అంతర్జాతీయం

పాక్‌లో పేలిన మానవబాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, ఆగస్టు 8: పాకిస్తాన్‌లో సోమవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. మానవ బాంబు జరిపిన ఈ దాడిలో 70 మంది మృతి చెందారు. ఇందులో చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. బాలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని అయిన క్వెట్టా నగరంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ మానవ బాంబు దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. క్వెట్టాలో బాలోచిస్తాన్ బార్ అసోసియేషన్ (బిఎ) అధ్యక్షుడు, న్యాయవాది బిలాల్ అన్వర్ ఖాసిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన కొన్ని గంటలకే ఈ మానవబాంబు దాడి జరిగింది.
బిలాల్ అన్వర్ మృతదేహాన్ని న్యాయవాదులు సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఈ పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించడం కోసం బిలాల్ అన్వర్ మృతదేహాన్ని ఉంచిన ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వద్ద న్యాయవాదులు, జర్నలిస్టులు గుమికూడిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించాయని వివరించారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు న్యాయవాదులే. వీరితో పాటు పోలీసు అధికారులు, జర్నలిస్టులు ఉన్నారని పోలీసు వర్గాలతో పాటు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ల తరువాత గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు కూడా జరిపారని పోలీసులు చెప్పారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇది ఆత్మాహతి దాడేనని, ఈ దాడిలో ఎనిమిది కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారని పోలీసులు చెప్పారు. పేలుడు సంభవించిన ప్రాంతం బీభత్సంగా మారింది. ఒకవైపు మృతుల తెగిపడిన అవయవాలు ఉండగా, మరోవైపు అనేక మంది న్యాయవాదులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చెల్లాచెదురుగా పారిపోయిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పేలుడు వల్ల ఎమర్జెన్సీ వార్డు కారిడార్‌లలో పొగలు నిండాయి.
మానవ బాంబు పేలుడు తరువాత ఫ్రాంటియర్ కాప్స్ బలగాలు, పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రి చుట్టూ మోహరించాయి. ఆసుపత్రిలోకి ఎవరినీ పోనివ్వలేదు. ఇటీవలి కాలంలో క్వెట్టాలో న్యాయవాదులపై తరచుగా దాడులు జరుగుతున్నాయి. కాసీ మృతదేహంతో పాటు ఆసుపత్రికి వచ్చే న్యాయవాదులను లక్ష్యంగా చేసుకునే ఈ మానవబాంబు దాడి జరిగినట్లు కనిపిస్తోందని బాలోచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అన్వర్ ఉల్ హక్ తెలిపారు. పాకిస్తాన్‌లో ఈ సంవత్సరం జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది.
ఈస్టర్ సందర్భంగా జనంతో కిటకిటలాడుతున్న లాహోర్‌లోని ఒక పార్కులో పేలుళ్లు సంభవించి 75 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని షరీఫ్ బాలోచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కాగా, ఈ దాడి తరువాత క్వెట్టాలోని ఆసుపత్రుల వద్ద ఎమర్జెన్సీని ప్రకటించారు. దాడి మృతులకు సంతాపంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు బాలోచిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

చిత్రం.. మానవబాంబు దాడితో భీతావహంగా మారిన క్వెట్టాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం