కృష్ణ

విద్యారంగాన్ని పటిష్టపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూలై 13: కొఠారీ కమిషన్ ఆశయాల మేరకు ప్రభుత్వ రంగంలో విద్యారంగాన్ని పటిష్టపర్చాలని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం కొటారి కమిషన్‌కు 50 ఏళ్లు - నేటి విద్యారంగం అనే అంశంపై సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కొఠారీ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం, కమిషన్ చేసిన సిఫార్సులను వివరించారు. కొఠారీ కమిషన్ ఆశయాలకు భిన్నంగా విద్యారంగంలో భారీగా ప్రైవేటీకరణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను ఆపాలని, కామన్ స్కూల్ విధానం అమలుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన యుటిఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కెఎ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సమంజసం కాదన్నారు. పిఆర్‌సి, డిఎ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూలై 14న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ స్టడీ సర్కిల్ జిల్లా కార్యదర్శులు అగస్టీన్, బందరు ప్రాంతీయ శాఖల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

నాటుసారా స్వాధీనం

కృత్తివెన్ను, జూలై 13: మండల పరిధిలోని చినగొల్లపాలెం గ్రామంలోని మైనివానిలంకలో దొంగచాటుగా నాటుసారా తయారుచేస్తున్న బట్టీలను డ్వాక్రా మహిళలు పట్టుకున్నారు. ఈ దాడిలో వెయ్యి లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల నాటుసారాను పట్టుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. సారా రహిత గ్రామంగా ప్రకటించిన చినగొల్లపాలెంలో సారా తయారు చేస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. సారా రక్కసిపై డ్వాక్రా మహిళలు కదం తొక్కి ఎక్సైజ్ పోలీసులకు కనువిప్పు కల్పించారు. ప్రతినెలా నాటుసారా తయారీదారులు ఎక్సైజ్ పోలీసులకు పెద్దమొత్తంలో లంచాలు ఇస్తున్నారని, వారిపై నమ్మకం లేకే స్వయంగా పట్టుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు డ్వాక్రా మహిళలు వివరించారు.

లారీ ఢీకొని వృద్ధుని మృతి

మైలవరం, జూలై 13: మండలంలోని వెల్వడం గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వెల్వడం గ్రామానికి చెందిన కుప్పాల నాగరాజు(65) రోడ్డుపై వెళుతుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొనటంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

పిఎసిఎస్ అధ్యక్ష పదవికి
రామారావు రాజీనామా

మైలవరం, జూలై 13: మైలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్ష పదవికి బండి వెంకటకృష్ణ రామారావు బుధవారం రాజీనామా చేశారు. గతంలో అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంలో ఇద్దరు పోటీపడగా బండి రామారావు మూడేళ్లు, రాజగోపాల్ రెండేళ్ల కాలం అధ్యక్ష పదవిలో కొనసాగేలా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బండి పదవీకాలం మూడేళ్లు నిండటంతో తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని సహకార శాఖ డీఆర్ రమణారెడ్డికి పంపగా ఆయన ఆమోదించినట్లు తెలిసింది.