కృష్ణ

‘కృష్ణా’కు చేరిన గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూలై 14: కృష్ణా జిల్లాలోకి గోదావరి జలాలు జలజలాపారుతూ ప్రవేశించాయి. పోలవరం కాలువలో గలగలాపారుతున్న గోదావరమ్మ కృష్ణవేణమ్మ చెంతకు పరుగులు పెడుతోంది. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ లక్షలాది వ్యవసాయ భూముల్లో సిరులు పండిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గోదావరి తరలి వస్తోంది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ సత్ఫలితాలు ఇవ్వటంతో పాటు లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరు సమృద్ధిగా అందబోతోంది. పట్టిసీమ వద్ద 24 మోటార్లను ఏర్పాటు చేసి గోదావరి జలాలను పోలవరం కాలువ ద్వారా కృష్ణానదికి తరలించే ప్రక్రియను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు కృష్ణాజిల్లా ముఖద్వారం నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి గురువారం రాత్రి చేరుకున్నాయి. 119వ కిలోమీటరు వద్దకు చేరుకున్న గోదావరి జలాలకు రాష్ట్ర ఎపెక్సు కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పూలు, పండ్లు వేసి, ఘనంగా స్వాగతం పలికారు. 24 మోటార్లు సహాయంలో 12 పైపుల ద్వారా నిత్యం 8500 క్యూసెక్కుల గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 1400క్యూసెక్కుల నీటిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి 8500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎపెక్సు కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ తెలిపారు. పోలవరం కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలో అనుసంధానం చేసి వందల కోట్ల రూపాయల విలువ చేసే రైతులు పండించే పంటలను రక్షించేందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. గత ఏడాది 8.8 టిఎంసిల గోదావరి జలాలు అందించి, 2500 కోట్ల రూపాయలు విలువ చేసే పంటలను టిడిపి ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం దేశంలోనే ప్రప్రధమమని అన్నారు.
జలాలు చేరేదిలా..
గోదావరి జలాలు పట్టిసీమ నుండి పోలవరం కాలువ ద్వారా వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణానదిలోకి చేరుతున్నాయి. కృష్ణాజిల్లాలో నూజివీడు మండలంలో పల్లెర్లమూడి గ్రామం నుండి సీతారామపురం, వేలేరు, రేమల్లె, వీరవల్లి, రంగన్నగూడెం, సూరవరం, బండారుగూడెం, బలిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చిక్కవరం, గొల్లనపల్లి, గోపువారిగూడెం, సూరంపల్లి, నున్న, నైనవరం, కొత్తూరు, తాడేపల్లి మీదుగా వెలగలేరుకు చేరుకుంటాయి. వెలగలేరు వద్ద ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి గోదావరి జలాలు చేరుకుంటాయి.