కథ

విలువైన కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
**
సూర్యభగవానుడు తన ప్రచండ తాపాన్ని గురిపెట్టిన మధ్యాహ్న సమయం!
ఆ చల్లని ఏ/సి గదిలో ఉస్సూరుమంటూ కూలబడ్డాను. హాయిగా సేద దీరినట్టనిపించింది.
‘అమ్మగారు అయిదు నిమిషాల్లో వస్తారు. కూచోండి సార్’ పనమ్మాయి ఓ గ్లాసుడు చల్లటి ఆరెంజి స్క్వాష్ నా ఎదురుగా పెట్టి చెప్పింది ‘తీసుకోండి సార్!’ అని.
ఆ గదిని పరిశీలనగా చూశాను. గది నాలుగు గోడలకు ఉన్న అద్దాల బీరువాల్లో ఏవేవో జ్ఞాపికలు సన్మానపు ఫొటోలు డాక్టర్‌గారి అనుభవానికి, సమర్థతకు చిహ్నాలుగా కనిపించాయి. డాక్టర్ సౌందర్య కర్నూలు పట్టణంలో మంచి పేరున్న చిన్నపిల్లల డాక్టర్ అని విన్నాను. మా పిల్లల చిన్నతనంలో ఇంత దూరం రాలేక మేము దగ్గర్లోని డాక్టర్‌నే సంప్రదించేవాళ్లం.
అంతలో స్ప్రింగ్ డోర్ తెరచుకుని హడావిడిగా ఒక చేత్తో పెద్ద సైజు సెల్, మరో చేత్తో ఏవో నాలుగు పుస్తకాలు పట్టుకుని మెరుపులా ప్రవేశించారు డాక్టర్‌గారు. మెడికల్ జర్నల్స్ ఏమో అనుకున్నాను.
మర్యాదపూర్వకంగా నమస్కరించాను. ‘ఆ నమస్తే! అయ్యో కూచోండి! తమరెందుకు నుంచోవడం, మీరు ఇకపై మా అబ్బాయికి చదువు చెప్పే గురువుగారాయె!’ చిరునవ్వుతో అన్నారు. నేను స్థిమితంగా కూచుని అన్నాను ‘చెప్పండి మేడమ్! మా కొలీగ్ రావుగారికి మీరు ఫోన్ చేసి నన్ను కలవమన్నారట’
‘అదే, అదే చెబుతున్నా!’ ఇంతలో సెల్ మోగడంతో ఆమె ఎవరో పేషెంట్ తాలూకు వారితో మాట్లాడి చివరగా ‘పది నిమిషాల్లో అక్కడుంటాను. మీరేం వర్రీ అవ్వకండి. మీ బాబు ప్రాణానికి నా ప్రాణం అడ్డు.. సరేనా?’ అంటూ పెట్టేశారు.
‘అదే సార్! మీరు మనూళ్లో చాలా మంచి పేరున్న ‘్ఫజిక్స్’ లెక్చరర్ అని విన్నాను. మా బాబు మొనే్న ఎనిమిదో తరగతి పరీక్షలు రాశాడు. వాడికి మీ ట్యూషన్ కావాలి!’
‘పరీక్షలయ్యి రెండ్రోజులేగా మేడం అయ్యింది.. ఇప్పుడు మళ్లీ ట్యూషన్ చెప్పడానికి ఏం ఉంది...’ అన్నాను అర్థంకాక.
‘మా వాడు మ్యాథ్స్ ఫరవాలేదు గానీ కాస్త ఫిజిక్స్ కెమిస్ట్రీల్లో వీక్.. బయాలజీ అంటే చాలా ఇంటరెస్ట్’
‘మరి బాబును మీలా మంచి డాక్టర్‌ను చెయ్యొచ్చుగా’ అన్నాను ఏమనాలో తోచక.
‘ఆ.. వాడికేం తెలుసండీ. పసివాడు. వాడలాగే అంటున్నాడు. ఇప్పుడీ ‘నీట్’ ఎగ్జామ్ వచ్చాక చాలా కష్టమై పోయింది. పైగా బైపిసి తీసుకుని ఆ తరువాత ఏ కోర్సులకు వెళ్లాలో అర్థంకాని పరిస్థితి’ అన్నారామె.
‘పోనీలెండి మేడం బాబును మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చెయ్యాలనుకుంటున్నారనుకుంటా’ అన్నాను.
‘అలా అయితే బాగానే ఉండేది. మా డాక్టర్‌గారు అదే వాళ్ల నాన్నగారు అస్సలొప్పుకోవట్లేదు!’ నాకేం అంతుపట్టలేదు. ప్రశ్నార్థకంగా చూస్తూ కూచున్నాను.
‘ఆయనగారేమో వీణ్ణి ఐ.ఐ.టి, ట్రిపుల్ -ఇ, జె.ఇ.ఇ. లాంటి కోర్సులు అదీ మన ఇండియాలో పేరు మోసిన సంస్థల్లో అయితేనే చదివిస్తానంటున్నారు. అందుకే... మిమ్మల్ని పిలిపించాను’ అందుకు నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగానే డాక్టరమ్మ అన్నారు.. తను పట్టుకొచ్చిన ఖరీదైన పుస్తకాలు నా ముందు పెట్టి-
‘ఇవన్నీ ఐఐటి ఫౌండేషన్ కోర్సు పుస్తకాలు.. మీరు వీటిని తీసుకుని మావాడికి ఇప్పట్నించీ ఇందులో గట్టి ఫౌండేషన్ ఇవ్వాలి!’
నాకు నోట మాట రాలేదు. నిన్న మొన్న ఎనిమిదో తరగతి పరీక్షలు వ్రాసిన ఓ పసిపిల్లాణ్ణి పట్టుకుని ఇంకా ఇంటర్‌లో చేరడానికి రెండు సంవత్సరాలు టైముందనగా నేను ఏ విధంగా ట్యూషన్ చెప్పాలి? వేసవి సెలవుల్లో పిల్లవాడి బాల్యమంతా ఇలా ఫౌండేషన్ హింసతోనే గడవాలా..’ అని ఆలోచిస్తుండగా.. డాక్టరమ్మగారే అన్నారు.
‘సరేనా మాస్టారూ..? ఫీజు గురించి మీరేం ఆలోచించకండి’
‘అబ్బే.. అదేం కాదు మేడం?’ నీళ్లు నమిలి చెప్పాను.
‘నేనాలోచిస్తూన్నది డబ్బు గురించి కాదు. బాబు ఇంకా ఎనిమిదో తరగతే కదా.. హాయిగా సెలవుల్ని ఎంజాయ్ చెయ్యనివ్వకుండా కూచోబెట్టి చదివించడం ఎంతవరకూ సమంజసం అని ఆలోచిస్తూ ఉన్నాను..’
‘్భలేవారు మాస్టారూ.. వీళ్ల స్కూల్లో ఒకటవ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారు..’ అంతకు ముందు కూల్‌డ్రింక్ గానీ తాగి ఉండక పోయినట్లైతే నేను మూర్ఛపోయేవాణ్ణేమో! నిలదొక్కుకున్నాను. డాక్టరమ్మ అన్నారు. ‘మీరు మా వాడికి ట్యూషన్ చెప్పవలసింది సెలవుల్లోనేనండీ మాస్టారూ... ఎందుకంటే వీళ్ల స్కూల్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిదింటి వరకూ క్లాసులుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే ఆదివారాలు, పండుగ రోజులు సెలవులిస్తారు. ఓ నెల రోజులు సమ్మర్ హాలిడేస్ మాత్రం కచ్చితంగా ఉంటాయి. అదీ మేనేజ్‌మెంట్ వారు విదేశాలకు హాలీడే ట్రిప్‌కి వెళతారు కాబట్టి!’
హతోస్మి..! నేనేం మాట్లాడగలనింక? సరే ఇంతా విన్నాక ఈ డాక్టరమ్మగారి వంశోద్ధారకుణ్ణి చూడాలనిపించింది.
‘ఒక్కసారి బాబును పిలిపించండి మేడం చూస్తాను’ అన్నాను. బెల్ కొట్టి పనిమనిషిని పురమాయించి పిలిపించారామె.
‘వీడే మా ఒక్కగానొక్క కొడుకు, పేరు సృజన్! నాన్నా వీరే నీకు ఫిజిక్స్ మాస్టారు’ పరిచయం చేసారామె.
‘నమస్తే మాస్టారూ!’ వినయంగా నమస్కరించాడు. ఇంకా పసితనంపోని ముఖం! పాలుగారే బుగ్గలు. పున్నమి చంద్రుల్లా ముద్దొస్తూ ఉన్న సృజన్‌ని చూసి ‘ఈ పసిమొగ్గనా నేను ఇకపై సెలవుల్లో ట్యూషన్ పేరుతో వసివాడేటట్లు చెయ్యాల్సింది’ అనిపించింది.
‘మీరు మా వాడితో మాట్లాడండి సార్! ఈ పుస్తకాలు మీ దగ్గర ఉంచండి’ అంటూ ఆ ఐఐటి పుస్తకాలను నాకందించారు. నాలుగు వేదాలను అందుకుంటున్నంత భక్తిగా వాటిని అందుకున్నాను.
‘నాన్నా, మాస్టారితో మాట్లాడుతూ ఉండు. మరి నేను వెళ్లొస్తాను సార్! ఓ అర్జంట్ కేసుంది. మరోలా అనుకోకండి..’ మాట్లాడినంత వేగంగాను డాక్టరమ్మగారు నిష్క్రమించారు.
‘మీరు నాకు హాలిడేస్‌లో ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నారా సార్?’ పిల్లవాడు గొంతు ‘నన్ను బలిచెయ్యడానికి కత్తిని సిద్ధం చేస్తున్నారా?’ అన్న అర్థంతో ధ్వనించింది.
‘అవును సృజన్! ఏం నీకిష్టంలేదా?’
‘మీరు మీ అబ్బాయికి కూడా ఇలాగే హాలిడేస్‌లో చెప్తారా?’
‘అసలు మాకు పిల్లలు లేరు సృజన్. నీలాంటి అబ్బాయి మాకూ ఉండుంటే బాగుండేది అనిపిస్తూ ఉంది’ మనసులో మాట సిన్సియర్‌గా చెప్పాను.
‘నాలాటి బాబు మీకూ ఉండి ఉంటే అతనికే కాదు అస్సలు ఎవ్వరికీ మీరు ట్యూషన్ చెప్పేవారు కాదు సార్!’
నవ్వేను నేను. ‘అదేం ఎందుకలా అనిపించింది?’
‘మరి మీ అబ్బాయి కూడా నాలా చచ్చిపోవాలనుకుంటాడు కదా! అది మీకు బాధ కదా?!’
స్థాణువునయ్యాను నేను. ‘ఏమిటి బాబూ.. సరిగ్గా చెప్పు?’ అన్నాను వణికే గొంతుతో.
‘సార్.. ఈ స్కూల్లో చేరింది మొదలు అస్సలు ఆటా పాటా ఏమీ లేవు. నాకేమో షటిల్ అంటే చాలా ఇష్టం. పాటలు విని నేర్చుకుని పాడాలని ఉంటుంది. కానీ టైమెక్కడిదసలు? ఎప్పుడూ చదువూ, చదువూ టెస్ట్‌లు, ర్యాంకులు.. నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది’ దుఃఖంతో వాడి కంఠం బొంగురుపోయింది. చంద్రుని కంట్లోంచి జారినట్లు రెండు కన్నీటి ముత్యాలు రాలి వాడి పసిడి చెంపలపై రాలిపడ్డాయి.
‘మీ బాబు ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతానని’ ఎవరికో మాటాచ్చిన డాక్టరమ్మ తన స్వంత కొడుకు అంతరంగాన్ని తెలుసుకోక పోవడం అన్యాయం అని మనసు ఘోషించింది.
‘ఇలా రా నాన్నా’ వాణ్ణి దగ్గరకు పిలిచి గుండెలకు హత్తుకున్నాను. వాడెంత నిరాశతో ఉన్నాడో ఏమో నన్ను అలాగే కరుచుకు పోయాడు, వౌనంగా రోదిస్తూ! నేను కొన్ని నిమిషాలు సృజన్‌ను ఓదారుస్తూ, తల నిమురుతూ ఉండిపోయాను. కాసేపటికి తేరుకుని చెప్పాడు. ‘వద్దు సార్, మీరు నాకు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోకండి’ నేనాలోచించాను.
‘ఇవ్వాళ నేను కాదంటే మరొకరు! అప్పుడీ పిల్లవాడి పరిస్థితి ఏమిటి?’
‘సరే నాన్నా. నేను చెప్పను గానీ అసలు మమీ డాడీ ఉద్దేశం టీచరుర్ల మీ ఇంటికొచ్చి చెప్పాలనా లేక నినే్న వారి ఇళ్లకు పంపాలనా?’
‘ననే్న కార్లో మీ ఇంటికి పంపుతారట సార్! నిన్న డాడీ అంటుంటే విన్నాను’
‘హమ్మయ్య’ అన్నాను ఊపిరి పీల్చుకుని.
‘అమ్మో, అలాగయితే ఒప్పుకుంటారా సార్?’ బిక్కమొహం వేసుకుని అడిగాడు.
నవ్వి పిల్లవాడి చేతిని నా చేతుల్లోకి తీసుకుని పెదవుల కానించుకుని చెప్పాను. ‘చెప్పను గాక చెప్పను! కానీ రోజూ హాలిడేస్‌లో నువ్వు మా ఇంటికి రావాల్సిందే. ముందిది చెప్పు. మామూలుగా మీ క్లాస్‌లో నీకు యే ర్యాంక్ వస్తూ ఉంటుంది?’
ఆశ్చర్యపోతూ చెప్పాడు. ‘ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే సార్!’ పిల్లవాణ్ణి నా ఎదురుగా కూచోబెట్టుకుని నా ప్రణాళిక విశదపర్చాను. పది నిమిషాలు విన్నాక సృజన్ మోము ‘సూపర్‌మూన్’ అంత కాంతితో వెలిగిపోయింది!
అలా సృజన్‌ను రోజూ ‘ట్యూషన్’కు వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చాను. చిన్నవాడే అయినా జీవితం విలువను తెలుసుకొని, జీవించి ఉంటే ఎంతో సాధించడానికి అవకాశం ఉందని తెలుసుకొనేట్టు చేసాను. అతనికి నిజంగా సబ్జెక్ట్‌లో ఏవైనా సందేహాలుంటే నన్ను అడిగి తెలుసుకునేవాడు. స్వతహాగా తెలివైన కుర్రాడు కాబట్టి ఇట్టే గ్రహించి, అర్థం చేసుకునేవాడు. నా అంతట నేను ఏనాడూ సృజన్‌కు సబ్జెక్ట్‌ను ట్యూషన్ పేరుతో బోధించలేదు. తనే చదువుకుని సందేహాలు తీర్చుకునేటట్లు ప్రోత్సహించాను. అదీ తన కిష్టమైనప్పుడే! బలవంతం మీద కాదు!
వీటన్నిటి కంటే ముఖ్యంగా ట్యూషన్ టైములో ఎక్కువ సమయం నేను సృజన్‌తో తనకు ఇష్టమైన షటిల్‌ను ఆడి ఆ ఆటలో పిల్లవాడికి మంచి పరిణతి వచ్చేట్టు చేశాను. అతనికిష్టమైనప్పుడు పాటలు విని నేర్చుకునేట్టు చేసాను. అతను ఇంటర్ అయ్యేలోపు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి షటిల్ ఆటగాడికి మంచి పేరు తెచ్చుకున్నాడు. తమ కొడుకు ఎప్పుడీ ఆట నేర్చుకుని, ప్రాక్టీస్ చేశాడో ఎలా మ్యాచ్‌ల వరకూ వెళుతున్నాడో ఆ డాక్టర్‌గారకీ డాక్టరమ్మకీ అర్థమయ్యేది కాదు. ఏమయితేనేం పిల్లాడు ఇంటర్ స్టేట్ ర్యాంక్‌తో పాసయ్యాడని వారు సంతోషించారు.
ఎటువంటి ఒత్తిడీ లేకుండా మనసు పెట్టి చదివేవాడు కాబట్టి అమ్మానాన్నల కలలు నెరవేర్చాలని ప్రోత్సహిస్తూ సబ్జెక్ట్‌పై శ్రద్ధ పెట్టేట్లు చేసి, మొదటిసారే మంచి ర్యాంకుతో ఐఐటి కాలేజీలో సీటు సాధించేట్టు చేసాను. ఇందులో నేను చేసింది అణు మాత్రమే! పూర్తి శ్రద్ధతో సృజన్ చేసిన సాధనే ఎక్కువ.
సృజన్ నాన్నగారు డాక్టర్ అనంతరంగారు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసి వచ్చిన అతితులతో చెప్పారు. ‘మా బాబుకు ఈ మాస్టారు ఓ ‘రోల్ మోడల్’. ఈయన్ను విడిచి మా వాడు ఒక్కరోజయినా ఉండేవాడు కాదు. రోజూ ట్యూషన్‌కి వెళతానని పట్టుబట్టి వెళ్లేవాడు. వీరి కోచింగ్ వల్లనే బాబుకు మంచి ర్యాంక్ వచ్చింది. అందుకు కృతజ్ఞతగా మేము ఈ గురువు గారికిచ్చే చిరుకానుక’ ఓ ప్యాకెట్‌ను నాకందించబోయారు. నేను వారించి చెప్పాను ‘నేను మీ బాబుకు సబ్జెక్ట్‌పరంగా చెప్పిన ట్యూషన్ చాలా తక్కువ సార్! అంటే బలవంతంగా కూచోబెట్టి ఏనాడూ చెప్పలేదు.. అతనికిష్టమైన గేమ్‌లో, మ్యూజిక్‌లో ఎంకరేజ్ చేస్తూ జీవితం విలువలను పాజిటివ్‌గా తెలుసుకునేట్టు చేశాను. రోజూ కొంత సమయం బాబుతో షటిల్ ఆడాను. పాటలు పాడించాను. మరి ఇది ఎంతవరకు సరైనదో నాకు తెలీదు! బాబు మానసిక వత్తిడి లేకుండా చదువుకోవాలని ఇదంతా చేసాను. అతన్ని డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికే తప్ప, మీకు తెలీకుండా ఇవన్నీ చేసి మిమ్మల్ని అవమానించాలని కాదు. నన్ను క్షమించండి’ కళ్లు చెమరుస్తుండగా చేతులు జోడించి చెప్పాను.
డాక్టర్‌గారు ఒక్కమారుగా నన్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ‘అలా అనకండి సార్! మీరు మాకు పుత్రభిక్ష పెట్టారు. బాబు డిప్రెషన్‌ను మేము గుర్తించలేక పోయాం. మీరు కనుక్కుని వాణ్ణి ఓ మనిషిని చేసారు. ఆటల్లోలాగే గెలుపు ఓటములను సమంగా తీసుకోవాలనే జీవిత సత్యాన్ని తెలియజేశారు. మేము మీకు ఇచ్చే ఈ చిన్ని కానుక కంటే ఎంతో విలువైన కానుక నా కొడుకును నాకందించారు. అది చాలు’ అన్నారాయన చేతులు జోడించి.
డాక్టరమ్మగారు కూడా నమస్కరించారు. నవ్వుతూ చెమర్చిన కళ్లతో నన్ను చూస్తున్న సృజన్‌ను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాను.

-బి.వి.స్వరూప్‌సిన్హా.. 9866137204