కథ

నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘ఇప్పుడేం చేద్దాం మహీ...’ ఏటి నీటి మీద తళతళలాడుతున్న నీరెండ కిరణాలను తదేకంగా చూస్తూ అడిగాడు మాధవ్.
ఏదో ఆలోచనలో మునిగి ఉన్న మహేశ్వరి ఒక్కసారి ఉలిక్కిపడి అతడి వైపు తిరిగి చూస్తూ ‘అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేదు...’ అంది సాలోచనగా తలపంకిస్తూ.
‘ఇది మన ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించిన విషయం.. ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఏ మాత్రం తడబడ్డా, తొందరపడ్డా అది మన జీవితాలకే ముప్పు తెస్తుంది...’ అన్నాడు మాధవ్.
అవునన్నట్లుగా తలూపింది మహేశ్వరి.
మాధవ్‌కి ఇరవై ఆరేళ్లు. బి.టెక్ పూర్తి చేసి ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాగైనా బ్యాంక్ జాబ్ సాధించాలన్న తపన ఉంది. అదే లక్ష్యంగా శ్రమించే ఓపికా ఉంది. మహేశ్వరికి ఇరవై రెండు. ఆమె ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతోంది.
ఇద్దరికీ ఈ మధ్యనే ఒక మూడు నెలల క్రితం నిశ్చితార్థం అయ్యింది.
అప్రయత్నంగా ఇద్దరి మనసులు తమకి ఒక బంధం ముడివడబోయేందుకు దోహదపడిన ఆనాటి పరిస్థితులను తలచుకున్నాయి.
* * *
బి.టెక్ పూర్తి చేసిన నాటి నుంచి కూడా ప్రభుత్వోద్యోగం కోసం తపిస్తున్నాడు మాధవ్. ఉద్యోగం పురుష లక్షణం అన్న పెద్దల మాటను పాటించడం కోసం కాకపోయినా, తాను నేర్చుకున్న విద్యని సాధన చేసినట్లుంటుందని ఒక చిన్న కంపెనీలో సిస్టమ్స్ అనలిస్ట్‌గా చేరాడు. బ్యాంక్ జాబ్ అతడి కల.
అతడి వృత్తి అతడికి ఆత్మసంతృప్తిని ఇవ్వగలిగింది కాని ఆర్థిక పరిపుష్టిని సంపాదించి పెట్టలేకపోయింది. ఎప్పుడెప్పుడు బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడుతుందా.. ఎప్పుడెప్పుడు దాన్ని సాధించి గవర్నమెంట్ కొలువులో చేరతానా అని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడసాగాడు.
సరిగ్గా అప్పుడే ఇంట్లో నస మొదలైంది అతడికి. ‘ఒంటిమీదకి ఇరవై ఆరేళ్ల వయసొచ్చింది. ముదరబెండకాయలా గిడసబారి పోతున్నావు.. ఇప్పటికైనా పెళ్లికి సరే అను’ అంటూ ఇంట్లోని వాళ్లంతా చెవినిల్లు కట్టుకుని నసపెట్టడం ప్రారంభించారు.
మాధవ్‌కి తల్లి మాట శిరోధార్యం అని ఎరిగిన మిగతా కుటుంబ సభ్యులు ఆమె చేత అతడికి త్వరగా ఇంటివాడివి కమ్మని బోధలు చేయించనారంభించారు.
‘ఏమిటమ్మా నువ్వు కూడానూ... సరైన ఉద్యోగం లేకుండా సంసార జీవితంలోకి అడుగుపెట్టడమంటే అది ఎంత సాహసమో కాస్తన్నా ఆలోచించరా! సరిపడా సంపాదన లేకుండా ఆ వచ్చే అమ్మాయిని నేనెలా పోషించాలి? నాకొచ్చే ఈ పదివేల రూపాయలు కనీసం ఇంటి అద్దెకి, మెనె్టయినెన్స్‌కి కూడా చాలవు... పెళ్లి సంసారం అంటే మాటలా! ఎన్ని చూసుకోవాలి! నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా...’ తల్లి దగ్గర చంటిపిల్లాడల్లే గారాలు పోయాడు మాధవ్.
‘అది కాదురా మాధవా... ఏ వయసుకా ముచ్చట.. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదన్నారు. అప్పుడే చూస్తూండగానే నీకు ఇరవై ఆరు వచ్చేశాయి. ఈ వయసుకి మీ నాన్నకి మీరందరూ పుట్టేశారు. కనీసం ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకుంటే మాకదే చాలు...’ గద్గద స్వరంతో పలికింది భువన.
‘ఆ రోజులు వేరు.. ఈ రోజులు వేరు. అయినా.. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే...’ కోపం వరదలా పొంగుకొస్తున్నా అతి ప్రయత్నం మీద అణచుకుని సమాధానమిచ్చాడు మాధవ్.
‘అదేమిటిరా.. అలాగంటావ్. ఇంటికి ఒక్కగానొక్క మగ నలుసువి. నీకు పెళ్లి చేసి కోడలిని తెచ్చుకుని, నీ కడుపునో కాయకాస్తే.. వాళ్ల ముద్దూ ముచ్చట చూసి మురిసిపోవడం కన్నా మాకీ వయసులో కావలసినదేముంటుంది చెప్పు...’ పసిపిల్లాడిని బుజ్జగించినట్లుగా కొడుకుని అనునయించింది భువన.
‘ఆఁ... మురిసిపోదురుగాని.. ఉద్యోగం సద్యోగం సరిగ్గా లేని కొడుకు పిల్లలని కనేసి వాళ్ల డైపర్స్ కోసం, పాలడబ్బాల కోసం మీ దగ్గర చేయి చాచి అడుక్కుంటూ ఉంటే చూస్తూ మురిసి ముక్కలైపోదురుగాని...’ కాస్త వెటకారంగా అన్నాడు మాధవ్.
అతడి వ్యంగ్యానికి చిన్నబోయింది భువన. కొడుకు కనబరచిన ఆ చిన్నపాటి కాఠిన్యానికి కళ్లమ్మట నీళ్లు తిరిగాయి.
‘ఎందుకురా అంత విసుగు? ఇప్పుడంత కాని మాట ఏమన్నానని... అయినా ఒక్కగానొక్క మగ పిల్లాడివి. మీ అక్కలకి పెళ్లి చేసి పంపేశాము. మాకా మరే ఇతర బాధ్యతలు లేవు. మీ నాన్నగారికా పెన్షన్ వస్తుంది. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలని కన్నా పోషించగలిగిన స్థితిలోనే ఉన్నాము’ ఎలాగైనా కొడుకుని సుముఖుడిని చేయాలన్నదే భువన తాపత్రయం.
‘అది కాదమ్మా... మమ్మల్ని పోషిస్తారు సరే... కాని, మాకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయిగా.. అస్తమానం కానీ పరక కోసం మీ దగ్గర చేయిచాచలేను కదా! అర్థం చేసుకోండి...’ తల్లి గడ్డం పట్టుకుని మృదువుగా పలికాడు మాధవ్.
తనకి ప్రీతిపాత్రురాలైన తల్లి కళ్లలో లీలామాత్రంగా చెమ్మ కదలాడినా అతడు తట్టుకోలేడు.
‘నా మాట వినరా మధూ... కావాలంటే బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకో... ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ కాపురం చేసుకుందురుగాని..’ నచ్చచెప్పింది భువన.
‘అంత బాగా చదువుకున్న అమ్మాయి ననె్నందుకు చేసుకుంటుందమ్మా... నీ పిచ్చికాకపోతేనూ!’ తీసి పారేశాడు మాధవ్.
‘అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా చెప్పు’ కొడుకు దారిలో పడుతున్నందుకు లోలోపలే సంతోషిస్తూ అడిగింది భువన.
ఇక ఈసారి తాను చెప్పే సాకులేవీ పనిచేయవని అర్థమై పోయింది మాధవ్‌కి. నిస్సహాయంగా తండ్రి వైపు చూశాడు. ఆయన ఆ విషయంతో తనకి సంబంధం లేనట్లుగా అమాయకంగా చూశాడు.
కొడుకు వౌనాన్ని అంగీకారంగా భావించి ముందుకు పోయింది భువన.
‘మన లలిత పెద్దమ్మ లేదూ... ఆమెకి వేలు విడిచిన పినతల్లి మనవరాలు ఒకమ్మాయి ఉందట.. ఎమ్మెస్సీ చదువుతోందట.. పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుందట..’ ఉత్సాహంగా చెప్పుకుపోసాగింది భువన.
‘వీళ్లు పక్కాగా ప్లాన్ చేసి తనని ఇరికించారన్న మాట...’ మనసులోనే అనుకుని ఇక తాను తప్పించుకునే వీల్లేదని తెలుసుకున్న మాధవ్ తల్లి కోరిక తీర్చేందుకే నిర్ణయించుకున్నాడు.
‘అలాగే అమ్మా... నిన్ను నొప్పించడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను. కాని, ఒక్క షరతు... రేపొచ్చే మే నెలలో నాకు ఐబిపిఎస్ పరీక్ష ఉంది. అది నా జీవితానికి ముఖ్యం. ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్లీ వస్తుందో లేదో చెప్పలేము. ఎందుకంటే వచ్చేసారి నుంచి ఇంజనీరింగ్ వాళ్లకి బ్యాంకు ఎగ్జామ్స్ రాసే అర్హత ఉండదని అంటున్నారు. అందుకని ఇప్పుడు పెళ్లి చేసుకుని నా జీవితాన్ని రిస్క్‌లో పెట్టలేను. కాబట్టి ఆ పరీక్ష అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. దీనికి ఆ అమ్మాయి వైపు వాళ్లు ఒప్పుకుంటేనే నేను పెళ్లిచూపులకి వస్తాను..’ నిక్కచ్చిగానూ, పదునుగానూ చెప్పాడు మాధవ్.
కొడుకు తన మాటలకు విలువిచ్చి పెళ్లి వైపు ఆపాటి మొగ్గు చూపినందుకే సంబరపడిపోయింది భువనలోని కన్నతల్లి హృదయం.
‘అలాగేరా మధూ... నువ్వొప్పుకున్నావు అదే పదివేలు. ముందు వెళ్లి అమ్మాయిని చూద్దాం. నీకు నచ్చితేనే ముందుకు వెళదాం.. సరేనా.. అయినా ఆ అమ్మాయిని చూస్తే నువ్వు కాదనలేవు. ఆ సంగతి నాకు తెలుసు...’ మురిపెంగా కొడుకుకేసి చూసింది భువన.
‘నువ్వలాంటి కమిట్‌మెంట్స్ ఏమీ పెట్టకు.. జస్ట్ చూడటం వరకే...’ తల్లి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశాడు మాధవ్.
భువన అదేమీ పట్టించుకోలేదు. ‘ఎలాగోలా కష్టపడి కొడుకుని పెళ్లిచూపుల దాకా తీసుకురాగలిగింది. ఆ తరువాత అంతా దేవుడి దయ...’ అనుకుంటూ భారం భగవంతుడి పైన మోపింది.
తల్లి, తండ్రి ముగ్గురు అక్కలతో కలిసి మహేశ్వరిని చూడడానికి వెళ్లాడు మాధవ్. మొదట కేవలం అమ్మాయిని చూడటం వరకే అని తనకు తనే స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చుకున్నా మహేశ్వరిని చూడగానే మరొక ఆలోచన లేనంతగా ప్రేమలో పడిపోయాడు మాధవ్.
కాటుక దిద్దుకున్న కోలకళ్లు, అమాయకత్వం నింపుకున్న చూపులు, సుతిమెత్తని గులాబీ రేకుల్లాంటి పెదవులు, అందమైన శరీర సౌష్టవం.. వెరసి ముగ్ధ సౌందర్యానికి ప్రతిరూపంలా తన కళ్ల ముందు మెరుస్తున్న మహేశ్వరితో తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడు మాధవ్.
కేవలం చూపుల వరకే అని అనుకున్న అతడి మనసు మరో మాట లేకుండా మహేశ్వరి వైపు మొగ్గు చూపింది. ఏకాంతంలో ఇద్దరూ మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరి భావాలు ఇంకొకరికి నచ్చాయి. ఒకరి హృదయాలు ఇంకొకరికి తెరచిన పుస్తకాల్లా అవగతమైనాయి.
మహేశ్వరి తన మనసు దోచుకుందని సిగ్గుపడుతూనే తల్లితో చెప్పాడు. కాని, తన ఐబిపిఎస్ పరీక్ష పూర్తయ్యే వరకు పెళ్లి మాట మాత్రం ఎత్తద్దన్నాడు.
కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడన్న ఆనందం భువనను నిలువనీయలేదు. అందుకని అతడు విధించిన ఆ చిన్న షరతుకి ఆనందంగా ఒప్పుకుంది. పూలు పళ్లు, ఉంగరం చీర పెట్టి పిల్లని తమది అనిపించుకుంటే సరిపోతుందని తలచిన భువన దగ్గరలో మంచి ముహూర్తం ఉందేమోనని సిద్ధాంతి గారిని వాకబు చేసింది.
ఆమె ముచ్చట తీర్చడానికా అన్నట్లుగా మరి వారం రోజులలోనే ఆ శుభ తరుణం సమీపించింది. పెద్దల ఆశీర్వచనాల నడుమ, అయిన వారి శుభాకాంక్షలతో మహేశ్వరి మాధవ్‌కి వాగ్దత్త అయింది.
అక్కడికి మాధవ్‌కి ఐబిపిఎస్ ఎగ్జామ్‌కి మూడు నెలల గడువు మాత్రమే ఉంది. ఓ పక్క కాబోయే అర్ధాంగితో తీయని ఊసులు కలబోసుకున్నా, చిలిపి కబుర్లు ఆడుతున్నా సరే... మాధవ్ దృష్టి మాత్రం రాయబోయే పరీక్ష మీదే ఉంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న కసితో రాత్రి పగలు కష్టపడి చదవసాగాడు మాధవ్.
మెడలో మూడు ముళ్లు పడకపోయినా.. అతడితో నిశ్చితార్థం జరిగిపోయింది కనుక మానసికంగా తను అతడి ఇల్లాలే అనుకుందో ఏమో... మహేశ్వరి కూడా అతడిని తరచుగా డిస్ట్రబ్ చేయకుండా తగిన తోడ్పాటు అందించసాగింది.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో... అనుకోని విధంగా ఒక కలకలం రేగింది వారి వివాహ విషయమై. అనుకోవడానికి అది కలకలమే అయినా.. అది వారిద్దరికీ మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు మహేశ్వరి తరఫు పెద్దలు. వెంటనే మాధవ్ తల్లిదండ్రులని సంప్రదించారు.
ఇంతకీ ఆ సారాంశం ఏమిటంటే... మాధవ్ పరీక్ష రాయడం పూర్తి కాగానే వాళ్లని దంపతులని చేద్దామని నిర్ణయించుకున్న మహేశ్వరి తరఫు పెద్దలు ఇప్పుడు వాళ్ల పెళ్లికి తొందర పడుతున్నారు. అతడి పరీక్ష ముగిసేలోపే మంచి ముహూర్తం ఉందని, అలాంటి దివ్యమైన ముహూర్తం ఎన్నో ఏళ్లకి కాని రాదని, అలాంటి శుభ ముహూర్తంలో వాళ్లకి ముడిపెడితే ఆది దంపతుల్లా కలకాలం సుఖంగా జీవిస్తారని, కాబట్టి ఆ ముహూర్తానికే మాధవ్, మహేశ్వరిల వివాహం జరిపిస్తే మంచిదన్న ఉద్దేశం వెలిబుచ్చారు.
ఆలోచిస్తే ఇదేదో బాగుందని అనిపించింది మాధవ్ కన్నవారికి. ఎవరేమి చెప్పినా, ఏం చేయాలనుకున్నా అది ఆ జంట క్షేమం కోరే కదా... అని తలచిన
వారు దానికి ఆమోదం తెలిపారు. ఒకవేళ ఆ శుభ ముహూర్తంలో వాళ్లిద్దరూ దంపతులైతే మాధవ్‌కి బాగా కలిసొస్తుందని అనుకున్నారు వాళ్లు.
కాని, మాధవ్ మాత్రం ఈ విషయం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాడు. పెళ్లిచూపులకి ముందు తనకిచ్చిన మాటను విస్మరించవద్దని తల్లిని బతిమలాడాడు.
‘అది కాదురా మధూ... ఇది చాలా మంచి ముహూర్తంట.. మీ ఇద్దరి జాతకాలకీ దివ్యంగా నప్పిన ఇలాంటి ముహూర్తం ఎప్పటికోగాని రాదట.. ఇలాంటి మంచి ముహూర్తంలో మీకు పెళ్లి జరిగితే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందట..’ భువనలో ఉప్పొంగిన తల్లి ప్రేమ కొడుకు ఉన్నతిని కాంక్షించింది.
‘ఏమిటమ్మా.. నీ చాదస్తం... మనకు కుదిరినప్పుడే మంచి ముహూర్తం. నేనప్పుడే చెప్పాను.. తొందరపడి పెళ్లి చేసుకుని నా బతుకును పాడుచేసుకోలేనని. అప్పుడు నా ఇష్టాన్ని కాదననని మాటిచ్చి, ఇప్పుడిలా బలవంతం చేస్తానంటే ఎలాగమ్మా... పెళ్లి హడావిడిలో పడి.. నేను నా లక్ష్యాన్ని విస్మరిస్తానేమో... ప్లీజ్ అమ్మా.. నా మాట విని.. ఇప్పుడీ పెళ్లిని వాయిదా వేయండి..’ ఒకింత కరుగ్గానే చెప్పాడు మాధవ్.
మృదువుగా చెప్పాలనుకున్నా అతడి బాధ అతడి స్వరంలో పదునునే పెంచింది.
‘నా మాట విను బంగారం... ఒకవేళ ఈ ముహూర్తానికే పెళ్లి జరిగి.. మహేశ్వరి నీ జీవితంలోకి అడుగుపెడితేనన్నా నీకు కలిసొచ్చి వెంటనే ఉద్యోగస్తుడివౌతావేమో... ఎవరు చెప్పొచ్చారు.. బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అన్నారు. ముహూర్త బలం వలన నీకు మేలు జరిగి జీవితం మలుపు తిరుగుతుందేమో!’ నాలుగు మంచి మాటలు చెప్పి అతడి ధ్యాస మరల్చాలని చూసింది భువన.
‘అబ్బబ్బ... అమ్మా... ఎంతసేపూ మీ వాదనే కాని, నా గోల పట్టించుకోరా... హఠాత్తుగా ఇప్పుడీ పెళ్లి జరగడం వలన నేను ఎంత నష్టపోతానో మీకు తెలియదు.. ఇప్పుడీ అవకాశం జారిపోతే మళ్లీ వస్తుందో లేదో తెలియదు. జీవితం

చేజారాక విచారించి లాభంలేదు. మూర్ఖంగా మొండి పట్టుదల పట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి..’ ఈసారి కరకుతనం తగ్గి అభ్యర్థన ధ్వనించింది మాధవ్ స్వరంలో.
‘ఏమోరా... నాకు నీ మాట కూడా కరెక్టేననిపిస్తోంది. కాని, ఇంత మంచి ముహూర్తం మళ్లీ దొరకదు అంటే.. మాకు కూడా ఆశగా అనిపిస్తుంది కదా! ఈ ముహూర్తానికి పెద్దవాళ్లుగా మిమ్మల్ని ఒకటి చేసి దీవించాలనుకోవడం తప్పు కాదు కదా! అయినా వాళ్లు మాత్రం ఎంతకాలమని నిశ్చితార్థం అయిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఉంటారు చెప్పు. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసి వాళ్ల బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటారు కదా...’ అనునయంగా అంది భువన.
‘ఏమోనమ్మా.. అదంతా నాకు తెలియదు. అయినా నేను ముందే చెప్పానుగా. పరీక్ష అయితేగానీ పెళ్లి చేసుకోనని... అప్పుడొప్పుకుని.. ఇప్పుడు ఇలా పేచీ పెడితే ఎలా?’ పళ్ల బిగువున అసహనాన్ని అణచుకున్నాడు మాధవ్.
‘అలా మండిపడకురా నాయనా... ఏమో.. ఈ పెళ్లివల్లనన్నా నీ దశ మారుతుందేమో అన్నదే నా బాధ.. అయినా నీతో నాకు వాదులాట ఎందుకు... పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది మీరు.. కాబట్టి నువ్వు, మహి తేల్చుకోండి మీకేది మంచిదో...’ తెలివిగా మహి మీదకి నెట్టేసింది భువన.
కనీసం మహి మాటకన్నా విలువిస్తాడేమోనని ఆమె బాధ. అన్నాళ్లు పెళ్లి వాయిదా వేయడాన్ని ఆమె నిరసిస్తేనన్నా కొడుకు పెళ్లికి మొగ్గుతాడేమోనని ఆమె ఆశ. అందుకే నెపం మహేశ్వరి మీదకు తోసేసి ఊపిరి పీల్చుకుంది భువన.
దాని ఫలితమే.. మహేశ్వరి, మాధవ్‌ల ఈ కలయిక.
మహేశ్వరికి మాధవ్‌ని నొప్పించాలని లేదు. అలాగని పెద్దల అభిప్రాయాన్ని ధిక్కరించాలనీ లేదు.. ఎటు పోతే ఏమొస్తుందో.. ఏ సలహా ఇస్తే ఏవౌతుందోనన్న సందేహంతో తటపటాయిస్తోంది.
అలా ఏటినీటి తరగల మీద నాట్యాలాడుతున్న సంధ్యాకాంతులను పరిశీలిస్తూ కూర్చుండిపోయింది. వీరిలాగానే ఆ సాయంసమయపు సోయగాలని వీక్షిస్తూ అక్కడ కూర్చున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అందరి మధ్యలో కూర్చున్నా మనసు చైతన్యాన్ని కోల్పోయి, నిస్తేజంగా మారిన భావన ఇరు హృదయాల్లోనూ నిండి ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అనిశ్చితిలో ఊగిసలాడుతున్న మనసుని ఎలా ఊరుకోబెట్టాలో తెలియడంలేదు.
‘దీనికింత ఆలోచన దేనికి మాధవ్... మీ గోల్ రీచ్ అయ్యేవరకు పెళ్లి మాట తలపెట్టనని కచ్చితంగా చెప్పేయండి. నా సపోర్ట్ మీకు ఎలాగూ ఉండనే ఉంది’ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ మహేశ్వరే మొదట మాట్లాడింది.
‘అన్నీ అయ్యాయి మహీ... ఈ ముహూర్తం చాలా మంచిదని మీ వాళ్లు బిగుసుకు కూర్చున్నారు. ఇప్పుడీ ముహూర్తానికే పెళ్లి జరిగితే నా లక్ష్యం నీరుగారిపోతుందని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు మా వాళ్లు కూడా.. ఈ పరిస్థితిలో ఏం చేయాలో నాకు తోచడంలేదు. మీ వాళ్లకి అంత తొందరగా ఉంటే ఇదే ముహూర్తానికి ఇంకెవరినన్నా మంచి వరుడిని చూసి నీ పెళ్లి కానిచ్చేయమను’ విసురుగా అన్నాడు మాధవ్.
ఆవేశంలో అనేశాడు కాని తానెంత తప్పుగా అన్నాడో మహేశ్వరి కళ్లల్లో నీళ్లు చూస్తేగానీ అర్థం కాలేదు అతడికి.
‘సారీ మహీ... నిన్ను హర్ట్ చేశాను.. కాని, నేను మాట్లాడేది వాస్తవం...’
‘కావచ్చు.. కాని మనిద్దరికి నిశ్చితార్థం అయ్యిందంటే దానర్థం ఏమిటి? సగం పెళ్లి అయిపోయిందనేగా! మానసికంగా నేనెప్పుడో మీదాన్ని అయిపోయాను. ఈ ముహూర్తాలూ, మూడు ముళ్లూ కేవలం తతంగాలు మాత్రమే..’ ఒక రకమైన ఉద్విగ్నతతో పలికింది మహేశ్వరి.
ఆమె వేదన అర్థం అయినట్లుగా చేతిలో చేయి వేసి బిగించాడు మాధవ్.
‘నువ్వు కంగారు పడకు మహీ... ఏదో మార్గం భగవంతుడే చూపిస్తాడు’ ఆమెకు ధైర్యం చెప్పాడు మాధవ్ తాను మనసులో ఆందోళన చెందుతూ కూడా.
‘అంతకు మించి ఏం చేయగలం! ఈ విషయంలో పెద్ద వాళ్లకి ఓ క్లారిటీ ఇవ్వగలిగితే అదే చాలు’ నిట్టూర్చింది మహి.
* * *
ఆ రోజు మాధవ్ ఆఫీసులో వర్క్ చేసుకుంటూండగా ఒక స్ర్తి, ఓ యువకుడు అక్కడికి వచ్చారు. ఆమెకి దగ్గరదగ్గర ముప్పై ఐదేళ్లు ఉంటాయి. ఆ అబ్బాయికి పధ్నాలుగు పదిహేను మధ్యన ఉంటాయి. అప్పుడే మొలుస్తున్న నూనూగు మీసాలతో అమాయకంగా కనిపిస్తున్నాడు.
వారు కట్టుకున్న బట్టలు వారి పేదరికాన్ని తెలియజేస్తున్నాయి. ఆఫీసు అవర్స్‌లో వచ్చి నిలబడ్డ వాళ్లని కాసింత ఆసక్తిగానూ, ఒకింత ఆశ్చర్యంగానూ చూశారు ఆఫీస్ స్ట్ఫాందరూ కూడా.
‘వీళ్లు నాకు తెలిసిన వాళ్లు... ఆమె ఒక చిన్న సమస్యలో ఉంది. మనమందరం కలిసి చేతనైన సహాయం చేసి ఆమెను ఆదుకుంటే బాగుంటుందని నేనే ఇక్కడికి రమ్మన్నాను...’ అందరి సందేహాలను తీరుస్తున్నట్లుగా చెప్పాడు మేనేజర్ సుధీర్.
‘చెప్పండి సార్... వీలైనది తప్పకుండా చేద్దాం..’ అన్నారు ఆఫీసులోని వాళ్లందరూ.
‘చెప్పమ్మా... నీకేం భయం లేదు. ఇక్కడ ఉన్న వాళ్లందరూ నీకు ఆత్మబంధువులే అనుకో...’ సంకోచిస్తూ నిలబడ్డ ఆమెనుద్దేశించి చెప్పాడు సుధీర్.
ఆ స్ర్తి సిగ్గు పడుతున్నట్లుగా ముఖం పెట్టి ‘నమస్తే అమ్మా.. నా పేరు సుమిత్ర.. వీడు నా కొడుకు రాహుల్. మొన్ననే టెన్త్ క్లాస్ ఎయిట్ పాయింట్స్‌తో పాసయ్యాడు. వీడిని పై చదువులు చదివించాలన్నది నా కోరిక. కాని అందుకు నా ఆర్థిక పరిస్థితి సహకరించదు. మా వారు ఒక చిరుద్యోగి. ఇంకా ఆయన చదువు సాగుతూ ఉండగానే పెద్దలు మాకు పెళ్లి చేసేశారు. నేను అంతగా చదువుకోలేదు. ఏదో అరకొర సంపాదనలతో జీవితాలను నెట్టుకొస్తున్నాం.
మా దంపతులిద్దరం చదువు విలువ తెలిసిన వాళ్లం కాబట్టి వీడినైనా బాగా చదివించాలని అనుకుంటున్నాము. ప్రభుత్వ కళాశాలలో చదివించాలంటే కనీసం నామమాత్రపు ఫీజు కట్టాలి. అదీకాక సీటు వస్తుందో లేదో తెలియదు. పైగా పుస్తకాలకి బోలెడు ఖర్చు అవుతుంది. ఎడ్యుకేషనల్ లోన్ పెట్టాలంటే ష్యూరిటీలు కావాలి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న మాకు ష్యూరిటీలు ఎవరు పెడతారు? అందుకే.. సిగ్గు విడిచి మీలా చదువుకున్న వాళ్లని సహాయం అడుగుతున్నా... ఇదిగో.. మా అబ్బాయి మార్కుల మెమో. మీరే చూసి నమ్మకం కుదిరతే ఎంతో కొంత సహాయం చేయండి’ అంటూ ఆమె తన చేతిలో ఉన్న మార్క్స్ మెమోని వాళ్లకి చూపించింది.
అందరూ దాన్ని చూశారు. నిజమేననిపించింది. మొక్కుల పేరిటో, పుణ్యం వస్తుందనో తిరుపతి హుండీలోనో కానుకలు, డబ్బులు వేస్తాము. అలాంటిది ఒక బీదరాలికి, ముఖ్యంగా బిడ్డ చదువు కోసం తపన పడే ఒక మాతృమూర్తికి కాస్త సహాయం చేస్తే తమ ఆస్తులేమీ తరిగిపోవు కదా! అనుకున్నారు.
మాధవ్ జేబులో నుంచి ఐదు వందల నోటు తీసి ఆ కుర్రాడి చేతిలో పెట్టాడు. మిగతా వాళ్లు కూడా యథాశక్తి తమకు తోచినది ఇచ్చారు. సుమిత్ర కళ్లు ఆనందంతో మెరిసాయి. ఆమె ముఖ కవళికల నిండా కృతజ్ఞత చోటు చేసుకుంది.
ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో పేర్లు అడిగి ఒక చిన్న పుస్తకంలో రాసుకుంది సుమిత్ర.
‘ఈపాటి దానికి రాసుకునేదేమిటి లెండమ్మా... ఏదో.. ఈ చిన్న మొత్తం మీ అవసరానికి ఉపయోగపడితే అంతే చాలు..’ మాధవ్ అన్నాడు మొహమాటంగా.
‘లెక్క కోసం రాయడం లేదు బాబూ... రేప్పొద్దున్న నా బిడ్డ గొప్పవాడయ్యాక ఎన్ని మెట్లు ఎక్కి మీదకి వచ్చాడో మరిచిపోకుండా ఉండడం కోసం... ఎంత మంది సహాయం పొందితే తానింత వాడయ్యాడో విస్మరించకుండా ఉండడం కోసం ఇలా రాస్తున్నా. ఇది చూస్తే వాడికి తన గతం గుర్తు రావాలి. తాను కూడా మరి కొంతమందికి ఉపయోగపడాలన్న తలంపు కలగాలి... అందుకే రాసుకుంటున్నా...’ చెప్పింది సుమిత్ర వినయంగా.
ఆమె ముందు చూపుకి, ఆదర్శానికి ఆశ్చర్యపోయారు సిబ్బంది.
‘్థంక్స్ బాబూ... నా సమస్య ఇదీ అని చెప్పగానే సహృదయంతో స్పందించారు. నా మాటలు నిజమో కాదోనని సందేహించకుండా.. నాకు సహాయపడ్డారు. మీ మేలు ఈ జన్మలో మరువలేను. మా ఆయన చదువు పూర్తయి ఏదో ఒక మంచి ఉద్యోగం చూసుకున్నాక మాకు పెళ్లై ఉంటే ఈ బాధలు ఉండేవి కావు. కాని పెద్దలు, వాళ్ల బాధ్యత తీర్చుకుందామన్న తలంపుతో స్థిరపడని మా జీవితాలను ముడిపెట్టి ఇలాంటి పరిస్థితి కల్పించారు. ఇప్పుడు వగచి ఏం లాభంలెండి.. ఏదో దొరికిన దారిలో ముందుకు పోవడం తప్ప...’ నిట్టూర్చింది సుమిత్ర.
అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ కుర్రాడు అందరికీ నమస్కరించి ధన్యవాదాలు తెలిపాడు. తల్లీబిడ్డలు ఇద్దరూ అక్కడి నుంచి నిష్క్రమించాక కాసేపు ఆలోచనలో పడ్డాడు మాధవ్. సుమిత్ర జీవితం తమకేదో సందేశం అందించినట్లుగా అనిపించింది మాధవ్‌కి. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సెల్ తీసి మహేశ్వరికి డయల్ చేశాడు.
* * *
‘ఏమిటమ్మా... మహీ... మీ ఇద్దరి మేలు కోరి ఈ వివాహం ఇదే ముహూర్తానికి జరిపించాలని మేము ఆరాటపడుతూ ఉంటే నువ్వు కాదంటావేమిటి? నీకేమన్నా మతిపోయిందా? ఎన్నో ఏళ్లకి గాని రాని ఇలాంటి దివ్యమైన ముహూర్తాన్ని కాదనడం మూర్ఖత్వం. కాలదన్నడం బహు సాహసం’ కాస్త ఆగ్రహంగా అన్నారు మహేశ్వరి తాతగారు.
‘లేదు తాతగారూ.. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఆయనకి ప్రభుత్వోద్యోగం సాధించడం ఒక కల. అదే ఆయన లక్ష్యం. ఆయనకి కాబోయే భార్యగా ఆయనకు చేయూత నందించడం నా ధర్మం. ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే మాకు సుముహూర్తం.
ఈ ముహూర్తాన్ని అహంకారంతోనో, అజ్ఞానంతోనో కాదనడం లేదు. మీ మీద గౌరవం లేకపోవడం అంతకన్నా కాదు. భవిష్యత్తు మీద ఆశతో ఈ ముహూర్తానికి పెళ్లి వద్దు అని నిరాకరిస్తున్నాము.
నిజానికి ఈ ముహూర్తానికి మా జీవితాలు ముడివడడం మాకు ఆనందదాయకం కూడానూ. కాని ముందు చూపు లేకుండా, జీవితం పట్ల అవగాహన లేకుండా, ఆయన లక్ష్యం నెరవేరకుండా మేము ఒక్కటవడం అంత మంచిది కాదనిపిస్తోంది. ఒక లక్ష్యం కోసం మా పెళ్లిని వాయిదా వేయడం మా జీవితాలను మలుపు తిప్పే ఒక ‘ప్రయత్నం’ అనుకుంటున్నాము. అంతవరకు మేము వేచి చూస్తాము. ఇది ‘పెద్దల నిర్ణయాన్ని దిక్కరించడం అని’ మీకనిపిస్తే మమ్మల్ని క్షమించండి... మా బతుకులలో వెనె్నల నిండాలని మమ్మల్ని ఆశీర్వదించండి’ స్థిరంగా చెప్పిన మహేశ్వరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆ పెద్దాయన.
‘అవును తాతగారూ... మాకు మీరన్నా, మీ నిర్ణయం అన్నా గౌరవముంది. కాని, అంతకన్నా ఎక్కువగా మా భవిష్యత్తు పట్ల ఆశలు, కోరికలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం మీ మాటను కాదనవలసి వస్తోంది. సహృదయంతో సహకరించండి. మేము తీసుకునే ఈ నిర్ణయం వలన మా జీవితాలు బాగుండాలని ఆశీర్వదించండి’ నమ్రతగా చెప్పాడు మాధవ్.
అతడి స్వరంలో ధ్వనించిన నిబ్బరాన్ని, కృతనిశ్చయంతో ముందడుగు వేయాలన్న ఆత్మధైర్యాన్ని గమనించి మనసులోనే మెచ్చుకున్నారు ఆ పెద్దాయన. ఆశయ సాధన కోసం ఒక్కటిగా కృషి చేస్తున్న కాబోయే దంపతులని నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. *

కె.కె.భాగ్యశ్రీ , 9440296076