అంతర్జాతీయం

స్వచ్ఛంద మరణానికి విక్టోరియాలో చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జూన్ 20: ఆస్ట్రేలియాలో వ్యాధి నయం కాదని తేలినప్పుడు బాధ నివారణ కోసం స్వచ్ఛందంగా చనిపోవడాన్ని (యుథనాసియా) చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా విక్టోరియా బుధవారం అవతరించింది. బుధవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం, వ్యాధి నయం కాదని తేలి, భరించలేని బాధను అనుభవిస్తున్న రోగులు తమకు ప్రాణాంతకమయిన ఔషధాలు ఇచ్చి అనాయాస మరణం సంభవించేట్టుగా చేయాలని తమ డాక్టర్లను కోరవచ్చు. చరిత్రాత్మకమయిన ఈ చట్టం ప్రకారం స్వచ్ఛంద మరణాన్ని (యుథనాసియా)ను కోరుకునే వారు విక్టోరియా రాష్ట్ర పౌరుడయి, భరించలేని నొప్పితో బాధపడుతున్న పెద్దలు (18 సంవత్సరాలు నిండిన వారు) అయి ఉండాలి. వారు ఆరు నెలలకు మించి జీవించి ఉండలేని వారు అయి ఉండాలి. న్యూరోడిజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న వారయితే 12 నెలలకు మించి జీవించి ఉండలేని వారు అయి ఉండాలి. కొత్త చట్టం ప్రకారం పనిచేయడానికి ఇప్పటికే సుమారు 120 మంది డాక్టర్లు శిక్షణ పొందినట్టు విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ తెలిపారు. ‘దీర్ఘకాలం నుంచి బాధపడుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి తరపున వాదిస్తున్న న్యాయవాదులకు ఇది సంతోషం కలిగించే రోజు’ అని విక్టోరియా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జెన్నీ మికకోస్ అన్నారు. ఈ చట్టం కోసం విక్టోరియా చట్టసభలో సుదీర్ఘంగా 18 నెలల పాటు చర్చలు జరిగాయి. 2017లో ఈ చట్టం కోసం ప్రతిపాదన వచ్చింది. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్, వెస్టర్న్ ఆస్ట్రేలియా రాష్ట్రాలు ఇలాంటి చట్టాన్ని తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలలో గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ, అది చట్టసభలలో ఓడిపోయింది. ఈ చట్టానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించినప్పటికీ, వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. జీవించే హక్కు కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు, పిల్లలు కలిసి సుమారు 50 మంది మంగళవారం రాత్రి పార్లమెంటు హౌస్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని క్యాథలిక్ నాయకత్వం ఈ చట్టాన్ని ఆమోదించినందుకు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ చట్టాన్ని ప్రతిఘటించాలని పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్కులకు పిలుపునిచ్చారు.