అంతర్జాతీయం

బెర్లిన్‌లో ట్రక్కు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, డిసెంబర్ 20: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేయడానికి మార్కెట్‌కు వచ్చిన వారిని మృత్యువు ఓ ట్రక్కు రూపంలో కబళించింది. నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లోకి ఓ ట్రక్కు దూసుకు రావడంతో కనీసం 12 మంది చనిపోగా, మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
నగరంలోని కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చికి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వందలాది మంది షాపులు, స్టాండ్‌ల వద్ద గుమికూడి ఉన్న సమయంలో పోలండ్ నంబర్ ప్లేట్ కలిగి ఉన్న, స్టీల్ రాడ్ల లోడ్‌తో ఉన్న ఓ ట్రక్కు మార్కెట్లోకి దాదాపు 80-100 మీటర్లు దూసుకు వచ్చిందని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ట్రక్కు లోపల ఇద్దరు ఉన్నారని, ట్రక్కు ఆగిన వెంటనే ఓ వ్యక్తి దూకి పారిపోగా, పోలెండ్ దేశస్థుడికి చెందిన ఓ మృతదేహం ట్రక్కు లోపల లభించిందని తెలిపింది. పాకిస్తానీ దేశస్థుడిగా భావిస్తున్న ట్రక్కు డ్రైవర్‌ను ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను 23 ఏళ్ల పాకిస్తాన్‌కు చెందిన నవేద్ బిగా గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలనుటంకిస్తూ ‘బిల్డ్’ వార్తాపత్రిక తెలిపింది.
కాగా, ఈ దాడి ఉగ్రవాద ముఠాల పనిగా అభివర్ణించిన జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ జర్మనీలో ఆశ్రయం కోరిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పేర్కొన్నారు. నవేద్ దాదాపు ఏడాది క్రితం శరణార్థిగా రిజిస్టర్ చేసుకున్నాడని కూడా ‘బిల్డ్’ పత్రిక తెలిపింది. కాగా, ఈ ఉగ్రవాద సంఘటన జరిగినప్పటికీ క్రిస్మస్ మార్కెట్లను మూసివేయాల్సిన అవసరం లేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్రిస్మస్ సందర్భంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని జర్మనీని ఇంతకు ముందే హెచ్చరించినట్లు అమెరికా తెలిపింది. కాగా, బెర్లిన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులపై జరిగిన ఉగ్రవాద దాడిగా అమెరికా నూతన అధ్యక్షుడిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

చిత్రాలు..క్రిస్‌మస్ సందర్భంగా బెర్లిన్‌లో ఏర్పాటైన ఓ మార్కెట్లోకి దూసుకెళ్లిన మృత్యుశకటం ఇదే..