కృష్ణ

కలెక్టరేట్‌ను మరిచారా.. సారూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 3: జిల్లా కలెక్టర్ బాబు.ఎ జిల్లా కేంద్రాన్ని మరిచిపోయారా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జిల్లా వాసులతో పాటు ప్రజాప్రతినిధుల్లో సైతం ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుండి పాలన సాగించాల్సిన కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విజయవాడకే పరిమితం కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు ముఖ్య అధికారులు విజయవాడనే అంటిపెట్టుకుని ఉండిపోతుండటంతో వివిధ శాఖల జిల్లా అధికారులు సైతం విజయవాడకే పరిమితం కావాల్సి వస్తోంది. సొంత కార్యాలయాలన్నీ ఇక్కడ పెట్టుకుని విజయవాడలో వేలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తూ అదనపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగమవుతుందే తప్ప మరొక ఫలితం కనిపించడం లేదు. కలెక్టర్ బాబు.ఎ కలెక్టరేట్ మొహం చూసి సుమారు రెండు నెలలు పైబడిందంటే అతిశయోక్తి కాదు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో జిల్లా కేంద్రం నుండే పాలన సాగించిన ఆయన తర్వాత విజయవాడలోని క్యాంప్ కార్యాలయానే్న పరిపాలనా కేంద్రంగా మలుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లన్నీ క్యాంప్ కార్యాలయం నుండే సాగిస్తున్నారు. ప్రతి సోమవారం బందరులో జరిగే ‘మీకోసం’ కార్యక్రమానికి మాత్రం అడపాదడపా హాజరవుతున్నారు. గత ఏప్రిల్ 25న జరిగిన ‘మీకోసం’కు హాజరైన కలెక్టర్ నాటి నుండి నేటివరకు మరోసారి హాజరైన సందర్భాలు లేవు. మధ్యలో మే 17న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన కలెక్టర్ అటు నుండి అటే విజయవాడ వెళ్లిపోయారు. ఈ సోమవారమైనా కలెక్టర్ గారు కలెక్టరేట్‌లో జరిగే ‘మీకోసం’కు వస్తారా, లేదా?.. అనేది ప్రశ్నార్థకమే. జిల్లా అధికారులంతా విజయవాడకే పరిమితం కావటంతో జిల్లా పాలనా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు సైతం వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టరేట్‌లో నిర్వహించిన బందరు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. బందరును పాలనా కేంద్రంగా గుర్తించాలని చురకలు వేశారు. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా బందరు నుండే నిర్వహించాలని కోరారు. బుద్ధప్రసాద్ మరో అడుగు ముందుకేసి జిల్లాకు మరో కలెక్టర్ పోస్టు మంజూరు చేయాలని, ఈమేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పక్కనే ఉన్న మంత్రి రవీంద్రను కోరడం గమనార్హం. విజయవాడ రాజధాని కేంద్రం కావడం, ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉంటుండటం వల్ల ప్రొటోకాల్ విధుల కారణంగా కలెక్టర్ విజయవాడను వదిలి రాలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా జిల్లా కేంద్రం మచిలీపట్నం పట్ల కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం మాత్రం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.