నమ్మండి! ఇది నిజం!!

గోడలు లేని జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ జైలు ప్రయోజనం, అందులోని ఖైదీలని సంస్కరించడమే. కానీ ప్రపంచంలో 99% జైళ్లు ఖైదీలకి ఈ ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. పైగా నేర ప్రవృత్తిగల వారు ఓ జైల్లో కలిసి జీవించడంతో, ఒకరికి మరొకరు నేరాల్లో ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు కూడా. ఫిలిప్పీన్స్‌లోని ప్యూర్టో ప్రినె్ససాకి సమీపంలోని ‘ఐవా హిగ్ ప్రిజన్ అండ్ పీనల్ రిఫాం’ ఖైదీలని సంస్కరించే విధంగా నిర్వహించబడుతోంది.
అమెరికన్స్ ఫిలిప్పీన్స్‌ని పాలించినప్పుడు 1904లో గవర్నర్ లూక్ రైట్ ఈ జైలుని ఏర్పాటు చేశాడు. ఐతే కేవలం జైలు భవంతిని ఏర్పాటు చేయడమే కాక, ఈ ప్రాంతాన్ని ‘పీనల్ కాలనీ’గా మార్చాడు. ది ఫిలిప్పీన్ కమీషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ 1907లో దీనికి అనుమతి ఇచ్చింది. అప్పటి నించి ఇది ‘గోడలు లేని జైలు’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శిక్షని అనుభవించేవారు 64 వేల ఎకరాలని సాగుచేస్తూ, స్వతంత్రంగా జీవిస్తున్నారు. పారిస్ నగరానికి రెట్టింపు విస్తీర్ణంలోగల ఐవాహిక్ పీనల్ కాలనీ చుట్టూ పర్వతాలు పెట్టని గోడల్లా ఉన్నాయి. పారిస్‌లోలాగానే ఓ చర్చ్, ఓ పోస్ట్ఫాస్, ఓ రిక్రియేషన్ సెంటర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
ఇక్కడి ఖైదీల్లో రెండు రకాల వారున్నారు. మీడియం సెక్యూరిటీ ఖైదీలు - వీరు గోధుమరంగు టీ షర్ట్‌ని ధరించాలి. రెండో తరహా ఖైదీలు మినిమం సెక్యూరిటీ ఖైదీలు. పారిపోరనే నమ్మకం గలవారిని మినిమం సెక్యూరిటీ ఖైదీలుగా పిలుస్తారు. వీరు నీలంరంగు దుస్తులని ధరించాలి.
వీరంతా పొలం సాగుబడి చేయడం, చేపలని పట్టడం, వడ్రంగం, అడవిని పెంచి, అటవీ సంపదని సేకరించడం మొదలైన పనులు చేస్తారు. ఎవరికి దేంట్లో అభిరుచి ఉంటే, దాన్ని ఎన్నుకోవచ్చు. ఈ పీనల్ కాలనీలోని ఖైదీలని ‘సెటిలర్స్, కాలనిస్ట్స్’ అని రెండు రకాలుగా విభజించారు. ఇక్కడ పని చేయడానికి అనుమతి లభించిన వారిని సెటిలర్స్ అంటారు. తమ కుటుంబ అవసరాలకి సరిపడే నిర్వహణ ఖర్చులని వారు సంపాదించి తీరాలి. ఈ కాలనీ మేయర్ కూడా ఖైదీనే!
ఇక్కడ మొత్తం 3186 మంది ఖైదీలు జీవిస్తున్నారు. రోజుకి మూడుసార్లు అధికారులు వీరిని లెక్కిస్తూంటారు. కేవలం ఆయుధాలు ధరించిన ముగ్గురు గార్డులు మాత్రమే వీరికి కాపలా ఉంటారు. ఇక్కడ నించి పారిపోవడానికి అరగంట చాలు. ఐనా పారిపోయే వారు తక్కువ. కారణం మిగిలిన ఫిలిప్పీన్స్‌లోని జైళ్లలోలా కాక, ఇక్కడ స్వేచ్ఛ, ఏదైనా ఆదాయం వచ్చే వృత్తిని నేర్చుకునే అవకాశం ఉంటాయి. అందువల్ల విడుదలయ్యే సమయానికి ఆర్జించింది వెంట తీసుకువెళ్లచ్చు. చాలామంది గ్రామీణ ఖైదీలకి అసలు తాము జైల్లో ఉన్న భావనే కలగదు. తమ గ్రామంలో ఉన్నట్లుగా అనిపిస్తూంటుంది. 1970ల నించి ఖైదీల కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి వారితో నివసించే అవకాశాన్ని కల్పించడంతో పారిపోవడం తగ్గిపోయింది. సగటున ప్రతీ ఖైదీ నెలకి 200 పెసోలు (4-30 అమెరికన్ డాలర్లు) సంపాదిస్తూంటారు. అడ్వైజరీ బోర్డు తరచూ ప్రతీ ఖైదీ గురించి రివ్యూ చేస్తూంటుంది.
ఎడ్విన్ యశోమ్ అనే దొంగ ఇప్పటికీ ఇక్కడ ఐదేళ్ల శిక్షని అనుభవించాడు. మరో పదేళ్ల శిక్షని అనుభవించాల్సి ఉంది. ఇక్కడ సహజంగా ఏర్పడిన స్విమ్మింగ్ పూల్ దగ్గర అతను ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లని చిక్కీలని అమ్మి జీవిస్తున్నాడు.
ఓ కారుని దొంగిలించిన నేరానికి పదిహేనేళ్ల శిక్ష అనుభవించే జెఫ్రీ (29) చిత్రాలని గీసి అమ్ముతున్నాడు.
‘నాకు ఇక్కడ ఏ మాత్రం నచ్చలేదు. నా కుటుంబ సభ్యులు వచ్చి నన్ను చూడలేరు. కారణం వాళ్లు చాలాదూరంలో ఉండే మనీలాలో నివసిస్తున్నారు’ జెఫ్రీ చెప్పాడు.
‘నాకిక్కడ చాలా బావుంది. నా భార్య, నేను కలిసి ఒకే గుడిసెలో జీవిస్తున్నాం’ 62 ఏళ్ల అరసెలి అనే ఖైదీ చెప్పాడు.

పద్మజ