కృష్ణ

నెల రోజుల్లో పోర్టు పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 20: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న బందరు ఓడరేవు నిర్మాణ పనుల్లో నెల రోజుల్లో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక విలేఖర్లతో శనివారం ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చే రైతులకు భూమి కొనుగోలు పథకం కింద ఎకరానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు అవసరమైన జీవోను కూడా ఇటీవల విడుదల చేయడం జరిగిందన్నారు. వారం రోజుల్లో భూమి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి భూములు సేకరిస్తామన్నారు. పరిహారం చెల్లింపుకు అవసరమైన రూ.1350కోట్లు మొత్తాన్ని వివిధ బ్యాంక్‌ల ద్వారా ప్రభుత్వ ఒప్పందంతో తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే బ్యాంక్‌ల నుండి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. బ్యాంక్ రుణం కోసం ఎదురు చూడకుండా ముందస్తుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి రూ.200 కోట్లను ముడకు బదలాయించి, ఈ నిధులతో భూముల కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఓడరేవు నిర్మాణ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మచిలీపట్నం, అక్టోబర్ 20: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ ఉదయ భాస్కర్ సూచించారు. శనివారం ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి మంజూరైన అభివృద్ధి, మరమ్మతు పనులన్నింటినీ తక్షణం పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్ధం ఎసీలు, ఫ్యాన్‌లు తదితర సామాగ్రి ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ల దశలో ఉన్న పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కొరకు కావల్సిన పరికరాలను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుండి కొనుగోలు చేయాలన్నారు. పిల్లల వార్డులో ఫ్యాన్‌లు అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రోగులకు డిజిటల్ ఎక్స్‌రే సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు కుళాయి కనెక్షన్ ఫ్రీ
మచిలీపట్నం, అక్టోబర్ 20: మచిలీపట్నం పురపాలక సంఘ పరిధిలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచిత మంచినీటి కుళాయి కనక్షన్ ఇస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో బందరు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంచినీటి కుళాయి కనక్షన్‌ల కొరకు తెల్ల రేషన్ కార్డుదారుల నుండి ఎటువంటి రుసుం వసూళ్లు చేసేది లేదన్నారు. మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా ఇంటి ప్లాన్స్ అప్రూవల్ చేయనున్నట్లు తెలిపారు. జన్మభూమి కమిటీలు గుర్తించిన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. భూధార్‌లో ప్రభుత్వ భూములుగా నమోదు కాబడిన భూములను సరి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22ఎ భూములపై కేబినెట్‌లో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.