కృష్ణ

ఎక్కడి పనులక్కడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో చేపట్టిన సుందరీకరణ పనులు పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. మరో వారం రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఆరోజుకు పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్న తలంపుతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పురపాలక సంఘానికి పుష్కర నిధులుగా రూ.9కోట్లు మంజూరు చేయించారు. తొలివిడత రూ.2కోట్లు, రెండో విడతగా రూ.7కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లా పరిషత్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటరు వరకు సెంట్రల్ డివైడర్ అభివృద్ధితో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కోనేరు సెంటరు సుందరీకరణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులను చేపట్టారు. అయితే నిధులు విడుదల కాకపోవటంతో సంబంధిత గుత్తేదార్లు పనులను వేగవంతం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీన్ని అధిగమించి గుత్తేదార్లతో శరవేగంగా పనులు చేయించాల్సిన పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్నాయన్న నెపంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదం ఏర్పడింది.
పుష్కర భక్తులకు ఉచిత భోజనం
తోట్లవల్లూరు, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు తోట్లవల్లూరులో ఈ నెల 12 నుంచి 23 వరకు ఉచితంగా భోజనం, ఫలహారం, మంచినీరు అందిస్తామని, ఇందుకు తహశీల్దార్ భద్రు ద్వారా అనుమతి పొందామని బివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మండలంలోని గరికపర్రులో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 11.30 నుంచి 3 గంటల వరకు భోజనాలు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అల్పాహారం అందచేస్తామని వివరించారు. రోజుకి వెయ్యి నుంచి 1500 మందికి ఉచితంగా నాణ్యమైన భోజనాలు పెడతామన్నారు. వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా డాక్టర్ గనే్న సుబ్బారావు ఇంటి ఆవరణలో భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. తమ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి, మహాశివరాత్రికి, గురుపౌర్ణమికి భక్తులకు అన్నదానం చేస్తున్నామని, ఆ క్రమంలోనే తోట్లవల్లూరులో పుష్కర భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని వెంకటరెడ్డి వివరించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ నడకుదురు రాజేంద్ర, పిఎసిఎస్ అధ్యక్షుడు గిరిబాబు, మాజీ సర్పంచ్ పొట్లూరి గోపాలకృష్ణమూర్తి, సిహెచ్ సుబ్బారావు, వల్లభాపురపు జగదీష్, ట్రస్టు సభ్యులు సుబ్రహ్మణ్యం, దొర, రమేష్, రవి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

పుష్కరాలకు పటిష్ట భద్రత
ఏలూరు, ఆగస్టు 6 : రానున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రీకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి భద్రతా ఏర్పాట్లను చేపట్టిందని ఏలూరు రేంజ్ డి ఐజి పివి ఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం డిఐజి పుష్కరాల ఏర్పాట్లపై ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పోలీసు అధికారులు, లారీ ఓనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి ఐజి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలను చేపట్టిందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. దీనిలో భాగంగా విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను ముందుగానే ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్నామని తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను సిద్ధాంతం, చించినాడ, బ్రిడ్జిల ద్వారా నర్సాపురం, కైకలూరు, గుడివాడ ప్రాంతాల నుంచి చీరాల, ఒంగోలు వైపునకు మళ్లిస్తున్నామన్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి భారీ వాహనాలను గుడివాడ వైపు మళ్లిస్తున్నామన్నారు. జిల్లాలో నర్సాపురం, భీమవరం, పాలకొల్లు వంటి పట్టణాల్లో ప్రత్యేక పోలీసు బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారన్నారు. అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయాలు కలిగే అవకాశమున్నందున ఆ సమయంలో మరిన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుందని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా యంత్రాంగాలను కోరామన్నారు. అలాగే పుష్కర ఘాట్ల వద్ద వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ వద్దకు వెళ్లేందుకు క్యూమార్గాలను నిర్ధేశించామని, రేవు వద్ద సరిపడిన సంఖ్యలో యాత్రీకులను మాత్రమే లోనికి వదులుతామని చెప్పారు. పుణ్యస్నానాల అనంతరం వారు వేరే మార్గం ద్వారా బయటకు వస్తారని తెలిపారు. ప్రతీ ఘాట్ వద్ద సిసి కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పశ్చిమలోని పోలీసు సిబ్బందిని పూర్తిస్థాయిలో కృష్ణా పుష్కరాల భద్రతా ఏర్పాట్లకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ పుష్కరాలు జరిగే రేవుల్లో ఎక్కడా సమస్యాత్మక ప్రాంతాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌బి డి ఎస్‌పి భాస్కరరావు, ఏలూరు డి ఎస్‌పి జి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డి ఎస్‌పి శ్రీనివాసరావులతోపాటు పలువురు సి ఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.
మట్టి తరలింపుకి అనుమతులు తప్పనిసరి
నూజివీడు, ఆగస్టు 6: పోలవరం కాలువ తవ్వకంతో వచ్చిన మట్టి తరలింపునకు అధికారుల నుండి అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సిందేనని ఎస్‌ఇ వై శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం బిఇఎల్‌కు మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చామని చెప్పారు. 30,336 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చామని, దీనికి సంబంధించిన మై నింగ్ సీనరేజీ రుసుము 9.10 లక్షల రూపాయలు బిఇఎల్ కంపెనీ చెల్లించిందని చెప్పారు. అయితే 175 కిలోమీటర్ల కాలువ పొడవు ఉన్నందున కొన్ని ప్రాంతాలలో మట్టి అక్రమంగా తరలించుకుపోయే అవకాశం ఉందన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలువ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో మట్టి తరలింపుపై దృష్టి సారించలేక పోతున్నామని చె ప్పారు. అపెక్సు కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ మాట్లాడుతూ పోలవరం కాలువ తవ్వకం ద్వారా వచ్చిన మట్టిని అక్రమంగా తరలించుకు పోతున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పార్టీ నాయకులు మరిడి వెంకటేశ్వరరావు, యనమదల దాసు, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతకు ప్రాధాన్యం
నూజివీడు, ఆగస్టు 6: పోలవరం కాలువకు గండి పడిన ప్రాంతంలో చేపట్టిన పనులు నాణ్యతతో, పాదర్శకంగా నిర్వహించాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన పనులు పరిశీలించిన అనంతరం బయలుదేరి వెళ్ళారు. ఈసందర్భంగా అధికారులకు మంత్రి ఉమ పలు సూచనలు చేశారు. గండి పడిన ప్రాంతంలో శాశ్వతంగా ఉండేలా పనులు నిర్వహించటం వల్ల కొంత ఆలస్యం అయిందని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన యుటి వద్ద కటాఫ్ నిర్మాణం, గండి పడిన ప్రాంతంలో వింగ్ వాల్ పొడిగించి, రిటర్న్ వాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాంక్రీట్ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత పనులను రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కాలువల్లో గోదావరి జలాలు ప్రవహింపచేస్తామన్నారు. కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు అందించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, గండి పడిన ప్రాంతంలో మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నానని మంత్రి ఉమ చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎస్‌ఇ వై శ్రీనివాసయాదవ్, జల వనరుల శాఖ ఎపెక్సు కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, యనమదల దాసు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు చిట్నేని శివరామకృష్ణ పాల్గొన్నారు.