అంతర్జాతీయం

వివాహ వేడుకలో ఐఎస్ మారణహోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఆగస్టు 18: అప్పటివరకు సంతోషంగా, ఉల్లాసంగా ఉన్న ఆ వివాహ వేడుక ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకుంది. రక్తపాతం, మారణహోమంగా మారిపోయింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ఒక వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకొని చేసిన ఆత్మాహుతి దాడితో ఈ విషాదం ఏర్పడింది. ఈ దాడిలో 63మంది మృతి చెందారు. 182 మంది గాయపడ్డారు. కాబూల్‌లో ఇటీవలి నెలల్లో జరిగిన అత్యంత భయంకరమయిన ఉగ్రవాద దాడిగా అధికారులు, ప్రత్యక్ష సాక్షులు ఆదివారం ఇక్కడ తెలిపారు. పశ్చిమ కాబూల్‌లో శనివారం రాత్రి ఈ ఉగ్రవాద దాడి జరిగింది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైన్యాన్ని తగ్గించడానికి అమెరికాకు, తాలిబన్లకు మధ్య ఒక ఒప్పందం కుదరడానికి రంగం సిద్ధమయిన తరుణంలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. శనివారం మధ్యాహ్నం అతిథులు చిరునవ్వులతో తనకు శుభాకాంక్షలు తెలిపారని పెళ్లికుమారుడు మీర్వాయిస్ చెప్పాడు. తరువాత కొన్ని గంటలకే వారు మృతదేహాలుగా మారిపోయారని ఆయన దుఃఖించాడు. ‘ఈ దాడి నా ఆనందాన్ని దుఃఖంగా మార్చింది’ అని మీర్వాయిస్ స్థానిక టీవీ స్టేషన్ టోలో న్యూస్‌కు చెప్పాడు. ‘నా కుటుంబం, నా పెళ్లికుమార్తె దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు కనీసం మాట్లాడలేకపోతున్నారు. నా పెళ్లికుమార్తె స్పృహ తప్పి పడిపోయింది’ అని మీర్వాయిస్ వివరించాడు. ‘నేను నా సోదరుడిని కోల్పోయాను. బంధుమిత్రులను కోల్పోయాను. నేను నా జీవితంలో ఇంకెప్పుడూ ఆనందంగా ఉండలేను’ అని అతను అన్నాడు. ఆత్మాహుతి బాంబర్ జరిపిన ఈ దాడిలో 63 మంది మృతి చెందారని, 182 మంది గాయపడ్డారని అఫ్గానిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహిమి తెలిపారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ‘పేలుడు సంభవించిన సమయంలో వివాహానికి వచ్చిన అతిథులు
నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు’ అని ప్రత్యక్ష సాక్షి 23 ఏళ్ల మునీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ దాడిలో మునీర్ తీవ్రంగా గాయపడగా, అతని సోదరుడు మృతి చెందాడు. ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధంగా అఫ్గానిస్తాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తానే ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించింది.
షియా ముస్లింల వివాహ వేడుకలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. సున్నీ తెగ ముస్లింలు మెజారిటీగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో షియాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.

చిత్రం...
అఫ్గాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడిలో ధ్వంసమైన కల్యాణ మండపం