కృష్ణ

వేరుసెనగ నష్టంపై అంచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 14: మండల పరిధిలోని మేకావానిపాలెంలో వేరుశెనగ పంట నష్టంపై అంచనాలు తయారుచేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి రవీంద్ర అధికారులతో కలిసి మేకావానిపాలెంలో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపర్చటంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు అప్పుడే విత్తిన వేరుశెనగ మొలక రాకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు మంత్రి రవీంద్రకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర తక్షణమే పంట నష్టంపై అంచనాలు తయారు చేసి నివేదిక అందించాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాలుగేళ్లుగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి రవీంద్ర వివరించారు. గ్రామంలో రూ.7.19కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గ్రామంలో 300 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని, 16 మందికి పక్కా గృహాలు మంజూరు చేశామన్నారు. గ్రామంలో 90 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారని, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే పంటలు సాగుకోసం పాలిహౌస్ లేదా షెడ్‌నెట్ సాగును రైతులకు పరిచయం చేసి ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖాధికారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లంకే నరాయణ ప్రసాద్, ఎంపీడీఓ సూర్యనారాయణ, తహశీల్దార్ కె శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఎఇలు జవహర్, నగేష్, కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సీఎం బందరు పర్యటన వాయిదా

మచిలీపట్నం, సెప్టెంబర్ 14: అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బందరు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న బందరు మండలం రుద్రవరంలో నూతనంగా నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయం భవన సముదాయం ప్రారంభోత్సవంతో పాటు జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీఎం బందరు పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. 19, 20 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సీఎం పర్యటన వాయిదా పడినట్టు తెలిసింది. వర్షం కురిస్తే ఆ ప్రాంతంలో సభ నిర్వహణకు అనుకూలంగా ఉండదని అధికారులు గుర్తించారు. జ్ఞానభేరి కార్యక్రమానికి 10 నుండి 15వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం బందరు పర్యటనను వాయిదా వేసినట్టు సమాచారం. విజయవాడ ఇందిరా గాంధి స్టేడియంలో జ్ఞానభేరి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సైనికుల్లా బూత్ కన్వీనర్లు పని చేయాలి

మైలవరం, సెప్టెంబర్ 14: బూత్ కమిటీ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ (కెపి) సూచించారు. మైలవరం నియోజకవర్గంలోని బూత్ కన్వీనర్‌లు, గ్రామ పార్టీ కన్వీనర్‌లు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత కన్వీనర్‌లపైనే ఉందన్నారు. ప్రతి ఓటూ అత్యంత విలువైనదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ తమ పరిధిలో 10 మంది సభ్యులను ఎంపిక చేసుకుని ఆ బూత్‌పై పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రతి కన్వీనర్ సైనికుని మాదిరిగా పని చేస్తే నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేయటం తధ్యం అన్నారు. అమ్ముడుపోయే వారుంటే కొనేందుకు మంత్రి దేవినేని ఉమ సిద్ధంగా ఉన్నాడని, కానీ తమ పార్టీలో అమ్ముడు పోయే వారు లేరన్నారు. కానీ తెలుగుదేశం నుండి మన పార్టీలోకి వలసలు రావటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే వారిని కూడా వైసీపీలోకి ఆహ్వానించటానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక నాయకుల సమన్వయంతోనే వారిని పార్టీలో చేర్చుకోవటం జరుగుతుందన్నారు. జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ రవీంద్ర కుమార్, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, జి కొండూరు ఎంపిపి వేములకొండ తిరుపతిరావు, జడ్పీటిసి కాజా బ్రహ్మయ్య, కెడిసిసి బ్యాంకు జిల్లా వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు, ఏఎంసి మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనుమానంతో ఆలిని హత్య చేశాడు

గుడివాడ, సెప్టెంబర్ 14: అనుమానం పెనుభూతంగా మారడంతో భార్యను దారుణంగా హతమార్చిన సంఘటన పట్టణంలో సంచలనం కల్గించింది. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా అది విఫలం కావడంతో నిందితుడు పరారయ్యాడు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీఐ డీ వెంకటేశ్వరరావు హత్యకు గల కారణాలను వివరించారు. స్థానిక బొక్కా వారి వీధిలో నాయుడు రాంబాబు-రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. గురువారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయటకు వస్తున్న రాంబాబు కుమార్తె జయశ్రీని చూసి కంగారుపడ్డాడు. దీన్ని గమనించిన జయశ్రీ ఇంట్లోకి వెళ్ళి చూడగా తల్లి రాజేశ్వరి విగతజీవిగా పడివుంది. బయటకు వచ్చి తండ్రి రాంబాబును నిలదీసింది. దీందో రాంబాబు నీ అమ్మను చంపేశానని, దరిద్రం వదిలిందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడని జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానంతో తల్లి రాజేశ్వరిని నిత్యం హింసించేవాడని, తండ్రే తన తల్లిని చంపాడని జయశ్రీ ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటేశ్వరరావు నిందితుడు రాంబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక పెదకాల్వ సెంటర్లో తిరుగుతున్న రాంబాబును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. మృతదేహానికి స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు సీఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్ చెప్పారు.