కృష్ణ

నాగాయలంకకు పర్యాటక శోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జూలై 3: దివిసీమలోని నాగాయలంక ఇతర మండల కేంద్రాల కంటే భిన్నంగా ఓ ప్రత్యేకత సంతరించుకుంది. కృష్ణానదీ ప్రవాహం సంగమంలో ప్రవేశించే ముఖద్వారానికి పడమటి వైపు చీలే పాయ ఒడ్డున వున్న ఈ గ్రామం విభిన్న వృత్తులు, సంస్కృతులకు సమ్మేళనంగా నిలుస్తోంది. సర్వ మతాలకు సమాహారంగా వర్థిల్లుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా స్థానిక శ్రీరామపాద క్షేత్రం వద్ద మునుపెన్నడూ లేనివిధంగా రూ.70 లక్షల వ్యయంతో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించేందుకు అనువుగా ఘాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో జీర్ణదశకు చేరిన వివిధ దేవాలయాల పునఃనిర్మాణ పనులు సైతం ఈసందర్భంగా చేపట్టారు. ఆలయ సముదాయ అభివృద్ధికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కమిటీని నియమించారు. జిల్లాలో విజయవాడ తరువాత రెండవ ప్రాధాన్యత కలిగిన పుష్కరఘాట్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, నాగాయలంక మండల పరిషత్ అధ్యక్షులు సజ్జా గోపాలకృష్ణ, సర్పంచ్ శీలి రాము నేతృత్వంలో క్లాస్-1 కాంట్రాక్టర్ సబ్బినేని రమేష్ నేతృత్వంలో నాగాయలంక పుష్కరఘాట్ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ఈ తీరంలో అడుగు పెట్టేందుకే భయపడిన ప్రజలు ఇప్పుడు ఏ వేళలోనైనా ఇక్కడకు వెళ్ళి ఆహ్లాద వాతావరణానికి ముగ్ధులవుతున్నారు. శ్రీరామపాద క్షేత్రానికి పడమటి దిక్కున నదిపాయ వైపు పుష్కర యాత్రికుల కోసం కుడి, ఎడమ వైపున తీరం నుంచి పైభాగానికి సుమారు 100 మీటర్ల మేర సిమెంట్ మెట్లు నిర్మిస్తున్నారు. మధ్య భాగాన మూడు దశలుగా సువిశాలంగా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు దివిసీమను సందర్శించే యాత్రికులకు నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటివరకు ఆక్రమణలు, అపరిశుభ్రతతో నిండి ఉన్న ఈ ప్రదేశం రూపుమారుతోంది. పుష్కరాల పుణ్యమాని రూ.కోటీ 60లక్షల అంచనాలతో శ్రీ సాయిబాబా మందిరం వద్ద నుంచి వెంకట్రామా థియేటర్ వరకు రహదారి విస్తరణ పనులను చేపట్టారు. శ్రీరామపాద క్షేత్రానికి వెళ్లే మార్గంలో కరకట్ట నుంచి విస్తరణతో కూడిన పక్కా రహదారి నిర్మాణం జరుగుతోంది. నాగాయలంక మండలంలో పర్యటించదలచుకున్న యాత్రికులకు చోడరాజుల హయాంలో నిర్మితమై గణిపేశ్వరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ దుర్గా గణపేశ్వరస్వామి ఆలయంతో పాటు సంగమేశ్వరంలోని శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం, నంగేగడ్డ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, టి కొత్తపాలెం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం, నాగాయలంకలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి, శ్రీ ప్రసన్న గణపతి ఆలయం భక్తిప్రపత్తులు పంచనున్నాయి. నాగాయలంకకు 25 కిలోమీటర్ల దూరంలో సముద్రపు ఒడ్డున నిర్మితమైన దీపస్తంభం (లైట్‌హౌస్) పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కరాల సందర్భంగా నాగాయలంకలో దివిసీమ చారిత్రక వైభవాన్ని తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కృషితో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఘాట్ నిర్మాణ పనులను ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ స్వర్గం నరసింహారావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.