కథ

మాటరాని వౌనమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
ఆ గదిలో వౌనం రాజ్యమేలుతోంది. ఉన్న నలుగురి మనసులలో వేరువేరు ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
అయితే ఎవరు ముందు మొదలుపెట్టాలో అర్థంకాక, ఒకరివైపు ఒకరు చూసుకోసాగేరు.
ఇంటికి పెద్దని కాబట్టి నాదే మొదటి ఛాన్సు అన్నట్టు కోపంగా మొదలుపెట్టబోయిన రావుగారు ‘తాతగారూ ఇది నా సమస్య, ఇందులో మీ జోక్యం సహించను’ అన్న సుమ మాటలతో మళ్లా ఆ గదిలో వౌనమే చోటు చేసుకుంది.
‘చచ్చేకాలానికి మాకెందుకీ రొష్టు. ఓ టిక్కెట్టు ముక్క పారేస్తే ఏ కాశీయో రామేశ్వరమో పోతాం’ పైట చెంగుతో కళ్లొత్తుకుంటూ మెల్లగా అంది ఎనభై ఏళ్ల శారదమ్మ.
‘నానమ్మా! పిచ్చి మాటలొద్దు. నాకు మీ అందరి అంగీకారం కావాలి’
‘చాక్లెట్టా అడగ్గానే ఇచ్చెయ్యడానికి. పరువు, ప్రతిష్ఠ, గౌరవం..’ ప్రకాష్‌ని మధ్యలోనే అడ్డుకుంది సుమ.
‘అవి మనకి కూడు పెట్టవు కదా నాన్నా’
‘జాతి సంకరం చేస్తే పిండివంటలతో కడుపు నిండుతుందా?’ ఎంత సౌమ్యంగా అందామనుకున్నా దాగని కోపం ప్రకాష్ గొంతులో.
‘సుమ తల్లీ మా మాట వినమ్మా. మాకు తలవంపులు తెచ్చే పని చెయ్యకు తల్లీ. ఏడాది లోపల మంచి సంబంధం తెచ్చి ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి నీ పెళ్లి చేస్తాం తల్లీ. ఆ కులం గోత్రం లేని పెళ్లి చేసుకోకు తల్లీ’ అన్నాడు ప్రకాష్.
‘నా గతం అంతా మరిచిపోయి పూర్వపు సుమని అవ్వాలని ఉంది కానీ నేనెప్పుడో గీత దాటాను నాన్నా’
‘ఎక్కడో అమెరికాలో జరిగిన విషయం కదా మర్చిపో. ఇక్కడ ఎవ్వరికీ చెప్పొద్దు. కొత్త జీవితం కొత్తగా మొదలుపెడుదువుగాని తల్లీ’
‘అబద్ధాల పునాది మీద నిలబెట్టిన కొత్త జీవితం ఎన్నాళ్లు నిలబడుతుంది?’
‘నువ్వు పిచ్చివాగుడు వాగకపోతే ఎన్నాళ్లయినా నిలబడుతుంది’ అంది నిభాయించుకోలేని మాలతి.
‘సత్యమునే పలుకవలెను అని పిల్లలకి నువ్వు చెప్పే పాఠం తప్పంటావా అమ్మా?’
‘ఔను నిన్ను కనడం ఒక తప్పే, పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించడం మరో తప్పే. కొవ్వెక్కి ఎవడితోనో పోయి సిగ్గు లేకుండా చెప్తున్నావు. చూడూ అది విని, నీకు బడిత పూజ చెయ్యకుండా వూరుకున్న నీ అమ్మా అబ్బలది అన్నిటికన్నా పెద్ద తప్పు. ముందు దాన్ని ఆ గదిలో పారేసి తలుపు తాళం వెయ్యి. తరువా సంగతి తరువాత చూసుకుందాం’ అన్న రావుగారి మాటలు విని శాంతంగా,
‘పాతకాలంలో ఉండిపోయేవు తాతయ్యా. అసలు తప్పంతా నీది అని నేనంటే నీ సమాధానం ఏమిటి?’
‘్భవడా నేను ఔనంటేనే వాడితో పోయావుటే. వితండ వాదం కాకపోతే’
‘అసలు సమస్య వదిలేసి ఇవంతా ఎందుకు కానీ నా మాట విను’ ఎలాగైనా కూతురిని ఒప్పించాలనే తాపత్రయం ప్రకాష్‌దీ.
‘అసలు విషయమే మాట్లాడుతున్నాను నాన్నా. తోటివారితో పోటీ పడకూడదు. అబద్ధాలు ఆడకూడదు అని చిన్నప్పటి నుండి మాకు నూరిపోసి, ఆ సూక్తులని మీరు ప్రతిరోజూ అధిగమిస్తూ ఉంటే అయోమయంలో పడి ఊరుకోలేక అడిగినందుకు నాకు లభించిన బహుమతి తొడపాశం. మొదటి నుంచి ఈ పోటీ నాకు పడేది కాదు. అందుకే ఏ పోటీ పరీక్షకి వెళ్లేదాన్ని కాదు. సామర్థ్యం వున్నా అరవై శాతం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొనేదాన్ని కాదు. నాకన్నా పెద్దదయిన పెదనాన్న కూతురు రమ్య ఇంజనీరింగులో చేరడంతో మీకు పెదనాన్నతో పోటీ ఏర్పడింది. చిన్నప్పటి నుండి మీలో అణిగి వుండిపోయిన ‘నేను అన్నతో పోటీపడి గెలవలేకపోయానే’ అనే భావం ఈసారి నా ద్వారా గెలవాలనే పట్టుదల మీ చేత నన్ను ఇంజనీరింగ్‌లో చేర్చేవరకూ ఊరుకోనివ్వలేదు. అంతర్గతంగా నేనూ ఈ పోటీలకి అలవాటు పడ్డానో, అంతకు ముందే ఈ కోర్సులలో చేరిన నా దోస్తుల చూపులలోని తేడాని పోగొట్టాలని అనుకున్నానో గాని నేనూ ఎదురు చెప్పకుండా ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అప్పటికే అమెరికా చదువులకి ఎగిరిపోయింది రమ్య. మీ కూతురు కూడా అమెరికాలో చదువుకోవాలనే కోరిక తలెత్తింది. నాకొచ్చిన స్కోరు మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించలేక పోయింది. ధూంధాంగా అక్కకి అమెరికా వరుడితో పెళ్లి చేసి బ్యాంకు బ్యాలెన్సు సున్నా చేసుకున్న మీరు అమెరికా చదువు వద్దంటారని ఎదురుచూసేను. అమెరికా మోజు మనలని ఆలోచించుకోనివ్వలేదు. అంతర్గతంగా నేను కూడా అమెరికా జీవితం కోరుకోడంతో వివేకం కోల్పోయి ఆ మారుమూల యూనివర్సిటీకి బయల్దేరాను.’
‘కాలూ కడుపూ కట్టుకొని ఇక్కడి రూపాయలని డాలర్లుగా మార్చి నిన్ను చదువుకోమని పంపితే ఒళ్లు... చేసిన వెధవ పనికి సిగ్గుపడి చావక మమ్మల్ని తప్పుపడతావటే’ పళ్లు కొరికేడు ప్రకాష్.
‘ఆ యూనివర్సిటీలో చదువుకాక వ్యభిచారం నేర్పేరుటే నీకు’ కళ్లెర్ర చేశారు రావుగారు.
‘ఎవరు ఎలా అనుకున్నా నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది అన్నది మీకు చెప్పే బాధ్యత నా మీద ఉంది. మీరు నేర్పిన సంస్కారం, విలువలు నేను మరిచిపోలేదని, మిమ్మల్ని చిన్నబుచ్చడానికి నేను ఈ పని చెయ్యలేదనేది మీరు నమ్మితే చాలు. మీరు ఒప్పుకుంటేనే నేను రోషన్ చేత తాళి కట్టించుకుంటాను. లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ముందు నే చెప్పేది వినండి.
‘నేను అక్కడికి వెళ్లింది సెప్టెంబర్ ఆఖరు వారంలో. అక్కడి వాళ్లకి అది వేసవి. హైదరాబాద్‌లో కొన్న లాంగ్ కోట్లు అప్పటికి సరిపోయాయి. వేరే అపార్ట్‌మెంట్ తీసుకుంటే అద్దె ఎక్కువ అవుతుందని పేయింగ్ గెస్ట్‌గా చేరాను. లాండ్‌లార్డ్‌కి మూడు నెలల అడ్వాన్స్ ఇచ్చి, యూనివర్సిటీ రాకపోకలకి పాత కారు కొనుక్కొనేసరికి నా దగ్గర డాలర్లు నిండుకున్నాయి. అక్కను అడిగితే వంద డాలర్లు పంపి పార్ట్‌టైమ్ పనేదైనా చూసుకొని చదువుకోమని సలహా ఇచ్చింది. అమెరికా ఆర్థిక పరిస్థితులు తలకిందు లవడంతో బావ ఉద్యోగం పోగొట్టుకొని అక్క జీతంతో ఇల్లు గడుపుతున్నారు వాళ్లు. అది మాత్రం ఏం చేస్తుంది? చేతిలోంచి జారుతున్న ప్రతి డాలరూ నాలో భయాన్ని నింపుతోంది. మా మొత్తం యూనివర్సిటీని కిందా మీదా వేసినా పట్టుమని పదిమంది భారతీయులు లేరు. ఎవరితో నా భయాలు పంచుకోవాలో తెలిసేది కాదు. నెలకి సుమారు నాకయ్యే ఖర్చు పదిహేను వందల డాలర్లు. మిమ్మల్ని అడగొచ్చు. నెలకి ముప్పై వేల జీతగాడు నెలకి లక్ష రూపాయలు ఎక్కడ నుంచి తేగలడు అనే ఆలోచన నన్ను అడగకుండా ఆపింది.
లోకల్‌గా వుండే ప్లేస్‌మెంట్ ఏజెన్సీలో నా వివరాలు ఇచ్చి వచ్చాను.
మూడు నెలల అడ్వాన్సు ఇవ్వడం వలన ఫుడ్‌కి బెడ్‌కి ఇబ్బంది లేదు. దాని తరువాత అనే దగ్గర నా ఆలోచనలు ఆగిపోయేవి. నా ఇబ్బంది సీనియర్స్‌కి చెబితే ముగ్గురు నలుగురు షేర్ చేసుకొనే అపార్ట్‌మెంట్ తీసుకుంటే తక్కువ ఖర్చు పడుతుందని, ఆడా మగా కలిసి ఒక ఇంట్లో కలిసి ఉంటే శీలం ఏం పోదని, అలా పోయేదే అయితే ఇక్కడకి రాబోయే ముందు ఇండియాలో దాచుకు రావలసిందని సలహా ఇచ్చారు. ఆ ముగ్గురు నలుగురు ఏరీ? వారిని బతిమాలి వారి జాగాలో ఒకరోజు పని చేసి చిన్నచిన్న అవసరాలు తీర్చుకోగలిగాను. అదీ నెలకి ఒకళ్లో ఇద్దరో ఒప్పుకొనేవారు.
ఏజెన్సీ వాళ్లు హెల్పర్ పని ఉందని పిలిచారు. హెల్పర్లు అంటే ఇల్లు తుడిచి, అలకడం, బాత్రూమ్‌లు కడగడం అన్న మాట. ముందు తటపటాయించినా గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఖర్చులన్నీ పోగా యాభై డాలర్లు వరకు మిగిలేవి. మనం పండుగలకి ఇల్లు దులుపుకొని, కడుక్కోడమూ. అక్కడా అంతే క్రిస్మస్ ముందు మాత్రమే పని ఉంటుంది.
కొత్త సంవత్సరం నాకు ఆనందాన్ని తేలేదు. నాకు అర్జంటుగా రెండువేల డాలర్లు కావాలి. మా ఓనర్‌కి మరో మూడు నెలలకు అడ్వాన్సు కట్టాలి లేదా తట్టాబుట్టా సర్దుకోవాలి. నా గడువు ముగిసిపోయినా మరో నెల ఉండనిచ్చారు అది వారి కుక్కల సంరక్షణ చూసుకోవాలనే షరతు మీద. అప్పటికే బాత్రూంలు కడిగిన నాకు కుక్కల సంరక్షణ కష్టమనిపించలేదు’
‘ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు ఇలాంటి పనులు చెయ్యడమేమిటే’ ఉక్రోషంతో అరిచింది మాలతి.
‘ముందు చూపు లేకుండా చేసే పనులు ఇలాంటి ఫలితాలనే ఇస్తాయమ్మా. ఈ చేతులతోనే వాటికి స్నానం చేయించాను. మాంసాహారాలూ వండాను. ఆ నిస్సహాయతని నాలో దాచుకోలేక భగవంతుడా పై జన్మలో ఇలాంటి దేశంలో కుక్కగా పుట్టించు అని ఎన్నిసార్లు కోరుకున్నానో? ఒక్క ఏడాది ఇలాగో అలాగ గడిపేస్తే రెండో సంవత్సరం చదువుకి వేరే యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. సిటీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగు నెలలు గడవడమే కష్టంగా ఉంటే మిగతా ఆరు నెలలు ఏం చెయ్యాలి’
‘్భగవంతుడా పై జన్మలో ఇలాంటి దేశంలో కుక్కగా పుట్టించు’ అన్న సుమ కోరిక వినగానే శ్రోతలలో ఆమె ఎంతటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొందో అర్థమయింది.
‘నా సమస్యని నా సీనియర్స్ ముందుంచి సలహా అడిగాను. అందరూ కాకపోయినా కొందరు నాలాంటి సమస్యలని ఎదుర్కొనే ఉంటారనే నమ్మకం నాది. అప్పుడే తెలిసింది రోషన్ కూడా నాలాగే ఇబ్బందులు పడుతున్నాడని. ఓ అమ్మాయి ఇచ్చిన సలహా ప్రకారం ఇద్దరం లివింగ్ రిలేషన్‌షిప్‌లో వున్నామని రోషన్ ఇంటి ఓనర్‌కి చెప్పి ఇద్దరూ అక్కడే ఉండడం, రోషన్ వుండే ఇల్లు ఊరికి దూరంగా ఉండడంతో రోషన్ వెళ్లిపోతే ఇంకొకరు అద్దెకు రారేమోనని ఓనర్‌కి భయం. అందుకు మరో మనిషి ఛార్జెస్ అడగడు. ముఖ్యంగా ఒక కారు అమ్మేసి ఒకే కారుని ఇద్దరూ వాడుకోవచ్చు. ఒక మనిషి ఖర్చుతో ఇద్దరూ బతకొచ్చు. ఈ ప్రపోజల్ నాకు నచ్చినా నా సందేహాలు నాకున్నాయి. అందుకే రోషన్‌తో మాట్లాడేక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను.
రెండు మూడుసార్లు అతని ఇంటికి వెళ్లాను. మనిషి నమ్మదగ్గట్టే అనిపించాడు. అలా కనిపించకపోయినా గత్యంతరం లేదు. నా గడువు తీరగానే నా సామాన్లతో రోషన్ రూమ్‌కి మారిపోయాను. అతని కారు అమ్మి మా సెమిస్టర్ పరీక్షలకి కట్టవలసిన సొమ్ము సమకూర్చుకున్నాం. అతనే పార్ట్‌టైమ్ పనులేవో చేసి ఇద్దరి అవసరాలు తీరేంత సంపాదించేవాడు.
ఉన్న ఒక్క మంచం నాకిచ్చి అతను కార్పెట్ మీద పడుకొనేవాడు. నా గురించి అతని మనసులో ఏ అభిప్రాయముందో గాని నాకు మాత్రం ఇది ఈ ఆరు నెలలు గడపడానికి చేసుకున్న ఓ ఒప్పందం మాత్రమే. ఆరు నెలల తరువాత అతనెవరో నేనెవరో అంతే. ఇక్కడ కొనుక్కొని తీసుకువెళ్లిన చలి బట్టలు అక్కడ ఏ మాత్రం పనికిరావని శీతాకాలం మొదలవుతూనే అర్థమయింది. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. పళ్ల బిగువున చలి ఆపుకొనేదాన్ని. ఓ రోజు రోషన్ రెండు స్నో కోట్లు తెచ్చాడు. వద్దనాలని వున్నా వివేకం హెచ్చరించడంతో తీసుకున్నాను. నాకు ఉద్యోగం రాగానే రోషన్ దగ్గర తీసుకున్న ప్రతీ పైసా లెక్కకట్టి వడ్డీతో సహా తీర్చేయ్యాలని నిర్ణయించుకున్నాక మనసు కొంత శాంతించింది.
వెంటాడి వేటాడే మృగాలు తిరిగే ఈ లోకంలో చెయ్యిజాచితే అందేంత దూరంలో ఆడపిల్ల వున్నా పట్టనట్లుగా వుండే రోషన్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలుగజేసేది.
ఇంటి పనులలోనూ చదువులోనూ అడగక ముందే సహాయపడేవాడు.
ఎక్కువగా ఎవరి పనులలో వారం వుండేవారం. మా మధ్య మాటలు చాలా తక్కువగా జరిగేవి. తక్కువగా జరగటం కాదు, అలా ఉండేటట్లు చూసుకున్నాను అంటే సరిపోతుందేమో.
మరో యూనివర్సిటీకి మారేంతవరకు ఎలాగోలా కాలం గడపాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అతని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చూపించలేదు. సాధ్యమైనంత వరకు అంటీ ముట్టనట్టుగా గడిపేదాన్ని. మన వంశ మర్యాదల గురించి అవసరం లేకపోయినా ప్రతిరోజూ వినిపించేదానిని. అతనిని కించపరచాలని కాదు గాని ఎందుకో అలా మాట్లాడాలని అనిపించేది. లేకపోతే నాలో వుండే అపరాధం భావం వల్ల అలా అనిపించేదో? ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి రోజులు గడుస్తున్నాయి. ఇలా ఉంటే ఫరవాలేదు అనుకుంటున్న సమయంలో జరగకూడనిది జరిగిపోయింది.
విధి అనేది ఒకటి ఉంటుందని, దానిని తప్పించుకోవడం మన వల్ల కాదని నిరూపించుకున్న సంఘటన జరిగింది.
ఫిబ్రవరి మూడో వారంలో అనుకుంటా రెండు రోజులలో మంచు తుఫాను రాబోతోందనే హెచ్చరికతో విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. మా ఓనర్ మరో రెండు రజ్జాయిలు ఇచ్చి ఇది కప్పుకొని దగ్గరగా హత్తుకు పడుకోమని చెప్పి వెళ్లిపోయాడు. మొదటి రోజు హీటర్స్ పని చెయ్యడంతో మంచు తుఫానుని కిటికీ లోంచి చూస్తూ వేడి కాఫీ తాగుతూ ఈపాటి దానికి వీళ్లు భయపడ్డమే కాక మనని కూడా భయపెట్టారని నవ్వుకున్నాం. మా నవ్వులకి ప్రకృతికి కన్నుకుట్టిందేమో. ఆ రోజు రాత్రి విపరీతంగా మంచు కురవసాగింది. పవర్ కట్టయింది. కొవ్వొత్తి వెలిగించి తెచ్చిన ఓనరు పాలు, పళ్లు, బ్రెడ్‌లతోనే గడుపుకోవాలని తిరిగి ఎలక్ట్రిసిటీ రావడానికి కనీసం పది రోజులైనా పడుతుందని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ రాత్రి నరకయాతన అనుభవించాం. మా కోట్లు, రజ్జాయిలు కప్పుకున్నా ఆగలేదు చలి. ఆ చలికి తట్టుకోలేని శరీరం నరనరం వణకసాగింది. ఇలా వుంటే ఎంతోసేపు బతకలేమన్నది తెలిసిపోయింది. చావుని చాలా దగ్గరగా చూశాం. సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులం, గోత్రం ఏవీ గుర్తుకురాలేదు. తెలుస్తున్నదల్లా బ్రతకాలనే కోరిక. చావు ప్రతీ వాళ్లకీ వస్తుంది అన్నది తెలుసు గాని ఇలాంటి చావు పగవాళ్లకి కూడా రాకూడదు. తప్పు.. ఒప్పు.. శీలం వీటన్నిటికీ.. ‘నేను’ అంటూ ఉంటేనే కదా అని అనిపించిన ఆ బలహీనమైన క్షణంలో అలా జరిగిపోయింది.
ఆ క్షణం దాటిన తరువాత దీనికన్నా చావు మేలేమో అని చాలాసార్లు అనుకున్నా నాన్నా.. నిజం నాకిష్టమైన నా కుటుంబం మీద వొట్టు వేసి చెప్తున్నా..
పది రోజులకి వాతావరణం బాగుపడింది. -20 డిగ్రీలలో బతికి ఉండాలంటే అంతకన్న గత్యంతరం లేదు. కాని మాలో అలజడి తగ్గలేదు. ఏదో తప్పు చేస్తున్నామన్న భావన ఇద్దరిలోనూ ఉంది. బతికుండాలంటే అంతకన్నా గత్యంతరం కూడా లేదు. ఇలాంటి బ్రతుకు అవసరమా? అని రోజుకి ఏ వందసార్లో అనిపించేది. ఎక్కువగా వౌనంగా గడపసాగాం. రోజు ఒక యుగంగా గడిచింది. ఈ లోపల నాకు సియాటల్, రోషన్‌కి షికాగో యూనివర్సిటీలకి ట్రాన్స్‌ఫర్ వచ్చాయి.
అదే నేను కోరుకున్న ముగింపు నా కథకి. కాబట్టి చాలా సంతోషంగా టాటా బై చెప్పేసా.
ఓ పక్క చదువు, పార్ట్‌టైమ్ ఉద్యోగంతో బిజీ అయిపోయాను. పేపర్లు సబ్మిషన్ అయిపోయింది. కాంపస్ సెలక్షన్‌లో మంచి ఉద్యోగమే సంపాదించుకోగలిగేను. మీ దగ్గర నుంచి పెళ్లికొడుకుల ఫొటోలు రాసాగాయి. అప్పుడు మళ్లా అంతర్మథనం మొదలయింది. నా రహస్యాన్ని నాలోనే దాచుకొని తలవంచుకొని తాళి కట్టించుకొని పెళ్లి మంత్రాలని అవహేళన చేసి జీవితాంతం తలదించుకుని బ్రతకాలా? ఏమీ తోచని అయోమయం. అందుకే ఉద్యోగం నిలదొక్కుకోవాలని మీ దగ్గర ఆరు నెలలు సమయం అడిగాను.
రోషన్ బాకీ అతనికి పంపేసి ఋణ విముక్తురాలనయ్యానని సంతోషించాను.
ఏమిటో మనసు తేలిక అవడం పోయి మరింత బరువుగా మారింది.
ఆరునెలల గడువు పూర్తయింది. కాని నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు. నాకేమీ ప్రత్యేకంగా రోషన్ అంటే ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. మనిషి మంచివాడే. అంతకు మించి అతని గురించి గాని అతని కుటుంబం గురించి గానీ నాకేమీ తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించలేదు.
పెళ్లి అనే ఆలోచన నాలో వచ్చినప్పుడల్లా నాలో ఏదో అలజడి మొదలయ్యేది. మొదటిసారి మీరు పంపిన వరుడితో మాట్లాడినప్పుడు విదేశాలలో చదువుకున్న ఆడపిల్లల మీద సగటు మగపిల్లవాడి భావాలు ఎలా ఉంటాయో అర్థమైంది. చదువుకున్నా మగపిల్లల మనస్తత్వం మారలేదని తెలుసుకున్నాను. నా పొరపాటును కప్పిపుచ్చుకొని తాళి కట్టించుకోవాలి. లేదా జీవితాంతం నాలోని అపరాధనా భావాన్ని మోస్తూ జీవించాలి.
మొదటిది నాకు సమ్మతం కాదు. ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో రోషన్ నుంచి వచ్చిన చిన్న ఇ-మెయిల్ తెచ్చిన సందేశం నన్ను ఈ నిర్ణయంవైపు నడిపించింది. దాని ప్రకారం రోషన్ కూడా నాలాగే అయోమయంలో ఉన్నాడని, ఎవరో ముక్కూమొహం తెలీని వాళ్లతో జీవితం పంచుకొనే బదులు శరీరాలు కలిసిన మనం ఒకటైతే కనీసం మిగతా జీవితం అపరాధ భావం నుంచి తప్పించుకున్న వాళ్లవౌతాం కదా అన్నది సారాంశం.
సుమారు పద్దెనిమిది నెలలు గిల్టీనెస్‌ని మోసిన మనస్సు అలసిపోయింది. అందులోంచి బయటపడతాను అనే ఆలోచనే నాకు ఎంతో రిలీఫ్‌నిచ్చింది. రోషన్ తెచ్చిన ప్రతిపాదన తరువాత అతని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నేను భర్త ఎలా ఉండాలనుకున్నానో చాలామటుకు అలానే వున్నాడు. నా కుటుంబ సభ్యులని ఏక్సెప్ట్ చెయ్యడానికి అతనికి లేని అభ్యంతరం నాకెందుకుండాలి. మీరు చూసిన సంబంధమైనా వాళ్ల గురించి నాకెంత తెలుస్తుంది. రోషన్ గురించి నాకు అంతకన్నా ఎక్కువే తెలుసు.
మన చుట్టాలు నన్ను రోషన్‌ని ఆదరించాలని నేను ఆశించటం లేదు. పచ్చని పందిట్లో వేదమంత్రాల మధ్య నన్నుగన్న తల్లిదండ్రులు కన్యాదానం చేస్తే నా వైవాహిక జీవితం చల్లగా సాగుతుందని నా నమ్మకం. మీరు కాదంటే రోషన్‌తో కాపురం పెట్టేస్తానని అనుకోవద్దు. కాని పాతికేళ్లు పెంచిన మీ మమకారం కావాలి నాకు. కొన్ని రోజుల సావాసం కాదు. మీ నిర్ణయమే నా నిర్ణయం’ ధారాపాతంగా కారుతున్న కన్నీటిని రుమాలుతో దాచే ప్రయత్నం చేసింది సుమ.
ఇన్నాళ్లుగా దాచుకున్న బరువు బయటపడటంతో ఎంతో తేలికైంది సుమ మనసు. తలపైన పడ్డ నాలుగు చేతులు వౌనంగా తమ అంగీకారాన్ని అందజేశాయి. మాలతి చేతులు వౌనంగా సుమ కన్నీటిని తుడిచాయి.

-కె.వి.ఎల్.ఎన్.మూర్తి