కథ

స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
***

‘వ్వాట్!! జోక్ చేస్తున్నావా రిషి? నువ్వేంటి.. ఉన్నట్లుండి ఇండియా వెళ్లిపోవడం ఏమిటీ? నమ్మలేక పోతున్నాను రా!’ ఆశ్చర్యంగా అన్నాడు నితిన్.
‘నమ్మలేకపోయినా, ఇది నిజంరా.. ఇంకో విషయం ఏమిటంటే.. ఇది నా ఆఖరి నిర్ణయం కూడా..’ స్థిరంగా అన్నాడు రిషి.
‘అసలు ఏమయ్యిందిరా? ఇన్ని ఏళ్ల నీ కల, నీ కోరిక, నీ కష్టానికి ఫలితం ఇంకో నెల రోజుల్లో వస్తోంది అనగా ఇప్పుడు ఈ నిర్ణయం ఏమిటి?! ఇంకో వారం రోజుల్లో ఎలాగూ ఇద్దరం కలిసి ఇండియా వెళ్లాలని టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అలాంటిది ఇలా నాకు కూడా చెప్పాపెట్టకుండా, సడెన్‌గా ఇండియా వెళ్లిపోతే ఏమిటని అర్థం?’ కోపంగా అడిగాడు నితిన్.
‘నువ్వన్నది నిజమే నితిన్. కానీ అదంతా రెండు రోజుల ముందు వరకు.. అంతకన్నా గొప్పదైన నిజం ఇప్పుడు నాకు తెలిసింది. ఇంతకాలం నా ఆలోచన ఎంత స్వార్థంతో నిండినదో... అమ్మా, నాన్న వాళ్లు ఎంత కరెక్టో అని..’ గొంతు వణుకుతుండగా అన్నాడు రిషి.
‘అబ్బా.. ఆపరా నీ తెలుగు సినిమా డైలాగులు.. నేను పని మీద నాలుగు రోజులు బయటికి వచ్చేసరికి ఇంత విప్లవమా? ఈ రెండేళ్లలో కేవలం ఒక్కసారి, అదీ మీ నాన్నగారికి పెద్ద ఆపరేషన్ అంటే ఒక పదిరోజులకని మాత్రమే ఇండియాకి వెళ్లిన నువ్వు ఇంత సడెన్‌గా పెట్టె బేడా సర్దుకొని ఇండియా చెక్కేసావంటే, అది కూడా శాశ్వతంగా! ఎలారా నమ్మమంటావ్?’ అడిగాడు నితిన్.
‘ఒక పని చెయ్యరా, ఎలాగూ ఇంకో వారంలో ఇండియా వస్తున్నావుగా. అప్పుడే మాట్లాడుకుందాం.. సరేనా’ అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి.
అమెరికాలో స్పేస్ టెక్నాలజీలో ఎం.ఎస్. చేస్తున్న తమ ఇద్దరిలో మొదట్నుంచి రిషి ఎక్కువ తెలివైన వాడు. మంచి స్కాలర్షిప్‌తో చదవడంతోపాటు తన కలల సంస్థ ఐన నాసాలో ఉద్యోగం ఖాయం చేసుకున్నాడు. తన నైపుణ్యంతో ఒకసారి మీట నొక్కితే ఒకేసారి ఆరు వేర్వేరు లక్ష్యాలని, ఆరు వేర్వేరు చోట్ల ఛేదించే రాకెట్ టెక్నాలజీని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కనిపెట్టి, ఆ కానె్సప్ట్‌ని నాసాకి తను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు సమర్పించి అమెరికా చరిత్రలో చిరస్థాయిగా నిలవడానికి అతి చేరువలో ఉన్నాడు.. అలాంటి తన జీవితాశయమైన అమెరికా జీవితం వదిలెయ్యడమా! విమానంలో తన సీట్‌లో కుదురుకున్న నితిన్ కళ్ల మీదకి మాస్క్ లాక్కుంటూ మెల్లగా గతంలోకి జారుకున్నాడు.
* * *
‘దటీజ్ కల్నల్ పరశురాం సన్... ఐఐటి ఫస్ట్ ర్యాంకర్!’ గర్వంగా అన్నాడు తన భార్య వైపు చూస్తూ పరశురాం.
సికిందరాబాద్‌లోని మిలిటరీ బేస్‌లో కల్నల్‌గా వున్న పరశురాంకి తన ఉద్యోగం, భార్య జయ, కొడుకు రిషి అంటే ఎంత ఇష్టమో దేశం మీద కూడా అంతే అభిమానం. చిన్నప్పటి నుంచి వున్న ఆ దేశాభిమానంతో మిలిటరీలో చేరి దేశ సేవలో తన వంతు కృషి చేస్తున్నాడు.
‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది రిషి. ఇది నీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. వచ్చే నాలుగేళ్లు నువ్వు పడే కష్టం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీకు బాగా ఇంటరెస్ట్ వున్న సబ్జెక్ట్స్.. ఎంపిక చేసుకో, మనసు పెట్టి చదువు.. దేశానికి మంచి పేరు తీసుకురా...’ కొడుకు భుజం తట్టి అన్నాడు పరశురాం.
‘డౌట్ లేదు డాడ్.. రాకెట్ సైన్స్ నాకు చాలా ఇష్టం. అందులోనే ముందుకి వెళ్తాను...’ స్థిరంగా అన్నాడు రిషి.
‘కరెక్ట్‌రా రిషి... మనం మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా రాకెట్ సైనే్స చేద్దాం...’ అన్నాడు అప్పుడే లోపలికి అడుగుపెట్టిన రిషి స్నేహితుడు నితిన్. అతనికీ ఐఐటి ఎంట్రన్స్‌లో ఆరో ర్యాంక్ వచ్చింది.
‘నీకు కూడా అభినందనలు అండ్ ఆల్ ది బెస్ట్ నితిన్...’ నితిన్ భుజం తడుతూ అన్నాడు పరశురాం.
‘మొత్తానికి సాధించామురా నితిన్... నాలుగేళ్లు ఆగితే చాలు.. అమెరికాలో దిగిపోతా.. ఎంఎస్ చేస్తా.. నాసాలో చేరిపోతా... అక్కడైతే మన టాలెంట్‌కి తగ్గ గుర్తింపు వస్తుంది... డబ్బులు.. పేరు.. ఆ లైఫ్ స్టైల్.. వాహ్..’ షటిల్ ఆడుతూ అన్నాడు రిషి.
‘మరీ అంత అమెరికా ప్రవాహంలో నువ్వు ఒక్కడివే కొట్టుకుపోకు. కాస్త మేము కూడా ఉన్నామని గుర్తు పెట్టుకో డియర్...’ అన్నాడు నితిన్.
‘సరేలేరా... మనం ఇంజనీరింగ్ కూడా కలిసి చదువుతాం. కలిసి అమెరికా వెళ్తాం. ఎంఎస్ చేస్తాం. అక్కడే సెటిల్ అవుతాం.. అక్కడ ఏ బేస్‌బాలో, లేదా బాస్కెట్‌బాలో ఇలాగే అక్కడ ఆడుకుందాం సరే..?’ నవ్వుతూ అన్నాడు రిషి.
‘అదంతా సరే గానీ, ఇంతకీ నీ మనసులో విషయం అంకుల్, ఆంటీ వాళ్లకి తెలుసా? అసలే మీ నాన్నగారికి దేశభక్తి ఎక్కువ. పైగా నువ్వు వాళ్ల ఒక్కగానొక్క కొడుకువి.. మరి నువ్వు అమెరికాలో సెటిల్ అవుతానంటే వాళ్లు ఒప్పుకుంటారంటావా?’ మంచినీళ్లు తాగుతూ అడిగాడు నితిన్.
‘నాకూ ఇంకా క్లియర్‌గా తెలియదు. నేను బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి దేశంలో సెటిల్ అవుతానంటే, వాళ్లు మాత్రం ఎందుకు కాదంటారు? వాళ్లే కన్విన్స్ అవుతారు...’ బ్యాగ్‌లోకి షటిల్ రాకెట్ సర్దుకుంటూ అన్నాడు రిషి.
* * *
‘చాలా హ్యాపీగా ఉంది నితిన్... మొత్తానికి మనం కల కన్నట్లు అమెరికాలో అడుగు పెట్టబోతున్నాం.. అది కూడా స్కాలర్షిప్‌తో...’ అన్నాడు రిషి.
‘ఎస్.. ఈ నాలుగేళ్లు జెట్ స్పీడ్‌లో గడిచిపోయాయి!!’ నవ్వుతూ అన్నాడు నితిన్.
‘ఐతే, వెళ్లడానికే నిర్ణయించుకున్నావా రిషి’ దగ్గరికి వస్తూ అన్నది జయ.
‘అవునమ్మా.. చెప్పా కదా.. అయినా నేను మిమ్మల్ని వదిలి అంత దూరం వెళ్తున్నాను అన్న దిగులు తప్పితే, మీకు మాత్రం సంతోషంగా లేదా?’ తల్లి చేయి పట్టుకుని అన్నాడు రిషి.
‘కేవలం నా పోరు పడలేక, నీ చదువు వరకు ఒప్పుకున్నారు గానీ, మన దేశంలో ఉండక పరాయి దేశానికి వలస వెళ్తాను అంటుంటే నాన్నగారికి మింగుడు పడటం లేదు.. మధ్యలో నేను నలిగిపోతున్నాను..’ ఒకింత నిరుత్సాహంగా అన్నది జయ.
‘వాడు అమెరికాలో ఉన్నత చదువులు చదవడం మీద నాకు అభ్యంతరం లేదు జయ.. ఇక అక్కడే ఉండిపోతాను అంటున్నాడు చూడు... అదే నేను జీర్ణించుకోలేక పోతున్నాను’ అంటూ రిషితోపాటు, నితిన్ వైపు కూడా ఒకసారి చూసి తన గదిలోనికి వెళ్లిపోయాడు పరశురాం.
‘నాన్నగారి సంగతి సరేనమ్మా, నీ సంగతి చెప్పు... నా తెలివికి తగ్గ గుర్తింపు కోరుకోవడం, మంచి జీవితాన్ని జీవించాలి, మీ ఇద్దరికీ అక్కడ ఒక సుఖవంతమైన శేష జీవితం కల్పించాలి అనుకోవడం తప్పంటావా?’ తల్లితో అన్నాడు రిషి.
‘ఏమోరా... నువ్వన్న దాంట్లో తప్పొప్పులు వెదికేంత పెద్ద చదువులు నేను చదువుకోలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను... మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాము. మాకేమీ ఇక్కడ కష్టం అనిపించలేదు. మంచిగానే జీవిస్తున్నాము... నీ జీవితం నీ ఇష్టం కానీ, మమ్మల్ని మాత్రం ఇక్కడే వదిలెయ్యరా.. మా సుఖం కోసం నువ్వు ఈ ఆలోచన చెయ్యకు...’ అన్నది జయ.
‘సారీ రిషి. నేను మళ్లీ కలుస్తాను’ అని బయట పడ్డాడు నితిన్.
నితిన్ తల్లి అతని చిన్నప్పుడే చనిపోవడంతో అన్నీ తానై పెంచాడు అతని నాన్న. ‘ఇంకో రెండేళ్లల్లో ఎలాగూ రిటైర్ అయిపోతాను. ఈలోపు నువ్వు ఎక్కడ సెటిల్ ఐతే, నేనూ అక్కడేరా..’ అన్న తన నాన్న మాటలు గుర్తొచ్చాయి నితిన్‌కి.
* * *
‘ఏరా.. చివరికి ఏం మాయ చేశావ్.. మీ పేరెంట్స్ కొంచెం హ్యాపీగానే నిన్ను సాగనంపినట్టు ఉన్నారు?’ అమెరికా విమానం ఎక్కిన రిషిని అడిగాడు నితిన్.
‘చిన్న ఉపాయం.. చదువు పూర్తి కాగానే ఇండియా తిరిగి వస్తానని చెప్పా’ నవ్వుతూ అన్నాడు రిషి.
‘అలా అబద్ధం చెప్పడం మోసం కాదా? లేక కొంపదీసి నిజంగానే ఇండియాకి వచ్చేస్తావా?’ అడిగాడు నితిన్.
‘చూడు మిత్రమా.. మొదటిసారి ఇలా వాళ్లని వదిలి వెళ్తున్నా కాబట్టి వాళ్లకి కొంచెం దిగులు. అంతే.. ఈ రెండేళ్లలో వాళ్ల మనసు మార్చి అమెరికాకి రప్పిస్తాను గానీ.. నేను మళ్లీ ఇండియా వెనక్కి రావడమా.. నెవర్’ నవ్వుతూ అన్నాడు రిషి.
* * *
మరి కొద్ది క్షణాల్లో తన విమానం హైదరాబాద్‌లో దిగబోతున్నది అన్న ప్రకటనతో తన ఆలోచనల అలల నుంచి తేరుకున్నాడు నితిన్. కలత నిద్ర, పాత జ్ఞాపకాలు, కొత్త పరిణామాలతో మనసు అల్లకల్లోలంగా వున్నా అసలు రిషికి ఏమయ్యింది అని తెలుసుకోవాలన్న ఆత్రమే ఎక్కువగా ఉంది ఇప్పుడతనికి. త్వరత్వరగా ఇంటికి పరుగుతీసి, తన నాన్నతో ఒక గంట గడిపినట్లే గడిపి, రిషి వాళ్ల ఇంటికి దారితీశాడు.
రిషి అమ్మా నాన్నల పలకరింపులు అయ్యాక.. రిషిని పక్కనున్న క్యాంటీన్‌కి లాక్కెళ్లాడు నితిన్.
‘చెప్పరా నాయనా.. అసలు ఏం జరిగింది? ఎందుకింత సాహసానికి వొడిగట్టావ్? ఇంత హఠాత్తుగా నీ అమెరికా జీవితాన్ని వదులుకోవడానికి కారణం ఏమిటి? లవ్‌లో ఏమైనా పడ్డావా? మీ అమ్మా నాన్న ఏమైనా ఎమోషనల్‌గా మాట్లాడారా? ఈ టెన్షన్ భరించలేక ఛస్తున్నాను’ గబగబా అడిగాడు నితిన్.
‘చివరికి మన దేశంలో మనం శాశ్వతంగా ఉండాలి అనుకోవడమే ఒక సాహసంగా అనిపిస్తోందా? ఈ దేశంలో ఒక మారుమూల పల్లెలో పేపర్ బాయ్‌గా పని చేసిన ఒక మధ్యతరగతి బాలుడు తన జీవితానే్న మన దేశం కోసం అంకితం చెయ్యాలి అని తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం ముందు... నా నిర్ణయం ఏపాటిది?’ నితిన్ కళ్లల్లోకి చూస్తూ అన్నాడు రిషి.
‘ఏంటిరా.. సడెన్‌గా ఈ దేశభక్తి డైలాగులు.. నీలో మీ నాన్నగారు కనిపిస్తున్నారు’ అన్నాడు నితిన్.
‘కారణం. అవుల్ పకీర్ జైనులబ్లీన్ అబ్దుల్ కలాంగారు’ ప్రశాంతంగా అన్నాడు రిషి.
‘ఏమిటన్నావ్.. మళ్లీ చెప్పు..?’ క్షణకాలం నిశ్శబ్దం తర్వాత నివ్వెరబోతూ
అన్నాడు నితిన్.
‘నువ్వు విన్నది పచ్చి నిజం.. ఆయన వలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఆ తరువాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు.. వచ్చేశాను..’ వెనక్కి వాలుతూ అన్నాడు రిషి.
‘ఆయన పది రోజుల పూర్వమే కాలం చేశారు కదా!! అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా నాయనా...’ ముందుకి వంగుతూ అన్నాడు నితిన్.
‘అవును నితిన్, నువ్వు ఊరు వెళ్లాక, ఇరవై ఏడో తేదీ నైట్ నిద్రపట్టక టీవీ చూస్తూ అలా మన దేశం న్యూస్ ఛానల్స్ పెట్టాను. అప్పుడు చూశాను. ఆయన మరణవార్త! ఇంతకు ముందు మనం ఆయన గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మనం ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒకసారి మన కాలేజీకి కూడా వచ్చారు. రాకెట్ సైన్స్‌లో ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతూనే ఉండేవాళ్లం. అంతే కాకుండా దేశ రాష్టప్రతిగా కూడా ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టారు మన దేశానికి...’ సర్వర్ కాఫీ తేవడంతో ఒక్క క్షణం ఆగాడు రిషి.
‘ఇదంతా మన అందరికీ తెలిసిన విషయమే కదా! ఆయన మన అందరికీ గర్వకారణం... కానీ నీకు కొత్తగా ఏం జ్ఞానోదయం అయ్యింది.. అది చెప్పు...’ కాఫీ చప్పరిస్తూ అన్నాడు నితిన్.
‘లేదు నితిన్... మనలో చాలామంది తెలుసుకోని, మన కళ్లు తెరిపించే అనేక విషయాలు ఉన్నాయి రా! ఎంతసేపు మనం ఆయనని ఒక మిస్సైల్ మాన్ లాగా, శాస్తవ్రేత్తలాగా, రాష్టప్రతిలాగా, భారతరత్న లాగా మాత్రమే చూశాము. అనేక మంది శాస్తవ్రేత్తలలో ఒక ప్రత్యేక శాస్తవ్రేత్త. అంతే కదా.. కానీ మనలో ఎంతమంది ఆయన ఆదర్శాలు పాటిస్తున్నాం? ఎందరో రాజకీయ నాయకులు మన దేశాన్ని ఏలుతూ తమ రాజకీయ ప్రయోజనం కోసమో, స్వార్థం కోసమో, తమ తరువాతి పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుల కోసమో, ఇతరుల పతనానికి వెనుకాడని ఈ రోజుల్లో.. పెళ్లి కూడా చేసుకోకుండా, తన జీవిత సర్వస్వాన్ని దేశం కోసం ధారపోసి, తన పరిజ్ఞానం వల్ల మన దేశానికి లక్షల కోట్ల రూపాయలు మిగిల్చి కూడా, తను సంపాదించిన కొద్దిపాటి సంపాదన దానం చేసి కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో బతికిన ఆయన లాంటి దేశభక్తులు ఎంతమంది ఉన్నారు అంటావ్?’ ఆవేశంగా అన్నాడు రిషి.
‘నిజమేరా.. కానీ ఆయన జీవితానికి నీ నిర్ణయానికి ఏమిటి సంబంధం?’ కాఫీ తాగడం ఆపేసి అన్నాడు నితిన్.
‘మన దేశానికి అంకితమై ఇక్కడే తనని తాను నిరూపించుకొని, మన దేశానికి అఖండ కీర్తి సంపాదించిన కలాంగారిది రా అసలైన జీవితం. అంతెందుకు.. నీ చుట్టూ చూడు.. అమెరికాలో ఉన్న ఎన్నో పెద్ద సంస్థలకి మన దేశస్థులే అధిపతులు.. నాసాలో దాదాపు ముప్పై శాతం మంది మన భారతీయులే... ఒక్కసారి ఆలోచించు.. ఒకవేళ వీళ్లందరూ ఇక్కడే.. మన దేశంలోనే వుండి ఉంటే... వీళ్ల ప్రతిభ, మేధస్సు.. మన దేశంలోనే వాడి ఉంటే.. ఈ దేశానికి ఇంకెన్ని లక్షల కోట్లు మిగిలి ఉండేవి లెక్కించగలవా? కలంగారు కూడా వీరిలాగా అమెరికాకి వెళ్లి అక్కడ స్థిరపడి పోయుంటే... మన దేశం ఏం కోల్పోయి ఉండేదో ఊహించగలవా?’ కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు రిషి.
‘అదంతా సరేరా... ఒప్పుకుంటాను. కానీ నువ్వెందుకు ఇంత సాహసం చెయ్యాలి.. ఇక్కడ నీకు ఏముంది.. నీ ప్రతిభకి సరైన గుర్తింపు ఉందా.. అడుగడుగునా అడ్డంకులు.. రాజకీయ స్వార్థాలు.. ఏమి సాధించగలవ్?’ అడిగాడు నితిన్.
‘లేదు నితిన్. రోజులు మారుతున్నాయి. నేడు మన శాస్తవ్రేత్తలు ఈ దేశంలో వుండి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇది ప్రపంచమంతా గుర్తిస్తోంది.. అభినందిస్తోంది. ఈ దేశ భవిష్యత్ అయిన మనం కూడా గుర్తించాలి.. భాగస్వాములు కావాలి. నేను ఇప్పుడు కనిపెట్టిన ఈ కొత్త టెక్నాలజీ ఒక విప్లవం... ఇది బయట దేశంలో నాకు కనక వర్షం కురిపిస్తుంది. బోలెడు పేరు, అవార్డులు రావడం ఖాయం.. నేను ఇది అక్కడుండి చేస్తే అది ఆ దేశానికి ఉపయోగం. కానీ ఇక్కడుండి చేస్తే మన దేశానికి ప్రయోజనం.. అది అక్షరాలా నిరూపించారు మన కలాంగారు.. అందుకే, ఆయన మరణానికి జాతి, మతం తో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం విలపించింది. ప్రపంచమంతా బాధపడింది... నేనూ బాధపడ్డాను. ఇంతకాలం నేను ఆయనలాగా ఆలోచించనందుకు బాధపడ్డాను.. దేశానికి నువ్వు ఏమిచ్చావు అన్న ప్రశ్న ఒక సినిమా డైలాగ్‌లా భావించినందుకు బాధపడ్డాను.. అప్పుడే నా ఈ కొత్త ప్రయాణానికి తొలి అడుగు వేశాను. ఆయన జీవితమే నా ఈ నిర్ణయానికి స్ఫూర్తి... నా ఈ నిర్ణయమే మరో నలుగురికి ఇలాంటి ఆలోచన కల్పించాలి... ఇక నుంచి ఇదే నా జీవిత లక్ష్యం.. సరే ఇక వెళదామా, నాకు రేపు ఇస్రోలో ఇంటర్వ్యూ వుంది.. దానికి సిద్ధపడాలి’ కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు రిషి.
‘నువ్వనుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది రిషి... పద, ఈ సాహసమేదో కలిసే చేద్దాం..’ నవ్వుతూ లేచి చెయ్యి కలిపాడు నితిన్.
***

-గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం
ఎ-206, మీనాక్షి మంగళం అపార్ట్‌మెంట్స్,
2వ మెయిన్, అరెకెరె, బనే్నరుఘట్ట రోడ్
బెంగళూరు - 560076... 9880280569

-గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం