అంతర్జాతీయం

సోమాలియాలో ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు, జూలై 13: దక్షిణ సోమాలియాలోని ఒక పేరు పొందిన హోటల్‌పై అల్-షాబాబ్ ఉగ్రవాదులు జరిపిన భయంకరమయిన దాడిలో 26 మంది మృతి చెందారు. వీరిలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. మరో 56 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఒక ఉన్నత స్థాయి ప్రాంతీయ అధికారి శనివారం తెలిపారు. శుక్రవారం ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనంతో వేగంగా ఓడరేవు పట్టణమయిన కిస్మయోలోని మెదీనా హోటల్‌లోకి దూసుకెళ్లాడు. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోగా, మిగతా ఉగ్రవాదులు హోటల్‌లో ఉన్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో పెద్ద ఎత్తున సాయుధ భద్రతా బలగాలు హోటల్‌లోకి వెళ్లి, ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు 12 గంటల పాటు సాగిన ఈ ఎదురుకాల్పులు శనివారం ముగిశాయి. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిలో ముగ్గురు కెన్యా పౌరులు, ముగ్గురు టాంజానియా పౌరులు, ఇద్దరు అమెరికా పౌరులు, ఒక బ్రిటన్ పౌరుడు, ఒక కెనడా పౌరుడు ఉన్నారని పాక్షిక స్వయంప్రతిపత్తి గల జుబలాండ్ రీజియన్ అధ్యక్షుడు అహ్మద్ మహమ్మద్ ఇస్లాం శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. ఇద్దరు చైనా పౌరులు గాయపడ్డారని ఆయన వివరించారు. మృతుల్లో నలుగురు ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారు ఉన్నారని ఒక వార్తాసంస్థ ధ్రువీకరించింది. చివరి ఉగ్రవాదిని కూడా కాల్చి చంపడం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి భద్రతా బలగాల అదుపులో ఉందని మహమ్మద్ అబ్డివెలి అనే భద్రతాధికారి తెలిపారు. కనీసం నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు సోమాలియా పోలీసుల యూనిఫామ్‌లు ధరించి వచ్చి దాడి చేసినట్టు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తామే ఈ దాడికి పాల్పడినట్టు అల్- షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్ పాల్పడిన పేలుడు చాలా శక్తివంతమైందని వివరించారు. మృతుల్లో ప్రముఖ సామాజిక మాధ్యమ కార్యకర్త హోదన్ నలేయేహ్, ఆమె భర్తతో పాటు, మహమ్మద్ సలాహ్ అనే స్థాని క విలేఖరి కూడా ఉన్నారు. సోమాలి జర్నలిస్ట్స్ యూనియన్ ఎస్‌జేఎస్ విలేఖరి మృతిని ధ్రువీకరించింది. ‘ఇది సోమాలియా జర్నలిస్టులకు విషాదకరమైన రోజు’ అని యూనియన్ సెక్రెటరీ జనరల్ అహ్మద్ ముమీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం... సోమాలియాలోని కిస్మయోలో ఓ హోటల్‌లో తొలుత ఆత్మాహుతి దళ సభ్యుడు బాంబుతో పేల్చేసిన కారు