కృష్ణ

ఆగ్రహించిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 23: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు ఆగ్రహించారు. సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. సీఐటీయు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తరలి వచ్చారు. సమస్యలపై ఏకరువు పెట్టారు. కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, బయోమెట్రిక్ మిషన్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. వాడి వేడి ప్రసంగాలతో ఉద్యమాన్ని మరింత వేడెక్కించారు. ప్రసంగాల అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. మూసి వేసి ఉన్న కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎక్కిన అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పేందుకు కలెక్టర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాము విశ్రమించేది లేదంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ దశలో ఏం చేయాలో తెలియని పోలీసులు ‘మీకోసం’ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సూచనల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే డీఆర్‌ఓ రాకను అంగన్‌వాడీలు ఏ మాత్రం అంగీకరించలేదు. కలెక్టర్ మాత్రమే వచ్చి తమ సమస్యలపై సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. దీంతో పోలీసులు అరెస్టులకు సిద్ధమయ్యారు. పోలీసుల చర్యలను అంగన్‌వాడీలు ప్రతిఘటించారు. పోలీసులను ఏ మాత్రం లెక్క చేయకుండా కలెక్టరేట్ ముట్టడికి తీవ్రంగా శ్రమించారు. ఈ దశలో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోరాట పటిమను ప్రదర్శిస్తున్న కొంత మంది ముఖ్యమైన ఉద్యమకారులను పోలీసులు టార్గెట్ చేశారు. రోప్ పార్టీ సాయంతో అంగన్‌వాడీలను కట్టడి చేస్తూ ఆందోళనకు నాయకత్వం వహించిన నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసుల వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నాలను కూడా అంగన్‌వాడీలు తీవ్రంగా అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను ఎటూ కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. కొంత మందైతే వాహనాలకు అడ్డంగా పడుకున్నా పోలీసులు మాత్రం అంగన్‌వాడీలను చెల్లాచెదురు చేసి అరెస్టు చేసిన వారిని చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ చిలకలపూడి పోలీసు స్టేషన్ వద్ద కూడా అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజీనారాణి, సిహెచ్ సుప్రజ, సీఐటీయు తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి వై నరసింహరావు, బందరు డివిజన్ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, ఆశ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కమల తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు.
చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తా : ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన అంగన్‌వాడీల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంగన్‌వాడీలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తాను అండగా నిలుస్తానన్నారు. అంగన్‌వాడీలు నిర్వహించే ఎటువంటి ఉద్యమానికైనా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

విద్యార్జనతోనే మానవుడు పరిపూర్ణ వ్యక్తిగా మారతాడు
* ఉప సభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఏప్రిల్ 23: విద్యార్జన ద్వారానే మానవుడు పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందుతాడని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ప్రగతి విద్యా సంస్థల 27వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఉపాధ్యాయుల బోధనల ద్వారానే సమరయోధులు తయారయ్యారన్నారు. భవిష్యత్ ఉపాధ్యాయులకు రోల్ మోడల్‌గా ప్రగతి సంస్థల అధినేత పూర్ణచంద్రరావు ఉంటారని, ఆయన నిరంతర కృషి ద్వారానే అవనిగడ్డకు ఒక గుర్తింపు రావటంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అవనిగడ్డ వైపు చూస్తున్నారన్నారు. అవనిగడ్డ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటు ఇస్తున్నారన్నారు. సమాజ వికాసానికి దోహద పడాల్సిన రాజకీయాలు ఓట్లు కోసం, అధికార దాహానికి దోహద పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో భవిష్యత్తుకు బాటలు వేసేందుకు గాను కందుకూరి వీరేశలింగం సంస్కరణలను ఆవస్యం చేసుకోవాలని బుద్ధప్రసాద్ హితవు పలికారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ సనకా పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ పోతురాజు, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు తుమ్మల రత్న, గౌరవాధ్యక్షుడు మోహనరావు, సనకా నాయుడమ్మ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాలలో విజేతలైన విద్యార్థులకు బుద్ధప్రసాద్ చేతులు మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
అర్హులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలి
* తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 23: అర్హులైన పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో రెండు విడతలుగా అర్జీలు అందజేసినా ఒక్కరికి కూడా నివేశన స్థలం మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ వెంటనే నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల స్వాధీనంలో ఉన్న స్థలాలకు వెంటనే పొజిషన్ పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఉచిత విద్య, వైద్యం కల్పించాలని, ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సులను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు మోదుమూడి రామారావు, జె వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి ఈశ్వరరావు, లింగం ఫిలిప్, సూరత్ సురేష్‌బాబు, కరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజాదివస్’ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించండి
* ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 23: ప్రజాదివస్ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ త్రిపాఠికి విన్నవించుకున్నారు. సంబంధిత సమస్యలపై ఎస్పీ త్రిపాఠి ఆయా పోలీసు స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పురోగతిని ఎప్పటికప్పుడు బాధితులకు తెలియచేయాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించండి
* జెసీ విజయకృష్ణన్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 23: నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెసీ విజయకృష్ణన్ మాట్లాడుతూ మీకోసంలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం తగదన్నారు. నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. ఒకటికి పదిసార్లు అర్జీదారులను తిప్పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. పద్మజారాణి, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ ఎన్‌వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఇడీ జి పెంటోజీరావు, సాంఘీక సంక్షేమ శాఖ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం అవలంభిస్తున్న విధానాలను తిప్పి కొట్టాలి
* సైకిల్ యాత్రలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 23: విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సైకిల్ యాత్రలో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని తాళ్లపాలెం, పెదపట్నం గ్రామాల్లో పర్యటించారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలను ఆయా గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్(నాని) తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 23: అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెని ఆస్తులను జి గ్రూపుకు చెందిన ఎస్‌ఎల్ కంపెనీ ఎనిమిది నెలల అనంతరం ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి దుర్భుద్దితో తప్పుకుందన్నారు. ఏ రోజుకారోజు ప్రతిక్షణం దిగులుతో బ్రతుకుతున్న బాధితులు మరోసారి వీధులలోకి వచ్చే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె గగన్, యండి షఫీ ఉల్లా, ఎన్ ఈశ్వర్, రామాంజనేయులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జంపన వెంకటేశ్వరరావు, సీపీఐ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ సీనియర్ నేత ‘కొసరాజు’కు కన్నీటి వీడ్కోలు
* భారీగా పాల్గొన్న అభిమానులు
గుడ్లవల్లేరు, ఏప్రిల్ 23: తెలుగుదేశం పార్టీ సీనియర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొసరాజు వెంకటాద్రి చౌదరి మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జును డు అన్నారు. ఆదివారం మృతి చె ం దిన వెంకటాద్రి చౌదరికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, గ్రామ సర్పంచ్ వల్లభనేని సుబ్బారావు, మాజీ ఎఎంసీ చైర్మన్ వల్లభనేని వెంకట్రావ్, ఎంపీపీ కొసరాజు విజయ భారతి, పీఎసీఎస్ అధ్యక్షుడు పొట్లూరి రవి కుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

వీఎంసీ, పోలీసుల సమష్టి కృషితో
ట్రాఫిక్ సమస్యలకు చెక్
* మేయర్ కోనేరు శ్రీ్ధర్
* సీఆర్‌డీఏ సహకారంతో ఆర్‌యూబీలు
* ప్రయోగాత్మకంగా ‘నో పార్కింగ్ జోన్’
* జాయింట్ సీపీ క్రాంతిరానా తాతా
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 23: రాజధాని అమరావతి ముఖద్వార నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్, వీఎంసీ సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని మేయర్ కోనేరు శ్రీ్ధర్ అన్నారు. సోమవారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, కార్పొరేటర్లతో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కోట్ల రూపాయల వ్యయంతో వీఎంసీ రహదారులను అభివృద్ధి పర్చడమే కాకుండా ముఖ్య కూడళ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ జంక్షన్స్ తదితర పనులను నిర్వర్తిస్తున్నా ప్రజలు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈవిషయంపై గతంలో పోలీస్ కమిషనర్‌కు పలుమార్లు లేఖలు అందించడం జరిగిందని వివరించారు. ప్రధానంగా రోడ్ క్రాసింగ్ విషయంలో పాదచారులు ఇబ్బందులు వర్ణనాతీతమని, ప్రధానమైన రోడ్లలో సెంట్రల్ డివైడర్లను ఏర్పాటు చేయడమే కాకుండా కొన్నిచోట్ల సిగ్నిల్స్‌ను కూడా తీసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించిన విషయం విధితమేనన్నారు. ఈనేపథ్యంలో రోడ్డుదాటే అవకాశం లేక పాదచారులు డివైడర్లను దాటుతూ అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు గాను ప్రధానమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీల కన్నా అండర్ బ్రిడ్జిల ఏర్పాటు చేస్తే పాదచారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. 30 అడుగుల ఎత్తులో ఉండే ఓవర్ బ్రిడ్జిలను ఎక్కి,దిగేందుకు ఆరోగ్య రీత్యా కానీ ఇతర కారణాల వల్ల పాదచారులు ఇష్టపడట్లేదన్న విషయం నగరంలో ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్వహణ చూస్తే స్పష్టమవుతోందన్నారు. అదే అండర్ టెనె్నల్ బ్రిడ్జిలైదే కేవలం 10 నుంచి 12 అడుగుల మేర మాత్రమే ఉంటున్నందున వినియోగానికి సౌకర్యవంతంగా ఉంటుందని, ఈవిషయంపై అవసరమైన చోట్ల అండర్ బ్రిడ్జిల ఏర్పాటుపై పోలీసులు నివేదిక అందిస్తే వాటికి వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను రూపొందిస్తామన్నారు. వీటి ఏర్పాటుకు సీఆర్‌డీఏ సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం, నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కోట్ల ఖర్చుతో వీఎంసీ రహదారుల అభివృద్ధి చేస్తుండగా, ప్రయాణికులు, వాహన చోదకుల వలన లబ్ధిపొందుతున్న ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీస్ శాఖలు వివిధ రూపాల్లో ఆదాయం పొందుతుండగా, ఆ ఆదాయంలో వీఎంసీకి ఆయా శాఖలు ఎటువంటి నిధులు సమకూర్చకపోవడం శోచనీయమన్నారు. పోలీస్ శాఖ వాహనదారుల నుంచి వసూలు చేసే ఫైన్ మొత్తంలో కొంత మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ అభివృద్ధికి ఖర్చు చేయునట్టుగా కృషి చేయాలని కోరారు. జాయింట్ సీపీ క్రాంతిరాణా తాతా మాట్లాడుతూ 2015-16 కన్నా ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని, సిటీలో ప్రవేశించే ప్రధాన రహదారులైన కృష్ణలంక, బెంజిసర్కిల్, కనకదుర్గ దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనుల నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద సిగ్నల్ లైట్లు రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, తోపుడు బండ్లు, అక్రమ పార్కింగ్ వద్ద కూడా సమస్యలు తీవ్రతరమవుతున్నాయన్నారు. వీఎంసీ తరఫున పార్కింగ్, నో పార్కింగ్ వ్యవస్థను కట్టుదిట్టంగా అమలుచేయాలని, గుర్తించిన చోట్ల పార్కింగ్ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు, కమర్షియల్ ఏరియాలలో సెల్లార్ పార్కింగ్‌లలో కూడా రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తూ ఇబ్బందులు కలుగచేస్తున్న చర్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. సెల్లార్ పార్కింగ్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తే అక్రమ పార్కింగ్ సమస్యను అధిగమించవచ్చన్నారు. దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజిసర్కిల్ వరకూ గల రోడ్డును ప్రయోగాత్మకంగా నో పార్కింగ్ జోన్‌గా ఎంపిక చేసి పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు వీఎంసీ, పోలీస్ శాఖలు సమష్టిగా పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు,ట్రాఫిక్ అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ, ఇన్‌చార్జ్ కమిషనర్ డీ చంద్రశేఖర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

బస్సుయాత్ర ద్వారా
నేరుగా ఉపాధి పనుల పరిశీలన
* కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 23: ఉపాధి హామీ నిధులతో వివిధ శాఖల సమన్వయంతో చేస్తున్న పనులను నేరుగా పరిశీలించేలా బస్సుయాత్రను చేపట్టనున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అధికారులతో కలిసి పాల్గొన్నారు. టెలీకాన్ఫరెన్స్ అనంతరం అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెద్దఎత్తున ఉపాధి హామీ పథకం కింద వివిధ శాఖల ద్వారా పనులు చేపట్టామని, వీటి పురోగతిని పరిశీలించేందుకు గురువారం బస్సుయాత్ర చేయనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం విజయవాడ నగరంలో అమలు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తరువాత గుర్తించిన రెండు గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, ఆటస్థలాల అభివృద్ధి, వ్యక్తిగత మరగుదొడ్ల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలు, ఉపాధి పనులు జరుగుతున్న తీరును అధికారుల బృందం ప్రత్యేక బస్సులో వెళ్లి పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జేసీ-2 పి బాబూరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక సీడీని సోమవారం ఉదయం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పి బాబూరావు, వ్యవసాయ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో వెయ్యి యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 23: జిల్లాలో యువత సామాజిక కార్యక్రమాల్లో చు రుకుగా పాల్గొనేందుకు వెయ్యి యూ త్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం యువజన సంక్షేమ శా ఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం యూత్‌క్లబ్‌ల ఏర్పాటుపై యువజన సంక్షేమాధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. ఈసందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ 10మంది గ్రూపు సభ్యులుగా వెయ్యి యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో పం చాయతీకి ఒక్కో యూత్‌క్లబ్, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకటి చొప్పున ఏ ర్పాటు చేయ్యాలన్నారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిలో ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులుగా 10వ తరగతి, సాధారణ సభ్యులుగా 7వ తరగతి ఉత్తీర్ణులైన వారిని నియమించవచ్చని తెలిపారు. సభ్యులు గ్రా మాల్లో సామాజిక, సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, 18 ఏళ్లు వయస్సు నిండినవారిని ఓటరుగా నమోదు చేయించటం, బాల కార్మికుల ను గుర్తించి వృత్తి మాన్పించడం, డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాల ల్లో చేర్పించడం, సామాజిక దురాచారాలైన వరకట్నం, అత్యాచారాలు, స్ర్తిలు, పిల్లలు, దివ్యాంగులపై జరుగుతున్న హింస నివారణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆరోగ్యంపై చైతన్యపర్చడం, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలపై అవగాహన, హెచ్‌ఐవీ, ఎయిడ్స్, కలరా, మలేరియా, వ్యాధుల పట్ల అవగాహన క ల్పించటం, సేంద్రీయ వ్యవసాయాన్ని ్ర ం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యువజన సంక్షే మ శాఖ అధికారులు యూత్ క్లబ్ స భ్యులను గుర్తిస్తారని, ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహ న, సమాచారాన్ని అందించడంలో వా రు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. గ్రామీణ క్రీడలైన కబాడీ, కోకో, షటిల్, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, యోగా వంటివాటితో శారీరక దృఢత్వా న్ని పెంపొందించేలా గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించడం వంటి వాటిని సభ్యులు ప్రధానంగా చేపట్టేలా యూత్‌క్లబ్‌లు పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు.

వీఎంసీ అభ్యున్నతికి సహకరించండి
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 23: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వీఎంసీ అభ్యున్నతికి ప్రభుత్వం సహకరించాలని స్పెషల్ సెక్రటరీ టు సీఎం సతీష్ చంద్రను మేయర్ కోనేరు శ్రీ్ధర్ కోరారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ వీఎంసీకి చెందిన వివిధ అంశాలు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ ఉద్యోగుల మాదిరిగా వీఎంసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతాలను చెల్లించే 010 జీవోను అమలుచేయాలన్నారు. వీఎంసీకి జమయ్యే ఆదాయంలో అత్యధిక శాతం ఉద్యోగుల జీతాల చెల్లింపులకే సరిపోతోందని, దీంతో నగరాభివృద్ధికి నిధుల కొరత ఉత్పన్నమవుతోందన్నారు. అలాగే వీఎంసీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మితమవుతున్న 11 అంతస్తుల భవనం నిర్మాణ విషయంలో సానుకూలంగా స్పందించి తగు అనుమతులను మంజూరు చేయాలన్నారు. పరిపాలనా పరంగా ఎదురవుతున్న కార్యాలయ వసతి సమస్యల పరిష్కారానికి నూతన భవన నిర్మాణం తప్పనిసరి అని వివరించారు. అలాగే ప్రభుత్వ పరంగా వీఎంసీకి జమ కావాల్సిన వివిధ నిధుల విడుదల, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ పోస్టులకు అర్హులను నియమించాలన్న అంశంతోపాటు పలు విషయాలను సతీష్ చంద్రకు దృష్టికి తీసుకురాగా, ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించినట్టు మేయర్ తెలిపారు.

నిరంతర పర్యవేక్షణతో
రోడ్డు ప్రమాదాల నివారణ
* 30 వరకు భద్రతా వారోత్సవాలు
* జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం
పటమట, ఏప్రిల్ 23: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించామని, నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించగలిగామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం బెంజిసర్కిల్ సమీపంలోని జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల నివారణ పట్ల ఇన్‌ఫరమేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, (ఈఈసీ) చాలా ముఖ్యమన్నారు. అదే విధంగా ఇన్‌ఫర్‌మేషన్, మోటువేషన్, ఫెసిలిటేషన్ ఆవశ్యకత ఉందన్నారు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అలాంటి చోట్ల స్థానికుల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. బ్లాక్స్ స్పార్ట్స్, లైటింగ్ లేని చోట్ల అప్రమత్తత అవసరం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందితే ప్రాణాన్ని రక్షించవచ్చన్నారు. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ రక్షా అనే యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఈ యాప్ ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించడంతోపాటు అక్కడ దగ్గరలోని ఆసుపత్రి వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంటుందన్నారు. గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలకు రోడ్డు ఇంజనీరింగ్ వ్యవస్థ వలన కొన్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇలాంటి వాటిని నివారించాల్సి ఉందన్నారు. ప్రమాదాలు సూచించే బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు నివారించవచ్చన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సి ఉందని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సి ఉందన్నారు. జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఈ మీరాప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికబద్దంగా పనిచేస్తున్నామన్నారు. ఈ నెల 23 నుండి 30 వరకు జరిగే రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రంమలో ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాద్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ పిన్నమనేని రామారావు, వైవీ ఈశ్వరరావు, కోనేరు వెంకట రామారావు, అడుసుపల్లి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదాల నివారణకు తెలిపే సీడీలు, కరపత్రాలను కలెక్టర్, ఇతర అధికారులు పంపిణీ చేశారు.