కృష్ణ

పెన్షన్.. టెన్షన్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దుతో పెన్షన్‌దారులకు దడ పట్టుకుంది. ప్రతినెలా 1వ తేదీన అందాల్సిన పెన్షన్ సొమ్ము అందుతుందా, లేదా?.. అనే అనుమానం వారిని ఆందోళన పరుస్తోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్ననోట్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించే విషయంలో అధికారులు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. చిన్ననోట్ల సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రతి లబ్ధిదారునితో బ్యాంక్ ఎకౌంట్లు తెరిపించి ఎన్‌పిసిఐతో అనుసంధానం చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ బాబు.ఎ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో గత ఏడాదిన్నరగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయి. 80శాతం మాత్రమే పెన్షన్ సొమ్మును బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్నారు. మిగిలిన 20శాతం నగదును పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓల ద్వారా ఇస్తున్నారు. డిసెంబర్ నెల పెన్షన్‌లను పూర్తిస్థాయిలో బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంతచేస్తున్నా చిన్ననోట్ల సమస్యను ఎలా అధిగమించాలనేది అధికారులకు అంతుపట్టడం లేదు. బ్యాంక్‌ల నుండి అవసరం మేర చిన్న నోట్ల లభ్యత లేని కారణంగా లబ్ధిదారులకు రద్దయిన రూ.1000ల నోట్ల స్థానంలో రూ.100ల నోట్లను ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియడం లేదు. ఆర్‌బిబి కొత్తగా ముద్రించిన రూ.500ల నోట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. తొలి విడతగా జిల్లాకు రూ.25కోట్ల మేర రూ.500ల నోట్లు వచ్చినా అవి ఎటియంల ద్వారా బట్వాడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెన్షన్‌దారులకు వెయ్యి నోటు స్థానంలో రూ.100ల నోట్లను ఎలా సమకూర్చాలనేది ప్రధాన సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 3లక్షల 32వేల 618 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా 1వతేదీ నాటికి సుమారు రూ.35కోట్ల మేర పంపిణీ జరుగుతోంది. ఈ మొత్తాన్ని బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా ఇస్తున్నారు. జిల్లాలో 1243 గ్రామాలు, పురపాలక సంఘ వార్డులకు గాను 878 మంది బ్యాంక్ కరస్పాండెంట్లు మైక్రో ఎటియంల ద్వారా పెన్షన్ సొమ్మును బట్వాడా చేస్తున్నారు. 3లక్షల 32వేల 618 మంది లబ్ధిదారుల్లో 2లక్షల 90వేల 722 మంది బ్యాంక్ ఎకౌంట్లు ఎన్‌పిసిఐతో అనుసంధానమయ్యాయి. వీరి వరకు మాత్రమే నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. మిగిలిన 26వేల 285 మందికి బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నప్పటికీ ఎన్‌పిసిఐతో అనుసంధానం కాలేదు. అలాగే మరో 15వేల 618 మంది లబ్ధిదారులకు అసలు బ్యాంక్ ఎకౌంట్లు లేవు. ఎన్‌పిసిఐతో అనుసంధానం లేని బ్యాంక్ ఎకౌంట్లను వెంటనే అనుసంధానం చేసే విధంగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. అలాగే బ్యాంక్ ఖాతాలు తెరవని వారితో కూడా ఖాతాలు తెరిపించేందుకు డిఆర్‌డిఎ అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో వీరి బ్యాంక్ ఎకౌంట్లను ఎన్‌పిసిఐతో ఏ మేర అనుసంధానం చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. బ్యాంక్ ఎకౌంట్లు లేని వాళ్ళతో ఈ-కెవైసి విధానం ద్వారా ఖాతాలు తెరిచేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా ఖాతాలు తెరిచేందుకు కృషి చేస్తున్నారు. ఈ-కెవైసి విధానంలో లబ్ధిదారుని ఐరిస్ లేదా వేలిముద్ర ద్వారా ఆధార్ కార్డు డేటాతో పాటు ఎన్‌పిసిఐతో అనుసంధాన ప్రక్రియ క్షణాల్లో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

రెండు విడతలుగా
పెన్షన్ సొమ్ము ఇస్తాం
* డిఆర్‌డిఏ పీడీ చంద్రశేఖరరాజు
చిన్ననోట్ల సమస్యను అధిగమించేందుకు రెండు విడతలుగా పెన్షన్ సొమ్ము ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని డిఆర్‌డిఏ పీడీ చంద్రశేఖరరాజు మంగళవారం ఇక్కడ విలేఖర్లకు తెలిపారు. 3.33 లక్షల మంది పెన్షన్‌దారుల్లో 80 శాతం మంది బ్యాంక్ ఎకౌంట్లు ఎన్‌పిసిఐతో అనుసంధానం చేశామన్నారు. మిగిలిన 20 శాతం కూడా ఈ నెలాఖరు నాటికి అనుసంధానం చేసి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ సొమ్మును జమ చేస్తామని చెప్పారు. బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా రూ.500లు చొప్పున రెండు విడతలుగా పెన్షన్ సొమ్మును అందజేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా చేసేదేమీ లేదన్నారు. ఇందుకు పెన్షనర్లు సహకరించాలని ఆయన కోరారు.