అంతర్జాతీయం

టర్కీలో బీభత్సకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకారా, జూలై 16: టర్కీలో అధ్యక్షుడిపై సైన్యం తిరగబడింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి బీభత్సకాండ సృష్టించింది. దేశంలోని అన్ని నగరాల్లో విశృంఖల వీరవిహారం చేసింది. సైనిక ట్యాంకులు విచ్చలవిడిగా వీధుల్లో పెట్రేగిపోయాయి. కాల్పులు, బాంబుల మోతలతో రాత్రంతా జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సివచ్చింది. 250 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడగా 1400 మంది గాయాలపాలయ్యారు. దేశంలో ఎక్కడ చూసినా రక్తపు మరకలే.. ఈ తిరుగుబాటు టర్కీ చరిత్రపై చెరగని మచ్చ వేసింది. అయితే కొద్ది గంటల్లోనే అధ్యక్షుడి బలగాలు ఈ కుట్రను విజయవంతంగా ఛేదించాయి.
అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సైన్యంలో ఓ వర్గం శుక్రవారం రాత్రి అనూహ్యంగా తిరుగుబాటు జరిపింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పోలీసులు, సైన్యాలు, ప్రజలు విజయవంతంగా తిప్పికొట్టి ప్రజాప్రభుత్వాన్ని పునరుద్ధరించాయి. తిరుగుబాటుకు బాధ్యులయిన వారు భారీ మూల్యం చెల్లిస్తారని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తరుూ్యప్ ఎర్డోగన్ శనివారం ప్రకటించారు. శుక్రవారం రాత్రి టర్కీలోని దాదాపు అన్ని నగరాల్లో సైన్యం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కాగా, శుక్రవారం రాత్రంతా జరిగిన హింసాకాండలో మొత్తం 250 మందికి పైగా చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. 1400 మంది గాయపడినట్లు టర్కీ ప్రధాని బెనాలి యిల్డిరిమ్ చెప్పారు. తిరుగుబాటుకు పాల్పడిన 104 మంది సైనికులను హతమార్చినట్లు, దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు తాత్కాలిక ఆర్మీ చీఫ్ దుందర్ చెప్పారు. ఈ కుట్రను టర్కీ ప్రధాని యిల్డిరిమ్ ‘టర్కీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ’గా అభివర్ణించారు. తిరుగుబాటుకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడి తీరుతుందని కూడా ఆయన చెప్పారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను, స్వేచ్ఛను కాపాడడానికి, దేశంలో చట్టాలను, శాంతిభద్రతలను కాపాడడం కోసం తాము ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటున్నట్లు మిలిటరీ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక ప్రకటన చేయడంతో తిరుగుబాటు మొదలైంది. ఈప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అంకారాలో యుద్ద విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో పాటుగా ఆర్మీ ప్రధానకార్యాలయం వెలుపల తుపాకీ కాల్పులు మొదలైనాయి. ఇస్తాంబుల్‌లో రెండు ప్రధాన బ్రిడ్జీలపై అడ్డంగా వాహనాలను నిలిపేశారు. ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆర్మీ ట్యాంకులను అడ్డంగా నిలిపి రాకపోకలను ఆపేశారు. అక్కడినుంచి అంకారా వీధులు తుపాకులు, బాంబుల మోతలతో, యుద్ధ ట్యాంకుల పదఘట్టనలతో మార్మోగిపోయింది. ప్రభుత్వ వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి తిరగబడ్డ సైన్యం హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపింది. తిరుగుబాటును వ్యతిరేకిస్తున్న జనంపైకి కూడా వారు కాల్పులు జరిపారు. వైమానిక దళానికి చెందిన అధికారులు, మిలిటరీ పోలీసు, ఆర్మర్డ్ యూనిట్లకు చెందినవారు ఈ తిరుగుబాటులో పాలు పంచుకున్నట్లు ఆర్మీ తాత్కాలిక ప్రధానాధికారిగా నియమితుడైన జనరల్ ఉమిత్ దుందర్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిపిన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. కాగా, టర్కీలో 148 మంది విద్యార్థులు, 38 మంది అధికారులు సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
టర్కీ గర్విస్తోంది
అధ్యక్షుడు ఎర్డోగన్ ఇస్తాంబుల్‌లో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ, ఇప్పుడు తన ప్రభుత్వం పూర్తి అధికారంలో ఉందని ప్రకటించారు. ‘మీరు అధికారం కట్టబెట్టిన ప్రభుత్వమే ఇప్పుడు విధి నిర్వహణలో ఉంది’ అని ఎర్డోగన్ ప్రకటించినప్పుడు అక్కడ పెద్దసంఖ్యలో చేరిన జనం ‘మిమ్మల్ని చూసి టర్కీ గర్విస్తోంది’ అంటూ నినాదాలు చేశారు. పలువురు టర్కీ జాతీయ పతాకాలను ఊపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

చిత్రం.. టర్కీ రాజధాని అంకారాలో తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ప్రజలు