అంతర్జాతీయం

మంచికోసం పనిచేసే శక్తి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 24: మూడు దేశాల పర్యటనకోసం శనివారం బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అమెరికా చేరుకుంటారు. కాగా, ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వస్తున్న వార్తలను ట్రంప్ ప్రభుత్వం కొట్టిపారేసింది.
భారత్ మంచికోసం పని చేసే బలమైన శక్తి అనే విషయాన్ని ట్రంప్ గ్రహించారని కూడా స్పష్టం చేసింది. ‘ట్రంప్ ప్రభుత్వం భారత్‌ను పట్టించుకోవడం లేదని, ఆ దేశంపై పెద్దగా దృష్టిపెట్టడం లేదని అనడం చాలాతప్పు. అమెరికా నిజంగా భారత్‌ను గౌరవిస్తోందని, ప్రపంచంలో మంచికోసం పని చేసే బలమైన దేశం భారత్ అనే విషయాన్ని, ఆ దేశంతో సంబంధం చాలా ముఖ్యమనే విషయాన్ని ట్రంప్ గ్రహించారని నేను భావిస్తున్నాను. సోమవారం మోదీ పర్యటనలో ఈ విషయం స్పష్టమవుతుంది’ అని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం అరునెలలే అయిందని, ట్రంప్, మోదీ మధ్య రెండు మంచి టెలిఫోన్ సంభాషణలు కూడా జరిగాయని, రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతప్రాధాన్యత ఇస్తున్నాయనే దానికి ఇదే నిదర్శనం అని కూడా ఆ అధికారి వాదించారు. కాగా, వైట్‌హౌస్‌లో ఇరువురు నేతలు సమావేశమైనప్పుడు ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ భాగస్వామ్యం, అంతర్జాతీయ వ్యవహారాల్లో సహకారం, వాణిజ్యం, ఇంధనం తదితర రంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంపై చర్చస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు.
మోదీకి అరుదైన గౌరవం
అమెరికా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం లభించనుంది. సోమవారం వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విదేశీ నేతకు ట్రంప్ ఇస్తున్న తొలి అధికారిక విందు ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా మోదీ వైట్‌హౌస్‌లో అయిదు గంటలకు పైగా గడపనున్నారు. ఒక విదేశీ నేత వైట్‌హౌస్‌లో అన్ని గంటలు గడపడం కూడా అసాధారణమే. ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి వైట్‌హౌస్ ఎంత ఆత్రుతతో ఉందో, ఆయన పర్యటనను ప్రత్యేకమైనదిగా చేయడంకోసం వైట్‌హౌస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో ఈ విందే చాటి చెబుతోందని అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా వ్యాఖ్యానించడం గమనార్హం.