కృష్ణ

చినుకు పడితే చెరువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 12: చినుకు పడితే స్థానిక ఎల్‌హెచ్‌ఆర్ ఇండోర్ స్టేడియం చిత్తడిగా మారి క్రీడాకారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాతల లక్ష్యం నెరవేరటం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. మైలవరంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయాలని 2001లో అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తలంచి ప్రభుత్వ ఆశయానికి తోడు దాతల సాయాన్ని కోరారు. దీంతో ప్రవాసాంధ్రులు, మండలంలోని వెల్వడం ప్రముఖులు లకిరెడ్డి హనిమిరెడ్డి స్పందించి తన తండ్రి పేరు పెడితే ఇండోర్, ఔట్ డోర్ స్టేడియం నిర్మాణానికి సహకరిస్తానని చెప్పటంతో అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు కోటి రూపాయల సొంత నిధులను హనిమిరెడ్డి ఈస్టేడియం నిర్మాణానికి వెచ్చించారు. ఎంతో సుందరంగా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాన్ని నిర్మించారు. దీనిని నిర్వహణకు గానూ శాప్(స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)కు అప్పగించారు. కానీ దీని బాగోగులు అధికారులకు పట్టటం లేదు. సువిశాలమైన క్రీడా ప్రాంగణం క్రీడాకారులకు, క్రీడల నిర్వహణకు కాకుండా మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్‌కు మాత్రమే ఉపయోగపడుతోంది. ఇండోర్ స్టేడియం సైతం ఎంతో సువిశాలంగా అన్ని హంగులతో ఏర్పాటు చేసినప్పటికీ దానికి తగిన విధంగా క్రీడల నిర్వహణ ఇక్కడ జరగటం లేదు. పైగా దాని మెయింటినెన్స్ అధికారులకు పట్టటం లేదు. పర్యవసానంగా ఇండోర్ స్టేడియం రేకులు లేచిపోయి వర్షం పడితే స్టేడియం ఆసాంతం వర్షం నీటితో చిత్తడిగా మారుతోంది. క్రీడాకారులు అందులో ఆడుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న క్రీడాకారులు ప్రతిరోజూ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నారు. కానీ వర్షం పడిన రోజు వీరి శిక్షణకు ఆటంకం ఏర్పడుతోందని వారు వాపోతున్నారు. ఇండోర్ స్టేడియం రేకులు ఎగిరిపోయి చాలా కాలమైనా పట్టించుకున్న అధికారులు లేరని వారు పేర్కొంటున్నారు. అదేవిధంగా స్టేడియం లోపల నిర్వహణ లేకపోవటం వల్ల క్రీడాకారులకు ఆశించిన స్థాయిలో ఇది ఉపయోగంలోకి రాకుండా పోతుందంటున్నారు. శాప్ అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించటం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం దాతల లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియాలకు మరమ్మతులు జరిపించి క్రీడాకారులకు క్రీడల నిర్వహణకు సహకరించాలని క్రీడలను ప్రోత్సహించాలని కోరుతున్నారు.