అంతర్జాతీయం

ఈమెయిల్ వివాదంలో హిల్లరీకి క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా ఎన్నికలకు ఒక్క రోజు ముందు డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలను మరింత పెంచుతూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) తీపి కబురు తెలిపింది. ఎన్నికల ప్రచారంలో హిల్లరీపై అత్యంత వివాదాస్పద ప్రచారాస్త్రంగా ట్రంప్ చేతిలో చిక్కిన ఈ మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీకి ఎఫ్‌బిఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ‘‘మేం చేసిన సమీక్ష ప్రకారం విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వివాదంపై గత జూలైలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు’’ అని ఎఫ్‌బిఐ డైరెక్టర్ జేమ్స్ బి కామీ సోమవారం కాంగ్రెస్ ప్రతినిధులకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో హిల్లరీ ప్రయివేట్ ఈ మెయిల్ సర్వర్‌ను వినియోగించుకున్నారన్న ఆరోపణలను గత జూలైలోనే ఎఫ్‌బిఐ కొట్టివేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా హిల్లరీ ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించటంతో మరోసారి విచారణను చేపట్టాల్సి వచ్చింది. క్లింటన్ సన్నిహితురాలు హుమా అబెదిన్ భర్త, మాజీ కాంగ్రెస్ సభ్యుడు ఆంథోని వెయినర్ నుంచి వచ్చిన ఈ మెయిల్స్ బయట పడటంతో ఈ విచారణ తిరిగి మొదలైంది. ‘‘మా విచారణ బృందం ఆరున్నర లక్షల ఈమెయిల్స్‌ను రేయింబవళ్లు కష్టపడి సమీక్షించింది. వీటిలో ఏ ఒక్కటి కూడా క్రిమినల్ విచారణార్హమైనది లేదు’’ అని జేమ్స్ వెల్లడించారు. ఈ ప్రకటనతో హిల్లరీ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జూలై తీర్పు పున:సమీక్ష జరగదని తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. అదే జరిగిందని హిల్లరీ ప్రతినిధి బ్రెయిన్ ఫాలెన్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. క్లీవ్‌లాండ్ ప్రచారంలో ఉన్న హిల్లరీ మాత్రం ఈ విషయాన్ని తన ప్రచారంలో నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.
సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు ఆమెపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు ఎఫ్‌బిఐ ప్రకటించటం ట్రంప్ శిబిరానికి మింగుడు పడటం లేదు. హిల్లరీని అమెరికాలోని ‘రిగ్గింగ్ వ్యవస్థ’ కాపాడుతూ వస్తోందని ట్రంప్ ఆరోపించారు. హిల్లరీ దోషి అని ఆమెకు తెలుసు, ఎఫ్‌బిఐకి కూడా తెలుసని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ ప్రచార సభలో తీవ్రంగా విమర్శించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరున్నర లక్షల ఈ మెయిల్స్‌ను పరిశీలించడం, నిర్ణయానికి రావటం ఎవరికైనా అసాధ్యమైన పని అని ఆయన అన్నారు. అలాంటప్పుడు హిల్లరీకి క్లీన్‌చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘ఆరున్నర లక్షల ఈ మెయిల్స్‌ను ఎనిమిది రోజుల్లో ఎవరూ పరీక్షించలేరు. మీకు తెలుసు హిల్లరీ దోషి అని. ఇక అమెరికా ప్రజలే న్యాయమేమిటో చెప్పాలి’’ అని ట్రంప్ అన్నారు. ఎఫ్‌బిఐలోని హిల్లరీ ఏజెంట్లు ఆమెపై ఏ నేరాన్నీ రుజువు కానీయరని ఆయన చెప్పారు.

చిత్రం.. ట్రంప్, హిల్లరీ