కృష్ణ

ఒకే మాట.. ఒకే బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 29: రైతులంతా ఒకే మాట, ఒకే బాటలో నిలిచారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ పరిశ్రమలకు సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటూ అధికారులకు తెగేసి చెప్పారు. బందరు ఓడరేవు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమీకరణ కోసం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పోర్టు, పరిశ్రమల ప్రతిపాదిత భూముల గ్రామాల్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభలు గురువారం నాలుగోరోజుకు చేరాయ. పొట్లపాలెం, కొత్తపూడి, గోపువానిపాలెం, గోకవరం, గుండుపాలెం, రుధ్రవరం గ్రామాల్లో మడ డెప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి. భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులంతా ఏకతాటిపై నిలిచి గ్రామసభల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు, నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. పరిశ్రమల కోసం భూములిచ్చేందుకు తాము సమ్మతంగా లేమని మడ అధికారులు కరాఖండిగా చెప్పేశారు. పలు గ్రామాల్లో రైతులు మడ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. ‘ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ మాకు ఎలాంటి లాభాన్ని చేకూర్చదు. మా భూములు మాకుంటే పదికాలాల పాటు పది మందికీ అన్నం పెడతాం’ అని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని మిగిల్చే పరిశ్రమల కోసం పచ్చని పొలాలను ఎలా ఇస్తామంటూ మడ అధికారులను నిలదీశారు. మడ అధికారులు గ్రామసభల ప్రారంభంలో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయగా దీన్ని సైతం రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి అవగాహన అవసరం లేదని, తమ భూములు తమకుంటే చాలని నినాదాలు చేశారు. గుండుపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామసభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి తడాల సుబ్బారావు, తూర్పు కృష్ణా అధ్యక్షులు యద్దనపూడి మధు, డివిజన్ అధ్యక్షులు యువకిషోర్, జిల్లా మత్స్యకార్మిక సంఘం అధ్యక్షులు కొల్లాటి శ్రీను, డివిజన్ కార్యదర్శి గంగాధర ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు నడకుదిటి పార్వతి హాజరయ్యారు. తొలుత పంచాయతీ శివారు పల్లిపాలెంలో బాధిత రైతులతో సమావేశమై ప్రభుత్వ భూదోపిడీపై గర్జించారు. భూములు ఇవ్వబోమని తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని మడ డెప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తికి తీర్మాన పత్రాన్ని అందజేశారు. పొట్లపాలెం, గోకవరం గ్రామాల్లో జరిగిన గ్రామసభలకు భూపరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు కొడాలి శర్మ, షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, మాదివాడ రాముతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు మూకుమ్మడిగా వెళ్లి నిరసన గళం వినిపించారు. గ్రామ పంచాయతీ తరఫున చేసిన తీర్మానాలను ఆయా గ్రామాల డెప్యూటీ కలెక్టర్లు సుజాత, నరేంద్రప్రసాద్‌లకు అందజేశారు. గోపువానిపాలెం గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వాలిశెట్టి వెంకటేశ్వరరావు(బాబు) నేతృత్వంలో రైతులంతా భూములు ఇవ్వబోమంటూ డెప్యూటీ కలెక్టర్ సమజకు తీర్మానం ప్రతిని అందజేశారు. రైతులంతా తీర్మానాలు ప్రతులిచ్చి బహిష్కరించినప్పటికీ మడ డెప్యూటీ కలెక్టర్లు మాత్రం వెళ్లకుండా సాయంత్రం వరకు గ్రామసభల వద్దే ఉన్నారు.