతులు కలిపాయి. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాల నేపథ్యంలో సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మనసు విప్పి మాట్లాడుకున్నారు. కొరియాల మధ్య శాంతికి, అంతర్జాతీయ ప్రశాంతతకు బలమైన పునాదులు వేస్తూ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా ఇచ్చిన భద్రతాపరమైన హామీల నేపథ్యంలో పరిపూర్ణ రీతిలో అణు నిరాయుధీకరణకు చర్యలు చేపడతామని కిమ్ ప్రకటించారు. ఉత్తర కొరియా అధినేతతో తాను జరిపిన చర్చలు నిజాయితీగా, సూటిగా, ఫలవంతంగా సాగాయని ట్రంప్ ప్రకటించారు. అలాగే ఉత్తర కొరియాను దారికి తెచ్చేందుకు దక్షిణ కొరియాతో చేపట్టిన సంయుక్త సైనిక విన్యాసాలకు కూడా స్వస్తి పలుకుతున్నట్టు వెల్లడించారు. తమ దేశంపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా ఈ విన్యాసాలు చేస్తోందని, వీటికి స్వస్తి పలకాల్సిందేనని ఉత్తర కొరియా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనతో ఆ ప్రధాన డిమాండ్ నెరవేరినట్టయింది. పూర్తిస్థాయి అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించినప్పటికీ అణు పరీక్షల నేపథ్యంలో విధించిన ఆంక్షలు మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన, శక్తివంతమైన శాంతియుత పరిస్థితులను బలోపేతం చేయడంతోపాటు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే రీతిలో ట్రంప్-కిమ్‌ల మధ్య సమగ్రంగా నిజాయితీతో ఈ శిఖరాగ్ర భేటీ జరిగింది. చర్చల అనంతరం ఇరువురు నేతలు ఓ సంయుక్త ప్రకటనను జారీచేశారు. ఉత్తర కొరియా భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారని, దానికి ప్రతిగా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా కిమ్ పునరుద్ఘాటించినట్లు ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సంయుక్త ప్రకటనకు ముందు ఇద్దరు నేతలూ ముఖాముఖి భేటీ అయ్యారు. కేవలం అనువాదకులు తప్ప మరెవరూ లేకుండా సింగపూర్‌లోని ‘సెంటోసా’ దీవిలోని హోటల్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఉత్తర కొరియాతో ఒప్పందం సరికొత్త చరిత్రకు నాంది పలికిందని తెలిపారు. అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామన్న రీతిలో ఉత్తర కొరియా అధినేతతో తాము సంయుక్తంగా ఓ ప్రకటనపై సంతకం చేశానన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాతో సరికొత్త సంబంధాలకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే క్షిపణి పరీక్షలకు సంబంధించిన యంత్రాంగాన్ని తాము ధ్వంసం చేసినట్టు కిమ్ తనకు తెలిపారని ట్రంప్ అన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. అణు నిరాయుధీకరణకు సంబంధించిన ప్రశ్నకు జవాబునిచ్చిన ట్రంప్ ‘ఆ ప్రక్రియను మొదలుపెట్టాం. ఇది చాలా వేగంగా ముందుకు సాగుతుంది’ అని అన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే వారంలో మరో సమావేశం జరుగుతుందని పేర్కొన్న ఆయన ఈ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా ప్రాంతీయంగా ఉన్న దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. ఈ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావడానికి అందుకు సంబంధించిన వివరాలను ఖరారు చేయడానికి వచ్చే వారం జాన్ బాల్టన్‌లో సమావేశం అవుతున్నామని తెలిపారు. దక్షిణ కొరియా, జపాన్, చైనాలతో కూడా ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు. దాదాపు గంటకు పైగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. తాజా ఒప్పందంపై స్పష్టమైన పురోగతి కనిపించేవరకూ ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగానే ట్రంప్ వెల్లడించారు. ఉత్తర కొరియా భవిష్యత్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ‘ఇది పూర్తిగా ఆ దేశ నాయకత్వం, ఆ దేశ ప్రజలు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని వెల్లడించారు. అనుకున్నదానికంటే కూడా ఈ శిఖరాగ్ర భేటీ ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించామని, గతాన్ని పక్కనపెట్టి వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని బలమైన భవితవ్యం దిశగా తొలి అడుగు వేశామని ట్రంప్ తెలిపారు. నేడు జరిగిన సమావేశం తనకెంతో ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తోందని ప్రపంచ సమస్యలపై ఇరు దేశాలు దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి దోహదం చేస్తాయన్న నమ్మకం తనకుందని ట్రంప్ తెలిపారు. 34 సంవత్సరాల కిమ్‌తో ఈ సమావేశం ద్వారా తనకు బలమైన వ్యక్తిగత అనుబంధం ఏర్పడిందని 71 సంవత్సరాల ట్రంప్ వెల్లడించడం గమనార్హం. కిమ్ చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అని, సరైన సమయంలో ఆయన్ని వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తానని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే తాను కూడా ఏదో ఒక సమయంలో ఉత్తర కొరియాను సందర్శించే అవకాశమూ లేకపోలేదన్నారు. సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన అనంతరం తన అనువాదకుని ద్వారా కిమ్ మాట్లాడారు. అమెరికాతో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచంలోనే ఓ పెద్ద మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ముందు మాట్లాడిన కిమ్ ఎన్నో అవరోధాలను అధిగమించి సింగపూర్ చేరుకున్నామని, అందుకే శిఖరాగ్ర భేటీకి ఆస్కారమేర్పడిందని తెలిపారు. ఉత్తర కొరియా మీడియా సమాచారం ప్రకారం సమావేశ ప్రాంగణానికి ఏడు నిమిషాల ముందే కిమ్ చేరుకున్నారని, అందుకు కారణం తనకంటే పెద్దవాడైన ట్రంప్ పట్ల తనకున్న గౌరవ సంకేతమేనని సమాచారం ప్రకారం తెలుస్తోంది. అలాగే కిమ్‌కు గౌరవ సూచకంగానే ట్రంప్ కూడా ఎరుపు వర్ణం కలిగిన టై ధరించినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే ఎరుపు వర్ణాన్ని ఉత్తర కొరియన్లు బాగా అభిమానిస్తారు. సమావేశానికి ముందు రెండు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగానే అణ్వాయుధాలను వదులుకుంటారా అంటూ మీడియా ప్రతినిధులు పదేపదే కిమ్‌ను అడిగారు. చిరుదరహాసంతో స్పందించిన కిమ్ ‘మా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ట్రంప్‌తో కలిసి పనిచేస్తాం. ఈ శిఖరాగ్ర సమావేశంపై ఏర్పడ్డ సందేహాలు, సంశయాలను నివృత్తి చేస్తాం’ అని తెలిపారు. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరువురు నేతలు విందు చేశారు. ఇటు పశ్చిమాసియా, కొరియా వంటకాలతో ఈ విందు షడ్రశోపేతంగా సాగింది. అనంతరం హోటల్ ప్రాంగణంలో ఇరువురు నేతలు అటు ఇటు నడిచి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
చిత్రం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్