కృష్ణ

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో నగర నీటి సరఫరా వీక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: నగర వ్యాప్తంగా విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా ప్రజలకు సరఫరా అవుతున్న నీటి తీరును ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఈసందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మోనటరింగ్ (స్కాడా) వైబ్‌సైట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా బుధవారం ఉదయం సిఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్కాడా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నగరంగా విరాజిల్లుతున్న విజయవాడ నగర అభివృద్ధితోపాటు ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సేవలందించాలన్నారు. అనంతరం స్కాడా పనితీరుపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ సిఎంకు వివరిస్తూ మంచినీటి సరఫరాను అనుసంధానం చేయడం ద్వారా సెన్సార్‌లతో పనిచేసే ఈప్రక్రియలో సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ (స్కాడా) విధానంలో రిజర్వాయర్లలో నీరు ఎంత నిల్వ ఉంది, ఎంత వినియోగం అయిందన్న విషయాలు ఆటోమెటిక్‌గా తెలుస్తుందన్నారు. వినియోగానికి సరిపడా నీటిని సరఫరా చేయడం వలన నగరంలో నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చేయవచ్చునని తెలిపారు. అలాగే ఈవిషయాలను స్థానిక రిజర్వాయర్ల పరిధిలో నివాసముంటున్న స్థానిక ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా లీకేజీలను కూడా నివారించవడం ద్వారా నిర్వహణా వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. నగర పరిధిలో మొత్తం 63 రిజర్వాయర్లు ఉండగా స్కాడా సిస్టమ్‌ను ఇప్పటివరకూ 53 రిజర్వాయర్లకు అనుసంధానం చేయడం జరిగిందని, మిగిలిన 11 వాటికి కూడా త్వరలోనే అనుసంధానం చేస్తామని వివరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, గుంటూరు కమిషనర్ నాగలక్ష్మీ, పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ మోజెస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుభాష తియ్యదనాన్ని
విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు
* మంగళంపల్లికి బుద్ధప్రసాద్ నివాళి
అవనిగడ్డ, నవంబర్ 23: తెలుగుభాష తియ్యదనాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక గాంధీ క్షేత్రంలో మంగళంపల్లి సంతాప సభ నిర్వహించారు. ఈసందర్భంగా మంగళంపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిమాలయాల ఎత్తుకు తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత మంగళంపల్లిదేనన్నారు. దివిసీమలో కూడా ఆయన సంగీత ప్రభ వెలుగొందిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. గతంలో గాంధీ క్షేత్రంలో ఆయనను సన్మానించామని గుర్తుచేశారు. కుల మతాలకు అతీతంగా ఆయన వ్యవహరించేవారని, నాగాయలంకలో అమ్ముల విశ్వనాథం భాగవతార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కార్యక్రమానికి హాజరైన విషయాన్ని బుద్ధప్రసాద్ గుర్తుచేశారు. తాను మంత్రిగా నియమితుడడైనప్పుడు తొలిసారిగా ఆయన ఆశీర్వచనం పొందానన్నారు. స్నేహితులతో ప్రేమగా వ్యవహరించడం, సంగీత విద్వాంసులను సన్మానించటం, కులాలను గాక కళలను పోషించిన ఘనత ఆయనదేనన్నారు. భారతరత్న పురస్కారంతో గౌరవించే అర్హతలు ఉన్నప్పటికీ ఆయన ఆశించలేదని, జీవించి ఉండగానే భారతరత్న ఇస్తే ఎంతో గౌరవించినట్లు ఉండేదని మండలి అన్నారు. కార్యక్రమంలో సనకా వెంకటనాథ ప్రసాద్, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, తుంగల కోటేశ్వరరావు, గాజుల మురళీకృష్ణ, మత్తి శ్రీనివాసరావు, మండలి శేషు, అద్దంకి నారాయణ, సిఐ మూర్తి, తదితరులు ఘన నివాళులర్పించారు.

బ్యాంకుల వద్ద హెల్ప్ డెస్క్‌లు
* పారాలీగల్ వలంటీర్లతో సేవలపై అవగాహన
* జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 23: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పారాలీగల్ వలంటీర్లతో బ్యాకింగ్ సేవలపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు పారాలీగల్ వలంటీర్లతో బ్యాంక్‌ల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 11 మండల లీగల్ సెల్ సర్వీసెస్ పరిధిలోని బ్యాంకులు విధిగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి నగదు మార్పిడి, డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం బ్యాంక్‌లకు వచ్చే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. అలాగే బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు దళారులు పుట్టుకొస్తున్నారని, అలాంటి వారి మాయలో సామాన్యులు పడకుండా ఉండేలా పారాలీగల్ వలంటీర్లు ప్రజల్లో చైతన్యం కల్పిస్తారని తెలిపారు. అలాగే డిపాజిట్లు, విత్‌డ్రాల సమయంలో వారికున్న సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. ఆన్‌లైన్ పేమెంట్‌లు, చెక్ పేమెంట్లపై కూడా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్, ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్స్ బ్రాంచ్, సిండికేట్ బ్యాంక్, ఎస్‌బిహెచ్, పెడన ఎస్‌బిఐలలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ల వద్ద ప్రజల రద్దీ తగ్గేవరకు హెల్ప్ డెస్క్‌లు పనిచేస్తాయన్నారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి అనుమానాలున్నా హెల్ప్ డెస్క్‌ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు వివరించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ పాల్గొన్నారు.

పెద్దనోట్లపై జగన్ వైఖరి హాస్యాస్పదం
* జనచైతన్య యాత్రలో మంత్రి ఉమ
23జికెఆర్‌పిహెచ్ 4: కవులూరులో జనచైతన్య యాత్రలో మంత్రి ఉమ
జి.కొండూరు, నవంబర్ 23: పెద్దనోట్లను రద్దు చేసిన 12 రోజుల తరువాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి నల్లధనం గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని కవులూరు, కట్టుబడిపాలెం, పినపాక గ్రామాల్లో బుధవారం జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు కొత్తకవులూరులో మంత్రి ఉమకు ఘనస్వాగతం పలికారు. భారీ పూలమాలలతో, బాణసంచాల మోతలు, డప్పు వాయిద్యాలతో మంత్రిని స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ నల్లధనం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన శాఖ ద్వారా సిఎం చంద్రబాబునాయుడు ఇప్పటివరకూ 19 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ఓట్లు వేసి కల్పించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పట్టిసీమతో సాగునీటి ఇబ్బందులు తొలగాయన్నారు. చింతలపూడితో మెట్టప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేస్తానన్నారు. ప్రతి కుటుంబం నెలకు పదివేలు సంపాదించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సభ్యత్వాలను చురుగ్గా నమోదు చేయించినందుకు చెరుకూరి వెంకటేశ్వరరావును, ఇతర నేతలను అభినందించారు. కొత్తకవులూరులో సిమెంటు రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు. మంత్రి ఉమకు గ్రామప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణాజిల్లా తెలుగురైతు కార్యదర్శి గరిమెళ్ళ గోపాలరావు, ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు తాటికొండ భాస్కరరావు, డిసి చైర్మన్ బొర్రా అశోక్, గరిమెళ్ళ ప్రసాద్, కట్టుబడిపాలెంలో బసవబోయిన నాగేశ్వరరావు, బుస్సు కోటేశ్వరరావు, పినపాకలో సర్పంచ్ గరికపాటి స్వామిదాస్, గాలి శ్రీనివాసరావు, వేములకొండ వెంకటేశ్వరరావు, వేములకొండ వేణు, నక్కనబోయిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.