కథ

గంసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
సందె ముసురుకుంటున్నది. పల్లెలను తండాలనూ దాటుకుంటూ చేలగట్ల నడుమ, దారి పొడుగునా ఎవరు చేయి చాపి ఆపితే అక్కడ ఆగుతూ... అందరినీ ఎక్కించుకుంటూ.. పల్లె వెలుగు బస్సు ప్రయాణిస్తున్నది. పచ్చని పొలాల మధ్య పనులు ముగించుకుంటున్న రైతులు అక్కడొకరూ ఇక్కడొకరూ కనపడుతున్నారు. ఎటు చూసినా పత్తి, మిరప విరగగాసి దారంతా కనుల పండుగే. ఏ ఇంట చూసినా రైతన్నల చేతినిండా ఎడతెగని పనులే.
ఈ దారిలో డ్యూటీ అంటే చాలామందికి మహా విసుగు. కానీ ఈ మారుమూల తండాలను అక్కడి నగరాన్ని కలుపుతూ మెలికల మెలికల రోడ్డు మీద ప్రయాణాన్ని కండక్టర్ జగదీష్ మాత్రం బాగా ఆనందిస్తాడు. ప్రతి నిత్యం పల్లెల నుండి చదువుకునే పిల్లలను, కాలేజీలున్న నగరానికి తీసుకురావడం.. నగరాల్లో ఉంటున్న పంతుళ్లనూ ఆరోగ్య సిబ్బందిని, ఇతర ఉద్యోగులను పల్లెలకు చేర్చడం.. గొప్ప క్రతువులా భావిస్తాడు జగదీష్. ఇప్పుడూ అంతే అక్కడక్కడ చిన్నచిన్న తండాల్లో పల్లెల్లో పనిచేసే పంతుళ్లూ, పల్లెవాళ్లూ బస్సులో ఉన్నారు. బస్సు అలా అలా ముందుకు సాగుతూండగా అల్లంత దూరంలో ఎత్తుగా మలబారు చెట్లు కనపడుతున్నాయి. ఆ చెట్ల నడుమ చందనం చెట్లు పెంచుతున్నారు. జగదీష్ ఇంతవరకెప్పుడూ చందనపు చెట్లను చూడలేదు. మొదటిసారి వాటిని చూసినప్పుడు అల్లంత దూరం నుండే చందనపు చెట్లు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయేమోనని అనుకుని వాటిని అబ్బురంగా చూశాడు. అదేమీ కాదు. అన్ని చెట్లలా అవి మామూలుగానే ఉన్నాయి. ఆ చెక్క అరగదీసినప్పుడు మాత్రమే దాని పరిమళాలు అని అర్థమయ్యింది.
ఆ రోజలాగే ఆ చందనపు తోట దాపునే ఉన్న ఆ తోవలో ‘గంసీ’ రెండు పెద్దపెద్ద పత్తి బస్తాలు నింపుకుని బస్ రాక కోసం ఎదురుచూస్తూ నించుని ఉన్నది. సరిగ్గా చందనపు తోటను సమీపిస్తుండగా.. అలవాటుగా బెల్ కొట్టాడు జగదీష్. కాస్త ముందుగానే బస్ వేగం తగ్గించి పెద్దగా హారన్ ఇచ్చాడు డ్రైవర్. కొంత దూరం పోనిచ్చి ఆమె ఉన్న చోట బస్ ఆపాడు. ఆమె ఒకింత తంటాలు పడుతూ ఆ బస్తాలు ఎక్కించి హమ్మయ్యా...! అనుకుని కూర్చున్నది. కొంగు ముడి విప్పి టికెట్ డబ్బులు తీసి కండక్టర్‌కి ఇచ్చింది.
గంసీని చూడగానే.. జగదీష్‌కి చీమా గొల్లభామ కథ గుర్తుకు వస్తుంటుంది. నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా రానున్న కాలానికి ఆహార సేకరణ చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతుంటుంది చీమ. కరువు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ కడుపు నిండా హాయిగా తిని తిరుగుతుంటుంది గొల్లభామ. యాభయ్యేళ్లు దాటిన గంసీ కష్టజీవి చీమలా ఎవరి కోసం ఇంత శ్రమ పడుతుందో అర్థం కాదు. రామ్‌నగర్‌కి పదిహేను మైళ్ళ కవతల ఉన్న ఆ గంధం తోట దగ్గర బస్ దిగి దూరాన ఉన్న తన చేనుకు నడుచుకుంటూ వెళ్తుంది. సాయంత్రానికి ఒక రెండు సంచులకు సరిపడా పత్తి తీసి, బస్తాలు నింపి.. వాటిని అతి కష్టం మీద మోసుకొచ్చి ఒక బస్తా ఓ చెట్టు వెనుక పెడుతుంది. మళ్లీ తన చేనుకు వెళ్లి మరో బస్తా మోసి తెచ్చుకుని పల్లె వెలుగు బస్ కోసం ఎదురుచూస్తూంటుంది. తానుండే రామ్‌నగర్‌లో బస్సు దిగి మళ్లీ ఆ బస్తాలను మరో కిలోమీటర్ దూరం నడిచి ఇంటికి చేర్చుకుంటుందట. బహుశా అక్కడ తన ఇంటికి చేర్చుకున్న పత్తినంతా వారానికోసారి అమ్ముకుంటుందేమో. ఈ వయసులో ఎంత కష్టపడుతున్నదీ తల్లి.. ఇంచుమించు తన తల్లి వయసు ఉండే ఆమె అంటే జాలి, గౌరవం రోజురోజుకు పెరిగిపోయింది జగదీష్‌కి. కొందరు డ్రైవర్లు మాత్రం ఎటు కాని ప్రదేశంలో అలా బస్ నిలపడమేమిటని విసుక్కుంటారు.
‘ఇక్కడ స్టాప్ లేదు కదా...’ అని ఒకరు, ‘ప్రతీరోజూ అంతంత లగేజ్ వేసుకొస్తుంటే ఎలా...?’ అని ఒకరూ...
‘ఇలా ఎక్కడ పడితే అక్కడ బస్ ఆపడం నువ్వు బాగా అలవాటు చేసావ్ జగదీశ్... లగేజ్ టిక్కెట్ కొట్టు అంతంత బస్తాలు ఆమె ఆటోలో వేసుకొస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది ఆమెకి’ అని ఒకరు విసుక్కుంటూ ఉంటారు.
జగదీశ్ పెద్దగా వాదించడు. కండక్టర్ ఆపమంటే బస్ ఆపాల్సిందే కదా! కొందరు ఆమె జగదీశ్‌కి ఎంతో కొంత ముట్టజెపుతుందనే అనుకుంటారు. పట్టించుకోడు. ఎవరు ఏమనుకున్నా రోజూ ఆమె కోసం అక్కడ బస్ ఆపడం ఏ కారణాల వల్లయినా ఆమె అక్కడ కనపడకుంటే ‘అయ్యో.. ఇవ్వాళ గంసీకి ఏమయ్యిందో రాలేదెందుకో...?’ అనుకోవడం అలవాటయింది. అసలు ఈ బస్ ఉదయం ఆరింటికి కాదు నాలుగింటికి పెట్టినా గంసీ ఆ సమయానికి సిద్ధమయిపోయి వస్తుంది. ఆమె బస్ ఎక్కగానే ఎందుకో ఉదయపు తూరుపు సూర్యుణ్ణి తన బస్‌లో ఎక్కించుకుని తీసుకెళ్లి ఆ చేను దగ్గర దింపి... సాయంవేళ తిరిగి జాగరత్తగా తెచ్చి పడమటన దింపేస్తున్నట్లుంటుంది జగదీశ్‌కి. అలా తొలి పొద్దుతో పాటుగా ఆమె పని పాటలు మొదలవుతాయి. ఎక్కడా అలసట విసుగు కనిపించవు. ఈమేమో తూరుపు సూరీడల్లే ఉంటే ఆమెతోపాటు ఎక్కే మరో యువతీ చందమామల్లే ఉంటుంది. ఆ చందమామ ఇపుడు చూలాలు. గంసీ ఆమెను బేటీ బేటీ అనడం వల్ల ఆమె గంసీ కూతురని అర్థం చేసుకున్నాడు జగదీశ్. ఈ మధ్య ఆ అమ్మాయి రావడంలేదు.
గంసీ అప్పుడప్పుడూ ‘బేటా జర సాయంత్రం ఖమ్మం నుండి వచ్చేటప్పుడు.. యాపీలీలు, అంగూర్ పండ్లు దెచ్చి పెట్టవా..?’ అంటూ ఒక వంద రూపాయలిచ్చి కడుపుతో ఉన్న ఆ అమ్మాయి కోసం పళ్లు తెమ్మంటుంది. పల్లెలో దొరకని ద్రాక్ష పళ్లు, యాపిల్స్ ఇలా అప్పుడప్పుడూ సాయంత్రపు ట్రిప్‌లో తెచ్చిస్తుంటాడు జగదీశ్. తోటి కండక్టర్లూ, డ్రైవర్లూ... ‘అబ్బో ఉద్యోగంతోపాటు ఇలా సామాజిక సేవ కూడా చేస్తున్నావా?’ అని నవ్వుతున్నా పట్టించుకోడు. ఆమెనూ ఆమె శ్రమను తపనను ఆశ్చర్యంగా గమనించడం ఈ దారిన డ్యూటీ పడ్డప్పుడల్లా ఆమెకు అంతో ఇంతో సాయపడడం అలవాటయిపోయింది జగదీశ్‌కి.
* * *
ఆ రోజు డ్యూటీ ముగించుకుని జగదీశ్ ఇల్లు చేరుకున్నాడు. అమ్మ ఇచ్చిన టీ తాగుతుండగా...
‘సుజాత ఫోన్ చేసిందిరా జగదీశ్..! ‘అయినా అదేమీ అత్తగారురా...? కడుపులో ఉన్న కోడలిని డాక్టర్‌కి చూపించిన ఖర్చు కూడా పుట్టింటివారే భరించాలి అంటున్నదట. ఇప్పుడు దానికి ఐదో నెల వచ్చింది. రేపు సీమంతం మనమే చేయాలా...?! ఆ తరువాత నాలుగు నెలల్లో పురిటి ఖర్చా..! ఆ తరువాతా బారసాల ఖర్చా..! వీటన్నిటినీ కాదంటామా?... ఈలోగా వాళ్ల కోడల్ని వాళ్లు పిల్లను డాక్టర్‌కి కూడా చూపించుకోలేరా? పాపం సుజాత వాళ్లనేమ అనలేక ఈ మాట నీతో చెప్పలేక ఒకటే దిగులు పడిపోతున్నది’ రాజేశ్వరమ్మ బాధపడుతూ చెప్పింది. మనసంతా బాధగా అనిపించి వెంటనే చెల్లికి ఫోన్ కలిపాడు.
‘అమ్మా సుజా..! ఏంటిరా ఆరోగ్యం ఎలా ఉంది?’ అడిగాడు.
‘ఈ అయిదు నెలల్లో ఇది రెండోసారి స్కానింగ్ అన్నయ్యా.. చాలా మందులు రాసింది డాక్టర్’
‘తప్పదుగా సుజా..! ఆ మందులన్నీ శ్రద్ధగా వాడు. వికారంగా ఉందని తిండి తినడం మానెయ్యకు. పండ్లు కూడా తిను. మంచినీళ్లు ఎక్కువగా తాగు. ఏంతా ఒక పది రోజులు ఓపిక పడితే నేనూ అమ్మ వచ్చి తీసుకొస్తాం సీమంతానికి. సరేనా నువ్వేమీ దిగులు పెట్టుకోకు..’ చాలాసేపు మాట్లాడి ధైర్యం చెప్పాడు. కానీ ఎలా సొమ్ములు సమకూర్చుకోవాలో అర్థం కాలేదు జగదీశ్‌కి.
సుజాత వాళ్ల అత్తగారు పైకి ఎంత హుందాగా కనపడుతుందో...? పెళ్లిలో బంధువులు ఇచ్చిన కానుకలన్నీ మాకే పంపాలి అని హెచ్చరించినప్పటి నుండే సుజాత అత్తగారి మనస్తత్వం బాగా అర్థమవ్వసాగింది. ఎక్కడా తన చెల్లి బాధ పడకూడదని అన్నీ భరిస్తున్నాడు. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకునే పిల్ల సుజాత. జగదీష్ బీకెట్ రెండో సంవత్సరంలో ఉండగా అకస్మాత్తుగా తండ్రి మరణించడంతో వచ్చిన ఉద్యోగమిది. ఇంకా చదువుకుంటానన్న సుజాతకు కూడా రాజేశ్వరమ్మ త్వరపడి పెళ్లి చేసేసింది. చిన్నది ఇవన్నీ తట్టుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కడుపుతో ఉన్న చెల్లి మనసును ప్రశాంతంగా ఉంచాలి.. అనుకుంటూ తరచూ ఫోన్లో మాట్లాడుతుంటాడు. సుజాత ప్రశాంతంగా ఉంటూ పండంటి బిడ్డను కనాలి. రేపు బాంక్‌కి వెళ్లి పర్సనల్ లోన్‌కు ప్రయత్నించాలి అనుకున్నాడు జగదీశ్. ఉదయానే డ్యూటీకి బయలుదేరాడు.
* * *
నగరాన్ని వదిలి చేలను పలుకరిస్తూ.. మెలికలు మెలికలు తిరుగుతూ నడుమ నడుమ ఉదయ రాగంలా హారన్ మోగిస్తూ జింకల తండాకు పల్లె బస్ బయలుదేరింది. దారంతా ఎన్నో తండాలు. అందులోని వారంతా వ్యవసాయం మీదే బతుకుతున్న ఆదివాసీలు. వారి చిన్నచిన్న తండాల నడుమ వేసిన రోడ్డులో వస్తూ పోతూ వారి జీవనశైలిని గమనించడం బాగా అలవాటయిపోయింది జగదీశ్‌కి. మిరప, పత్తితో పాటుగా కొందరు మునగ, వంకాయ, టమోటా, కాలిఫ్లవర్ వంటి కూరగాయలు పండిస్తూ ఈ బస్‌లోనే ఖమ్మం మార్కెట్‌కి తరలిస్తుంటారు. ముఖ్యంగా మిర్చీ, పత్తీ మార్కెట్ యార్డ్‌కి తరలించాక.. కొందరు పల్లె వాసులు అదే ట్రక్కుల్లోనే వెళ్లిపోతుంటారు. పనులుండి ఖమ్మంలో ఉండిపోయిన ఒకరిద్దరు ప్రయాణికులు బస్‌స్టాండ్లలో పడుకుని ఉదయానే ఈ బస్‌లో బయలుదేరుతారు. మొదటి ట్రిప్ తండాకు వెళ్లేటప్పుడు బస్సంతా దాదాపు ఖాళీగానే ఉంటుంది. దారంతా రకరకాల పక్షులు సందడి చేస్తుంటాయి. ఆ సమయంలో రైతులంతా పొలాలకి వెళ్తూ కనపడుతుంటారు. ఇక ఏడింటికి జింల తండాకి చేరుకోగానే... ఒక్క పది నిమిషాల్లో తిరిగి ప్రయాణమవుతుంది. అప్పుడిక దారంతా కాలేజీ పిల్లలు ఎక్కుతూ సందడి చేస్తుంటారు. టిక్కెట్లు చూసుకుంటూ చిల్లర పంచుతూ స్టాప్ వచ్చినప్పుడల్లా బెల్ కొట్టి ఆపుతూ తన విధి తానూ చేస్తున్నాడు జగదీశ్. ముఖ్యంగా ఈ కాలేజీ పిల్లలకు ఉదయానే నగరంలో పని ఉన్న పల్లె వాసులకు ఉపయోగపడుతుందనే ఇంత ఉదయానే ఆ పల్లెకు ఈ బస్ వేశారు. తిరిగి తొమ్మిదిన్నరకు మళ్లీ అదే పల్లెకు బస్ బయలుదేరుతుంది. అప్పుడు చేలల్లో కూర్చుని రైతులు సద్ది తింటూ కనిపిస్తారు. పచ్చని చెట్ల నడుమ, అందరూ కల్సి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్న వాళ్లను చూస్తూ, వీళ్లకు ప్రతిరోజు వన భోజనాలే అనుకుంటూ ఉంటాడు.
ఇక మరి కాస్సేపటికి పశువుల సందడి మొదలవుతుంది. కాపరులు పశువులను మేతకయి తీసుకెళ్తూ ఉంటారు. దారంతా దుమ్ము రేగుతూ మేకల మంద.. గేదెల మందా వెళ్తూ ఉంటాయి. ఎంత హారన్ కొట్టినా ఒక్క గేదె కూడా పక్కకు జరగదు. అవి వెళ్లే పద్ధతిలోనే అవి వెళ్తాయి. ఇండియాకి ప్రెసిడెంటయినా వీటి ముందు అయిదు నిమిషాలయినా ఆగిపోవాల్సిందే అనుకుంటూ నవ్వుకుంటుంటాడు జగదీశ్. వేగంగా వెళ్దామన్నా వెళ్లలేని దారి.. నిదానమే ప్రధానమన్నట్లుగా కులుకుతూ బస్ ముందుకు వెళ్తున్నది.
జగదీశ్‌కి తన చెల్లాయి సుజాత పదేపదే గుర్తుకొస్తూనే ఉన్నది. సీమంతం ఖర్చు పురిటి ఖర్చు ఎక్కడ నుండి తేవాలో అర్థంకాని పరిస్థితి. ఇంకా పుట్టని శిశువుకు బంగారు గొలుసు పెట్టి బారసాల ఘనంగా చేయాలని ఇప్పటి నుండే చెబుతున్నారు. ఇంత ఖర్చు ఎలా భరిస్తావురా..? ఎక్కడ నుండి తెస్తావు? అని తల్లి బాధపడుతున్నది. కానీ చేసేందుకేమీ లేదు. మన ఖర్చులు చాలా ఉన్నాయి కదా అని నెలకు రెండు జీతాలు రావు కదా నవ్వుకున్నాడు. ఆ సాయంత్రం గుర్తు పెట్టుకుని గంసీ వాళ్ల చందమామకు అదే.. ఆ అమ్మాయి పేరు చాందీ అని చెప్పింది. ఆమెకు పండ్లు తెచ్చి పెట్టాడు. ఒక్కోసారి ఆమె అడక్కపోయినా పండ్లు తెచ్చిస్తుంటాడు. చాందీకి పళ్లు పంపిస్తుంటే తన చెల్లెలు సుజాతకి ఇచ్చినట్లే తృప్తి పడుతుంటాడు.
ఆ తరువాత ఒక వారం నుండి గంసీ రావడం మానేసింది. ఎందుకో అర్థం కాలేదు. చాందికి ఎట్లా ఉందో అనుకుని ఆందోళన పడ్డాడు. జగదీశ్‌కి తరువాతి రెండు వారాలు మరోవైపు డ్యూటీ పడింది. ఈలోగా ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి తన చెల్లెలికి సీమంతం చేసి పంపించాడు. ఉన్న రెండు రోజుల్లో అత్తగారు నగరంలో ఏ ఆసుపత్రిలో కానుపు చేయాలో నిర్ణయించేసింది. బారసాలకు ఎంతమంది వస్తారో చెప్పింది. పుట్టేవారికి ఎట్లాంటి గొలుసు పెట్టాలో ఎంత తూకముండాలో చెప్పింది. తన తరఫు వారికి ఎవరెవరికి బట్టలు పెట్టాలో కూడా చెప్పింది. ఆరోగ్యంగా నిండుగా తయారయి నిండుగా తిరుగుతున్న చెల్లిని చూసి సంతోషపడాలో... ఆమె అత్తగారి ఆర్డర్లకు బాధపడాలో అర్థంకాలేదు అతనికి. అట్లా అట్లా దాదాపు ఇరవయి రోజులు గడిచిపోయాయి.
* * *
మళ్లీ జింకల తండా వైపు డ్యూటీ పడింది. కానీ వెళ్లేటప్పుడు రామ్‌నగర్ దగ్గర గంసీ బస్ ఎక్కడంలేదు. అయినా సాయంత్రం వేళ ఆ గంధం తోట దగ్గరకు చేరుకుటుండగా.. డ్రైవర్‌కి చెప్పి హారన్ కొట్టిస్తూనే ఉన్నాడు. ఒకవేళ పొద్దునే్న ఎందువల్లయినా ఆలస్యమయినా ఆటోలో చేసుకు వెళ్లి సాయంత్రానికయినా బస్‌లో వస్తుందేమో అని.. ఆ దారంతా ఆమెకోసం వెతుక్కుంటున్నాడు. కానీ నెల రోజులు గడిచినా ఆమె రాలేదు. దూరాన గంసీ పత్తి చేను బాగా విరగగాసి పత్తికాయలు కాయలు విచ్చుకుని తెల్లగా వేలాడుతూ కనపడుతున్నది. అంటే పత్తి కూడా ఎవరితో తీయించలేదు అని అర్థమయింది.
ఏమి చేస్తున్నా ఉండుండీ గంసీనే గుర్తుకు రాసాగింది జగదీశ్‌కి. ఎందుకో గంసీకే ఆరోగ్యం బాగోలేదేమో అని భయం వేసింది. ఒక కండక్టర్‌కి ఒక ప్రయాణికురాలంటే ఇంత అనుబంధం ఏర్పడుతుందా అనుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉన్నది జగదీశ్‌కి. తానో మామూలు కండక్టరే.. ఆమె ఒక మామూలు ప్రయాణికురాలే కావచ్చు. ఏదో ఒక విధంగా కొన్ని నెలలుగా కల్సి ప్రయాణం చేస్తున్నాం. ఆమె చేతల్లో చర్యల్లో ఆమె తనకు ఒక మార్గదర్శిలా తోచేది. ఆ నిరంతర శ్రామికను చూస్తుంటే తెలియని గౌరవం కలిగేది. వంటి చేత్తో ఎంత వేగంతో తీస్తే ఇంత పత్తి అవుతుంది. బస్ ఎక్కగానే.. కొడుకా అని పలకరిస్తూ ఎన్నో ముచ్చట్లు చెబుతూ ఆత్మీయతను పంచేది. ఆ దారిలో ఆమె బస్ ఎక్కని లోటు బాగా కనపడుతున్నది. పాపం ఎందుకు రావడం లేదో? పదేపదే గంసీ గుర్తుకు వచ్చి తెలియని కలవరమేదో కలిగింది అతనికి.
ఒకరోజు ఎవరో బాగా తాగి బస్ ఎక్కారు.
‘అబ్బా ఇంత పొద్దునే్న ఎక్కడ దొరుకుతుందో ఛీఛీ.. బస్సంతా కల్లు వాసన’ అని ఒక టీచర్ విసుక్కుంది.
‘బిడ్డా..! ఈ చెట్లే మనకు అన్నం బెడతాయి. ఈ చెట్లే మొగోల్ల పానాలు దీస్తుంటాయి. మా ఊర్లల్ల మా వోళ్లకు ఏమి దొరికినా దొరకకున్నా ఇల్లూ వల్లూ ఇవరం దెలియకుండా తాగేటోళ్లకు తాగినంత.. తాటికల్లు, ఈత కల్లు, ఇప్పసారా.. గుడుంబా.. అన్నీ ఫుల్లుగా దొరుకుతాయి. ఇగ ఏం బాగుపడతారు? ఇవి సాలవన్నట్లు ఊర్లో సారా గాస్తారు.

గంసీ (10వ పేజీ తరువాయ)
పొయ్యి ఎలిగించుకోను గాంచు నూనె ఉంటుందో లేదో తెలియదు. గంజి గాసుకోను గింజలుంటాయో లేదో తెలియదు గాని.. తాగుడుకు మాత్రం కరువే ఉండదు. పగలంతా కష్టం జేస్తరు. మాపటికి తాగి పొర్లుతరు. పోనీ తాగి మంచిగా నోర్మూసుకొని పండుకుంటారా అంటే అది గూడ గాదు. నడుమ పెండ్లాంతో కిరికిరి పెట్టుకుంటారు. ఇంకా ఘోరమేందంటే బిడ్డా.. పతీ నాలుగిళ్లకు ఒకడు, గీ తాగుడుతో సచ్చినోడే ఉంటడు. ఆ ఇంటి ఆడోల్ల బతుకులు నా తీరే అయితుంటాయి’ కంటతడి పెట్టుకుంది.
అప్పుడర్థమయింది గంసీ భర్త బాగా తాగితాగి వంటికి రోగం తెచ్చుకుని చనిపోయాడని. అప్పటి నుండి ఇట్లా ఇంటి బాధ్యనంతా తానె నెత్తికెత్తుకున్నదని... పాపం కొడుకులు లేరేమో లేక కొడుకులు చాలా దూరంలో ఉన్నారేమో అనుకున్నాడు.
‘ఏ ఇంట్లయినా సూడు బిడ్డా.. వయసులున్న మొగోలల్లూ ఇట్లా తాగుడుకు అలవాటయితే ఆ ఇంటి సంగతి ఇంతే... పచ్చటింట్ల అగివద్దట్లే..’ అని బాధపడింది గంసీ. వొంటరిగా ఇంటిని చూసుకునే బాధ్యతే కాక ఇప్పుడు కూతురికి పురుడు పోసే పనిలో ఉన్నట్లుండి అనుకున్నాడు... అయినా కనీసం ఒక ఇరవయి రోజులకయినా రావాలి కదా... అసలు గంసీకి ఏమీ కాలేదు కదా అనుకోగానే మనసంతా కలతగా అనిపించింది.
* * *
మరో రెండు రోజుల తరువాత ఆ రోజు జగదీశ్‌కి ఆఫ్. ఇక ఉండబట్టలేక తానే జింకల తండా బస్ ఎక్కి, రామ్‌నగర్ దగ్గర దిగాడు. అక్కడ నుండి ‘గంసీ వాళ్ల ఇల్లు ఎక్కడా..?’ అని ఒకర్నొకర్ని ఆరా తీస్తూ ముందుకు సాగాడు.
‘గంసీ వాళ్ల ఇల్లా..! అబ్బో చాల లోపలకి పోవాలి. అయినా మీరెవ్వరూ ఎందుకొచ్చారు ఆమె మీకేమయినా పయిసలివ్వాలా’ అని అడగసాగారు. అదేమీ లేదు అంటూ ఏదో ఒక జవాబు చెబుతూ మరింత ముందుకు సాగాడు. అంటే ఆమె ప్రతీరోజు ఇంత దూరం పత్తి బస్తాలను మోసుకెళ్తుందన్నమాట... అనుకుంటే బాధనిపించింది. చుట్టూ గోరింటాకు కంచె ఉన్న ఒక చిన్న ఇంటిని చూసి అది గంసీ వాళ్ల ఇల్లు అని చూపించారు ఆ తండా వాళ్లు... ‘ఓ గంసీ నీ కోసం ఎవరో సార్ వచ్చిండు’ అని అరిచి చెప్పారు.
గంపీ ఆశ్చర్యంగా బయటకు వచ్చి తొంగి చూసింది. ‘అరే... నువ్వా కొడుకా!.. రారా...’ అని సంతోషంగా చేయి పట్టి లోనికి తీసుకువెళ్లింది. ‘మంచిగున్నావా అవ్వా...’ అని అడిగాడు. ఆమె క్షేమంగా ఉండడం చూసాక అతని మనసు కాస్త స్థిమితపడింది.
‘అయ్యో నాకేమయ్యిందని కొడుకా...! నేను మంచిగనే ఉన్నా.. మనవడు బుట్టిండు గాడు...’ అంటూ సంబరంగా చూపించింది. ఆ చందమామ పక్కన మరో బుల్లి చందమామా చిన్నిచిన్ని కళ్లు చేతులూ ఆడిస్తూ సమం పక్కన సేదతీరుతున్నాడు. జగదీశ్‌ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది.
‘దా అన్నా దా’ అన్నది సంతోషంగా.
‘ఇటువయిపు కాస్త పనుండి వచ్చానమ్మా.. నీకు బాబు పుట్టాడని తెలిసి భలే సంతోషంగా అనిపించింది చాందీ...’ అన్నాడు ఆప్యాయంగా.
‘నేను మొన్ననే మా అత్తతో అన్న కూడా మన కండక్టరన్నకు చెప్పి పంపు అత్తా అని...’ అన్నది.
ఓహో ఈ చాందీ ఆమె కూతురు కాదు కోడలన్నమాట...’ అనుకున్నాడు.
‘ఎక్కడి పత్తి అక్కడే ఉంది అన్నా...! వీడేమో ఏదో పనున్నట్టే ఎడో నెలకే పుట్టిండు. మా అత్తకేమో ఒకటే పనయిపోయింది. వాడేమో చాలా అల్కంగా పుట్టిండు... రెండు నెల్లు జాగర్తగా చూసుకోవాల్నంటా! బట్టలల్ల.. బట్టలల్ల చుట్టి పండబెడుతున్నాం.. గంట గంటకు పాలు తాపుతున్నాం. తొందరగా బరువు పెరగా పెరగాలనంట...’ పలుకరించే మనిషి కనిపించేసరికి మదిలోని బాధ చెప్పుకుంటున్నది చాందీ పాప. గంసీ ఒక్కతే ఇట్లా తంటాలు పడకపోతే.. చాందీ వాళ్ల కన్నవాళ్లు లేరా అని అడగాలనిపించింది. పత్తి తీయాల్సిన నేను అట్లా పడి ఉన్నది. ఎవరన్నా కోసుకుపోయినా దిక్కులేదు. ఆ పంట కోసమే కదా గంసీ ఇన్ని నెలలు ఇంత కష్టపడింది. ఆ పంటే కదా వీళ్లకు ఆధారం. పైగా ఇప్పుడు మంచి ధర పలికే సమయం.. మరి చాందీకి సాయంగా ఎవరూ పుట్టింటి వారు లేరా..’ అని అడగాలనుకున్నాడు. ఈలోగా గంసీనే చెప్పింది.
‘చాందీకి పెళ్లయిన రెండేళ్లకే వాళ్లమ్మ చనిపోయింది. అప్పటి నుండి ఆమెకి అన్నీ నేనే కొడుకా...’ అని. అతను ఆశ్చర్యంలో ఉండగానే ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసి..
‘ఇగ్గో రామ్‌సింగ్...! మన కండక్టర్ సాబ్.. నాకు ఇంకో కొడుకు తీరు...’ అని ‘పాపం నేను ఏడుంటే ఆడ బస్ ఆపుతాడు. ఇటు దిక్కు ఎదో పనుంది వచ్చిండంట. మమ్ముల కూడా చూసిపోదామని వచ్చిండు సారూ...’ సంతోషంగా చెప్పింది గంసీ.
‘నమస్తే సారూ..! నేన్ను బగ్గు బయిల పని చేస్తున్నా...’ అంటూ చేయి కలిపాడు.
‘చాలా సంతోషం సారు. మా ఇంటికొచ్చిండ్రు. పెద్దమ్మా సార్‌కి చాయి తాపు’ అంటూ తానూ అక్కడే కూర్చున్నాడు.
‘ఇతను గంసీని పెద్దమ్మా అని పిలుస్తున్నాడేంటి..?’ జగదీశ్‌కేమీ అర్థం కాలేదు. ఏమీ అడగలేక పోయాడు. టీ తాగాక రాంసింగ్ ఎదో పనుందని బయటకు వెళ్లిపోయాడు. తాను కూడా బయలుదేరబోతూ...
‘అవ్వా ఇంట్లో ఇలాంటి పరిస్థితి పెట్టుకుని ఇక చేనుకెట్లా వస్తావు..?’
‘ఏంజేస్తం బిడ్డా.. రామ్‌సింగ్‌ని సెలవు బెట్టిపించి ఇంట్ల చాందీ కాడ ఉంచి రేపో మాపో వచ్చి ఇద్దరు కూలీలను బెట్టుకుని ఆ పత్తంత తీయిస్తా... పచ్చి బాలింతరాలు కాదా ఎట్లా ఇడిసి పెట్టి రావాలె బిడ్డా..?’
గంసీనలా చూస్తుంటే... చూడడానికి అతి మామూలుగా కనిపించే గంధం చెట్టు గుర్తుకు వచ్చిందతనికి.. తానూ అరిగిపోతూ పరిమళాలు పంచె గంధం చెక్క ఈ గంసీ అనిపించింది. అదే అన్నాడు ఆమెతో...
‘నిజంగా ఎంత కష్టపడుతుంటావో అవ్వా...’ అని.
‘కష్టపడాలే కొడుకా..! తప్పదు. చిన్నప్పటి నుండీ గిట్ల కష్టం జేసుడు అలవాటే. మొగోనిగా పుట్టిందే తాగుతానికి అన్న తీరు తాగి తాగి నా మొగడు పదేళ్లనాడే సచ్చిపోయిండు. ఆనాటి నుండి నా కష్టానికి ఏనాడూ రికామే లేదు.. కష్టం జేసుడు అలవాటయిపోయింది కొడుకా...’
చాందీ చేతుల్లోని బాబు ఏడుస్తున్నాడు. ఆమె పాలు పడుతుందేమో అనుకుని.. ‘ఇక వెళ్లొస్తాను...’ అంటూ లేచాడు జగదీశ్.
‘ఇటు రా కొడుకా ఇదే నా కమ్రా...’ అని ఎదురుగా ఉన్న చుట్టింట్లోకి తీసుకెళ్లింది గంసీ.
‘్భలే బాగుంది అవ్వా నీ కమ్ర’ సరదాగా అంటూ ఆ గదిలోకి వెళ్లాడు.
‘జర ఒక రొట్టె తిని పో కొడుకా...’ అని ఆప్యాయంగా జొన్నరొట్టె పెట్టింది.
‘అవ్వా మా చెల్లి కూడా మరో రెండు నెలల్లో పురిటికొస్తుంది! అప్పుడు మా ఇంటికీ కూడా ఒక పాపో, బాబో వస్తారవ్వా...’
‘గట్లనా.. చెల్లె పైలం కొడుకా...’ అన్నది. అంతలోనే ఉన్నట్లుండి...
‘నాకో సాయం చేస్తావా కొడుకా...’ అడిగింది గంసీ.
‘్భలేదానివే అవ్వా! నువ్వడగడం నేను చేయకపోవడమూనా.. తప్పకుండా చేస్తాను. ఏమి కావాలో చెప్పవ్వా!’ అన్నాడు.
అటు చూసి ఇటు చూసి ‘ఇగ్గో ఈ పుటువా సూడు’ అంటూ తలుపు చాటుకున్న ఒక ఫొటో తీసుకొచ్చి చూపింది. అందులో చాందీ మరో యువకుడు ఉన్నాడు. జగదీశ్‌కేమీ అర్థం కాలేదు. పైగా ఆ యువకుడి ఫొటోకి పెద్దగా కుంకుమ బొట్టు పెట్టి ఉన్నది. అయోమయంగా చూశాడు.
‘వాడు నా కొడుకు హర్యా.. తాగి బండి నడిపి టక్కరయి సచ్చిపోయి మొడేళ్లయితుంది.’ ఆమె కొంగు ముఖాన కప్పుకుని వౌనంగా రోదించసాగింది.
‘అంటే.. చాంది’
‘అవును.. బిడ్డా! చాంది నా కొడుకు భార్య.. ఆమె నా కోడలు’
‘వయసులో ఉన్న పిల్ల.. వొంటరిగా ఈ దునియాల బతుకుడు కష్టం కొడుకా... మొగడు సచ్చినంక నేను పడరాని తిప్పలు పడ్డా.. అందుకే నా తీరు అది చెరలు పడొద్దని.. దాని మతుకు ఆగం కాకూడదని నేనే దగ్గరుండి లగ్గం జేసిన.. కన్నోళ్లు లేరని నా దగ్గరే ఉంచుకుని పురుడు పోసిన... రామ్‌సింగ్ కూడా నా కొడుకు తీరే.. నన్ను మంచిగా చూసుకుంట అందరం కలిసే ఉందాం పెద్దమ్మా’ అన్నాడు. బగ్గుబాయిల డూటీ జెసి ఎప్పుడంటే అప్పుడొస్తాడని కోడల్ని నా దగ్గరే బెట్టుకున్నా... అందరమూ కలిసే ఉంటున్నం.’
దైవం మానుష రూపేణా అన్నదానికి అక్షరాలా నిదర్శనమయిన గంసీని రెప్పవేయకుండా చూస్తూ.. దాదాపు మూగవాడయి వింటున్నాడు జగదీశ్. కాస్సేప్పటికెప్పటికో కోలుకుని.. ఇక వెళ్దామనుకుని,
‘ఒక సాయం చెయ్యమని అడిగావు కదా...! నీకు నేను చేయగల సాయం ఏముంటుందవ్వా...?’ అడిగాడు. గంసీ మళ్లీ ఇటూ అటూ చూసి గొంతు తగ్గించి,
‘ఈ పుటువా తీస్కపోయి ఇండ్ల నుండి నా కొడుకు ఒక్కడినీ దింపుకొస్తావా బిడ్డా..! అది పెండ్లయిన ఆడిపిల్ల... దాని పుటువా సచ్చిపోయిన నా కొడుకుతో ఎందుకు...? నా కొడుకుదొక్కటే తెస్తే నా క్రమలబెట్టుకుంటా.. అప్పుడప్పుడూ సూసుకుంటా...’ కళ్లు తుడుచుకుంటూ అన్నదామె.
ఆ ఫొటో అందుకుని అక్కడ నుండి బయటపడిన జగదీశ్ చెమరించిన కన్నుల నీరు చెంపలకు జారింది. అతని మనసు మాత్రం ఇంకా.. ఆమె పాదాల చెంతే ప్రణమిల్లి వున్నది.

సమ్మెట ఉమాదేవి... 9849406722