కథ

మృగాల మధ్య...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక బహుమతి
రు.2,500 పొందిన కథ
**
‘ప్లీజ్.. డోర్ క్లోజ్ చెయ్యొద్దు... నాకస్సలు ఇష్టం లేదు’
‘ఇక్కడ నీ ఇష్టం కాదు... కెరీర్ ముఖ్యం. ఆలోచించుకో’
శృతి ముఖం ఎర్రబడింది. మొదటి రోజు నుండే తన శరీరాన్ని తాకాలని చేసిన వెకిలి చేష్టలు ఎలాగో భరించింది. తర్వాత బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే ఎలాగో తప్పించుకుంది. తన వౌనాన్ని అంగీకారంగా అనుకుని ప్రతిరోజూ ఏదో విధంగా బాధపెడ్తున్నా, ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఇన్నాళ్లూ భరించింది. కానీ ఈ రోజు తలుపు మూసేవరకు వ్యవహారం రావడంతో ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది.
‘షటప్ మిస్టర్ సూర్యా.. కెరీర్‌కన్నా కేరెక్టర్ ముఖ్యం నాకు. ప్రతిభ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు’
‘అబ్బా... వెళ్లువెళ్లు.. ఎక్కడికి వెళ్లినా ఆడది ముందు ఆడది. తర్వాతే ఉద్యోగి. గుర్తు పెట్టుకో’ వెకిలిగా నవ్వుతూ అన్నాడు.
‘నీలాంటి మృగాలే అన్నిచోట్లా ఉండరు. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం. అక్కడ మంచివాళ్లు కూడా ఉంటారు. ఇంతకన్నా బాగానే బ్రతకగలను’
‘ఇంతకన్నా బాగా బతుకుతావా? ఈ రోజుల్లో ఇది చాలా కామన్. బాస్‌ను తృప్తిపరిస్తే జాబ్ సెక్యూరిటీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు త్వరగా వస్తాయి.. లేకపోతే ఉన్న జాబే ఊడిపోవచ్చు. అందరూ ఇలాగే ఉంటారని.. ప్రతిచోటా ఇంతేనని నువ్వే తెలుసుకుంటావులే’
‘అదీ చూద్దాం’
అంటూ విసురుగా డోర్ దగ్గర అడ్డంగా నిల్చున్న సూర్యని గట్టిగా పక్కకు తోసి బయటకు నడిచింది శృతి.
* * *
ఆటో ఎక్కింది శృతి.
ఆమెకు అమ్మానాన్న గుర్తొచ్చారు. ఆ రోజు ఇంకా ఆమెకు గుర్తే.
‘నాన్నా.. నేను హైదరాబాద్‌కు వెళ్లి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను’
‘ఇకడ ఏడవలేక పోయావ్.. ఇంక అక్కడ ఏం ఏడుస్తావ్?’
‘అక్కడ అవాశాలు ఎక్కువ నాన్నా.. నేను వెళ్తాను’
‘వెళ్లి ఎక్కడ ఉంటావ్? ఆడపిల్లవి.. ఒక్కదానివి ఏమైనా జరిగితే మేం ఊళ్లో తలెత్తుకోగలమా? ఓ మంచి సంబంధం వచ్చింది. నోర్మూసుకుని పెళ్లి చేసుకో’
‘ఏమేవ్.. నీ పెంపకం ఇలా ఏడ్చింది. ఇది హైదరాబాద్ వెళ్తుందట!’
‘శృతీ.. నాన్న చెప్పేది నీ మంచికేగా.. ఎందుకు తల్లీ నీకు లేనిపోని ఇబ్బందులు? నాన్న చెప్పినట్టు చెయ్’ అంది అమ్మ.
‘లేదమ్మా.. ఏమైనా సరే నేను వెళ్లి తీరుతాను’ శృతి పంతంగా అంది.
శృతిది ఓ పల్లెటూరు. ఇంజనీరింగ్ చదివాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం రాలేదు. ఆమెకి ఓ ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తను నిలబడాలని కోరిక.
అలా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా మంచి అవకాశాలు ఉంటాయేమోనని హైదరాబాద్‌కు వచ్చేసింది. వచ్చిన నాలుగు నెలలకి ఎలాగో కష్టపడి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఏం లాభం? అక్కడ చేరిందో లేదో మేనేజర్ నుండి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. బూతు మెసేజ్‌లు, వీడియోలు మామూలే. ఈ రోజు వ్యవహారం మరీ శృతిమించడంతో ఉద్యోగాన్ని వదిలేసింది శృతి.
ఎందుకో ఆమెకు ఇంటికి వెళ్లిపోదామనిపించింది. కానీ ఇంటికి వెళ్లడం సమస్యకి పరిష్కారం కాదు. ఇంటికి వెళ్లిన వెంటనే ఎవరో ఒకరితో పెళ్లి చేస్తారు. మళ్లీ ఇంకొకరిపై ఆధారపడటం అనేది జీవితాంతం ఎదుర్కోవాల్సిన ఇంకో సమస్య.
* * *
తన ఆలోచనలు సాగుతూండగానే హాస్టల్ వచ్చేసింది.
‘ఏమైంది శృతి? అలా ఉన్నావ్’ పలకరించింది రూమ్మేట్ రవళి.
‘మా బాస్ గురించి నీకు తెల్సిందేగా రవళి! వొఠ్ఠి రోగ్ వాడు. ఈ రోజు మరీ హద్దులు దాటాడు’
‘ఏం చేశాడేంటీ?’
‘ఏకంగా డోర్ క్లోజ్ చేశాడు’
‘కమాన్ శృతి. టేకిట్ ఈజీ. మా బాస్ కన్నా బెటర్ మీవాడు. ఇవన్నీ పట్టించుకుంటటే ఉద్యోగలు చేయడం కష్టం’ కల్పించుకుంది ఇంకో రూమ్మేట్ హరిత.
‘చేయి పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించడం, డోర్ క్లోజ్ చెయ్యడం.. ఇవన్నీ కామనా?’ అడిగింది శృతి.
‘మరి కామన్ కాక ఇంకేంటి? అలా అని ఉన్న ఉద్యోగం వదిలేస్తావా? ఎక్కడికెళ్లినా ఇదే బాగోతం. తెలివితక్కువగా ఉండి ఇంత మంచి జీతం తెచ్చే ఉద్యోగం వదులుకోకు’ అంది హరిత.
‘అదెప్పుడూ అంతేలేవే. వదిలేయ్ దాని మాటలు’ అంది రవళి.
* * *
రోజులు గడిచాయి. శృతి మళ్లీ కష్టపడి ఇంకో ఉద్యోగం వెతుక్కుంది. జాయిన్ అయిన పదిహేను రోజుల తర్వాత అక్కడ కూడా అదే కథ. మనసు చంపుకుని రాజీపడలేక మానేసింది.
‘ఎక్కడ మొదలైనా ఇక్కడికే వస్తుంది. లోకం ఇంతే’ అనుకుంది ఆమె. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఉద్యోగం దొరకలేదు. చేతిలో డబ్బులు అయిపోవచ్చాయి.
‘ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోవడం ఒక్కటే మార్గం. నేను పూర్తిగా ఓడిపోయాను. ఇంట్లో వాళ్ల ఇష్టానికి తలవంచి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేనేమో’ అని అన్పించింది శృతికి.
ఇంటికి వెళ్లే ముందు అమ్మకు ఒకసారి ఫోన్ చేద్దాం అన్పించింది శృతికి. అమ్మ ఏమంటుందో? ‘నీకలా జరగాల్సిందే, మమ్మల్ని కాదని వెళ్లావుగా. అనుభవించు’ అని ఎత్తి పొడుస్తుందేమో.
పోనే్ల. అంటే అననీ, అమ్మేగా. తనకీ శాస్తి కావాల్సిందే. ఇంట్లో వాళ్లని కదాని వచ్చినందుకు ఇలా జరగాల్సిందే - తనని తానే తిట్టుకుంటూ ఫోన్ చేసింది పొర్లుకొస్తున్న దుఃఖంతో.
‘హలో అమ్మా!’
‘హలో శృతీ.. చెప్పరా. ఎలా ఉన్నావ్?’
చాలా రోజుల తర్వాత అమ్మ గొంతు వినేసరికి ఏడుపు వచ్చేసింది శృతికి.
‘అసలు ఏం బాలేదు అమ్మా ఇక్కడ’ అంటూ భోరున ఏడ్చేసింది.
‘ఏమైందిరా? ఒంట్లో బాగాలేదా?’ కంగారుగా అడిగింది తల్లి సునంద.
కాసేపటికి తమాయించుకుని,
‘ఇక్కడేం బాగాలేదమ్మా. నేను ఇంటికొచ్చేస్తాను’ అంది శృతి.
‘బాగాలేకపోవడం ఏంటిరా తల్లీ. చక్కగా ఉద్యోగం చేస్తున్నావు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు ఏమైందిరా?’
‘లేదమ్మా. ఇక్కడ మగాళ్లందరూ మృగాలేనమ్మా. మొదట జాయిన్ అయిన ఆఫీసులో మేనేజర్ చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. అది వదిలేసి ఇంకోటి వెతుక్కుంటే మళ్లీ అదే పరిస్థితి. ఇక నా వల్ల కాదమ్మా. ఇక్కడ ఉండలేను. ఇంటికి వచ్చేస్తానమ్మా’
తల్లి తెల్లబోయింది. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అంది.
‘ఇంటికి వచ్చి ఏం చేస్తావు తల్లీ.. ఇక్కడికి వస్తే పెళ్లి చేస్తాం.. పెళ్లి.. అయిన తర్వాత వచ్చేవాడు కూడా ఓ మృగం అయితే ఏం చేస్తావు? ఉద్యోగం లేక జీవితాంతం వాడి కాళ్ల దగ్గర పడి ఇలాగే ఏడుస్తావా?’
అమ్మ అలా మాట్లాడుతుందని ఊహించని శృతికి అది పెద్ద షాక్.
‘అమ్మా...’
‘అమ్మనే మాట్లాడుతున్నాను. నా సంగతే చూడు. పద్దెనిమిదేళ్లకి నాకు పెళ్లి చేస్తారు. అప్పటి నుండి నేను సాధించింది ఏమిటి? నాకు చదువుకుని జాబ్ చెయ్యాలని ఉండేది. కానీ బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత నాన్న మాటే నాది తప్ప ఏ విషయంలోనూ నాకు స్వేచ్ఛ లేదు. నా మాటకు విలువ లేదు. రేపు నీ గతి నాలానే కావాలా? ఇంత చదువుకుని సమస్యలకు భయపడి వెనక్కి వచ్చేస్తాననడమేమిటే నాకు వింతగా ఉంది.
‘నీకో సంగతి చెప్పనా? ఆ రోజు నాన్న వద్దన్నా నువ్వు హైద్రాబాద్ వెళ్లినప్పుడు పైకి చెప్పలేదు గానీ నేను సంతోషపడ్డాను. నా చిట్టితల్లి నాకంటే నయమని మనసులో గర్వపడ్డాను. ఆడదాని జీవితమంతా మృగాల మధ్య సాగే ఆట. నువ్వు నాకన్నా బాగా చదువుకున్న దానివి. ఇంతకు మించి నాతో చెప్పించుకోవనే అనుకుంటున్నాను. ఓడిపోయి తిరిగి ఇంటికి వస్తావో నీ సమస్యల్ని నువ్వే తేల్చుకొని జీవితాన్ని జయిస్తావో నువ్వే తేల్చుకో. నేను చెప్పేదేమీ లేదు. నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేసింది సునంద.
తల్లి మాటల్తో ఆలోచనలో పడింది శృతి.
‘అమ్మ.. తనకి ఇన్నాళ్ల నాన్న చాటు అమ్మగానే తెలుసు.. చిన్నప్పటి నుండి తను అమ్మని చూస్తూనే ఉంది. ఎప్పుడూ నాన్న చెప్పింది చెయ్యడమే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోవడం తను ఎప్పుడూ చూడలేదు. నాన్న చెప్పిందానికల్లా తల ఊపడమే అమ్మకి ఇష్టం అని అనుకునేది ఇన్నాళ్లు.
కానీ ఇప్పుడు అర్థం అయింది. అది ఇష్టం కాదు. ఓ రకమైన బానిసత్వం అని. స్వతంత్రంగా బతకలేక, మనసులో మాట చెప్పలేక, చెబితే ఏమవుతుందోనన్న ఓ రకమైన భయంతో, అభద్రతా భావంతో గడిపిన జీవితం అమ్మది అని ఇప్పుడు అర్థమైంది.
ఇంటికి వెళ్లే ఆలోచనను విరమించుకుంది శృతి.
* * *
ఆ రోజు శృతి నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమైంది. అప్పటికే కింద నుండి అరుపులు వినిపిస్తున్నాయి. హాస్టల్‌మేట్స్ అందరూ బాల్కనీ గోడ దగ్గరికి చేరి కిందికి చూస్తున్నారు. శృతి కూడా అటువైపు నడిచింది.
కింద హాస్టల్ దోబీ - సావిత్రి. హాస్టల్ ఓనర్‌తో గొడవపడుతోంది.
‘ఏంట్రా రెచ్చిపోతున్నావ్? నీకెంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తావ్? నీకు సదువులు సదివే కూతుళ్లు లేరు.. సచ్చినోడా.. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చమ్‌డాలు వలిచేస్తా...’ ఆమె చెయ్యి అతని కాలర్ మీద ఉంది.
అప్పటికే రెండు చెంపలు వాయించినట్టుంది. వరహాల్రావు బుగ్గలు రెండూ బూరెల్లా అయ్యాయి.
బిక్కచచ్చిపోయి అటూ ఇటూ చూస్తున్నాడు అతను.
‘నువ్వేంట్రా నన్ను పనిలోకి రావద్దనేది? నీ దగ్గర పని కాకపోతే పది కొలువులు నాకు. నువ్వు ఏం చేసినా నేను పడుంటాననుకున్నావురా? నాకు రావాల్సిన సొమ్ములు తియ్యి’
అప్పటికే అందరూ తమ వైపే చూస్తుండటంతో చేసేది లేక ఆమె పని డబ్బులు తీసి ఆమె చేతికిచ్చాడు.
‘్థ...’ అని అతని మొహం మీద ఉమ్మేసి.. అక్కడి నుండి వెళ్లిపోయింది సావిత్రి.
అందరూ రూముల్లోకి వచ్చారు.
‘సావిత్రిలా ఉండాలే.. ఆ ఓనర్‌గాడికి చదువుకున్న మనమే ఎంతో భయపడతామ్. వాడు ఎన్ని వెకిలి వేషాలు వేసినా చూసీ చూడనట్టు పోతుంటామే. అలాంటిది సావిత్రి అంత ధైర్యంగా వాణ్ణి ఉతికేసింది’ అంది పక్కరూమ్ అర్చన.
అందరూ తలో రకంగా సావిత్రి గురించి కామెంట్ చేస్తున్నారు.
సావిత్రే శృతి కళ్ల ముందు మెదిలింది.
‘సావిత్రికి ఉన్న ధైర్యం కూడా నాకు లేదే. ఇంకో పని దొరకదేమో అన్న బెంగ లేదు సావిత్రికి. ఏం చదువుకోకపోయినా ఆమెకు తన మీద తనకు ఎంత నమ్మకం. బతుకు మీద ఎంత భరోసా?
మరి అమ్మ ఎంతో కొంత చదువుకుంది. తను, తన హాస్టల్‌మేట్స్ బాగానే చదువుకున్నారు. కానీ నలుగురికి తెలిస్తే ఏవౌతుందో, ఎవరేం అనుకుంటారో, పరువుగా బతకలేమేమోనన్న భయాలు, అభద్రతా భావాలు తమలాంటి చదువుకున్న వారికి ఎక్కువనుకుంటా! సమస్య నుంచి ఇంకో సమస్య వైపు పరిగెత్తడమే పరిష్కారం అని అనుకుంటారు తమలాంటి వాళ్లు.
వేటలో మృగాలకు రెండే ఆప్షన్స్. ఒకటి ఎప్పుడూ వేటగాడికి ఛాయిస్ కాకుండా పరిగెడుతుండటం. లేదా ధైర్యంగా తిరగబడటం. మొదటిది తనలాంటి వాళ్లకైతే రెండోది సావిత్రి లాంటి వాళ్లకు.
స్వంతంగా తన కాళ్ల మీద నిలబడుతూ ఎందరికో ఆసరా కల్పిస్తున్న స్ర్తి పారిశ్రామికవేత్తలు, ఇంటి నుండే ఆన్‌లైన్ బిజినెస్‌లు చేస్తున్న మహిళలు ఎందరు లేరు?
ఒళ్ళంతా గాయపరిచిన మృగం దగ్గర దొరికే పంచభక్ష్య పరమాన్నాల్లకంటే సొంతంగా చేసుకుని తినే పచ్చడి మెతుకులే బావుంటాయి.
నిర్ణయం తీసుకున్నాక హాయిగా నిద్రపట్టింది శృతికి.
* * *
మర్నాడు శృతి లేచేసరికి ఫ్రెండ్స్ అందరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.
‘నాకు మిర్చిబజ్జీ అంటే చాలా ఇష్టమే. కానీ ఇక్కడ దొరికేది చల్లారిపోయాకో లేక రుచి లేకో ఉంటాయి’
‘నాక్కూడానే సరళ. ఇంతకు ముందు హాస్టల్‌లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న బండి దగ్గర కూడా పెద్ద బావుండేవి కాదు’ జ్యోతి కల్పించుకుంది.
‘ఏదో చేస్తారులే కానీ.. ఇంట్లో ఉన్నట్టు ఉండే ఆ రుచే అస్సలు ఉండదే బాబూ’ అంది గోప్య.
‘అందరికీ ఇష్టమైన ఐటమ్ అది. అవి అంతగా బాగుండకే ఈ పానీపూరీలు, కట్‌లెట్‌లు అన్నీ కూడా తింటున్నది’ అంది రమ్య.
శృతి మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.
‘అమ్మగారూ! మీరు బాగా చదువుకున్నోరు. నాకు ఎక్కడైనా పని ఇప్పించరు’ అన్న పక్కింటి యాదమ్మ గుర్తుకొచ్చింది.
తన అకౌంట్‌లో ఉన్న ఎవౌంట్ చెక్ చేసింది. నలభై వేలుంది.
‘హమ్మయ్య’ అని అనుకుంది శృతి.
వెంటనే రెడీ అయ్యి, హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకొని బయల్దేరింది.
యాదమ్మని కల్సింది.
‘యాదమ్మా... ఎలా ఉన్నావ్?’ పలకరించింది.
‘బానే ఉన్నానమ్మ. వాడు తెచ్చిందంతా తాగుతూనే ఉంటాడమ్మా.. మిగిలేదేం ఉండదు.. చూస్తే పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు... ఏం చేయాలో తెలియడం లేదు’ అంది నిరుత్సాహంగా.
‘యాదమ్మా.. నీకు నెల జీతం నేనిస్తాను. నువ్వు రోజూ బజ్జీలు చేయగలవా?’
ఆ మాటలకు యాదమ్మ మొహం మతాబులా వెలిగిపోయింది.
‘చేస్తానమ్మా... ఏమైనా చేయగలను’ అంది యాదమ్మ.
‘సరే.. ఎప్పుడు చేయాలో నేను చెప్తాను’ అని బయటికి వచ్చేసింది శృతి.
ఆన్‌లైన్ బిజినెస్ పోర్టల్, మార్కెటింగ్, ఏజెన్సీ దగ్గరికి వెళ్లింది శృతి. వాళ్లతో మాట్లాడి ‘బజ్జీ బజార్’ పేరుతో ఓ సైట్ క్రియేట్ చేసింది.
తర్వాత యాదమ్మతో బజ్జీలు చేయించింది. తనకు పరిచయస్తులైన వారందరికీ వారి అడ్రస్‌లకు మిర్చిబజ్జీలు పంపింది వేడివేడిగా. బజ్జీలు ఇంటికే రావడంతో అందరి నుండి మంచి స్పందనే వచ్చింది శృతికి.
తర్వాత తనకు తెల్సిన హాస్టల్స్‌లోని ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపింది.
అది డబ్బులకు కాకపోయినా, ఆ రుచి వారికి చేరితే... వాళ్లే తమ మాటల్తో పబ్లిసిటీ చేస్తారని శృతికి తెలుసు.
అనుకున్నట్టుగానే హాస్టల్స్ నుండి, బిజినెస్ యూనిట్స్ నుండి రెండు నెలలు తిరిగేలోపే ఆర్డర్లు పెరిగిపోయాయి. యాదమ్మ ఒక్కత్తె సరిపోవడం లేదు. ఇంకా నలుగురు మహిళలను నియమించింది వంటకి.
సంవత్సరం తిరిగేసరికి దానికే ఓ బిజినెస్ సైట్ తీసుకోవాల్సి వచ్చింది. నలుగురు కాస్తా ఇరవై మంది అయ్యారు పనివాళ్లు. జిల్లా నుండి రాష్ట్రానికి పెరిగింది వ్యాపారం.
సావిత్రికి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది శృతి.

-శృంగవరపు రచన.. 9959181330